Read more!
 Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 2

 

    "మరి?"

 

    "రచయిత్రి పేరు."

 

    "అవును - మధూళీ కదూ?" ఇంకా ఆఫీసు ద్వారం కేసే చూస్తూ మాట్లాడుతున్నాడు....."ఈ మధ్య నాలుగైదు సీరియల్స్ రాసింది. అవునూ, ఎలా రాసిందో మీరింకా చెప్పలేదు"

 

    "చెప్పేవాడ్ని కానీ మీరసలు నావేపు చూడటం లేదు."

 

    "ఏం చేయను సర్! రిటెన్ కి రెండు లక్షలు తగలేశాను...."అసంకల్పితంగా నోరు జారేసి 'అరె...ఏదేదో మాట్లాడుతున్నాను కదూ....అదే సర్. టెన్షన్......' యిప్పుడు జారిపోయిన రహస్యానికి కాళ్ళు రాకుండా కాపాడమంటు కళ్ళతోనే అభ్యర్ధించాడు.

 

    "ఇప్పుడు చూస్తున్నాగా సర్! చెప్పండి. మధూళీగారు బాగా రాశారు కదూ?" అన్నాడా అభ్యర్ధి.

 

    వ్రాతపరీక్షలో నెగ్గుకురావటానికి రెండు లక్షలు తగలేసిన విషయాన్ని బయటికి కక్కేసిన ఒక యువకుడు ఆ విషయం మరుగున పెట్టి తెలుగు సాహిత్యం గురించి, దాని విలువల గురించి మాట్లాడటం చిత్రంగా వుంది.

 

    కోపం రావటానికైనా ధన్వికి యిలాంటివి కొత్తయితేగా. లోపం వ్యక్తులదో, లేక సిస్టమ్ డో చెప్పడం కష్టం. కాని మనిషి ఓడిపోకుండా వుండటం గెలుపుకి వెలకడుతున్నాడు. ఆ తర్వాత శీలం కోల్పోయిన విలువల పలుసల్ని తన ఒంటి మీద కప్పేసుకుంటూ జీవిత సత్యాల గురించి మాట్లాడటం మొదలు పెడుతున్నాడు.

 

    రాత్రి మందు పీకల దాకా కొట్టేసి సగటు ప్రొహిబిషన్ గురించి మాట్లాడటం అలవాటైన కుహన ఉద్యమకారులు పుష్కలంగా వున్న సొసైటీలో....రోజుకో వేశ్యతో గడిపి కట్టుకున్న ఆడదాన్ని మోసం చేస్తూ 'స్రీలను పూజించేది దేవతలుంటార'ని ఉద్వేగంగా వాక్రుచ్చె సుడో ఇంటల్లెక్చువల్స్ తో నిండిపోయిన ఈ సిస్టమ్ లో కొట్టుకుపోతున్న ఓ యువకుడు విలువలు చదివే సాహిత్యానికే తప్ప చదివే పాఠకులకు అవసరం లేదన్నట్టు చాలా కేజువల్ గా ఓ నవల గురించి మాట్లాడుతున్నాడు......

 

    "అంటే మీకు 'నీరవం' నచ్చలేదన్నమాట."

 

    తనకు తోచిన జవాబుని వెదుక్కొని అలా మాట్లాడిన ఆ వ్యక్తిని చూస్తూ "భావాన్ని భాష డామినేట్ చేస్తే అది మంచి రచనేలా అవుతుంది మాస్టారు" అన్నాడు ధన్వి. "మీరు అభిమానించే 'మధూళీ' కుమారో, శ్రీమతో నాకు తెలిదు కాని ఆమె రాసిన నీరవంలోని పంక్తులు చూస్తుంటే తడబడుతున్న అక్షరాల తప్పటడుగుల్లో రచయిత్రిగా ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నట్లుగా వుంది."

 

    ధన్వి విశ్లేషణతో ముందు కంగారుపడ్డాడా యువకుడు.....చర్చని పొడిగించే సాహసం చేసేవాడే కాని అవకాశం యివ్వలేదు ధన్వి. "మంచి నవలంటే కధ నడిపించే నాయకుడి సమర్ధత గురించి చెప్పేది చెడ్డనవలంటే రచయిత అసమర్ధతని తెలియచేసేది అంటారు జి.కె. చెస్టర్ టన్."

 

    అతడెవరో తెలీదు, చెస్టర్ ట న్ పేరు వినటం అదే తొలిసారి. కాని 'అలాగా' అన్నాడు.

 

    అంతకుమించి లంచం కట్టకుండా వ్రాతపరిక్ష పాసయ్యుంటాడని కూడా ధన్వి విషయంలో నమ్మాడు, అతడి ఐక్యూకీ అబ్బురపడుతూ .....

 

    అదిగో సరిగ్గా అప్పుడు వినిపించింది.

 

    "మిస్టర్ ధన్వి!"

 

 

                                                      *    *    *    *

 

    విశాలమైన హాలులాంటి గది....రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకి సంబంధించిన న్యాయనిర్ణేతల్లా టేబుల్ కి అవతలి వేపు సర్విస్ కమిషన్ బోర్డుకి చెందిన అయిదుగురు మెంబర్స్ కూర్చుని వున్నారు.

 

    మిట్ట మధ్యాహ్నపు సూర్యతాపం పై గెలుపు సాధిస్తున్నట్టు గదిలో ఎయిర్ కండిషనర్ సన్నగా చప్పుడు చేస్తుంది.

    "సో మిస్టర్ ధన్వి" అంతసేపూ ధన్వి సర్టిఫికెట్స్ చూసిన ఓ మెంబర్ "మీరు ఇంజనీరింగ్ చేసారన్న మాట" అన్నాడు 'పైగా డిస్టింక్షన్ లో పాసయ్యారు....గుడ్."

 

    "బైదిబై! ధ్వని అనే మీ పేరుకి అర్ధం....."

 

    "అర్జునుడు."

 

    "ఐసీ...." ఇంకో మెంబరు అడిగాడు "ఇంజనీరింగ్ పాసైన మీరు గ్రూప్ వన్ సర్వీసెస్ కి ఎందుకు వచ్చారు?"

 

    "ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు రాకుడదన్న రేస్త్రిక్షన్ లేదు కాబట్టి."

 

    ప్రశ్నడిగిన మెంబర్ మొహం మాడిపోయింది.

 

    "చాలా ఫాస్ట్ గా జవాబులిస్తున్నారే....." ఇంకో మెంబర్ జోక్యం చేసుకున్నాడు. "మీరు మేధమేటిక్స్ లో జీనియస్ అన్న విషయం ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ దాకా మార్క్స్ లిస్ట్ చూడగానే బోధపడింది......మిమ్మల్నో సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను.....ముప్పై సెకండ్ల వ్యవధిలో జవాబు చెప్పాలి."

 

    ధ్వని నిశ్చలంగా చూస్తున్నాడు.


    "ఇద్దరు తండ్రులు వాళ్ళిద్దరి కొడుకులకి డబ్బిచ్చారు, ఓ తండ్రి వెయ్యి రూపాయలిస్తే, మరో తండ్రి అయిదు వందలు. కానీ ఆ యిద్దరి కొడుకులూ మొత్తం డబ్బు లెక్కపెడితే వాళ్ళ దగ్గరున్నది వెయ్యి రూపాయలే, పదిహేను వందలుండాలిగా!"

    ధ్వనికి ఎక్కువ వ్యవధి అవసరం లేకపోయింది.

 

    "ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు అంటే మొత్తం నలుగురు వ్యక్తులైతే పదిహేను వందలుండాలి సర్. కానీ మీరు యిచ్చిన సమస్యలో సభ్యులు ముగ్గురే.....తాత, తండ్రి, కొడుకు....అంటే ముగ్గురు ......నిజానికి ఆ ముగ్గురిలో యిద్దరు తండ్రులున్నారు, ఇద్దరు కొడుకులున్నారు.......అప్పుడు లెక్కపెడితే వచ్చేది వెయ్యిరుపాయలేగా."

 

    "గుడ్" ఇప్పటిదాకా పెదవి విప్పని ఓ సభ్యుడు అభినందనగా చూశాడు. అయన టేబుల్ మీదున్న నేమ్ ప్లేట్ ని బట్టి ఇంజనీరింగ్ కాలేజి లోని ప్రోఫెసర్ లా వున్నాడు......."చాలా స్పీడ్ గా జవాబు చెప్పారు అంటే యు అర్రియాల్లి ....."

 

    మేధమేటికల్ గా ప్రశ్నించి యిబ్బంది పెట్టాలనుకున్న యిందాకటి మెంబర్ హటాత్తుగా ఓ కవిత ఉటంకించారు.

 

    "పడులలో గర్వాన

 

    సడలలో సుడులలో

 

    పరవళ్ళు తొక్కుతూ

 

    ప్రవహించి వచ్చింది"   

 Previous Page Next Page