అయిపోయింది తనపని. చావు ముందుకొచ్చేస్తోంది. ఒక్కసారిగా పుణ్యవతికి క్షమాపణ చెప్పగలిగితే.
పుణ్యవతీ! నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను.
మళ్ళీ... ఎప్పుడో... ఎక్కడో...
హఠాత్తుగా తూలి, ధన్ మని మెట్లమీద పడిపోయాడు అర్జున్.
ఆ చప్పుడికి చటుక్కున తలెత్తి చూసింది పుణ్యవతి. భర్తని గుర్తించింది. రెండు అంగల్లో అతన్ని చేరుకుంది. అతని తల తన ఒళ్లోకి తీసుకుంది. ఆమె కన్నీటి చుక్క ఒకటి అతని పెదిమల మీద పడింది.
అతనికి మాట రావడంలేదుగానీ మనసు మాట్లాడుతోంది.
"తులసి మొక్కరా ఈ పుణ్యవతి. ఆమె కన్నీరు తులసితీర్థం! అది ఓ చిక్క నీ నోట్లో పడింది. మళ్ళీ మనిషిగా పుడతావ్ పో! జరిగింది గుర్తుంచుకుని వచ్చే జన్మలో అయినా తప్పుని ఒప్పు చేసుకో!"
వెనక్కి విరుచుకుపడిపోయాడు అర్జున్. అతను మరణించగానే, మహా సాధ్విలాంటి పుణ్యవతి కూడా గుండె పగిలి, అప్పుడే అక్కడే ప్రాణాలు వదిలింది.
* * * *
చటుక్కున స్పృహ వచ్చినట్లయింది కాశీకి. తల దిమ్ముగా ఉంది. షాక్ లో ఉన్నట్లు ఉన్నాడు అతను.
అయితే గత జన్మలో జరిగింది ఇదా!
ఆ గుళ్ళో చనిపోయాడు. ఈ గుళ్ళో గతాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు.
కానీ - ఇది అసలు నమ్మశక్యంగా ఉందా?
జన్మ! గత జన్మ! గత జన్మలో తను జల్సారాయుడు! నాస్తికుడు! తన భార్య పుణ్యవతి దైవభక్తురాలు. మహాసాధ్వి!
తను చేసిన తప్పులవల్ల తను పూటకి గడవని వాడిగా పుట్టాడు.
పుణ్యవతి పుణ్యం మూటకట్టుకుని అరవై వేల కోట్ల రూపాయలకు అధికారిణిగా ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిపే ఐశ్వర్య రాజశ్రీగా పుట్టింది. గత జన్మలో ఎన్ని నోములు నోచిందో - ఎంతమంది దేవుళ్ళకు మొక్కిందో చెప్పలేం!
కానీ -
ఇప్పుడు ఆమెకి దేవుడంటే పడదు! అడుగడుక్కీ దేవుణ్ణి ఇన్సల్టు చేద్దామని చూస్తుంది. తన క్రీగంటి చూపువల్లే ఈ భూగోళం నడుస్తున్నదనీ, సమస్త చరాచర జీవులూ తన కటాక్ష వీక్షణాలవల్లే బతుకుతున్నాయనే భ్రమలో ఉంది.
తన భార్య! ఐశ్వర్య!
తను! ఆమె దగ్గర నౌకరు - ఈ జన్మలో!
కానీ - తన భార్యని తను పెళ్ళి చేసుకోవాలి. పాపపు పనులు చెయ్యొద్దని ఆమెకు నచ్చచెప్పాలి. లేకపోతే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు!
మృదుమధురమైన స్వరంతో మూర్తిగారు చెప్పడం వినపడుతోంది.
'మనిషి ఆశకి అంతం లేదు. మనిషి తనని తాను అదుపులో ఉంచుకోవాలంటే, వారానికి కనీసం రెండు రోజులు కటిక ఉపవాసం చెయ్యాలి. అప్పుడు ఎదుటివాడి ఆకలి తెలుస్తుంది. రోజూ గుడికి వెళ్ళాలి. నేను అనే అహంకారం తగ్గుతుంది. వారానికోసారి హాస్పిటల్ కి వెళ్ళి పండ్లు పంచాలి. రోగులను పరామర్శించాలి. కష్టాలంటే ఏమిటో తెలుస్తాయి. నెలకొకసారి శ్మశానానికి వెళ్ళాలి. జీవితం ఎంత క్షణికమైనదో తెలుస్తుంది' అంటున్నాడు ఆయన.
అతి కష్టంమీద గొంతు పెగల్చుకుని అన్నాడు కాశీ - 'గత జన్మ గుర్తుంటుందా ఎవరికన్నా?'
చిన్నగా నవ్వి చెప్పాడు మూర్తిగారు.
"జన్మలు లేకేం! మనిషి పుట్టి చనిపోయేలోగానే అనేక జన్మలు ఎత్తినట్లు లెఖ్ఖ! రాత్రి నిద్రపోయాం అనుకో! ఆ కాసేపు చనిపోయిన వాడికిందే లెఖ్ఖ కదా! లేవడంతోనే మళ్ళీ పుట్టుక! నిద్రలో మళ్ళీ చావు! పిల్లాడు పెద్దవాడయ్యాక అది వేరే జన్మ కాదూ? పెద్దవాడు ముసలివాడయిపోవడం వేరే జన్మ కాదూ? అంతా అన్వయించుకోవడంలో ఉంటుంది."
ఇందాకటి కుర్రాడు ఓటమి అంగీకరించినట్లుగా మళ్ళీ అన్నాడు.
"సార్! సూటు వేసుకుని గుళ్ళోకి వచ్చారు మీరు. సూటు భారతీయ సంప్రదాయం కాదు కదా! దీనికి మీ సమాధానం ఏమిటి?"
చిన్నగా నవ్వాడు మూర్తిగారు.
"నీ ప్రశ్నకు సమాధానం మళ్ళీ ఇంకో ప్రశ్నే అవుతుంది. 'అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకూ?' అన్నదే ఆ ప్రశ్న! సరే! ముందు నీ ప్రశ్నకు సమాధానం చెప్పి, ఆ తర్వాత నా ప్రశ్నలోకి వస్తాను. సూటు వేసుకుని గుళ్ళోకి ఎందుకొచ్చానంటున్నావా? ఇది కాలానుగుణంగా ఉన్న డ్రస్సు కాబట్టి! శ్రీ రాముడూ, శ్రీకృష్ణుడూ అప్పటి ఫ్యాషను ప్రకారం పట్టు పీతాంబరాలు కట్టుకుని, ఆభరణాలు, కిరీటాలూ ధరించి ఉంటారు. వాళ్ళే ఇప్పుడు జన్మ ఎత్తితే, రేమాండ్ సూట్లు, లూయిస్ ఫిలిప్ షర్టులూ, 'హష్ పప్పీస్' షూస్ వేసుకు తీరతారనే నా నమ్మకం! అసలు విషయం వదిలేసి, అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మనకి ఎప్పుడూ ఉన్న అలవాటేగా! ఇంకో విషయం చెప్పు. పురాణకాలంలో ఈ మైకులు ఉన్నాయా? ఈ ఎలక్ట్రిక్ లైట్లు ఉన్నాయా? గుళ్ళోకి ఆవు నేతి దీపాల స్థానంలో ఎలక్ట్రిక్ లైట్లు ఎలా వచ్చాయో, ఈ సూట్లు కూడా అంతే అనుకో!" అన్నాడు మూర్తిగారు.
ఆయన చెప్పిన పాయింటు కరెక్టేనా కాదా అన్న విషయం అటు ఉంచితే ఆయన పద్ధతి మాత్రం బాగా నచ్చింది కాశీకి. ఆయన పాత కొత్తల మేలు కలయిక. గతం మీద గౌరవం ఉంది. కానీ శుద్ధ సనాతనవాది కాడు. చాదస్తం లేదు.


