అదే ఆ ఎద్దు కొమ్ములకు తాళ్ళుండి మెడ ఖాళీగా వుంటే పొరపాటున కొమ్ముపొదల్లోనే, అడవి తీగల్లోనో చిక్కుకుని వుందన్న నమ్మకంతో ఆ ఎరపై దుమికి ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతుంది.
ఒకవేళ ఎద్దు కాలికి తాడు కట్టి అడవిలో ఎరగా వాడినా పులి అనుమానించదు. దీనికి ముఖ్య కారణం__ పెద్దపులికాని, చిరుతకాని జంతువులపై లంఘించేటప్పుడు ముఖ్యంగా మెడ భాగాన్నే ఎన్నుకుంటాయి. ఆ భాగంలో తాళ్ళవంటివి కనిపించే ఏ అవాంతరాలయినా వాటికి అనుమానాన్ని కలుగజేస్తాయి.
ఇదే విశ్లేషణతో రెండు ఎద్దుల విషయంలో జాగ్రత్త పడ్డాడు చైతన్య.
ఎరగా వాడడం కోసం కొన్న రెండు ఎద్దులూ ఆరోగ్యకరంగానే వున్నాయి. మూతి జబ్బుతో బాధపడే ఓ ఎద్దును ఎరగా వాడి నల్లమల అడవుల్లో ఓ పులిని చంపే ప్రయత్నంలో విఫలమయిన విషయం అతడింకా మర్చిపోలేదు. చాలా దగ్గరగా సమీపించి అనారోగ్యంతో వున్న ఎద్దును విడిచిపెట్టి వెళ్ళింది పులి ఆనాడు.
ఆ రాత్రికి గుట్టకు దిగువ భాగంలో కట్టిన ఎద్దు దగ్గరకాకుండా సింధూర చెట్ల నడుమ కట్టిన ఎద్దుపయిన మాటువేయాలనుకున్నాడు చైతన్య. అదే ఉద్దేశంతో ఓ వందగజాల దూరంలో చెట్టుపై మంచె కూడా ఏర్పాటు చేయించాడు.
సాయంకాలం తనతో తోడుగా వస్తానన్న తవిటయ్య కాదని రైఫిల్ ను, టార్చిని తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు.
మార్గమధ్యంలోనే ఎదురయ్యారు కుందనపల్లికి చెందిన గ్రామస్థులు.
వారు చెప్పిన విషయం విని షాక్ తిన్నాడు.
ఉదయం తనతో మాటాడిన రాజయ్య పడాలు_దబాయింపుతో తనకు ఆతిధ్యం ఇస్తానని ఇంటికి తీసుకువెళ్ళిన వ్యక్తిని మేనీటర్ హతమార్చింది.
కేవలం కొన్ని గంటల వ్యవధిలో గుట్టకి ఉత్తరాన ఉన్న పొలానికి బయలుదేరిన రాజయ్య పడాలు బలయిపోయాడు.
వ్యవధిలేదు. మరికొద్దిపాటి సమయంలో సూర్యుడు అస్తమించబోతున్నాడు.
చీకటి పడకముందే కనీసం శవాన్ని ట్రేస్ చేయగలిగితే అక్కడే మాటు వేయవచ్చు.
అదే సంకల్పంతో చనిపోయిన రాజయ్య పడాలుతోబాటు నడుస్తూ ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన వ్యక్తి సహాయంతో ఆ ప్రాంతానికి బయలుదేరాడు.
చైతన్యతో రావడానికి సంశయిస్తుంటే తక్కిన మరికొందర్ని కూడా సద్దుచేయకుండా తనతో రమ్మన్నాడు.
ఆకాశంలో సూర్యుడు పులిపంజాకి బలయినట్టు రక్తం కక్కుతున్నాడు. పశ్చిమాన వున్న గుట్టల శిఖరాలు రక్త తిలకాన్ని అద్దుకున్నట్లు రాక్షసంగా కనిపిస్తున్నాయి.
సుమారు మూడు మైళ్ళ ప్రయాణం తరవాత సింధూర చెట్ల వరకూ ముందు నడిచిన వ్యక్తి ఆగి చైతన్య వేపు చూశాడు__దూరంగా వేలిని చూపుతూ.
ఆశ్చర్యపోయాడు చైతన్య. అతడు ఎద్దును ఎరగా ఉపయోగించింది ఆ ప్రాంతంలోనే.
ఇక వారి అవసరం లేనట్టు వెనక్కి వెళ్ళిపొమ్మన్నాడు.
వారు తటపటాయిస్తుంటే కొంతదూరం వరకూ వారిని అనుసరించి వెళ్ళాడు కూడా. పూర్తిగా అడవిని దాటేవరకూ వారిని వెంబడించిన చైతన్య ఓ చోట నిలబడి వారు క్షేమంగా మైదానాన్ని చేరగానే వెనక్కి మరలాడు.
ఒకవేళ మేనీటర్ వారి రాకను గమనించి ఉంటే శవాన్ని తరలిస్తుంది. లేదా....
పులి అడుగుజాడల్ని చెరిపేసిన మనిషి పాదాలు గుర్తుకొచ్చి తరలించబడుతుంది అనుకున్నాడు అసంకల్పితంగా.
అప్పటికే సూర్యుడు పూర్తిగా అస్తమించి అసురసంధ్య పుంజుకుంటోంది. ప్రమాదానికి వెరచి సంకోచిస్తే మరో అవకాశం చేజారిపోతుంది.
ఏది ఏమయినా ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలన్నంత తొందరపాటు సంకల్పం అతడ్ని తొందరచేస్తుంటే అడుగులో అడుగు వేస్తూ సింధూర చెట్ల మధ్యగా నెమ్మదిగా నడిచాడు.
ప్రమాదభూయిష్టమైన అడవిలో అందునా తిరుగులేని విజయాలతో పులి విశృంఖల విహారానికి ఆలవాలమయిన ప్రాంతంలో అడుగుపెట్టాక ఒంటరిగాడైన మనిషి ఆందోళన ఎంత పరాకాష్టని చేరుకొనేదీ అనుభవంతో కాని అర్ధంకాని విషయం.
"వేటగాడు భయాన్ని కూడా ఓ అస్త్రంగా ఉపయోగించుకోవాలి గాని భయానికి లొంగిపోకూడదు. నిశ్శబ్దంగా వున్న అడవిలో, భీతినిగొలిపే పరిసరాలలో భయమన్నది ఇంద్రియాలను ప్రతిక్షణమూ హెచ్చరిస్తుంది. నిక్షిప్తమయి ఉన్న ఆలోచనా పటిమను ద్విగుణీకృతం చేస్తుంది. గాలి అలలకు ఓ ఆకు కదలినా సమీపంలో ఓ ఎండుటాకు నలిగినా ప్రమాదాన్ని పసిగట్టే ప్రజ్ఞని అందిస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోగలిగినవాడే తెలివైన వేటగాడు" ప్రముఖ వేటగాడు 'టర్నర్' అభిప్రాయమిది.
నడుస్తున్న చైతన్య ఓ పొదమాటున కనిపించిన శవాన్ని చూసి ఆగాడు .తెల్లటి ధోవతి రక్తసిక్తమయి ఉంది.
కేవలం చంపడమే తన విధి అన్నట్టు కంఠంనుండి తలను వేరుచేసి రెండంగుళాల దూరంలో పడేసింది. ఒక్క అవయవాన్నీ ఆహారంగా ముట్టిన పాపాన పోలేదు.
అదృష్టమో, దురదృష్టమో అతడు ఎరగా ఉపయోగించిన ఎద్దుకూడా అక్కడికి ఓ వందగజాల దూరంలో వుంది. మధ్యగా చెట్టుపై మంచె. చీకటి క్రమంగా దట్టమౌతుంటే నేలపై పగ్ మార్క్స్ ను పరికించే సాహసం చేయలేక మంచెపై ఎక్కేశాడు. టార్చిని రైఫిల్ మజిల్ కు ఓ క్లిప్ లాంటి సాధనంతో క్లేంప్ చేశాడు.
అవసరమైనప్పుడు టార్చిని వెలిగించడంతోపాటు రెప్పపాటులో ట్రిగ్గర్ ను సైతం నొక్కి పులిపై దెబ్బతీయ్యొచ్చు.
ఎలక్ట్రానిక్ వాచ్ సుమారు ఏడు గంటలు సూచిస్తూంది. అడవిలో శ్మశాన స్తబ్ధత ఆవరించింది. చైతన్య దూరంగా వున్న ఎద్దును, సమీపంలోని శవాన్ని పదేపదే చూస్తూ కూర్చున్నాడు.
ఆకాశంలోని నక్షత్రాల వెలుగు కొమ్మల్ని దాటి క్రమంగా నేలపై పరుచుకోవాలని ప్రయత్నిస్తూంది.
అక్కడికి మూడుమైళ్ళ దూరంలో ఉన్న ఎద్దును ఒకవేళ మేనీటర్ చూసి ఉంటే బహుశా ముందుగా దాన్ని సంహరిస్తుంది. అదే జరిగితే రాత్రంతా వేచి చూడడం తప్ప ఇక్కడ తనకు ఒరిగేదేమీలేదు.
కాని పెద్దపులి తను వేటాడి చంపిన కళేబరాన్ని ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టదు. కాబట్టి శవాన్ని సమీపించి తీరుతుందన్నది. అతడి బలమయిన నమ్మకం.
రాత్రి ఎనిమిది కావస్తోంది.
అంతవరకూ చీకటి భూగృహంలా ఉన్న అరణ్యం మబ్బులు దాటిన చంద్రుడి మసక వెన్నెట్లో కొద్దిపాటి వెలుగును పుంజుకుంది.
క్రింద తలతెగిన శవం_భయానకంగా.
బలిసిన భూతాల్లా నిలబడ్డ చెట్లు శాపగ్రస్తులయిన రాక్షసుల్లా అచేతనంగా వున్నాయి.
గాలి స్తంభించడంతో ఒక్క ఆకు కదిలిన చప్పుడు సైతం వినిపించడం లేదు.
ఇంతలో....
ఆ నీరవాన్ని భంగపరుస్తూ గుట్టకు ఉత్తరంగా ఓ కణుసు అరిచింది హెచ్చరికగా. సింధూర వనంలో నుంచి వో కొండముచ్చు కేక పెట్టింది. మరెక్కడినుంచో దుప్పి ఆక్రందన.


