Read more!
 Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 3


                                                               కాపలా
    "కుక్కగారి గొలుసుగారు ఊడిపోయారు. కాస్త కట్టరా-" రామలక్ష్మిగొంతు ఖంగుమంది. చదువుతున్న పుస్తకం బల్లమీద పడేసి లేచాడు రామం. ఎప్పుడయితే గౌరవవాచకం చెవిని పడిందో అప్పుడే అర్థమయింది పరిస్థితి. అందులో గొలుసుగారు అని కూడా తల్లి అనేసరికి పరిస్థితి కొంచెం డేంజర్ లో పడిందని అర్థమవటానికి అరనిముషం పట్టలేదు రామానికి. రామలక్ష్మి ముఖం ఎప్పుడయితే ఎర్రబడిందో అప్పుడే ఇంట్లో అంతా నిశ్శబ్దం. ఇంచుమించుగా వారంలో మూడు రోజులైనా రామలక్ష్మికి ఇంట్లో అందరి మీద కోపం రాకతప్పదు. ఈ మధ్య వారంలో ఆరు రోజులూ ఇదే పరిస్థితి - కారణమేమిటంటే - బిక్కీ వచ్చి అప్పటికి మూడు వారాలైంది.
    బిక్కీ రావడానికి ముందు ఇంట్లో చాలా గొడవ జరిగింది. వాదోపవాదాలయ్యాయి. వాగ్దానాలు కూడా అయ్యాయి. ఇంట్లో అందరు ఓ రాజీ మార్గానికొచ్చిన తర్వాత బిక్కీ ఇంట్లో ప్రవేశించింది.
    "చాకిరీ, ఈ పిల్లలు చాలక దీన్ని నేను చూడలేను - అంత నిష్ఠూరంకన్నా, ఆదినిష్ఠూరం మేలు" అంది ఖచ్చితంగా రామలక్ష్మి.
    "నువ్వేం చూడక్కర్లేదు - అన్నీ మేమే చూసుకుంటాము ముక్తకంఠంతో ఇంట్లో అందరూ అన్నారు.
    అంతే. ఆ తర్వాత రెండు రోజులయేసరికి బిస్కట్లు, ప్లేటు, గొలుసు, బెల్టు - ఒకటేమిటి ఆఖరికి - ఓ మూల మంచి చోటు, పడుకుందుకు ఓ దుప్పటి అన్నీ సిద్దమయిపోయాయి. ఒక శుభ సమయంలో గృహప్రవేశం చేసింది బిక్కీ. ఇంట్లో ఎంతో సందడి. ఎవరొచ్చినా బిక్కీ ముచ్చట్లే - ఒకళ్ళపైన ఒకళ్ళు పోటీపడి దానికి తిండి పెట్టడం, ఒళ్ళో కూచోపెట్టుకోటం- చెప్పలేనంత హడావిడి. బిక్కీ తప్ప మరో ప్రపంచం లేదనుకునే జడభరతులయ్యారింట్లో అందరూ- ఒక్క రామలక్ష్మి తప్ప! 
    నెలరోజులు గడిచాయి. వస్తాయి వస్తాయి అనుకున్న పరీక్షలు వచ్చేసాయి - అందరూ ఎవరి గొడవలో వారు మునిగిపోయారు. స్నేహితుడింటికి వెళ్ళి చదువుకొనేవాడొకడయితే, తలుపు తీసుకుని గదిదాటి బయటకి రానివాడు మరొకడు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది.
    "అరే - పన్నెండవుతోందే -" గబుక్కున పుస్తకం కింద పడేసి వంటింట్లోకి నడిచాడు రామం.
    రామలక్ష్మి అన్నం తింటోంది. కాసేపు అటు ఇటు చూసాడు. "ఏం కావాలి" అంది రామలక్ష్మి.
    "ఏం లేదు - బిక్కీకి అన్నం పెట్టావా అని." నసిగాడు రామం. "ఓహో ఇప్పుడు గుర్తొచ్చిందా - అది తిని గంటయింది. వెళ్ళు - వెళ్ళి చదువుకో." రామం మాట్లాడకుండా గదిలోకొచ్చేసాడు. 
    వాగ్దానాలు చేసిన వారంతా వాటి విషయమే మరిచిపోయారు. తెల్లారేసరికి పాలు పోయటం - తర్వాత బిస్కట్లు, తర్వాత - అన్నం ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా బిక్కీ పనులన్నీ రామలక్ష్మే చేస్తోంది. గుమ్మంలో రామలక్ష్మి నిలబడితే చాలు తోకాడిస్తూ దగ్గరకొస్తుంది. కోపంగా వుంటే దానికీ తెలుస్తుంది. ఓ మూల నక్కి కూచుంటుంది. ఎవరిమీద ఏమి కోపగించినా బిక్కీని మాత్రం శ్రద్ధగా చూస్తోంది రామలక్ష్మి. రెండు నెలలు తిరిగేసరికి బొద్దుగా, ముద్దుగా తయారయింది బిక్కీ.
    జ్ఞాపకమొచ్చినప్పుడు అడుగుతుంటారు ఇంట్లో అంతా - 'పాలు పోసావా, అన్నం పెట్టావా' అని. ఆలాంటప్పుడు రామలక్ష్మికి ఒళ్ళు మండిపోతుంది.
    "అంత ప్రేమున్న వాళ్ళయితే మీరే పొయ్యలేక పోయారా - ఎలాగూ నేనే అన్నీ చూసుకుంటా కదా అని తెలిసి - గడుసుతనం!" రామలక్ష్మి మూతి తిప్పుకుంటూ లోపలకెళ్ళిపోతుంది. మరీ విసుగ్గా వున్నపుడు 'దీన్ని బయట వదిలేయండి' అంటుంది.
    "నిజంగా వదిలేయనా?" పెద్దబ్బాయి అన్నాడు తల్లితో.
    "ఆ వదిలేయ్."
    "నిజంగానేనా?" రెట్టించాడు.
    "ఏం నన్నుద్దరించటానికే దీన్ని తెచ్చినట్టు మాట్లాడు తున్నావే!"
    "సరే, సాయంత్రం మా ఫ్రెండు వస్తాడు. ఎప్పటినుంచో కుక్కపిల్ల కావాలంటున్నాడు దీన్ని ఇచ్చేస్తాను. ప్రేమగా పెంచుకుంటాడు. ఒక మాట చెప్పనా మళ్ళీ - ఇది ఇంట్లో వుంటే నీకు కొంత కంపెనీ. అదే, నీకు కాలక్షేపం."
    పెద్దబ్బాయి మాటలకి విస్తుపోయింది. కళ్ళల్లో గిర్రున తిరిగాయి నీళ్ళు. ఇదా నాకు కంపెనీ! దాని మీద ఇష్టంతోటి, ఇంటికి కాపలాగా వుంటుందని తెచ్చారనుకుంది. ఇన్నాళ్టికి - ఇప్పుడర్థమయింది అసలు విషయం. అయినా మనింట్లో మణి మాణిక్యాలేమున్నాయని కాపలాకి? నిజమే - అది నాకు కాపలా, నేను దానికి కాపలా.
    రామలక్ష్మి మాట్లాడకుండా లోపలికెళ్ళి పోయింది ఎర్రబడ్డ ముఖంతో.
    అమ్మకి అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థంకాక తికమక పడ్డాడు అబ్బాయి.
                                                 *    *    *
    ఆనాటి నుంచీ బిక్కీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది రామలక్ష్మికి. అబ్బాయి దీన్ని బయట వదిలేస్తాడేమో అనే భయం కూడా లేకపోలేదు. వదిలేస్తే దిక్కులేని అనాథలా రోడ్డున పడుతుంది. అలా కావడానికి వీల్లేదు - ఎవరూ చూడక్కర్లేదు. నేనే చూసుకుంటాను దీన్ని. గుమ్మంలో కూచున్న బిక్కీ అమాయకంగా రామలక్ష్మి కేసి చూస్తోంది. పాపం, నోరులేనిది. ఆ నిముషంలో ఎంతో జాలేసింది దాని మీద రామలక్ష్మికి!
    అప్పుడప్పుడు పాలు పోశావా అని, అన్నం పెట్టావా అని అడిగేవాళ్ళు ఈ మధ్య అది కూడా అడగటం మానేశారు. దాని బాధ్యతంతా రామలక్ష్మిదే అనే భావం ఇంట్లో అందరికీ కలిగింది. మరో ధైర్యం కూడా వచ్చింది. ఎవరెక్కడకెళ్ళినా, ఎప్పుడొచ్చినా ఫరవాలేదు. బిక్కీ వుందిగా ఇంట్లో!
                                              *    *    *
    కాలం గడుస్తోంది. రామలక్ష్మికి ఇల్లే సర్వస్వం అయిపోయింది. ఎప్పుడయినా బయట కెళ్ళాలంటే బిక్కీకి పాలు ఎవరు పోస్తారు, అన్నం ఎవరు పెడతారు అనే బెంగ! - ఒక్కోసారి రామలక్ష్మికి ఇంట్లో వాళ్ళ మీదే కాకుండా లోకం మీదే కోపం వస్తుంటుంది. అలాటప్పుడు బిక్కీ దగ్గరకిపోయి కూచుంటుంది!
    ఆ రోజు పెద్దబ్బాయి తల దువ్వుకుంటూ "ఈ రోజు ఇంగ్లీషు సినిమా కెడుతున్నాం. నిన్ను తీసికెడదామంటే__" నసిగాడు. రామలక్ష్మి నవ్వింది. "ఏం నేను ఇంగ్లీషు సినిమా చూడకూడదా?"
    "అది కాదు" అద్దంలో మరోసారి ముఖం చూసుకుని బయటికి వెళ్ళిపోయాడు పెద్దబ్బాయి.
    మరో రోజు "నేనూ వస్తా మీతో" అంది రామలక్ష్మి, టై సరిచేసుకుంటూన్న రాజశేఖరంతో.
    "రా నీకభ్యంతరం లేకపోతే. మా ఫ్రెండ్సుతో కలిసి వెడుతున్నా."
    "ఏం ఫరవాలేదు, నేనూ వస్తాను." రామలక్ష్మి జుట్టు ముడి వేసుకుని గబగబా డ్రస్ చేసుకుని, చెప్పులు తొడుక్కుంది.
    "నిజంగా వస్తున్నావా?"
    "భయపడకండి. మీ వెంటపడి రాను__ఊరికే అన్నానంతే,
    రాజశేఖరం ఒక్క నిముషం నిలబడ్డాడు. కొంచెం బరువుగా రెండడుగులు ముందుకు వేశాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. బిక్కీని ఒళ్ళో కూచో పెట్టుకుని ఒళ్ళు నిమురుతోంది రామలక్ష్మి. గబగబా నడిచి ముందు కెళ్ళిపోయాడు.
                          *    *    *
    ఇంట్లో మిగిలింది తను. కాదు కాదు కాళ్ళదగ్గర కూచున్న బిక్కీ కూడా. రామలక్ష్మికి నవ్వొచ్చింది ఎందుకో.
    "బిక్కీ - నిన్నీ ఇంటికి తెచ్చినప్పుడు కోపగించాను. విసుక్కున్నాను. కానీ ఎంత ఫూలునో చూశావా! నువ్వు ఈ ఇంటికి కాపలా. నేనూ ఈ యింటికి కాపలా. ఈ ఇంటివాళ్ళు గొప్పోళ్ళే బిక్కీ! నిన్ను నన్ను కూడా పోషిస్తున్నారు. కాకపోతే నీ మెడకి ఓ గొలుసు కట్టారు తప్పించుకు పోతావని, ఎవర్నన్నా కరుస్తావని. నేను అరుస్తాననుకో కరవను. నీకు ఒక్క గొలుసు బంధం, నాకు గొలుసుల గొలుసులు బంధాలు. ఎక్కడికి తప్పించుకుపోతామే మనం బిక్కీ?" రామలక్ష్మి చేతిలో వున్న బిస్కట్లు దాని నోటి కందిస్తూ అప్రయత్నంగా చూసింది గోడకేసి. పెళ్ళినాటి ఫోటో....అబ్బ, ఎంత సన్నగా ఉందప్పుడు! ఇప్పుడో? రామలక్ష్మికి పాతికేళ్ళగతం కళ్ళముందు కదలాడింది. ఇంట్లో వాళ్ళ నెదిరించి రాజశేఖరాన్ని రిజిష్టరు పెళ్ళి చేసుకొంది. చదువుకొనే రోజుల్లో వుండే ఆదర్శాలు ఒకటి దూరమైపోయాక, కేవలం పిల్లల తల్లిగా, మిసెస్ శేఖరంగా మిగిలిపోయింది. అయితే మాత్రమేం!
    "మమ్మీ-నిన్ను అమ్మమ్మ ఊరు పంపింఛం. నువ్వు లేకపోతే బోర్ గా వుంటుంది" అంటారు పిల్లలు.
    రాజశేఖరం మాటలు తక్కువ మాట్లాడినా అతని మనసు నిండా ఉన్నది తనేగా! రామలక్ష్మికి గొప్ప తృప్తి మనసు నిండా నిండింది. రామలక్ష్మి గోడమీదున్న ఫోటో కేసి చూస్తోంది. వీధిలో కారు హారన్ మోగటంలో ఈ ప్రపంచంలోకి వచ్చింది.
    మిసెస్ నళినీ మోహన్ కారు దిగింది.
    "ఓ చిన్న పార్టీ. రేపు నువ్వు రావాలి."
    "పార్టీయా?"
    "ఆ. నా బర్త్ డే పార్టీ. అన్నట్టు ఇవి నీకు చూపించాలని నిన్నటి నుంచి ఒకటే ఇదిగా వుంది నాకు." తళతళలాడుతున్న వజ్రాల దుద్దలు.
    "అబ్బ చాలా ఖరీదుంటాయేం?"
    "ఆ ముప్పయివేల పయినే. దుద్దులే కాదు, రింగు కూడా తెచ్చారు మద్రాసునించి." గలగల మాట్లాడింది మిసెస్ నళినీ మోహన్.
    "వెంకటలక్ష్మికి ఫోను చేశాను. వస్తానంది. అది వచ్చేదేమిటిలే, భర్త తీసుకొస్తాడుగా, నిన్న పంతొమ్మిదివందల ఏభై పెట్టి మంచి చీర కొన్నాను. చూస్తావుగా రేపు." గలగలా మాట్లాడి, గబగబా కారెక్కింది.
    రాళ్ళు, రప్పలు, చీరలు, నగలు ఇవి చూసుకు తృప్తిపడిపోతోంది పాపం నళిని! జీవితంలో ఏం పోగొట్టుకుందో తెలుసుకోలేని వెర్రిది. విలాసాల్లో వినోదాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని అనుభవించేస్తున్నాడు మోహన్ మద్రాసులో. అతని భార్యగా సంఘంలో బతికేస్తోంది నళిని.
    ఎంత దురదృష్టవంతురాలో నళిని! ఎంతో జాలేస్తుంది నళినిని తల్చుకున్నప్పుడల్లా రామలక్ష్మికి.
    రామలక్ష్మికి రాజశేఖరం మాటలు గుర్తొచ్చాయి వెంటనే. "సంసారం అనే సామ్రాజ్యాన్ని ఏలే మకుటం లేని మహారాణి నువ్వు" అని. నిజమే మరి-రామలక్ష్మి కళ్ళు గర్వంతో మెరిశాయి ఆ క్షణంలో.
    "బిక్కీ - మనమే హాయిగా ఉన్నాం మనం ఈ ఇంట్లో భాగస్వాములం. అరే, ఈ మధ్య నీకు ఇంగ్లీషులో చెప్తే కాని అర్థం కావటం మానేసింది కదూ- మనం పార్టనర్స్. ఈ ఇల్లు నువ్వు కాపలా కాయి. ఈ ఇంట్లోవాళ్ళని నేను కాపలా కాస్తాను." అవునుమరి, ఏ వయ్యారిభామో రాజశేఖరాన్ని కొట్టెయ్యకుండా కాపలా కాసుకోవద్దూ తను! ఏ చిన్నదో అమాయకుడైన తన అబ్బాయిని వలలో వేసుకోకుండా కాపలా కాసుకోవద్దూ తను!! ఒళ్ళో వున్న బిక్కీ నల్లని కళ్ళతో రామలక్ష్మిని చూస్తూ అటు ఇటు కదిలింది__ "కూచో, నాకు పనులు లేవనుకుంటున్నావా?" బిక్కీని కిందకి దింపివేసింది రామలక్ష్మి.
    బిలబిలమంటూ నలుగురు స్నేహితుల్ని వెంటేసుకు వచ్చాడు రామం లోపలకి.
    "మమ్మీ, ప్లీజ్-"
    "ఏమిటీ?"
    "ఫైవ్ కప్స్ ఆఫ్ టీ-ప్లీజ్-"
    "నాకు తెలియదు-" రామలక్ష్మి టీ ఇస్తానందో ఇవ్వనందో తెలుసుకోకుండా ముందు గదిలోకెళ్ళి స్నేహితుల మధ్య కూచున్నాడు రామం.
    తిన్నగా వంటింట్లోకి నడిచి టీ కోసం నీళ్ళగిన్నె స్టౌ మీదుంచింది రామలక్ష్మి.*

 Previous Page Next Page