Read more!
 Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 4


    తమ్ముడూ - నీవు తమ్ముడివైనా నిన్నెప్పుడూ కొడుకుగానే భావించాను. రెండేళ్ల వయసు నించి కన్నతల్లిలాగే సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా! నీవు బాగుండాలి, చల్లగా వుండాలనే ఎప్పుడూ కోరుకున్నాను. నాన్న బతికుండగా, చనిపోయే ముందు - తల్లీ నీవే వాడిని ఓ దరికి చేర్చాలి, నీవే వాడికి అమ్మవి. వున్న రెండెకరాలలో ఒక ఎకరం వాడి చదువుకి, రెండో ఎకరం నీ పెళ్లికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరూ చెరి సగం తీసుకోండి. ఆడపిల్లవయినా సగభాగం నీది, వాడి భారం నీది అంటూ కన్నుమూశారు ఏక్సిడెంట్ లో పోవడంతో విల్లు రాసే టైము లేక ఆఖరు క్షణంలో చెప్పిన మాటలివి. నేనేనాడూ ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు - నా పెళ్లి మామయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బి.కాం.తో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలొస్తాయి గుమస్తా తప్ప ఎం.కామ్. చదువుతానంటే ఆ రెండెకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మనది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీకోసం ఎందుకు ఖర్చు చెయ్యడం అని నేననుకోలేదు. అప్పటికి నాకూ నలుగురు పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు నాకు, కాని నీవు బాగుపడాలి పైకి రావాలన్నదే నా ఆలోచన. నాకేదన్నా అవసరం వస్తే నా పెద్దకొడుకుగా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది!
    ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే ఒకటి నా స్వార్థం. రెండు నీకు తెలిస్తే యీ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో! వుండేందుకు మాకు కొంపైనా వుండదు అన్నది నా స్వార్థం. ఇదమ్ముతే ఎంతొస్తుంది. ఇద్దరు పంచుకుంటే వచ్చేదెంత చూద్దాం. అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలియదు కాబట్టి మిగిలింది ఈ ఇల్లు మాదే అనుకున్నావు అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాశావు. నాయనా నీకు నాకు రక్త సంబంధం కనుక నామీద అభిమానం వుండొచ్చు. నేడబ్బడిగినప్పుడల్లా ముల్లెదాచిపెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే వుంటుంది. బాబూ భాస్కర్! నిన్నంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకడిగాననుకున్నావు. నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చెయ్యాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్నిచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోడాలలో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వాతంత్ర్యాన్ని నాకిచ్చింది. ఈ ఇల్లు నీది, నీకూ వాటా వుంది అని తెలిస్తే నిన్నడిగినప్పుడు అమ్మిపారేయి ఈ డొక్కు కొంప అనేవాడివి. అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను.
    ఇప్పుడు ఈ అపార్ట్ మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. ఈ ఏడొందల ఏభై గజాల స్థలంలో ఫ్లాట్ లు కడతానని ఎవరో బిల్డరు వచ్చాడు. మొత్తం పన్నెండు కట్టి మనిద్దరికి చెరో రెండు ఫ్లాట్లు యిచ్చి చెరో లక్ష యిస్తానన్నాడు. మిగతావి అతను అమ్ముకుంటాడు. ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడూ, నే కావాలంటే నిన్ను అన్యాయం చెయ్యొచ్చు. ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మామయ్య ఎప్పుడో పోయాడు. దస్తావేజులు నాపేరు మీద, నీ చిన్నప్పుడే నా ఎకరా పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చెయొచ్చు. కాని నేను తల్లినిరా నీకు, ఏ తల్లీ బిడ్డకి అన్యాయం చేయదు. నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకి కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డరు ఇచ్చే క్యాష్ తో నీకు ఇచ్చేస్తాను. నీ రెండు అపార్ట్ మెంటులు నీ ఇళ్లు. వుంచుకున్నా అమ్ముకున్నా నీ యిష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నీవూ బిల్డరుతో మాట్లాడుకో"... అక్కయ్య _
    అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుంటే, కన్నీళ్లు చెంపలంబడి జారి, కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని. "మీ అక్కయ్య ఎప్పుడూ వాడికో ఇల్లుండాలి అండీ, యీ ఇల్లు కాస్తా యిప్పుడమ్మితే ఏం వస్తుంది. ధరలు పెరిగాక చూద్దాం అనేది - ఎప్పుడు డబ్బవసరం వచ్చి నేను అమ్మేద్దాం అంటే! ఆవిడది తల్లి మనసయ్యా - నీవు విసుక్కున్నా నిన్నడగడానికి ఆవిడేనాడూ మొహమాటపడలేదు. కొడుకు నడగడానికి ఆవిడేనాడూ మొహమాటపడలేదు. కొడుకు నడగడానికి నాకేం సిగ్గు అనేది" బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం, కాయితాలు పట్టుకుని గదిలోకి వెళ్లి సుగుణ మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది. అక్కయ్య ఋణభారం తీర్చలేదు - పెంచిపోయింది అనిపించింది.
    
                                                                                                 (పత్రిక - మంత్లీ - 2002)

                                                 *  *  *  *  *

 Previous Page Next Page