మెల్లగా లేచాడు ఆంజనేయులు. రాత్రి తాగిన విస్కీ మత్తు దిగి పోయింది. దాని తాలూకు తలనొప్పి మాత్రం మెదడుని భారం చేసింది. టైమ్ ఎంతైందో తెలుసుకోవాలని అటూ ఇటూ చూశాడు. గడియారం కట్టుకున్న వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు.
టీ తాగాలనిపించి టీ కొట్టువైపు నడిచాడు.
ఈ మధ్య అప్పుడప్పుడూ అతను తాగుతున్నాడు. తాగినప్పుడు తన బాధలంతా మరీ ఉద్దీపన చెంది గుండెల్ని తినేస్తున్నాయి. తనకు శరీరమే లేనట్లు ఉన్నదంతా బాధపడే మనసేననిపిస్తోంది. అందుకే తాగుడు అలవాటైంది అతనికి. మందులోని మహత్యం తెలియాలంటే చిటికెడంత విషాదమన్నా వుండాలి. అతనికి చిటికెడంత కాదు. సముద్రమంత వేదన వుంది. ఈ కారణం చేత తాగుడు అతనికి చాలా ఆనందాన్ని ఇస్తోంది. దేవదాసు తన ప్రేయసి కన్నా తాగుడిని ఎందుకంత ప్రేమించాడో అర్ధమైంది.
ఆ రాత్రి అతను మహాలింగంతో కలిసి తాగాడు. మాటల్లోపడి టైం గురించి పట్టించుకోకపోవడంతో పాపానాయుడు పేటకి వెళ్ళే లాస్ట్ బస్ మిస్సయింది. దాంతో బస్టాండ్ ముందున్న పార్కులో పడుకుండిపోయాడు.
టీ కొట్టు దగ్గర జనం విపరీతంగా వున్నారు. అందరూ యువకులే అంత రాత్రప్పుడు వాళ్ళంతా అక్కడ ఎందుకున్నారో అంతుబట్టలేదు ఆంజనేయులకు.
టీ కావాలని చెప్పి పక్కనున్న ఓ యువకుడి దగ్గరకు వెళ్ళి 'పరీక్షలా?" అని అడిగాడు.
అతనికి అర్ధం కాలేదు. "ఏమిటండీ?" అని విసుగ్గా ప్రశ్నించాడు.
"ఇంత రాత్రి పూట చాలా మంది పిల్లలున్నారే. పరీక్షలున్నాయా అని అడుగుతున్నాను."
"అప్పటికి అర్ధమైంది అతనికి. ఎదుటివాడి అజ్ఞానాన్ని చూసి నవ్వాడు. "లేదండి మా గురువుగారి సినిమా ఈ వేళ రిలీజ్ తెల్లవారు జామున మూడున్నరకు అబిమానుల కోసం షో వేస్తున్నారు. దాన్ని చూడడానికి వచ్చాం" అని విడమరిచి చెప్పాడు.
"మీ గురువు ఎవరు?" అమాయకంగా అడిగాడు ఆంజనేయులు.
అది కూడా తెలియదా అన్నట్టు అతను మరోసారి నవ్వి "చిరంజీవి" అన్నాడు.
అంజనేయులకు చిన్న తమ్ముడు నాగరాజు గుర్తొచ్చాడు. చిరంజీవి సినిమా రిలీజురోజు వాడు వూర్లో వుండడు. ఇక్కడే వుండి మార్నింగ్ షో మ్యాట్నీ, డబ్బులుంటే ఫస్ట్ షో కూడా చూసి ఇంటికి వస్తాడు. ఈ పాటికి వాడువచ్చే వుంటాడనుకుని అందర్ని పరికించి చూశాడు.
నాగరాజు ఎక్కడా కనిపించలేదు.
అంతలో టీ కొట్టు కుర్రాడు టీ ఇస్తే తాగడం మొదలుపెట్టాడు.
పక్కనున్న కుర్రాళ్ళు మాటల్లోపడ్డారు.
ఆంజనేయులు మౌనంగా వింటున్నాడు.
"ఇంకాసేపటికి ఫిల్మ్ బాక్స్ వచ్చేస్తుంది. సినిమా ఎలా వుంటుందో ఏమో? ఓ యువకుడు దిగాలుగా ముఖంపెట్టి అన్నాడు అతనిచేతిలో పూలమాల వుంది.
"నువ్వు అలాంటి శంకలేం పెట్టుకోకు. సినిమా అదుర్స్ అట. మొన్న థియేటర్ మేనేజర్ మద్రాసు కెళ్ళి ప్రివ్యూ చూసి వచ్చాడట. మొత్తం పదిహేను గెటప్ లలో చిరంజీవి కనిపిస్తాడట" మరో యువకుడు తనకు తెలిసిన సమాచారం చెప్పాడు.
"పదిహేను గెటప్ లా" పొట్టిగా వున్న యువకుడు ఆనందాన్ని అణచుకోలేక ఓ అడుగు పైకి ఎగిరాడు.
మొత్తం అరవైడ్రస్సులంటే ఒక్కోపాటకు పది డ్రస్సులు మార్చాడంట"
"సినిమాలో చిరంజీవి రిక్షావాడు కదా అన్ని డ్రస్సులు ఎలా వేసుకుంటాడు?" పూలమాల కుర్రాడు ఆసక్తిగా ప్రశ్నించాడు.
"డైరెక్టర్ ఈ మాటే అని మొదట అన్ని డ్రస్సులు వేయడానికి ఒప్పుకోలేదు. కానీ నిర్మాత దీనికి సుతరామూ అంగీకరించలేదు. డైరెక్టర్ తో దెబ్బలాడారట, అన్ని డ్రస్సులు వేయకపోతే నేను రిక్షావాడ్ని అయిపోతాను చిరంజీవా! మజాకానా! అన్ని డ్రస్సులు వేయాల్సిందే. కావాలంటే డ్రీమ్ స్వీక్వెన్స్ లుగా లాగించేయ్ అన్నాడట. దీనికి డైరెక్టర్ కూడా కన్విన్స్ అయ్యాడట. అందుకే అన్ని డ్రస్సులు వాడారు"
"డ్రస్సులంతా ఎక్కడ కుట్టించారో తెలుసా?" అంతవరకు ఎగ్జయిటింగ్ తో వింటున్న కళ్ళజోడు యువకుడు అన్నాడు.
"ఎక్కడ?" మిగిలిన వాళ్ళు ఆతృతతో ప్రదర్శించారు.
ఈ విషయం తెలుసుకోవటం తన పూర్వజన్మ సుకృతమన్నట్టు కళ్ళజోడు యువకుడు కళ్ళను తడిచేసుకొని "విజయవాడ నుంచి స్పెషల్ టైలర్ ను మద్రాసుకు పిలిపించారు. అతనే బ్రహ్మాండంగా కుట్టాడట. మన గురువు డ్రస్సులు కుట్టడానికి రెండు నెలలు పట్టిందట"
నీకెలా తెలుసు ఇదంతా"
"సిల్వర్ స్టారా రాసింది"
"మొత్తం ఎనభై రెండు థియేటర్లలో ఈ రోజు సినిమా రిలీజ్ చివరికి నగరిలో కూడా రెండు థియేటర్లకు ఇచ్చారట. నగరి చరిత్రలోనే రెండు థియేటర్లలో సినిమా రిలీజ్ కావటం ఫస్టు టైం అట. నగరి చిరుఫ్యాన్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ చిన్నబ్బాయ్ మన అసోసియేషన్ కు లెటర్ రాశాడు"
అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ల మధ్య ఉత్తరాలు కరస్పాండెన్స్ జరుగుతుందని మొదటిసారి తెలుసుకున్నాడు ఆంజనేయులు. వాళ్ళ మాటలను మరింత ఇంట్రెస్టింగ్ గా వినడం మొదలుపెట్టాడు.
"గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ ఎంతట?"
"కళ్ళజోడు అబ్బాయి చెప్పడం ప్రారంభించాడు. "నగరిలో ఫస్టు వీక్ 1,01,516 రూపాయలు, అనకాపల్లిలో 1,56,303 రూపాయలు, బందరులో 1,74,164 రూపాయలు, పుత్తూరులో 1,44,706 రూపాయలు, సికింద్రాబాద్ లో రెండు థియేటర్లలో 2,56,874 రూపాయలు విశాఖలో రికార్డు బ్రేక్ అట. మొత్తం 3,06,789రూపాయలు నెల్లూరులో ....."
ఆంజనేయులు తల తిరిగింది. ఆ అంకెలు వింటుంటే ఆ కుర్రాడు ఇదంతా ఎలా గుర్తుపెట్టుకున్నాడు? మేథమెటిక్స్ లో దిగ్గజం అయిన శకుంతలా దేవికి కూడా ఇంత మెమరీ పవర్ వుండదు. మరి ఈ అబ్బాయి వాటినన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోగలిగాడు? ప్రేమ అభిమానం చిరంజీవి మీదున్న ఇష్టం. ఆ పిచ్చి అభిమానంవల్లే ఏకాగ్రత తో ఇవన్నీ స్టడీ చేశాడు. ఆ అంకెలు మెదడులో ముద్రపడిపోయాయి. ఈ ప్రతిభ, ఈ ఏకాగ్రత అతను చదువులో చూపిస్తే......? ఏ.ఐ.ఏ.ఎస్ ఆఫీసరో? ఏ.ఐ. పి ఎస్ ఆఫీసరో అయిపోతాడు. కానీ అతను చదువులో ఇంత ఇంట్రస్ట్ చూపించలేడు. అతను వయసులో వున్నాడు. ఈ వయసులో ఎవర్నో ఒకర్ని ప్రేమించాలి. ప్రేమించబడాలి. ఇంట్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా వుంటాయి. తండ్రి తాగుతాడు. తల్లి ఎప్పుడూ ఇంటిని నెట్టుకురావడంలోనే కలం వెళ్ళబుచ్చుతుంది. చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళ వాళ్ళ సమస్యల్లో వుంటారు. కుటుంబ సంబంధాలు అంత ఘోరంగా వుండడంతో ఆ కుర్రాడు ప్రేమకోసం సంఘంలో వెదుక్కుంటాడు. కానీ దొరకడు. ప్రేమ పొందలేకపోయిన అతను ప్రేమించాలనుకుంటాడు. ఎవర్ని ప్రేమించడం? సరిగ్గా ఈ సమయంలో తను ఎంత హీరోయిన్ గా వుండాలని కోరుకుంటాడో అనే లక్షణాలతో తెరమీద హీరో ప్రత్యక్షమౌతాడు. ప్రేమ కట్టలు తెంచుకుంటుంది. ప్రాణానికి ప్రాణంగా ఆ హీరోని అభిమానిస్తాడు. అతని ప్రగతే తన ప్రగతి అనుకుంటాడు. అతని విజయాలే తన విజయాలని భ్రమిస్తాడు.
"సార్! గ్లాసు ఇవ్వండి" ఉలిక్కిపడ్డాడు ఆంజనేయులు. ఆలోచనల గొలుసు తెగింది.
గ్లాసును టీ కుర్రాడికి అందించాడు.
స్టూడెంట్స్ కూడా గ్లాసులు ఇచ్చేసి బయల్దేరారు.
బస్టాండ్ కు దగ్గర్లోనే థియేటర్. తనూ సినిమాకి వెళితే బావుండుననిపించింది ఆంజనేయులుకి. ఆలోచన వచ్చిందే తడవుగా అటు అడుగులు వేశాడు.
థియేటర్ ముందు ఇసుకవేస్తే రాలనంత జనం, అందరూ కుర్రాళ్ళే పదిఏళ్ళ నుంచి ఇరవై అయిదేళ్ళ వరకు వివిధ ఏజ్ గ్రూప్ ల వాళ్ళున్నారు. కొందరు పూలమాలలు కొందరు చాక్ లెట్ల ప్యాకెట్లు, ఇంకొందరు కొబ్బరికాయలతో సినిమా ఎప్పుడు స్టాట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


