తిరుగుతున్నాడు ఆరాటంగా, ఆర్తిగా వీధి వీధి తిరుగుతూనే వున్నాడు. ఫలితం కనిపించటంలేదు. సమయం పదకొండు గంటలు కావస్తుంది. సూర్యుడు నడినెత్తికొస్తున్నట్లుగా ఎండ చురుక్కుమనిపిస్తుంది. పెనుగాలికి, చలికి, ఎండకు ఎండి జడివానలో తడిసి కొండరాళ్ళ మధ్య కరడుగట్టుకుపోయిన రాతిశరీరం అతనిది.
ఆ ఎండ అతనిలోని పట్టుదలను, ఆరాటాన్ని అణుమాత్రంకూడా అణచలేకపోతుంది. ఉన్నట్టుండి అతనికో ఆలోచన వచ్చింది. అంతే. ఆ మరుక్షణం నుంచి పోస్టాఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు.
o o o
యుగంధర్ ముందు సర్కిల్ ఇన్స్ పెక్టర్ వున్నాడు. ఆ సర్కిల్ కి యుగంధరంటే భయభక్తులేకాదు గౌరవాభిమానాలు కూడా వున్నాయి.
"మిష్టర్ సర్కిల్! నాకో చిన్న సహాయం కావాలి. అది మన ఎథిక్స్ కే విరుద్దం కావచ్చు. అయినా తప్పదు. ఒక మంచిపని జరగాలంటే చిన్న తప్పు చేయక తప్పదు" ఒకింత సంజాయిషీ ఇచ్చుకుంటున్న ధోరణిలో అన్నాడు యుగంధర్.
శాసించాల్సిన అధికారి ఆ విధంగా తన్నో సహాయం అడుగుతున్నాడంటే అవుటాఫ్ ది వే వెళ్ళవలసిన పనే అయుంటుంది. "తప్పక సార్! చెప్పండి సార్! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్?"
"ఏ. ఎస్. పి గౌసుద్దీన్ ఇంట్లో దొంగతనం జరగాలి" నెమ్మదిగా వత్తిపలుకుతూ అన్నాడు యుగంధర్. ఒక విచిత్రమయిన విషయాన్ని విన్న స్థబ్దత సర్కిల్ ను చుట్టుముట్టింది క్షణకాలంలో.
ఎలాంటి క్రిమినల్ నయినా గడగడలాడించే ది గ్రేట్ పోలీసాఫీసర్ యుగంధర్. తను ఓ యింట్లో దొంగతనం జరగాలని అడుగుతున్నాడు. పైగా ఆ దొంగతనం కూడా పోలీసాఫీసర్ ఇంట్లో. కొద్దిక్షణాలు అతనికేమీ అర్ధముకాలేదు. కానీ ఒకటిమాత్రము ఆ సర్కిల్ కి బాగా తెలుసు. యుగంధరు ఒక పతాకము వేశాడంటే అది ఖచ్చితముగా మంచికే అని, ఇంకో విషయముకూడా అర్ధముకాక కలవరపడ్డాడు సర్కిల్. అది తననే ఆ దొంగతనము చేయమని అడగడుకదా అని.
"నువ్వేం కంగారుపడక్కరలేదు మిస్టర్ సర్కిల్. ఇప్పుడు మనకు మంచి తెలివితేటలు ధైర్యము వున్న వ్యక్తికావాలి. అతను మన డిపార్ట్ మెంట్ మనిషి మాత్రము కాకూడదు.
మరో విషయము గుర్తించుకో -గౌసుద్దీన్ ఇంట్లో లంచాలద్వారా సంపాదించిన సొమ్ము చాలావుంది. దాన్ని దొంగతనము చేయకూడదు. వైట్ ఎసెట్స్ అంటే రికార్డులోకి వచ్చిన వస్తుసంపదల్నే దోచుకోవాలి. నా పని పూర్తయిపోగానే అతనింట్లో దోచుకున్నదంతా తిరిగి అతనికి చేర్చబడుతుంది."
సర్కిల్ కొంచెముసేపు ఆలోచిస్తూండిపోయాడు.
"నిజానికి సయితము అతను కరప్టడ్. అతనిప్పుడు పెద్ద స్టేక్ నాశించి మరో చోటుకి బదిలీ కావాలనే ఆలోచనలో వున్నాడు. అతన్ని అక్కడకు వెళ్ళకుండా ఆపాలి. నాకదే కావాల్సింది. ఇది నీ సహకారంతో మాత్రమే పూర్తికాగలదనే ఆశతో పిలిపించాను. కాదంటే చెప్పు. నేను మరో వ్యక్తిని ఎన్నుకుంటాను. ఇందులో నిర్భంధము ఏమీలేదు. నామీద, నా నిజాయితీమీద నమ్మకం వుంటేనే ముందడుగు వెయ్" యుగంధరు నిర్మొహమాటంగా అన్నాడు.
అప్పటికే తేరుకున్నాడు సర్కిల్. అప్పుడు రాత్రి పదకొండు గంటలవుతుంది. నిశ్శబ్దముగా వున్న ఆ హాలు నాలుగు గోడల మధ్య ఆ యిద్దరే వున్నారు. మొదటి ఎత్తులోనే మధుమూర్తి, ప్రభృతుల్ని చిత్తుగా దెబ్బతీయాలని పట్టుదలతో వున్నాడు యుగంధర్.
ఇప్పుడతను సర్కిల్ అంగీకారము కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా వున్నారు. సర్కిల్ మౌనాన్ని పాజిటివ్ గా అర్ధము చేసుకున్నాడు యుగంధర్.
"ఓకే సార్! ఆ గౌసుద్దీన్ గా గారంటే నాక్కూడా ఎప్పటి నుంచో ఎలర్జీ. అతని యాక్టివిటీస్ అంటే పరమ అసహ్యము. అతనింట్లో వున్న చిన్న టేప్ రికార్డర్ దగ్గర్నుంచి ఎ.సి. మిషన్ వరకూ పెద్దల తప్పుల్ని కాసి సంపాదించుకున్నవే. ఎంతమంది పేదప్రజల ఉసురో అతనికి తగలకపోదు. నేనతని కింద నా కర్మగాలి కొన్నాళ్ళు పనిచేశాను సార్! ప్రతీక్షణము హుమిలియేషన్. ఏనాడు ఏ కేసూ నిజాయితీగా పరిష్కరించలేకపోయాను. అయితే నా భయమల్లా ఒకటే. అతను నరరూప రాక్షసుడని ఖాకీదుస్తుల్లో వున్న కొండచిలువని అందరికీ తెలుసు. అలాంటి దుర్మార్గుడింట్లో చూస్తూ చూస్తూ ఎవరు దొంగతనము చేయటానికి ముందుకొస్తారు? అదే సార్....మీరు చెప్పిన దగ్గర్నుంచి నా ఆలోచన."
యుగంధర్ కూడా ఆలోచనలో పడ్డాడు. మరలా నిశ్శబ్దము పేరుకుంది. క్షణాలు....నిమిషాలు గడిచిపోతున్నాయ్. అంతలో ఫోన్ మోగింది. యుగంధర్ చటుక్కున ఫోనెత్తాడు. "హలో! యుగంధర్ దిస్ సైడ్!"
"హలో యంగ్ మేన్!" నేనూ గంగాధరరావుని మాట్లాడుతున్నాను...."
"నమస్కారం సార్!" అని ఫోన్ లో చెప్పి మౌత్ పీస్ మీద కుడిచేతిని అడ్డం పెట్టి సర్కిల్ వేపు చూస్తూ "సెంట్రల్ జైల్ సూపరెంటెండెంట్ గంగాధరరావుగారు" అని అప్పుడు చేతిని తొలగించి "చెప్పండి సార్" అన్నాడు వినయంగా యుగంధర్.
"ఏం లేదు. నువ్వు నాన్నగారెలా వున్నారో తెలుసుకుందామని చేశాను. నా ఉద్యోగం తెలుసుగా నరరూప రాక్షసుల్లాంటి ఖైదీలపై అనుక్షణం కంటికి రెప్పలా నిఘావేసి వుంచాలి. బైదిబై నువ్వు, నాన్నగారు పోయిన సండే మా ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి రాలేదు. నేనయితే నీ బిజీని అర్ధంచేసుకోగలను. కాని నా ముద్దుల కూతురు, నీ ఫ్రెండ్ అదే బ్రాహ్మణి గొడవచేసింది.మరలా మీరు భోజనానికి వచ్చేవరకు నన్ను హింసించేదే నా అదృష్టం బావుండి ఓ ఖైదీ మనస్తత్వం పరిశీలనంటూ దానిలో మునిగిపోవటంతో నేను బతికిపోయాను. అలాంటిపనులు వద్దమ్మా అంటే వినదుకదా? అతనసలే పదేళ్ళ వయసులోనే మర్డర్ చేసిన మోస్ట్ ఇంటలిజెంట్ అండ్ డేంజరస్ గై. ఈలోపే అతను రిలీజ్ అయ్యాడు. దాంతో నేనా వూరు వెళతానని అతని వూరువెళ్ళి "ఆప్టర్ జైల్" అన్న అంశంమీద రీసెర్చ్ చేస్తానని మొండికేసింది. ఎలాగో సర్దిచెప్పి ఆపాను. ఆ పెళ్ళి కాస్త చేసేస్తే ఆ బాధలేవో నీవే పడతావని" ఆవేపు గంగాధరరావు అన్న మాటల్ని మననం చేసుకున్నాడు యుగంధర్.


