Read more!
 Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 3

   

    జవాబుగా ధ్వని కూడా రెండు చరణాలు చెప్పాడు అక్కడ మరెవరూ వూహించనంత వేగంగా "ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పన్న యోగిసింది గోదావరి....."క్షణం ఆగి అన్నాడు ధన్వి" బాపిరాజు గారి వరద గోదావరి కవితలోని పంక్తులివి."


    మరోసారి ఓడిన చిరాకు కనిపించింది ఆ సభ్యుడిలో. "సౌదీఅరేబియాకి చెందిన బోయింగ్ విమానం కజకిస్తాన్ కి చెందిన కార్గో విమానాన్ని ఆకాశ మార్గంలో డీకొట్టి మూడువందల ఏబై ఒక్క మంది ఆహుతి కావటానికి కారణమైంది, ఆ ప్రమాదం జరిగిందెప్పుడు, ఏ తేదిలో?" ధన్వి నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయాడు. ప్రశ్న అడిగిన మెంబరు మోహంలో శాడిస్టిక్ అనందం కనిపించింది.....బరువుగా గడియారం ముళ్ళు కదులుతున్నాయి.


    ఒకటి....రెండు.....నాలుగు.....పది సెకండ్లు గడిచాయి.

 

    "1996 నవంబరు 12వ తేది సాయంకాలం జరిగింది ప్రమాదం......విమాన శిధిలాలు పడింది హర్యానాలోని భివాని జిల్లా రోధాన్ జిల్లాకి చెందిన రెండు గ్రామాల మధ్య....."

 

    ధ్వనిని ఓడించటమే ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు ఒకరిద్దరు మెంబర్స్. ధ్వని కన్ఫిడెంట్ గా జవాబు చెప్పడం నచ్చడం లేదు......

 

    "యుసీ మిస్టర్ ధ్వని.......'ఎ' గ్రూప్ రక్తాన్ని 'బి' గ్రూప్ రక్తం వున్న వాళ్ళకి ఎక్కించకూడదు. రియాక్టయి ప్రాణాలు పోతాయి....కానీ ఆ రెండు గ్రూపుల బ్లడ్ వున్న వ్యక్తుల రక్తం చీల్చిన దోమకి ఏ హాని జరగదు.....ఎందుకని?"

 

    "దోమ తాగిన రక్తం చేరేది దాని కడుపులోకి.....సరాసరి దాని రక్తంలోకి చేరేది రక్తం....అందుకే దోమకి ప్రాణహాని వుండదు. ....ఇదే సూత్రం వేర్వేరు బ్లడ్ గ్రూపున్న వ్యక్తుల్ని తిని ప్రాణ హాని లేకుండా బ్రతికే నరమాంస భక్షకులకి వర్తిస్తుంది.

 

    ధ్వనిని అభినందించాలనిపించడంలేదు. ఇంకా యిబ్బంది పెట్టాలనుంది. "1995 సంవత్సరం స్టేటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ చిత్రాలు నిర్చించిన దేశం."

 

    "మన దేశమే."

 

    "మిస్టర్ ధన్వి" పలికింది యిందాక ధన్విని అభినందించిన ఇంజనీరింగ్ లో డాక్టరేట్ చేసిన డా. శరత్ చంద్ర కంఠం "ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలుగుతున్న మీ మేధస్సుని అభినందించకుండా వుండలేకపోతున్నాను....."సాలోచనగా అడిగాడు "లాజికల్ గా జవాబు చెప్పాలి. ఈ ప్రపంచం పరిణామ దశకి చేరుకోవాలంటే కావాల్సింది అశావాదులా, నిరాశావాదులా?"

 

    "ఇద్దరూ" వెంటనే అన్నాడు ధన్వి. "యస్సర్! రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టింది అశావాదులతో అయినా ఆ తర్వాత ప్రయాణికుల ప్రమాదంలో చిక్కుకుంటే ఎలా అన్న మిమాంసతో మరో మేధావి పేరాచూట్ ని కనిపెట్టాడు.....నిజానికి ప్రమాదం గురించి ఆలోచించడం నిరాశావాదమే. కానీ అందులో కొన్ని ప్రాణాల్ని కాపాడాలన్న ఆశావాదం వుంది.....ఆశావాదం కానీ నిరాశావాదం కానీ నిర్ణయించబడేది మన ఆలోచనా విధానంతో అని మీరు అంగికరించాలి."

 

    బహాటంగా కాకపోయినా మనసులోనే అభినందించాడు డాక్టర్ శరత్ చంద్ర....ఏభై అయిదేళ్ళ అతడి జీవితంలో చాలా మంది యువకుల్లో మేధస్సుని చూడగలిగాడు అరుదుగా అయినా. అయితే అటువంటి వాళ్ళని వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.....ఇదిగో.....యిప్పుడు చాలా కాలం తర్వాత మరో యువకుడు ధన్వి కనిపించాడు.

 

    "నీవొచ్చింది ఇంటర్వ్యూ కి" అప్పటి దాకా ఓపికపట్టిన అయిదో సభ్యుడు అప్పుడు నోరు తెరిచాడు.....బట్టతలతో చూడటానికి గుండాలా వున్నాడు. అయితే అతడి అనాగరికతని దాచటానికి ప్రయత్నిస్తుంది ఆతడు వేసుకున్న గ్రే కలరు సూటు "మిస్టర్ ధన్వి. నేను చెప్పింది నీకు వినిపించిందనుకుంటను."

 

    అంతసేపు ఇంగ్లీషులో సాగిన ఇంటర్వ్యూ కార్యక్రమం యిప్పుడు హటాత్తుగా తెలుగులోకి మళ్ళింది. అందుకు బాధపడలేదు ధన్వి. అడుగుతున్న వ్యక్తీ ఎవరన్నా కానీ ఏకవచనంతో సంభోదిస్తున్నాడు.

 

    తమాయించుకున్నాడు ధన్వి. నాలుగు పదుల వయసులో, జీవితం నేర్పని సంస్కారాన్ని నలబై నిమిషాల ఇంటర్వ్యూ వ్యవధిలో తాను నేర్పలేడు. పైగా వచ్చింది అందుక్కాదు.

 

    "యస్సర్, చెప్పండి"

 

    "మేం నిన్ను యిక్కడ యింటర్వ్యు చేస్తున్నాం అంటే అర్ధం ఏమిటి? బట్టతల సగర్వంగా అడిగింది.

 

    "మీరు అడిగేవారు , నేను చెప్పేవాడ్ని అని."

 

    "తెలుసుగా మరి....కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే నీకే మంచిది"

 

    ధన్వి పిడికిళ్ళు బిగిసుకున్నాయి. "నేనేం ....అసభ్యంగా ప్రవర్తించలేదే!"

 

    "కానీ నువ్విచ్చే జవాబులు చాలా పొగరుగా వున్నాయి."

 

    ఇక నిభాయించుకోలేకపోయాడు ధన్వి. "పొగరుకి, ఆత్మ విశ్వాసానికి చాలా పోలిక వుంటుంది సర్. కానీ నిజానికి ఆ రెండు ఒకటే కాదు....."

 

    ఇంజనీరింగ్ అయిన యీ ఏడాదికాలంలో కనీసం ఏడు ఇంటర్వ్యూలకి వెళ్ళి వుంటాడు. వెళ్ళిన ప్రతిచోట ఓడి తిరిగొచ్చిన మాట నిజం. కాని యిలాంటి అనుభవం తొలిసారి. "నా దగ్గర మీరు నేర్చుకోవాల్సినంత చిన్నస్థాయిలో మీరు లేరు సర్....." ఆవేశం దిగమింగుకుంటూ చెప్పాడు ధన్వి. "కానీ గ్రూప్ వన్ సర్విస్ లో విజయం సాధించిన మనిషి  రేపు అక్యుపై చేసే పొజిషన్ గురించి మీరు ఆలోచించడం న్యాయమంటున్నాను.....గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ లో సెక్రటేరియట్ లోనో, జిల్లా కలెక్టరేట్ లోనో బాధ్యతలు తీసుకుని లక్షమందికి జవాబుదారి కావలసిన అభ్యర్ధిల్లో బానిసల్ని చూడడంగానీ, మీ ముందు ఫ్యున్స్ లా ప్రవర్తించలని కోరుకోవడంగానీ దారుణమంటున్నాను అంతే...."

 

    "అయితే నువ్వు గ్రూప్ వన్ సర్వీసులో సెలెక్ట్ అయిపోయావనుకుంటున్నావా?" ఇందాక ధన్విని ప్రశ్నించి ఆత్మన్యూనతా భావంతో బిక్కమొహం వేసుకున్న ఓ సభ్యుడు బట్టతలకి సపోర్టుగా నిలిచాడు" అసలు రాఘవరావంటే ఎవరో నీకు తెలుసా?"

 Previous Page Next Page