ఆఫీసు ఒక యంత్రం. అందులో తను ఒక చక్రం. చక్రం గిరగిరా తిరుగుతూ వుంది. దానికి విరామం లేదు. మనసు లేదు. మమకారం లేదు. అభిమానం లేదు.
తెల్లారితే ఒకటో తారీఖు. అది ఎన్.జీ.ఓ. లకు పర్వదినం. కాని ఈరోజు ఒకటో తారీఖు తనచేతి నిండుగా పదిహేను వేలు జీతాలు పంచుతాడు. అన్ని కట్సుపోగా రెండొందల ఇరవై రూపాయలతో తను ఇంటికి వెళ్తాడు.
"అయ్యగారూ! ఎనిమిదయి పోయిందండీ! అందరూ వెళ్ళిపోయారు." ఫ్యూన్ అన్నాడు.
"ఎనిమిదయిందా?"
"ఇంటిదగ్గర కొంచెం__" నసిగాడు ఫ్యూన్.
"పని వుంది. వెళ్ళు. నైట్ వాచ్ మన్ కి తాళాలు నేను ఇచ్చి వెళ్తాలే." అన్నాడు షణ్ముఖం.
జవాను నమస్కారంచేసి వెళ్ళిపోయాడు.
షణ్ముఖం మెడమీద చెయ్యిపెట్టుకొని వెనక్కు విరుచుకున్నాడు. మేడ నొప్పిగా వుంది.
ఎదురుగా బోసినవ్వులతో పలకరిస్తున్న గాంధీ మహాత్ముని పటం కన్పించింది.
ఆ ముఖంలో ఎంత ప్రశాంతత! నవ్వులో ఎంత చల్లదనం! ఆ కళ్ళలో ఎంత వెలుగు! ఎంత నిరాడంబర జీవి? తనకేం తక్కువని వంటినిండా బట్టకూడా కట్టుకోకుండా సన్యాసిగా బతికాడు? ఎవరికోసం? తనకోసం కాదు. తన దేశంకోసం! తన దేశంలోని ప్రజల కష్టాల నివారణకోసం! ఎన్ని బాధలు పడ్డాడు! ఎన్నిసార్లు జైలుకు వెళ్ళాడు! ధన్యజీవి! మానవజన్మ అంటే అది.
మరి తనో! తన ఇంట్లోవారి కష్టాలను కూడాతీర్చలేకుండా వున్నాడు. పైగా విసుక్కుంటున్నాడు? తన బిడ్డల్నే తను సుఖపెట్టలేకపోతున్నాడు.
గాంధీజీ లొక కళ్యాణంకోసం జైలుకు వెళ్ళాడు. స్వరాజ్యం తెచ్చాడు మరి తనూ, తనలాంటివారూ ఇంకా ఇలాగే వున్నారేం?
క్షణం తీరికలేని పని, ఎప్పుడూ ఎలుగ్గొడ్డులా అరిచే ఆఫీసరూ, శరీరాన్ని, ఆత్మనూ, అమ్ముకొని సంపాదించే నెల జీతం రెండువందల రూపాయలూ, క్షణకాలం శాంతిలేని కొంపా, ఎప్పుడూ ఏడుస్తూ ఎదురయే ఇల్లాలూ, సాధించే తల్లీ, అది కావాలి ఇది కావాలి అని ఏడ్చే పిల్లలూ, ఎప్పుడూ రోగాలూ, మందులూ....
'ఖంగ్ ఖంగ్' చిన్నకొడుకు దగ్గు.
'నాన్నా, నాన్నా.' జబ్బుతోవున్న చిన్న కూతురి కలవరింత.
"జామెంట్రీ బాక్సు" పెద్దకొడుకు నిద్రలో.
"ఇవ్వాళైనా పెందలాడే వస్తారా?" కలలో పలకరిస్తూ భార్య.
'ఒరే నాయనా! ఇంట్లో సరుకులు నిండుకున్నాయిరా!' మూగగా తల్లి గొణుగుడు.
షణ్ముఖం చెవులు మూసుకున్నాడు. అయినా మాటలు విన్పిస్తూనే వున్నాయి.
'హే! మహాత్మా. నా కళ్ళు తెరువు. నాకు వెలుగును ప్రసాదించు! నాకు జ్ఞానబోధ చెయ్యి. నన్నేం చెయ్యమంటావ్?' గాంధీ మహాత్ముని ఫోటోకేసి చూస్తూ పైకే అన్నాడు షణ్ముఖం.
గోడ గడియారం తొమ్మిది కొట్టింది. క్యాష్ బుక్ క్లోజ్ చేసి క్యాష్ బాక్సు తీశాడు. క్యాష్ లెక్క పెట్టుకున్నాడు. సరిపోయింది. ఆఫీసరు ఇంటికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు.
మహాత్మునికేసి చూశాడు. రెండు చేతులూ జోడించి నమస్కరించి స్వామీ! జ్ఞానోదయం అయింది అన్నాడు.
షణ్ముఖం ఇంటికి చేరేప్పటికి పది దాటింది.
అందరూ నిద్రపోయారు.
ఆదిలక్ష్మి మాత్రం దర్వాజాకు చేరబడి జోగుతూ వుంది.
షణ్ముఖం భార్యకు తగలకుండా లోపలకు వచ్చాడు.


