Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    వేణు తల వంచుకున్నాడు. అతడికి తనమీద తనకే అసహ్యం వేసింది. యీ కథలో నిజమైన విలన్ ఎవరన్నా వుంటే, అది తనే. ఒక కర్తవ్యం కోసం దీక్ష బూనిన ప్రసాదరావు కానే కాడు. అతడు అడుగు ముందుకు వేసి, "క్షమించండి. ఇంతకాలం మీ సహనాన్ని పరీక్షించాను. నాకు ఇంకో నాలుగు అయిదు గంటలు టైమివ్వండి చాలు" అన్నాడు.

    ప్రసాదరావు ఆశ్చర్యంగా అతడివైపు చూసాడు.

    "అవును. మీ కోర్కె నేను నెరవేరుస్తాను. ఇంతకాలం ఓపిక పట్టారు. ఇక సాయంత్రం వరకూ చూడండి."

    "మీ పని నేను చేయలేకపోతే మీరు కాదు, నేనే కాల్చుకుంటాను. ఈ క్షణంనుంచీ నా మనసు యుక్తాయుక్తాలు అలోచించటం మానేస్తుంది. కేవం మీకు మాటిచ్చిన వేణు మాత్రమే బ్రతికివుంటాడు" అంటూ అక్కణ్నుంచి విసురుగా వెళ్ళబోయి ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగి, ప్రసాదరావు దగ్గిరకి వచ్చాడు. వంగి, బల్లమీద వున్న పిస్టల్ తెరిచి అందులో వున్న రెండు బుల్లెట్లూ జేబులో వేసుకుని_ "వీటి అవసరం ఇక మీకు వుండదు" అని చెప్పి అక్కడినుంచి కదిలాడు.

    ప్రసాదరావు చిత్తరువులా అతడి చర్యలను చూస్తూ వుండిపోయాడు. సరిగ్గా అరగంట తరువాత ఎదురింటి కాంపౌండ్ నుంచి కారు బయటికి దూసుకు వెళ్ళటం కనిపించింది. వేణు డ్రయివ్ చేస్తున్నాడు. పక్కనే ప్రేమ వుంది.

    వాయుగుండం తాలూకు ప్రభావం ఇంకా తగ్గలేదు. మేఘాలు మళ్ళీ అలుముకుంటున్నాయి. రోడ్లన్నీ తడిగా వున్నాయి.

    ప్రసాదరావు గుండె వేగంగా కొట్టుకోసాగింది.

    ఏం చేస్తాడు?

    వేణు ఏం చేయబోతున్నాడు?

    అతడి ఆతృత గమనించినట్టు కొంచెంసేపటికి, టీ హోటల్ కుర్రాడొచ్చి ఫోన్ వచ్చిందని చెప్పాడు.

    వెళ్ళి అందుకున్నాడు.

    అట్నుంచి వేణు!
   
    "హల్లో!"

    "నేను_వేణుని."

    "చెప్పు, ఎక్కణ్ణుంచి."

    "మా ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ నుంచి"

    "అదేమిటి_ప్రేమ?"

    "లోపల స్నానం చేస్తోంది. మీరింకేం కంగారుపడనవసరంలేదు. అనుకున్నట్టే అంతా అయిపోతుంది. యూ కెన్ సెలబ్రేట్ ఓల్డుమాన్ ఆనందంతో తినండి, తాగండి. మీరే గెలుస్తున్నారు. ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తీ".... ఫోన్ కట్ అయింది.

    "హల్లో-హల్లో" అన్నాడు ప్రసాదరావు. టెలిఫోన్ టాప్ చేస్తూ అట్నుంచి ఏ శబ్దమూ లేదు. ఎంక్వయిరీ ఫోను కట్ చేశాడు. వర్షంవల్ల చెడిపోయి వుండవచ్చు అన్నారు.

    రూమ్ కి తిరిగి వస్తూంటే ఎన్నో ఆలోచన్లు.

    వేణు మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అతడి కంఠంలో ఒక తెగింపుని చూడగలిగేడు ప్రసాదరావు. రేసు గుర్రాలకి పరుగెత్తబోయే ముందు మందు త్రాగిస్తారు. అది తాగేక ఇక వాటికి పరుగెత్తటం ఒకటే దృష్టిలో వుంటుంది. అది తప్ప మరేమీ ఆలోచించవు. వేణు స్థితి అలానే వున్నట్టు అతడి మాటలను బట్టి తెలుస్తుంది.

    ప్రసాదరావుకి సంతోషం వేసింది.

    తన ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్ధంకాలేదు. ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళుగా ఎదురుచూసిన సమయం దగ్గిరపడింది. తన పగ చల్లారబోతూంది.

    అతడు లేచి గాలిలో కొంచెంసేపు అటూ ఇటూ పచార్లు చేసాడు.

    సరిగ్గా అదే సమయానికి అక్కడ గెస్ట్ హౌస్ లో, బాత్ రూమ్ లోంచి ప్రేమ బయటికి వచ్చింది. నుదుటిమీదా, మెడమీదా నీటిబొట్లు తళతళా మెరుస్తున్నాయి. "ఏమిటలా చూస్తున్నావ్?" అంది నవ్వుతూ.

    అతడు దగ్గిరగా వచ్చాడు. ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు.


                       *    *    *    *


    పిస్టల్ ని చేతుల్లోకి తీసుకుని ఇటూ అటూ తిప్పి చూశాడు ప్రసాదరావు. ఇక దాని అవసరం లేదు. డ్రాయరు సొరుగుతీసి అందులో పెట్టేశాడు. అతడి పెదవులమీద ఎంత ఆపినా, ఆగని చిరునవ్వు నాట్యం చేస్తూంది. తన పని అనుకున్నట్టే జరగబోతూ వుందని అతడి మనసు చెపుతూంది. ఇంకొక్క నాల్గయిదు నెలలు. అదృష్టం బావుంటే, మూడు నెలలే చాలు! ఒకవేళ తను అనుకున్నట్లు ప్రేమ గర్భవతి కాకపోయినా ఫర్వాలేదు. ఒక ఆర్నెల్లు చూసి అప్పటికి ఏమీ కాకపోతే, కావల్సిన ఫోటోలు తీసి, వేణుని రంగంనుంచి నిష్క్రమించమని చెప్తాడు. ఇక తరువాత ఆ జగపతిరావుని ఆడిస్తాడు.

    కోర్టులో తనమీద బనాయింపబడిన కేసు. తనకి పడిన శిక్ష, జైలు నుంచి బయటకు రాగానే చెల్లెలి గురించి తెలిసిన వార్త అన్నీ వరసగా జ్ఞాపకం వచ్చాయి. కూతురి శీలం గురించి ప్రపంచం అంతా తెలిసాక, జగపతిరావు స్థితి అలాగే కావాలి. తాను జైలులో ఎలా చెల్లెల్ని తల్చుకుని కుమిలిపోయాడో, అతడూ అలాగే కూతుర్ని తలుచుకుని కుమిలిపోవాలి.

    అతడి దృష్టి బైనాక్యులర్స్ మీద పడింది. ఇక ఈ రోజునుంచీ దాని అవసరం లేదు. ఇంతవరకూ సేవచేసింది. దాన్ని ముద్దు పెట్టుకుని పెట్లో పడేసేడు.


                       *    *    *    *


    ఆమెని చేతుల్లోకి తీసుకుని మెడమీద నిలిచిన నీటిబిందువుని నాలుకతో సుతారంగా స్పృశించాడు. ఆమె కనులు మూసుకుంది. వంటి మీదనుంచి వచ్చే చక్కటి పరిమళం అతడిని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తూంది. ఆమెకూడా ఆ తదాత్మ్యతని అనుభవిస్తున్నట్టు చాలాసేపటి వరకూ కదల్లేదు. తరువాత నెమ్మదిగా అతడి చేతుల్ని విడిపించుకుంటూ, "చూసేవా మనం ఎంత దగ్గిర అయిపోయామో?" అంది.

    అతడు తెప్పరిల్లి- "ఏమిటి?" అని అడిగాడు.

    "ప్రయాణంచేసి ఇద్దరు స్నేహితులు గదికి రాగానే, నేను స్నానం చేయాలి బాబూ అని చొరవగా వెళ్ళినట్టు నేను బాత్ రూమ్ కి వెళ్ళిపోయాను" అంది.

    "ఏం? మనం స్నేహితులం కామా?"

    ఆమె కళ్ళతోనే నవ్వుతూ- "అంతకంటే ఎక్కువే అనుకుంటున్నాను" అంది.

    అతడు చప్పున ఆమెని దగ్గిరకు లాక్కున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు.

    "వేణూ!"

    "ఊ!"

    "డూ యూ లవ్ మి?"

    "ఇప్పుడా నీకు ఆ అనుమానం రావల్సింది?" 

    "నా ప్రశ్నకి సమాధానం అదికాదు."

    "ఐ లవ్యూ ప్రేమా!"

    పర్యవసానం ఏదైనా ఈ మాట మాత్రం సిన్సియర్ గా అంటున్నాను- అనుకున్నాడు. చాలా చిత్రంగా, అతడిలో ఈసారి ఏ ఘర్షణా లేదు. ఒక నాటకంలో నటుడు తన పని ఎలా చేసుకుపోతాడో, అలా చేసుకుపోతున్నాడు. ఈసారి ప్రసాదరావుని నిరాశ పర్చదల్చుకోలేదు అతడు. ఆరు మూడయినే సరే.

    "వేణూ!" అతడి ఛాతిమీద వాలుతూ అన్నది. అతడు పక్కమీద వెల్లకిలా పడుకుని వున్నాడు. "చెప్పు" అన్నాడు.

    "నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు నువ్వు?"

    "ఎవరయినా దేన్ని చూసి ప్రేమిస్తారు ప్రేమా?"

    ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. అతడు ఆమె ముంగురుల్ని చెవి వెనక్కు తోస్తూంటే, ఆమె కనులు మూసుకునే తనలో తను మాట్లాడుకుంటున్నట్టు- "నాకు పెద్ద పెద్ద నిర్వచనాలు తెలియవు బాబూ! నాకు తెలిసినంతలో ఏమిటంటే- ఒకరి అందం, అర్హతలవల్ల ఆకర్షణ ప్రేమగా మారుతుందని" అంది.

    ఒక చిన్న వాక్యంతో ఆమె అంత గొప్ప అర్ధాన్ని చెప్పటం అతడికి ముచ్చటేసింది. "గుడ్!" అన్నాడు ఆమెని మరింత దగ్గిరకు తీసుకుంటూ. ఆమె అప్రయత్నంగా పక్కకి జరిగింది. అతడు ఆ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించబోతూ వుండగా, అప్పటివరకూ కాస్త తెరిపి యిచ్చిన వర్షం, తిరిగి కురవటం ప్రారంభించింది.


                                                   *    *    *    *


    సన్నగా కురుస్తున్న వర్షాన్ని కిటికీలోంచి చూస్తున్నాడు ప్రసాదరావు. అతడి మనసంతా థ్రిల్ తో నిండివుంది.

    ఏదో చెయ్యాలని వుంది.

    ఏం చెయ్యాలి.... ఏదో చెయ్యాలి.

    ఈ ఆనందాన్నీ, ఈ ఉద్వేగాన్నీ ఎవరితోనయినా పంచుకోవాలి.... ఎవరితో?

    అతడి మనసులో మెరుపులా ఒకరి పేరు స్పురించింది. అతడు సన్నగా వణికేడు. అయితే, అలా వణికింది పట్టలేని ఆనందంతో! తనకా సమయానికి ఆ పేరు స్పురించినందుకు తనని తానే అభినందించుకున్నాడు.

    అతడు తన జీవితపు ఆ అద్భుతమైన ఆనందకర క్షణాల్ని పంచుకోవాలనుకున్నది సర్ జగపతిరావు బహద్దూర్ తో.

    తలుపు తాళంవేసి, అతడు మెట్లు దిగాడు. వర్షానికి నానిన కర్ర మెట్లు అతడు దిగుతూంటే కిర్రుమంటున్నాయి.

    దిగుతూ అతడు ఆలోచిస్తున్నాడు.

    తను చేయబోతున్న ఈ పనిలో రిస్కు ఏదయినా వుందా అని ఆలోచించసాగాడు.

    ఒకటి రెండుసార్లు కారులో వెళ్తూ యధాలాపంగా తనని చూసేడు జగపతిరావు. అయినా గుర్తుపట్టలేదు. అవును మరి ఇరవై సంవత్సరాలు కావస్తూంది తనని చూసి.

    ఇప్పుడు తను వెళ్ళి చెప్తాడు తనెవరో....

    అప్పుడు అతని రియాక్షన్ ఎలా వుంటుంది? కేవలం అది చూడటానికే మనసు ఉవ్విళ్ళూరుతుంది.

    ఇంతకాలం ఎదురింటిలో వుండి తనేం చేసాడో అర్ధంగాక బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. మరో ఆర్నెల్లపాటూ తన ఎత్తేమిటో తెలియక అనుక్షణం చచ్చిపోతాడు.

    ఆ ఆనందమే తనకు కావల్సింది.

    అయితే ఇందులో రిస్కేమైనా వుందా?

    భవిష్యత్తులో తనతో కలిసి వేణుని ఎప్పుడైనా చూస్తే, అది రిస్క్. అది జరక్కుండా తను జాగ్రత్తపడగలడు. పోతే, "ఎదురింట్లో ఉన్నది మన శతృవమ్మా" అని ప్రేమతో చెప్తే అది రిస్కు. "ఆయన నాకు తెలుసు నాన్నా!" అంటుంది- మొత్తం తీగ అంతా కదులుతుంది. కాని ఆయన చెప్పడు. చెప్పవలసివస్తే, మొత్తం కథ అంతా చెప్పాలి. తన కౄరత్వం గురించి ఏ తండ్రీ కూతురికి చెప్పుకోదు. మొత్తంమీద కొద్ది రోజులపాటు, వేణు తన మనిషని ఆయనకీ తెలియకుండా చూసుకోగలిగితే చాలు.

    అతడిలో ఈ ఆలోచన వచ్చినప్పటినుంచీ, క్షణక్షణానికీ ఆ కోర్కె పెరిగిపోతూంది_ జగపతిరావుని కలుసుకోవాలని కలుసుకోవాలని!!!

    అతడు రోడ్డు దాటి అవతలి ఇంటివైపు నడిచాడు.

    ప్రహరీగోడ గేటు తీసుకుని, లోపలికి ప్రవేశించాడు. తెలిసిన వాడవటంచేత, గూర్ఖాకూడా ఆపుచెయ్యలేదు. "జగపతిరావ్ సాబ్ వున్నాడా?" అని అడిగాడు నౌఖర్ని.

    "ఊర్నించి ఇప్పుడే వచ్చిండు సాబ్."

    ప్రసాదరావు హాలులోకి ప్రవేశించాడు. మధ్య హాలులో సోఫాలో కూర్చుని జగపతిరావు బూట్లు విప్పుకుంటున్నాడు. అలా చెప్పా పెట్టకుండా వచ్చిన అతిదెవరా- అని మొహం చిట్లించి, అంతలోనే అతడు ఎదురింటి మనిషి అని గుర్తించి, కాస్త ప్రసన్నుడై, "రండి రండి" అన్నాడు. ప్రసాదరావు మాట్లాడకుండా ఎదుటి సోఫాలో కూర్చుంటూ జగపతిరావుని పరీక్షగా చూశాడు. అప్పటికీ ఇప్పటికీ అతడిలో బాగా మార్పొచ్చింది_ బహుశా డబ్బు సంపాదన తాలూకు ఆలోచనలు అతడికి వృద్ధాప్యాన్ని తొందరగా సంపాదించి పెట్టాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra