ఆ తరువాత ప్రతి రోజూ మాధవరావు ఇంటికెళ్ళి స్మితారాణి కలెక్ట్ చేసే విషయాలు సేకరిస్తూఉండాలి. ఇలా మహా అయితే రెండు మూడు రోజులు మనమందరం కష్టపడాలి! అంతే ఆ తరువాత "హాపీ డేస్ ఆర్ హియర్ ఎగైన్" అని పాడేసుకోవటమే -
అందరూ కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయారు.
"కమాన్ సిస్టరిన్ లా! ఆడాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తే ప్రపంచానికే ప్రమాదం! అంచేత ఆలోచనలు ఆపేసి మాకు అద్భుతమయిన కాఫీ సప్లయ్ చేశారంటే మీ ఫోటో ఓ వారపత్రిక కవరు మీద వేసి లోపల "నా చేదు అనుభవం" అనే ఆర్టికల్ వేయిస్తాను."
అఖిలభాను నవ్వేసింది "ఇప్పుడే తెస్తాను" అంటూ లోపలికెళ్ళింది. అయిదు నిముషాల తర్వాత అందరూ కాపీలు తాగారు.
"ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి?" అడిగాడు శ్యామ్.
"నువ్వూ సిస్టరిన్ లా కలిసి స్మితా జీని ఓ డ్రెస్ షాప్ కి తీసుకెళ్ళి ఈ కవరు ఫోటో లో సంధ్యారాణి వేసుకున్న డ్రెస్ లు కొనాలి. ఆ తరువాత ఏదయినా ఒక బ్యూటీ క్లినిక్ వెళ్ళి ఆమె హెయిర్ స్టయిల్ కూడా ఈ సంధ్యారాణి హెయిర్ స్టయిలులాగా మార్చాలి."
"మరి నీ సంగతేమిటి?"
"నేను ఈలోగా ఆ మాధవరావు తాలూకు పూర్తీ ఇన్ ఫర్మేషన్ లాగటానికి ప్రయత్నిస్తాను. నా అనుమానం ఏమిటంటే నిన్న రాత్రి ఆ సునందను కత్తి విసిరి చంపిన వాళ్ళు మాధవరావు గాంగే ఆయింటారని" అంటూ లేచి బయటకు నడవబోయాడతను.
"బైదిబై కామ్రేడ్ శ్యామ్! ఇదిగో ఈ అయిదువందలూ స్మితాజీ డ్రెస్సుల కోసం ఖర్చు పెట్టు. నేనోసారి నీ వాహనం మీద నా రూం కెళ్ళి ఏ క్షణాన్నయినా పీలకలయి పోడానికి సిద్దంగా వున్న నా డ్రెస్ మార్చుకోస్తాను" అంటూ శ్యామ్ కి డబ్బిచ్చి సైకిలు తీసుకుని బయల్దేరాడు.
ఫోటో స్టూడియోలో నుంచి హటాత్తుగా "గురూజీ" అంటూ కేకలు వినిపించేసరికి చటుక్కున బ్రేకులు వేసి వెనక్కు తిరిగి చూశాడు.
విక్రమార్కరావు చేతులు వూపుతూ పిలిస్తున్నాడు.
సైకిలు అతని షాపు దగ్గరకు పోనిచ్చాడు భవానీ శంకరు.
"యస్ కామ్రేడ్ శివనారాయణా! హౌ ఆర్ యూ."
విక్రమార్కారావు . "నేను ఫైన్ సర్! మీకో శుభవార్త చెప్దామని పిలిచాను."
"ఏమిటి కామ్రేడ్ అది? త్వరగా చెప్పేసెయ్."
"నేను పదేళ్ళ వయసులో రాసిన ఓ కధను మీ సలహా మీద రేడియో స్పాన్సర్లు ప్రోగ్రాం కి సబ్మిట్ చేశాను కద్సార్. అది శాంక్షన్ అయినట్లు లెటరు వచ్చింది. వచ్చే నెల ఆఖరి వారం నుండి , తెలుగుదేశ మంతటా అది సీరియల్ గ వస్తుంది."
"ఓ! నీకు కంగ్రాచ్యులేషన్స్ కామ్రేడ్. బైదిబై దానికి డైరెక్షన్ ఎవరు?"
"మా షాప్ ఊడ్చే కుర్రాడు సార్! ఎప్పటినుంచో అడుగుతున్నాడు వాడు, డైరెక్షన్ చేయాలని ఉందని. వాడెలాగూ పగలంతా ఖాళీగానే వుంటాడు. మొత్తం పదమూడు వారాలు డైరెక్షన్ చేసినందుకు పదిరూపాయలు ఎక్ స్ట్రా ఇస్తే సరిపోతుంది సార్?"
"అద్భుతం కామ్రేడ్! అలాగే కానీ బైదిబై నటీనటులు."
అందరినీ మాట్లాడాను సార్! హోటలు షాన్ బాన్ పక్కన కూలీలు దొరుకుతారు. మా ఫాదర్ వాళ్ళందరినీ కాంట్రాక్టు తీసుకుని రోడ్లు వేయించేవాడు కదండీ! వాళ్ళనే రోజు కూలీ మీద యాక్షన్ చేసేందుకు కాంట్రాక్టు మాట్లాడాను."
"ఒండర్ పుల్ కామ్రేడ్! నీ సీరియల్ ని ఏ టూత్ పేస్టూవాడో తప్పక కొనుక్కుంటారని నాకు తెలుసు? వస్తాను కామ్రేడ్ కీప్ టప్ -"
తన గదికి వచ్చేశాడు భవానీశంకర్ - పిల్లలందరూ అతని చుట్టూ మూగిపోయారు. ఆనందంగా, వాళ్ళతో కాసేపు గడిపి స్నానం వగైరా ముగించి బట్టలు వేసుకుంటుంటే బూట్ల చప్పుడు వినిపించింది.
చటుక్కున వెనక్కు తిరిగి చూశాడు భవానీశంకర్.
ఎదురగా పోలీస్ ఇన్స్ పెక్టర్ , ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపించారు.
"భవానీశంకర్ నువ్వేనా?" అడిగాడతను.
"యస్ - కామ్రేడ్ ! ఎనీ ప్రాబ్లమ్?"
"నిన్ను అరెస్టు చేస్తున్నాము."
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు. "అరెస్టు చేస్తున్నారా?" రెండు రోజుల క్రితం హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కాను. అదే కారణమా కామ్రేడ్?"
ఇన్ స్పెక్టర్ అతని మాటలు పట్టించుకోలేదు.
"సునంద అనే అమ్మాయిని హత్య చేసిన నేరానికి!" అంటూ కానిస్టేబుల్ వేపు చూశాడు.
"నేను హత్య చేశానా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
అవును, ఇంతకుముందే మా పోలీస్ స్టేషన్ కి ఎవరో ఫోన్ చేసి చెప్పారు మర్డర్ గురించి. వెంటనే అక్కడి కెళితే ఆ డెడ్ బాడీ చేతిలో మీ పెన్ టార్చి దొరికింది. ఆ టార్చి మీద మీ పేరుంది."


