Read more!
 Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 4

 

    "చారిత్రక హీరో ముఖం పెట్టమంటవా మాధవీ!" "ఛీ పో!" మాధవి కళ్ళల్లో వెలుగులు చిమ్మాయి.
    "ఏమిటో మీ సోద నాకోక్కటీ అర్ధం కావటం లేదు" నాగరత్నమ్మ అయోమయంగా చూసింది!
    "ఇదీ సినిమా డైలాగే" మాధవి తల్లి భుజం మీద వాలి ప్రేమ్ సాగర్ ను ఓరగా చూసింది.
    "ఉండమ్మా అబ్బాయికీ కాఫీ అన్నా తెచ్చి పెడతాను" అంటూ నాగరత్నమ్మ వంటింటి వేపు నడిచింది.
    "నాగరత్నమ్మ గారూ! నాగరత్నమ్మ గారూ!" బిగ్గరగా అరిచాడు సాగర్.
    "మళ్ళీ ఏ మొచ్చిందర్రా?" గిర్రున వెనక్కి మళ్ళింది నాగరత్నమ్మ.
    "కాఫీ వద్దండి. మీ కెందుకు శ్రమ!"
    "ఓరీ నీ ఇల్లు బంగారం గానూ! ఇందుకా అంత అరుపు అరిచావు నాయనా! ఇందులో నాకు శ్రమ ఏమిటి గాని కూర్చో. క్షణంలో కాఫీ పంపుతాను." అంటూ నాగరత్నమ్మ వంటింట్లోకి నడిచింది.
    "అది సరే గాని సాగర్! మా అమ్మను 'నాగరత్నమ్మ గారూ' 'నాగరత్నమ్మ గారూ' అని పిలుస్తావేమిటి?"
    "మీ అమ్మగారి పేరు అది కాదా?"
    "తెలివి! అదేలే, పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలిస్తే ఏం బాగుంటుందని?"
    "అయితే వరుసలు పెట్టి పిలవమంటావా?"
    "అబ్బ నీ ఇష్టం వచ్చినట్లే పిలువు. ప్రతిది లాగి లాగి గుంజుతావ్!"
    "మనసులు కలిసినప్పుడు కదా వరసలు పెట్టి పిలవవలసినది."
    "వరసలూ మనసులూ మీద మరో ఫై.హెచ్.డి చేయి" మాధవి బుంగమూతి పెట్టింది.
    "అరె అంతలోనే కోపమా! అయితే అంటీ అని పిలవమంటావా?" కొంటెగా చూపులు చూస్తూ అన్నాడు సాగర్.
    "అతి తెలివి" పెడముఖం పెట్టింది మాధవి.
    "నాకు వరసలు తెలివ్వని చెప్పానుగా! ఏమని పిలవమంటావో నీవే చెప్పు." బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు.
    "అత్తయ్యా అంటే నీ నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా?"
    "ఎమిటమ్మాయ్, ముత్యాలంటూన్నావ్? అసలు ముత్యాలా/ నకిలీ ముత్యాలా?" అంటూ నాగరత్నమ్మ కాఫీ పట్టుకు వచ్చింది.
    "అదేనమ్మా! సాగర్ వాళ్ళ నాన్న సాంబశివరావు గారు పెద్ద పోలీసు ఆఫీసర్ గదమ్మా!"
    "అదేమిటే ఆయన్ని పేరు పెట్టి సంభోధిస్తావు ! మీ నాన్నగారు, ఆయనగారు ప్రాణ స్నేహితులు గదా! మావయ్యగారూ అనలేవూ!"
    "నేను అయన గార్ని పేరు పెట్టె పిలుస్తా' సాగర్ కేసి కసిగా చూస్తూ అన్నది మాధవి.
    "తప్పమ్మా! ఇంతకీ ఆ ముత్యాల సంగతేమిటే?"
    "వాళ్ళ నాన్న పోలీసు ఆఫీసరు గదా! ఆ మధ్య దొంగ రవాణా చేస్తున్న ముత్యాలు బస్తాలకు బస్తాలు పట్టుకున్నారట! అదే చెప్తున్నాడు సాగర్."
    "ఏం నాయనా, బంగారం కూడా ఏమన్నా దొరికిందా?"
    "ఆ దొరికింది అయిదు వందల కేజీలు"
    "అయిదు వందల కేజీలు! అంటే అరటన్నుటే?" నాగరత్నమ్మ బుగ్గమీద వేలు పోడుచుకొన్నది! కాఫీ కప్పు సాగర్ కు అందించి నాగరత్నమ్మ తిరిగి వంటింటిలోకి వెళ్లి పోయింది.
    కాఫీ కప్పు చేతితో పట్టుకుని "మరి నీకో" అన్నాడు
    "మా అమ్మ ఉదయం ఒకసారి కంటే కాఫీ ఎక్కువ తాగనీయదు."
    "అయితే నేనిస్తాను సగం తాగు."
    "మా అమ్మ చూస్తే మళ్ళీ ఈ జన్మలో నీకు కాఫీ ఇవ్వదు! తెలుసా!"
    కాఫీ తాగి కప్పు మాధవికి అందిస్తూ "మా నాన్న నీకు మావయ్య కాకపోతే మీ నాకు అత్తయ్య ఎలా అవుతుంది" అన్నాడు సాగర్.
    "మా అమ్మ నీకు అత్తయ్య కాకపోతే మీ నాన్న నాకు మావయ్య కాడు, అందుకని. తెలిసిందా అబ్బాయిగారి కిప్పుడు!"
    "పెళ్ళి కాని పిల్ల తల్లిని చూడగానే 'అత్తయ్య' అని పిలుస్తాడు సినిమాలో విలన్."
    "హీరో అయితే యేమని పిలుస్తాడు?"
    "అంటీ- అమ్మా, పిన్ని"
    "బామ్మా, జేజమ్మా, నాయనమ్మా అని కూడా పిలుస్తాడు" రుసరుస లాడింది మాధవి.
    "కరక్టు! కావాలంటే మీ అభిమాన రచయిత్రి రాసిన కధ వెండి తేర మీద నేడే చూడు!" ప్రేమ్ సాగర్ పగలబడి నవ్వాడు. ఆ నవ్వులో కలిపి మాధవి పగలబడి నవ్వింది.
    సాగర్ టైం చూసుకొని "అరె టైం అయిపోతుంది గెట్ రెడీ!" అన్నాడు.
    "ఎక్కడికి"
    "మ్యట్నికి"
    "రేపు వెళ్దాం లే"
    "రేపు మళ్ళీ కాలేజ్ తెరుస్తారని కూడా గుర్తు లేదా?"
    "రేపు కాలేజికి వెళ్ళాలంటే నాకేమిటోగా ఉంది" అన్నది మాధవి.
    


                                                             4

 

    హటాత్తుగా తలుపు తోసుకుని లోపలికి వచ్చిన మాధవిని చూసి సాగర్ స్టడీ టేబిలు మీద రాస్తున్న నోట్ బుక్ వదిలేసి నిలబడ్డాడు. జారిపోతున్న లుంగీ బిగించుకొని చొక్కా తగిలించుకుని గుండీలు పెట్టుకుంటూ -
    "ఏమిటీ , ఇంత రాత్రప్పుడు వచ్చావ్" అన్నాడు.
    మాధవి మౌనంగా నడిచి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నది.
    "ఏమైంది మాధవీ! ఎందుకలా వున్నావ్?" ఆదుర్దాగా అన్నాడు సాగర్.
    "మళ్ళీ ఏదో ఏదో కనపడింది."
    "కనపడిందా?" ఆశ్చర్యంగా అన్నాడు సాగర్.
    తల ఊపింది మాధవి.
    "కనపడిందా? గుర్తు కొచ్చిందా?"
    "ఏమో, ఆ రెంటికి నాకు తేడా తెలియడం లేదు."
    "దట్సాల్ రైట్! టేకిట్ ఈజీ" అనునయంగా అన్నాడు సాగర్.
    మాధవి దీర్ఘంగా నిట్టుర్పు విడిచింది. గదంతా కలయ జూసింది. టేబుల్ మీద తెరచి వున్న నోట్ బుక్, పెన్ చూసి "ఏమిటి రాస్తున్నావు సాగర్?" అన్నది.

 Previous Page Next Page