కెనడాలో చదువుకున్న మరో అమ్మాయి ఇండియాకు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోవాలి. పేపర్లో వరుడు కావాలని అనౌన్స్ చేశారు కులమింటి కుర్రాడితోనే వివాహం జరిగింది. భర్తతో కెనడా వెళ్ళింది ఆరు నెలలు తిరక్కుండానే విడిపోయారు అతను మరో వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయి మనసు విరిగిపోయింది అలాగే ఉండిపోయింది.
మన అభిప్రాయాలలో కొంతవరకు మార్పు వచ్చింది కాని వివాహ పద్ధతులలో పెద్దగా మార్పు రాలేదు పెళ్ళి చూపుల్లో ఒకర్ని ఒకరు చూసుకున్నంత మాత్రంచేత ఆ వివాహం సఫలం అవుతుందనే నమ్మకం ఉండదు.
ఒకసారి చూడగానే ఒకరి అభిప్రాయాలు ఒకరికి అర్థం కావు ఆలోచనలూ, అలవాట్లూ తెలియవు అందుకే పెళ్ళి చూపులకూ, వివాహానికీ మధ్య కొంత వ్యవధి కావాలి ఆ వ్యవధిలో వారు సన్నిహితంగా మెలిగి ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
మనిషి సమాజ జీవి. ఒంటరిగా ఉండలేడు జీవన సహచరి లేక సహచరుడు కావాలి వారి అభిప్రాయాలు కలిసినప్పుడే వారి జీవితం సాఫీగా సాగుతుంది.
ప్రేమ వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చూద్దాం వయసులోని ఆకర్షణనే ప్రేమని భావిస్తున్నారు హృదయాలు కలవడం, డ్యూయెట్లు పాడుకోవడం సినిమాల్లోనూ, కథల్లోనూ బాగానే వుంటుంది.
కాని వాస్తవ జీవితంలో అడుగుపెట్టగానే, కేవలం శరీరక ఆకర్షణలో పడి అదే ప్రేమగా భావించినవారి భ్రమ పటాపంచలు అవుతుంది. "ప్రేమ గుడ్డిది" "లౌ ఎట్ ఫస్ట్ సైట్" "ప్యార్ హోతా హై మగర్ కియానహి జాతా" అనే మాటలు వాస్తవ జీవితంలోకి ప్రవేశించాక అర్థరహితంగా కనిపిస్తాయి.
ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి లోపాలను ఒకరు సహించగల మానసిక బంధన ఉన్నప్పుడే వారి మధ్య ఉన్నది నిజమయిన ప్రేమ అనుకోవాలి యిలాంటి వివాహాలు సఫలం అవుతాయి.
కొందరు భార్యల్ని కేవలం కోర్కెలు తీర్చే యంత్రంగా మాత్రమే భావిస్తారు పాతకాలపు భావాలుగల ఆడదయితే పాదదాసిగా పడి వుంటుంది చదువుకున్న స్త్రీ అయితే (కేవలం చదువే కాదు - స్వతంత్ర భావాలు గల స్త్రీ అయితే) వెంటనే విడిపోతుంది.
వివాహం అనేది జీవితంలో చాలా ప్రధానమైన విషయం వివాహానికి పూర్వమే యువతీ యువకులు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఇంటి పరిస్థితుల గురించి కూడా మాట్లాడుకోవడం అవసరం.
ఒకోసారి యువకుడు ఇంటికి పెద్దవాడై ఉంటాడు బాధ్యత వహించవలసిన వాడుగా ఉంటాడు భార్యకు అది ఇష్టం ఉండదు వివాహం కాగానే వేరు కాపరం పెట్టాలనే కోరిక ఆమెకు ఉండడం సహజం అటువంటప్పుడు అతను తన ఉద్దేశ్యాలను భార్యకు వివాహానికి ముందే ఖచ్చితంగా చెప్పి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వాలి.
దాంపత్య జీవితం అంటే ఏమిటి? సుఖమయమైన దాంపత్య జీవితం గురించి వారి అభిప్రాయాలు ఏమిటి? వారి కోరికలు ఏమిటి? భవిష్యత్తు గురించి వారి కలలు ఏమిటి? మొదలైన అన్ని విషయాల మీద మనసులు విప్పి చర్చించుకోవాలి.
ముఖ్యంగా వారి ఆర్థికస్థితిగతుల్ని గురించి చర్చించుకోవాలి ప్రేమతో పొట్టనిండదు పెళ్ళయి ఆర్ధిక ఇబ్బందులకులోనైన మరుక్షణంలోనే ప్రేమ జ్వరం సబ్ నార్మల్ కు వచ్చేస్తుంది.
ఇది పురుష ప్రపంచం వివాహం విషయంలో చదువుకున్న స్త్రీ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి సంఘర్షణ వ్యక్తుల మధ్య జరగదు వారి భావాల మధ్య అభిరుచుల మధ్య జరుగుతుంది అవసరం అయితే ఇద్దరూ తమ తమ అభిప్రాయాల విషయంలో కొంతవరకు రాజీ పడటానికి ప్రయత్నించాలి.
ప్రేమ వివాహాలు విఫలం అవుతున్నాయి అనే అపవాదులు తొలగించాలి పాతపద్ధతుల వివాహాలే సుఖవంతంగా ఉన్నాయనే నమ్మకాలను కూడా తొలగించి, కాలంతోపాటు ఆలోచించుకోవడం నేర్చుకోవాలి.
----:సమాప్తం:----


