Read more!
 Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 2

    "ఢాం...ఢాం...ఢాం"

    రివాల్వర్ శబ్దానికి ఆ పరిసరాలు ప్రతిధ్వనించాయి.

    అందరూ కళ్ళు తెరచి చూశారు.

    "బాబోయ్ రక్తం!"అంటూ కమీషనర్ లింగారావ్ భయంగా కళ్ళు మూసుకున్నాడు.కాస్త దూరంలో రోడ్డుమీద రక్తపు మడుగులో గజదొంగ గంగులు పడి వున్నాడు.

    జీపు గజదొంగ గంగులు శవం దగ్గిరికి వచ్చి ఆగింది.


      
                                                                    *     *     *    *


    గజదొంగ గంగులు  ఎన్ కౌంటర్   అయిన మర్నాడు....

    అన్ని న్యూస్ పేపర్స్ ఆ వార్తని ప్రముఖంగా ప్రచురించాయి.ఆ వార్తని చదివిన అందరూ ఎంతో సంతోషించారు.ఒక్క వ్యక్తి తప్ప!

    ఆ వ్యక్తి పేరు మంగులు!!

    గంగులు మరణవార్త విన్న  మంగులు అంత భాధపడుతున్నాడంటే అతను గంగుల్ని పెంచి పోషించే రాజకీయ నాయకుడనుకుంటే పొరబాటే!

    మంగులు గజదొంగ గంగులు తమ్ముడు.

    గజదొంగ మంగులు !!

    మంగులు తన డెన్ లో  అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.అతని అనుచరులంతా నిశ్శబ్దంగా నిలబడి ఊపిరి బిగపట్టి అతన్నే చూస్తున్నారు.

    పచార్లు చేస్తున్న మంగులు పచార్లు  ఆపి నిలబడ్డాడు. "హబ్బా!" అరిచాడు.

     "ఏం బాస్ అలా అరిచారు!?" అంటూ అడిగాడు గజదొంగ మంగులు కుడిబుజం వీరూ.

    "ఈ ప్రశ్న వేరేవాళ్ళు అడిగుంటే వాళ్ళ నాలిక మొండి కత్తితో కోసేసి వుండేవాడిని.అరిచానంటే అరవనా మరి? బాధతో అరిచాను" మండిపడుతూ అన్నాడు మంగులు.

    "అంతేకదా బాస్....మీరు అరగంటనుండీ  అటూఇటూ పచార్లు చేస్తున్నారు.కాళ్ళు నెప్పులు పుట్టి బాధ కలుగుతుంది కదామరి!!" అమాయకంగా అన్నాడు వీరూ.

    "హబ్బా!"బాధగా తల పట్టుకున్నాడు గజదొంగ మంగులు. "ఒరేయ్ తొట్టినాయాలా....కాళ్ళనొప్పికి ఇంత బాధపడ్తార్రా  ఎవరైనా....అసలు నిన్నరాత్రి చచ్చిపోయార్రా?"బాధగా అడిగాడు మంగులు.

    వీరూ బుర్ర గోక్కున్నాడు.

    "ఏమో బాస్....భూకంపంలోనో, వరదల్లోనో, యాక్సిడెంట్లలోనో, మతకలహాల్లోనో ఇలా దేనిలోనో చాలామందే పోయుంటారు బాస్."

    "హయ్యో!"గుండెలు బాదుకుంటూ బాధపడ్డాడు మంగులు.తర్వాత అందరివైపూ చూస్తూ అడిగాడు. "ఏరా....మీకైనా తెలుసా నేనెందుకు బాధపడ్తున్నానో?"

    అందరూ తలలు అడ్డంగా వూపారు తెలీదన్నట్లు.

    మంగులు నుదుటిమీద అరచేత్తో ఠపా ఠపా కొట్టుకుని " నా ఖర్మ!ఏరా.....? మీలో ఒక్కడంటే ఒక్కడు ఈరోజు న్యూస్ పేపర్ చదవలేదా?" అంటూ బాధగా అడిగాడు.

    "ఊరు చివర ఇంత మారుమూల డెన్ లో న్యూస్ పేపర్ యాడికెల్లి వస్తుంది బాస్?" ధైర్యంచేసి  అన్నాడు వాళ్ళలో ఒక్కడు.

    మంగులు ఆలోచగా అన్నాడు "అదీ నిజమేననుకో....రేపట్నుండి ఏదోవిధంగా మీకు న్యూస్ పేపర్ వచ్చే ఏర్పాటు చేస్తాను. లేకపోతే నేను పోయినా మీకు తెలియదు....!"

    "బాస్ పోతే మీకు నాయకుడ్ని నేనే!" వాళ్ళలో ఒకడు హుషారుగా అన్నాడు.

    "నువ్వు బాసా....? ఓసారి అద్దంలో మొకం చూస్కోరా సాలే....ఏనాడైనా ఒక మర్డర్,కనీసం రేప్ చేశావ్ రా....? నీ యవ్వ! నువ్వు బాస్ ఎట్లవుతవ్ బే....పది మర్డర్లు, ఇరవై రేప్ లూ నేను చేసినా....! బాస్ పోతే నేనే బాస్ ని....!" ఇంకోడు మొదటివాడి మీద మండిపడ్తూ అన్నాడు.

    "హబ్బా!"అంటూ మంగులు బాధగా తల పట్టుకున్నాడు.

    "అరె....నోరు ముయ్యండ్రా వెధవల్లారా....! బాస్ కి కుడిభుజం నేనుండగా, మీరు బాస్ లు ఎలాగావుతార్రా?"వాళ్ళని కసిరి మంగులు వైపు తిరిగి ఇలా అడిగాడు వీరూ"ఇంతకీ ఎవరు పోయారు బాస్?"

    "ఎవరు పోతే నేనింత బాధపడ్తాన్రా....నా అన్నయ్య గంగులు....పోలీస్ ఎన్ కౌంటర్లో పోయాడ్రా...." గుండెలు బాదుకుంటూ అన్నాడు మంగులు.

    "అయ్యో....! అలాగా బాస్....?" సానుభూతిగా అన్నాడు వీరూ.
    మరుక్షణం మంగులు మొహం కౄరంగా మారింది."ఒరేయ్ వీరూ....నేను శపధం చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యరా...." అన్నాడు గర్జిస్తూ.

    వీరూ భుజానికి తగిలించుకుని వున్నసంచిలోంచి ఓ లావుపాటి కొవ్వొత్తిని తీసి దాన్ని వెలిగిచాడు.తర్వాత ఒక్కొక్క అడుగే ముందికి వేసి మంగుల్ని సమీపించాడు.డెన్ లోని అందరూ మంగుల్ని జాలిగా చూశారు.ఏ శపధం అయినా చేసేప్పుడు మంగులికి నిప్పుమీద చెయ్యి పెట్టి శపధం చేసి,ఆ తర్వాత ఆ నిప్పుని ఆర్పేయడం అలవాటు.

    మంగులు కొవ్వొత్తి మంటమీద చెయ్యి పెట్టాడు.కొవ్వొత్తి లావుగా వుండటం చేత దానినుండి మంట ఎక్కువగా వచ్చి అతని చేతిని తాకుతుంది.చేయి కాల్తున్న మంగులు మొహం బాధగా పెట్టాడు.

    "అబ్బా....! మంచి చీకులు కాల్తున్న వాసన వస్తుంది కదరా....?" డెన్ లో ఎవడో ప్రక్క వాడితో అన్నాడు.

    మంగులు వాడివైపోసారి సీరియస్ గా చూసి "నేను దీపని చంపుతా" అంటూ శపధం చేసి కొవ్వొత్తిని ఆర్పేశాడు.

    "దీపంటే పాత సినిమా హీరోయిన్! ఆమేకదా బాస్? అయినా ఆమెనెందుకు చంపుతానని  శపధం చేశారు బాస్?"అయోమయంగా అడిగాడు వీరూ.

    "ఆ...."బాధగా జుట్టు పీక్కున్నాడు మంగులు."నువ్విలాంటి పిచ్చిప్రశ్న వేస్తే మరోసారి కొవ్వొత్తి ఆర్పి నిన్ను చంపుతా"అరిచాడు మంగులు.

 Previous Page Next Page