Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2


    రాజకుమారులందరూ ఆ విలుకానికోసం వెదకడం మొదలుపెట్టారు. వెదకగా వెదకగా వారికి ఒకచోట అస్త్రాభ్యాసం చేస్తున్న ఏకలవ్యుడు కనిపించాడు. అతనిని చూడగానే రాజకుమారులంతా ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు.
    అర్జునుడు గబగబా అతని ముందుకు వెళ్ళి, "భిల్లవీరా! ఎవరు నీవు? ఈ విలువిద్య ఎక్కడ నేర్చుకున్నావు? నీ గురుదేవులెవరు? గాయం కాకుండా బాణం ప్రయోగించే నైపుణ్యం నీకెలా వచ్చింది?" అని ప్రశ్నలవర్షం కురిపించాడు.
    ఏకలవ్యుడు ప్రశాంతంగా, "అయ్యా! నా పేరు ఏకలవ్యుడు. నేను హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కుమారుణ్ణి. మా గురుదేవులు కరుణామయులైన ద్రోణాచార్యులు. వారి దయవల్లనే ఈ విలువిద్య నేను నేర్చుకున్నాను" అని సమాధానం చెప్పాడు.
    "ఏమిటీ! నిజంగానే నీవు ద్రోణాచార్యులవారి శిష్యుడవా!" అని ఆశ్చర్యపడ్డారు రాజకుమారులు. కాని అర్జునుడికి మాత్రం ఎక్కడలేని అసూయా, ఆవేదనా పుట్టుకు వచ్చాయి. "ఏమిటేమిటీ! ద్రోణాచార్యులవారి దయవల్లనే ఈ విలువిద్య అభ్యసించాడా? ఎంత చిత్రం! అయినా, గురుదేవులు నాకు ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి చేశారు? మరి విలువిద్యలో నాకు ప్రపంచంలో ప్రతివీరుడు లేకుండా చేస్తానని గురుదేవులు చేసిన వాగ్దానం అసత్యం అయినట్లేనా! ఈ ఏకలవ్యుడు అస్త్రవిద్యలో నాకంటే ఆరితేరినవాడనటానికి ఈ ప్రదర్శనమే నిదర్శనం" అని అనేక విధాలుగా ఆవేదన పడ్డాడు అర్జునుడు.
    వెంటనే వేట చాలించి రాజకుమారులంతా హస్తినాపురానికి తిరిగి వచ్చారు. అర్జునుడు ఒంటరిగా ఆచార్యులవారి దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించి చెప్పాడు. "గురుదేవా! నిత్యమూ సత్యమే పలికే మీరు నన్ను ఒక్కడినే విలువిద్యలో సాటిలేని మేటిని చేస్తానని వాగ్దానం చేశారు. కాని ఈనాడు అస్త్రవిద్యలో నాకంటే మీకంటే లోకంలో అందరికంటే అధికుడైన ఒక వీరాధివీరుణ్ణి చూచాను. ఆ ఎరుకలవాడు మీకు ప్రియశిష్యుడట కూడా!" అన్నాడు ధీనంగా. ఈ పలుకులు విని గురుదేవుడు చకితుడైనాడు.
    ద్రోణాచార్యునికి ఏమీ స్పురణకు రాలేదు. ఆయన ఆశ్చర్యంగా "ఏమిటి అర్జునా! నీవు ఎవరిని గురించి మాటాడుతున్నావు? ఒక ఎరుకలవాడు అస్త్రవిద్యలో అంత ప్రవీణుడైనాడా? పైగా నా శిష్యుడా!" అన్నాడు.
    "అవును గురుదేవా? అతడు అలాగే చెపుతున్నాడు. ఆ విలుకాడు ఎక్కడో ఉండి మొరిగిన కుక్క నోటిలో ఏమాత్రమూ గాయం కాకుండా ఏడు బాణాలు అవలీలగా ప్రయోగించాడు. అయినా నా వెంటరండి, గురుదేవా! అతనిని చూచి వద్దురుగాని" అన్నాడు ఆత్రంతో అర్జునుడు.
    గురుశిష్యులు ఇద్దరూ ఏకలవ్యుని దగ్గరకు బయలుదేరారు. ఆచార్యులవారికి అలనాడు విలువిద్య నేర్పమని తన వద్దకు వచ్చిన భిల్లకుమారుడు గుర్తుకు వచ్చాడు త్రోవలో. ఈ విలుకాడు అతడే అయివుంటాడని అనుకున్నాడు ఆచార్యుడు.
    అరణ్యంలో అల్లంత దూరాన ఆచార్యదేవుని అవలోకించాడు ఏకలవ్యుడు. అతడు పరుగు పరుగున గురుదేవునికి ఎదురువచ్చి ఆయన చరణకమలాల మీద వాలాడు. "దయచెయ్యండి, గురుదేవా! దయచెయ్యండి! తమ సందర్శనం వల్ల నా జన్మ సార్థకం అయింది. తమ ఆజ్ఞానుసారం మీ విగ్రహాన్ని ముందుంచుకొని స్వయంగానే అస్త్రవిద్య అభ్యసించాను. తమ అనుగ్రహం వల్ల విలువిద్యలో కొంత నేర్పు గడించాను. నేను తమ శిష్యుడను! తమరు నా గురుదేవులు! ఈ ధనుర్విద్య తమ దయాభిక్ష" అని వినయంగా మనవి చేసుకొన్నాడు ఏకలవ్యుడు.
    ద్రోణాచార్యుడు కొంచెం ఆలోచించి తల పంకించి "సంతోషం నాయనా! నీ గురుభక్తికీ, విద్యాశక్తికీ చాలా ఆనందించాం. మరి మాకు గురుదక్షిణ ఏమి ఇస్తావు?" అని అడిగాడు. ఏకలవ్యుడు ఉత్సాహంగా "స్వామీ! నా భిల్లరాజ్యం, నా శరీరం, నా ప్రాణం అంతా మీ సొత్తు. ఇందులో మీరు ఏది కోరినా సరే, సంతోషంగా సమర్పిస్తాను. సందేహించకండి స్వామీ! కావలసింది అడగండి" అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
    ఆ మాటలు వింటున్న అర్జునుడికి ఒక్కమాటుగా భుజాలు ఉప్పొంగాయి. "ఏమిటేమిటీ! గురుదక్షిణగా ఏమి కోరినా కాదనకుండా ఇస్తావా?" అన్నాడు అర్జునుడు.
    "అవును నిస్సందేహంగా ఇస్తాను" అన్నాడు ఏకలవ్యుడు మరింత గట్టిగా.
    "రాజ్యం - దేహం - ప్రాణం ఏమి అడిగినా ఇచ్చేస్తావా?" ఆవేశంగా అడిగాడు అర్జునుడు.
    "తప్పకుండా ఇస్తాను" అని నొక్కి పలికాడు ఏకలవ్యుడు.
    ఆ మాటలు విని ద్రోణాచార్యుడు ఆశ్చర్యపడ్డాడు. "తొందర పడకు ఏకలవ్యా! ఏమి కోరినా ఇస్తాననటం ఎంత సాహసం!" అన్నాడు ఆచార్యుడు.
    "అలా సందేహించకండి గురుదేవా! మీరు ఏమికోరినా ఆనందంగా అర్పిస్తాను" అని దృఢంగా పలికాడు ఏకలవ్యుడు.

             

    "ఒకవేళ నేను నీ కుడిచేతి బొటనవ్రేలు తెగనరికి ఇమ్మంటే" అని నాలుక కొరుక్కున్నాడు ద్రోణాచార్యుడు.
    "నిరభ్యంతరంగా ఇస్తాను స్వామీ!" అంటూ ఏకలవ్యుడు చివాలున చురకత్తి దీసి తన కుడిచేతి బొటనవ్రేలు కోసి గురుదేవుని పాదాల ముందుంచాడు. "గ్రహించండి గురుదేవా! ఇదుగో నా గురుదక్షిణ!" అన్నాడు ఏకలవ్యుడు. ఇదంతా నిమేషమాత్రంలో జరిగిపోయింది. అద్భుతమైన ఆ గురుభక్తికి ఆచార్యుడు విభ్రాంతుడైనాడు. ఆయన కన్నులు నీటితో నిండి పోయాయి.
    ఆయన ఏకలవ్యుని శిరస్సు మూర్కొని "ఎంతపని చేశావు ఏకలవ్యా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ ఇవ్వని గురుదక్షిణ ఇచ్చావు! ఎన్నడూ ఎవ్వరూ చెయ్యని త్యాగం చేశావు! ఇంత కాలంగా అంత కష్టపడి నేర్చుకున్న అస్త్రవిద్యను నాకే అర్పించావా నాయనా!" అని పరితపించాడు. ఏకలవ్యుడు నిశ్చింతగా, "అలా అనకండి గురుదేవా! ఇందులో నా ఆధిక్యం ఏమీలేదు. తమ దయవల్ల నేర్చిన విలువిద్య తమ పాదాల మీదనే పూజాపుష్పంగా సమర్పించుకున్నాను" అని పలికాడు.
    ఆచార్యుడు ఆనంద విషాదాలతో అతనిని అభినందిస్తూ, "కానీ నీవు చాలా తొందరపడ్డావు నాయనా! నేను నీ దీక్షా శక్తిని పరీక్షించాలనే ఆ మాటలు పలికాను. కాని నేను కోరకముందే నీవు నీ బొటనవ్రేలు కోసి ఇచ్చావు. ఈ గురుభక్తి పారవశ్యం ప్రపంచంలో అపూర్వమైనది నాయనా! నీవు సమస్త ప్రపంచంలో సర్వకాలాలకూ ఆదర్శ శిష్యులలో అగ్రగణ్యుడవై అఖండ కీర్తి ఆర్జించుకున్నావు. నీ గురుభక్తి మహత్త్వం నిరుపమానమైనది. నీవు విశ్వవిఖ్యాతుడౌతావు!" అని ఆశీర్వదించాడు.
    కుడిచేతి బొటనవ్రేలు కోల్పోవటంతో ఏకలవ్యునికి బాణవిద్యలో ప్రావీణ్యం నశించిపోయింది. అర్జునుడి మనోవ్యథ తీరింది. అప్పటినుంచి భిల్లు లందరూ బొటనవ్రేలు తాకకుండానే ప్రయోగించటం అలవరుచుకున్నారు.


                                          * * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra