Read more!
 Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 5


                                                 గొడుగు నీడ

    ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్లి పదిహేనో రోజు ఆ రోజు ఇల్లంత ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా వుండి ఈ రోజే శ్వవాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళు చావు పెళ్ళితో సమానం అంటారు. అంటే సుబ్రహ్మణ్యంగారు మరీ పెద్దవారు కాదు. ఏ ఎనభై తొంభై ఏళ్ళోలేవు. ఆయనకి పోయే నాటికి అరవైఏడు ఏళ్ళు మాత్రమే.
    ఈ రోజుల్లో అరవై ఏడేళ్ళంటే పోయే వయసు కాదు. కాని ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అదృష్టవంతుడన్నారు అందరూ ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాసు పక్కనపెట్టి పక్కకి వరిగారు అంతే.
    ఆయన ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, ఇద్దరు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవులు ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరదులు ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసే సరికి వంటవాళ్ళు వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళులాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శకి, వూళ్ళోవాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్ధం అయ్యేది.
    రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం వున్నవాళ్ళు కనుక అయినవాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్ళుని పదేపదే తుడుచుకుని దుఃఖించేవారు, ఏమయితేనేం సుబ్రహ్మణ్యం గారి హయాం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతుకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిగారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు.
    ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి. అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అన్పించడం లేదు. అంచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖం, కడుపులోంచే, మనసులోంచే తన్నుకు రావలసినంత దుఃఖం రాలేదు. నలభై ఏళ్లు కలిసి బతికారు కాని, మనసులు కలబోసుకుని బతకలేదు వాళ్ళు, అసలే హఠాత్తు మరణం దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికాం అన్న ప్రేమ, అనురాగం కరవయి ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజిమీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి, సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందో నన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం భాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చుని రాని ఏడుపుని నటించడం - గత పదిహేను రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగోతంతో, ఇంటినిండా మనుషులు పడుకునే వీలులేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలిసిపోయింది. ఎప్పుడింత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడకి పుట్టింటికీ రావాలమ్మా వచ్చి పదిరోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బతిమాలినా ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది, అని సమాధానపడి వెళ్ళారు, ఆమె పుట్టింటివారు కూతుళ్లిద్దరూ పిల్లల చదువులమ్మా ఎలా వుండడం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా ఎన్నాళ్ళు ఎవరికోసం ఎవరుంటారు. నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతూందనుకుని ఆవిడని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. రెండో కొడుకు బెంగుళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం సెలవు లేదమ్మా అని నసిగాడు వెళ్లు నాయనా నాకాభగవంతుడే తోడు, ఆయనా అన్నయ్య వున్నాడుగా నాకోసం ఏ దిగులు వద్దు అంటూ రెండో కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా వుండకూడదంటూ పదకొండోరోజు కొందరు, దగ్గరవాళ్లు పదమూడోరోజు వెళ్ళారు. వున్న వూర్లోనే లాయరు ప్రాక్టీసు చేస్తున్న పెద్దకొడుకు ఇంకా ఈ జంఝాటం అంతా నామీదే రా బాబూ అనుకున్నాడు. అంతా నాల్గురోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు తనకు పుస్తెముడి, ఈ చాకిరి నాకు తప్పదు అని మనస్సులో విసుక్కుంది లాయరు మొగుడ్ని చేసుకున్నందుకు, రోజుకి నాలుగుసార్లన్నా పశ్చాత్తాప పడే పెద్ద కోడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిది, తోడికోడలు టింగురంగా అని వెళ్ళిపోగానే వుడుకుమోత్తనంగా మారింది.
    ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిసాక మాదిరి అయింది. గాలివాన జోరు హోరు తగ్గినా ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా చిత్తడి, ఆకులు అలములు చెత్తా చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో పక్కలతో మరకలతో గలీజు అయింది. పెరడంతా చూసే నాథుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. పది రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్దకోడలు బెంగపెట్టుకుని ఈ రోజు నావల్లకాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తుకోళ్ల తిండి నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆరోజు ఎనిమిది గంటల కింత అన్నం కడుపులో పడగానే వెర్రినిద్ర ముంచుకు వచ్చిందావిడకి.
    అయితే వీటన్నింటిమధ్య సుబ్రహ్మణ్యంగారు పోయిన పదిరోజుల్లో అంత హడావిడిలోను, అంత గొడవల మధ్య కూడా అందరి మనస్సుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే వుంది. కొడుకులు ఆరాటంగా, బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లుకోసం చూశారు. పదో రోజున కాబోలు సుబ్రహ్మణ్యంగారి పెద్ద తమ్ముడు "ఏరా ప్రభాకర్ మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ" అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరో అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసుకో మదన పడుతున్న ప్రభాకర్ "ఏమో చిన్నాన్నా తెలియదు చూడాలి. నా కయితే ఏం చెప్పలేదు మరి' అన్నాడు ఆరాటంగా, హఠాత్తుగా పోయాడు మరి రాశాడో లేదో చూసుకోండి. రాస్తే పరవాలేదుగాని అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావుగారు.
    ఆ మాటే ప్రభాకర్, దివాకర్ల మనస్సులో మెదులుతుంది పది రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్థి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి వుంది ఆవిడకీ ఓ వాటా ఇవ్వాలి.
    "ఏమ్మా వదినా నీకేమయినా తెలుసా? అన్నయ్య విల్లురాసిన సంగతి ఏమన్నా చెప్పాడా."
    'అయ్యో నాయనా నీ అన్నయ్య సంగతి నీ వెరుగవా ఇంట్లో పెళ్ళాం చాకిరికీ తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా వుందా ఈ నలభై ఏళ్ళల్లో' అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది...
    "చూడరా ప్రభాకర్ ఇనప్పెట్టి బీరువాని తీసిచూడు. విల్లు వుంటే నలుగురి ముందు ఒకసారి చదివితే మంచిది' అన్నారు సుబ్బారావుగారు. ఇప్పుడెందుకులే ఆయన పోయి పట్టుమని పది రోజులవలేదు. ఆస్థులు పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా వుంది.
    ప్రభాకర్ ఇనప్పెట్టి, బీరువాలు, బ్రీఫ్ కేస్ లు, డ్రాయర్లు పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి, పీకి, కెలికి చూశాడు. కాని విల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు నిరాశపడ్డాడు.
    'రాసినట్టు లేదు బాబాయి.. మరి ఇప్పుడెలా' అన్నాడు సందిగ్ధంగా.
    "రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి. వున్నదేదో నలుగురు పంచుకోవాలి మరి. మీ అమ్మతో కలిసి ఐదు వాటాలవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికి సమంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కరలేదంటే తప్ప నాలుగు వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాలలో పడ్డారు. మొగుళ్ళు మంచి ఉద్యోగాలలో వున్నారు. మా కెందుకులే అక్కరలేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కాని చెల్లెళ్ళు నోరు మెదపలేదు. వుత్తినే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటాం మాకేం వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. మనం ఎందుకు బయటపడడం అన్నట్టు నోరు మెదపలేదు.
    "ఏమోయ్ ప్రభాకర్ ఇప్పుడెందుకయ్యా ఈ ఆస్థి పంపకాల మాటలు. మీ అమ్మగారింకా వుండగానే, పదో రోజన్నా కాకుండా ఈ మాట లెందుకు, తరువాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూడవచ్చుగదా' పెద్ద అల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు.
    "అదీ నిజమే అనుకోండి, నన్నడిగితే అక్కయ్య వున్నన్ని రోజులు ఆస్థి ఉమ్మడిగా వుండడమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి. ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ అతని మాటల్లో సబబు కన్పించింది చుట్టాలకి. ప్రభాకర్ కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడి పోవడం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు.
    'అది కాదు మామయ్య.. ఏదో అనుకుని రాసుకుంటే మంచిదిగాదా ఎప్పటికి ఎలా వస్తుందో నాన్న హఠాత్తుగా పోయారు. విల్లు రాయక పోబట్టే కదా ఈ ఆలోచన్లు...
    'అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంతకాలం అంతా ఆవిడ ఆధీనంలో వుండేట్టు తదనంతరం ఫలానాది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ.

 Previous Page Next Page