"లేదు. నేనూ వస్తున్నాను, పద" అన్నాడు రాజు.
తను తెచ్చిన వస్తువుల్ని పూర్ణచేతిలో పెట్టి "పూర్ణా! బాగా చదువుకొని వేగం పెద్దదానివయిపోతే నువ్వుకూడా పట్నం వచ్చేయచ్చు. అప్పుడు హాయిగా మనం కలిసి చదువుకొందాం" అన్నాడు రాజు.
"చిన్నాన్నా! నువ్వు మళ్లా వచ్చేసరికి నేనింత చదువు చదువు కొంటాను" రెండుచేతుల్నీ చేయగలిగినంత దూరం చేస్తూ చూపింది పూర్ణ.
"అప్పుడు నీకు నేనింత పెద్ద పుస్తకం తెస్తాను." పూర్ణ బుగ్గల్ని పుణికి ముద్దు పెట్టుకొంటూ అంది అనూరాధ.
సిగ్గుగా చేతులతో ముఖం కప్పుకొని వేళ్ళ సందుల్లోనించి దొంగచూపులు చూసింది పూర్ణ.
* * *
పదిరోజులుగా ఎప్పుడు ఈనుతుందో అని చూస్తున్న ఎర్రావు పడ్డ ఆ తెల్లవారుఝామున ఈనింది. సలక్షణంగా మొదటి కాన్పుకి కోడెపెయ్యని వేసింది. కలవకళ్ళు, కుచ్చుతోక, తెల్లటి ముఖంమీద సిందూరం దిద్దినట్లు ఎర్రటి మచ్చ. ఆవుల సాల వదలి రాబుద్ధికాలేదు. వరదరాజుకి, పూర్ణకి.
రాజు బి.యస్ సి. ఫైనల్ ఎగ్జామినేషన్సు అయిన వెంటనే తను గ్రామం చేరుకొన్నాడు. పూర్ణ ఒకటో క్లాసు పాసయి రెండో క్లాసులోకి వచ్చింది. ఇద్దరికీ సెలవులే. కబుర్లకి, కథలకి అంతం లేదు. పూర్ణ చిలిపిచేష్టలతో, అన్నవదినల అభిమానంతో రాజుకి సెలవులు ఇట్టే గడిచి పోయినట్లు అయ్యేయి.
పరీక్షాఫలితాలు తెలిసే సమయం దగ్గిరపడుతున్న కొలదీ ముందు ఏమి చెయ్యాలన్న ఆలోచన రాజు మనసులో కదలజొచ్చింది. ఎమ్. ఎస్ సి. చదివితే? మళ్లా రెండు సంవత్సరాల చదువు! తను ఆర్జించి పెట్టకపోవడం సరికదా అన్నని నెలనెలకి సొమ్ము పంపమనాలి. ఎంతకని అప్పులుచేసి పంపుతాడు? ఎవరు ఇస్తారు అప్పు?
రాజు ఒక నిశ్చయానికి రాకముందే పరీక్షాఫలితాలు తెలిసేయి. రాజు, పూర్ణ ఆ రోజే పుట్టిన బుజ్జాయి అందచందాల చూస్తూండగా వీథిలోనించి సత్తిబాబు కేకపెట్టేడు. పరీక్షాఫలితాలు తెలిసిన వెంటనే తనకి కబురుపెట్టమని వరదరాజు సత్తిబాబుతో చెప్పివచ్చేడు. ఏదో పనిమీద ఆ గ్రామం వస్తూ ఆ వార్త స్వయంగా తీసుకువచ్చేడు సత్తిబాబు. అతని చేతిలోని పేపరు అందుకొని ఆత్రంగా తీసి నెంబరు చూసుకొన్నాడు రాజు.
ఫస్టుక్లాసు! తను ఫస్టుక్లాసులో పాసయ్యేడు!! ఇంటిలోనికి ఒకటే పరుగుతీసేడు.
"వదినా, నేను పరీక్ష పాసయ్యేను, వదినా! ఫస్టుక్లాసులో పాసయ్యేను!"
ఆవుకి తవుడు మేపుతున్న మీనాక్షి చేయి దులుపుకోకుండానే 'వరదం' అంటూ వచ్చి కౌగిలించుకుంది.
తన వయసుని మరిచిపోయి రాజు, వదిన కౌగిలిలో ఇమిడి పోయేడు. వరదరాజు పి.యు.సి. చదువుకోసం పట్నం వెళ్లే ముందు ఇదేవిధంగా వదిన గుండెల్లో తలదాచుకొంటే 'నువ్వు పెద్ద వాడివవుతున్నావు వరదం. పెద్దవాడిలా ప్రవర్తించాలి' అంటూ బుద్ధులు చెప్పింది మీనాక్షి.
కాని ఈ రోజు ఆమెకి తన భుజంమీద జోకొట్టి నిద్రపుచ్చిన చిన్న మరిదిలాగానే కనిపించేడు రాజు.
వదినా మరదులను ఆ స్థితిలో చూసిన శివయ్య "ఏమిటిది? ఏమయింది?" అంటూ ముందుకి వచ్చేడు.
"వరదుడు పరీక్ష పాసయ్యేడండి. ఫస్టు క్లాసులో పాసయ్యేడు!" అంది మీనాక్షి సంతోషంగా. ఆమె ముఖంమీద అష్టైశ్వర్యాలు పొందినంత తృప్తి కనిపించింది శివయ్యకి.
"ఏమిటి రాజూ, ఫస్టు క్లాసే!" ఈసారి తమ్ముని కౌగిలించుకోవడం శివయ్య వంతయింది.
ఆనందం, ఆశ్చర్యం ఒక హద్దులోకి వచ్చేక తన షర్టుకి అంటిన తవుడు దులుపుకోసాగేడు వరదరాజు. మీనాక్షి ఆవుజున్ను పంచే నెపంతో ఇరుగింటికి వెళ్ళి తన మరిది ఫస్టు క్లాసులో పరీక్ష పాసయ్యేడన్న వార్త అందించింది. నాలుగిళ్ళ అవతల ఉన్న నారాయణమ్మకి, పదిళ్ళు దాటేక ఉన్న పద్మావతికి కూడా ఆ వార్త అందించి మీనాక్షి తిరిగి వచ్చేసరికి వారి ఇంటిముందు సైకిలు వుంది. 'ఎవరు వచ్చివుంటారు చెప్మా?' అని ఆలోచిస్తూ గుమ్మంలో కాలుపెట్టింది.
చావిట్లో నవారు మంచంమీద కూర్చున్న మనిషిని చూసి 'తను ఎన్నడూ చూడని ఈ చుట్టం ఎవరా?' అనుకొంది.
అంతలో వరదరాజు బట్టలు మార్చుకొనివచ్చి "పదండి, వెళ్దాం" అంటూ అతన్ని లేవగొట్టాడు. ఏమీ తెలియక తెల్లబోయి చూస్తున్న మీనాక్షికి సంగతి వివరించి చెప్పేడు శివయ్య.
"అతడు రాఘవయ్యగారి గుమాస్తా. వారెందుకో రాజుని రమ్మని కబురు పంపేరు" అన్నాడు భార్యతో.
"పరీక్ష పాసయేడని చూసివుంటారు. తమ సంతోషం తెలియజెయ్యడానికి పిలిచి వుంటారు. రెండేళ్ళపాటు వారింట ఉండి చదువుకొన్నాడు కదా, ఆపాటి అభిమానం వుండడం సహజమే. అందులో ఆ పిల్లకి వరదుడంటే చాలా ఇష్టం" అంది మీనాక్షి.
"అంతే అయివుంటుంది" అన్నాడు శివయ్య.
వరదరాజుకోసమే ఎదురు చూస్తున్నట్లు వీథి సావిట్లోనే కూర్చున్నారు రాఘవయ్య, రాజమ్మ.
గుమ్మంలో చూస్తూనే 'రావయ్యా....రా....ఫస్టు క్లాసులో మంచి మార్కులతో పాసయేవు _ చాలా సంతోషం!" అన్నాడు భార్యా భర్తలిద్దరూ.
కాస్తసేపు చదువు సంధ్యలూ, పరీక్షల గురించి మాటలు సాగేక, "ఇక ముందు ఏం చెయ్యదలుచుకొన్నావు?" అంటూ ప్రశ్నించేడు రాఘవయ్య.


