Read more!
 Previous Page Next Page 
రాక్షసుడు పేజి 2


    కుండీకి కాస్త దూరంగా జనం గుమిగూడి వున్నారు. అందరి దృష్టి కుండీ మీదే వుంది.

 

                                            *    *    *    

 

    ప్రపంచంలోకి రాగానే జీవితంలో ఆ శిశువు యుద్ధం మొదలైంది. గట్టిగా ఏడవటం ద్వారా ముక్కుకున్న అడ్డు తొలగించుకుంది. అంత ఎత్తునుంచి పడ్డా, క్రింద ఎంగిలి ఆకులుండటం వల్ల దెబ్బ తగల్లేదు. కుడికాలు, మోకాలి క్రింద చీరుకు పోయిందంతే.

 

    క్రిస్ మస్ రోజులవి. చలి దట్టంగా పేరుకుని వుంది. పైన ఏ ఆచ్చాదనా లేకుండా పది నిముషాలు అలాగే పడి వుంది ఆ శిశువు.

 

    ఆ తరువాత వచ్చిందో కుక్క.

 

    రక్తం అంటుకుని వున్న మాంసం ముద్దలాంటి ఆ శరీరాన్ని చూసి, చొంగలు కారుస్తూ దగ్గరకు చేరింది. పళ్ళతో పట్టుకోబోతూంటే ఆ శరీరం కొద్దిగా కదిలింది. దాంతో బెదిరి వెనక్కి తప్పుకుని పరీక్షగా చూసింది. మళ్ళీ ఆ ముద్ద కదలకుపోవడంతో, ధైర్యం తెచ్చుకుని మూతి ముందుకు చాపి, ఆ వంటిని స్పృశించింది. దాంతో మళ్ళీ కదిలింది ఆ శరీరం.

 

    ఇలా పది నిమిషాల పాటూ కుక్కకీ, ఆ పసికందుకీ మధ్య యుద్ధం జరిగింది.

 

    బ్రతకటానికి ఆ పిండం చేస్తున్న మూడో ప్రయత్నం అది. మొదటిది అబార్షను, రెండోది ప్రసవం.

 

    అంతలో సెకండ్ షో వదిలారు. మొదట ఎవరో ఒకరు చూశారు. అయిదు నిముషాల్లో పదిమంది పోగడ్డారు. కొంతమంది ఆడాళ్ళని తిట్టారు. కొంతమంది మొత్తం మానవజాతినే తిట్టారు. మొత్తానికి ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు.

 

    ఈ ప్రపంచంలో ఇంత మానవతా రాహిత్యాన్ని అప్పుడే చూడటం ఇష్టంలేనట్టూ ఆ పసిగుడ్డు ఇంకా కళ్ళు విప్పలేదు. 'నేనింకా బ్రతికే వున్నా' నన్నట్టు చేతులు మాత్రం అప్పుడప్పుడు కదుపుతూంది.

 

    ఆ సమయంలోనే అక్కడికి చేరారు ఇద్దరూ. విషయం తెలియగానే మరి ఆలస్యం చేయకుండా గంగులు "అరెరె" అనుకుంటూ కుండీ దగ్గరకు నడిచి పిల్లాణ్ని చేతుల్లోకి తీసుకున్నాడు. "ఇంత సలిలో మనమే ఇట్ట వణికిపోతున్నామే. అట్టాటిది పైగుడ్డ లేకుండా ఈ పసిగుడ్డు ఇట్ట పడివుంటే ఇంత సేపట్నుంచి చూస్తావుండటానికి మనసెట్ట వప్పిందయ్యా మీకు?" అని అక్కడున్న జనాన్ని ప్రశ్నించాడు. ఎవరూ మాట్లాడలేదు. తమని కాదు ఆ ప్రశ్న వేసింది అన్నట్టు చూపు మరల్చుకున్నారు.

 

    "పదరా పోదాం"

 

    "ఈ పిల్లాణ్ణి..." అర్థోక్తిలోనే ఆపుచేశాడు దేవదాసు.

 

    "మనం తీసుకెళ్తున్నాం. కలో గంజో మనతోపాటే తాగుతాడు. పాలిచ్చే తల్లి, పొత్తిళ్ళలోనే గెంటేసింది కదరా. పాలియ్య లేకపోయినా నీళ్ళోసి పెంచుదాం".

 

    తమలో లేనిది ఇంకొకడిలో చూసి, మనుషుల్లో మానవత్వం ఇంకా నశించనందుకు తమ జాతిపట్ల సంతృప్తిపడి మిగతా మనుషులు అక్కడనించి కదిలారు. రెండు నిముషాల్లో ఒంటరి చెత్తకుండీ మిగిలింది. ఇంకో నిముషం తరువాత మళ్ళీ ధైర్యం తెచ్చుకుని కీచురాయి తిరిగి అరవటం ప్రారంభించింది.      

 

                                                                 *    *    *

 

    చిన్న పాకలా వుందది. పాకంటే పాక కాదు. ఒక పెద్ద సిమెంటు పైపు పక్క నుంచి కర్రలు పాతి కట్టిన కాన్వాసు గుడ్డ. దాన్నించి క్రిందికి గోనె సంచులు వేలాడుతున్నాయి. అంతే.

 

    దేవదాసు ఆ శిశువు శరీరాన్ని తుడవటానికి గుడ్డ తడుపుతూ "మనకే తినటానికి లేదంటే మళ్ళీ ఈడేమిట్రా" అన్నాడు విసుగ్గా.

 

    "మనం ప్రతిరోజూ పాడతాం కదరా- 'రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము' అని. అందుకే ఆ రాముడే మన కోసం పంపిండు. ఇక మనకి ఈ నాల్రోజులూ పండుగే అనుకో- అరెరె... అదేట్రా... లేలే- తుడవకు ఆ వళ్ళు. వంటికి ఆ రక్తం అట్ట అంటుకుని వుంటేనే మంచిది. 'ఇప్పుడే పుట్టిన బిడ్డ బాబూ- తల్లి పురిట్లోనే సచ్చిపోయింది బాబూ' అనొచ్చు. 'ఇంకా రక్తం కూడా ఆరలేదు సూడండి బాబూ' అని సూపించొచ్చు" అంటూ దగ్గరకు వెళ్ళి బొడ్డు దగ్గర వేలాడుతున్న పేగు పైకి లాగాడు.

 

    "ఈ బొడ్డు కోసినోళ్ళు ఎవరో మనకి భలే సాయం సేశార్రా దాసూ. మరీ మొదట్లోకి కోసెయ్యకుండా రెండంగుళాలు వదిలిపెట్టి కోశారు. ఇదంతా పూర్తిగా ఎండటానికి ఎంత లేదన్నా నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజులు మనకి పండుగే. ప్రతిరోజూ పొద్దున్నే ఈ బొడ్డు చివర కాసింత రక్తం పులిమితే సరి. ఇంకా బొడ్డూడని బిడ్డ బాబూ అని అరవొచ్చు. ఒరేయ్- ఈ పేగు కోసిన ముడి కాస్త ఇప్పరా. మరీ ఇంత గట్టిగా కట్టేస్తే పేగు తొందరగా ఎండిపోయి గాయం మానిపోద్ది. కాస్త కాస్త రక్తం వచ్చేలా సులభంగా కట్టు. అట్టా సూత్తావేట్రా. రాములోరే ఈడ్ని పంపిండ్రు. నే సెప్పలే భగవంతుడి దయ వుండాలే గానీ మన అదృష్టం తిరిగిపోద్దీ అని..."

 

    -సరిగ్గా నాలుగు గంటల తరువాత- సూర్యుడు ఇంకా పైకి రాకముందే ఫుట్ పాత్ మీద ఆ పసిగుడ్డుని పడుకోబెట్టి అరవటం మొదలుపెట్టాడు దేవదాసు.

 

    గంగులు వూహించినట్టే జనంలో రియాక్షన కనపడింది. చచ్చిన శవాన్ని పడుకోబెట్టి అడుక్కుంటే, జనానికి అలవాటైపోయింది. పసికందు- అందులోనూ రక్తం ఆరని పసికందు- జనం సానుభూతి బాగా సంపాదిస్తున్నాడు.

 

    దానికితోడు గంగులు, దేవదాసుల అరుపులు.

 

    "ఇప్పుడే పుట్టిన బిడ్డ బాబూ"

 

    "తల్లి సచ్చిపోయింది బాబూ".

 

    మార్నింగ్ వాక్ కి వచ్చినవాళ్ళు, పాలకి బయల్దేరిన వాళ్ళుకూడా ఆగి, డబ్బులు వేస్తున్నారు.

 

    "ఇప్పుడే పుట్టిన బిడ్డ బాబూ".

 

    "పేగ్గూడా ఎండలేదు బాబూ".

 

    "సేతులుకూడా తెరుసుకోలే..." అనబోతూ ఆగి, ఆశ్చర్యంగా చూసేడు. వాడంత హఠాత్తుగా అరుపులు ఆపుచేసేసరికి దేవదాసు కూడా ఆ శిశువు వైపు దృష్టి తిప్పాడు.

 

    తల్లి కడుపునుండి బైటకొచ్చిన రెండు మూడు నెలల వరకూ ఎవరికీ తెరుచుకోని లేత గుప్పిళ్ళు ఆ శిశువుకు మాత్రం అప్పుడే తెరుచుకుని వున్నాయ్-

 

    ఈ ప్రపంచం మీద కసి తీర్చుకోవటం కోసమా అన్నట్టు.

 

                                                2

 

    లేత గులాబీ రంగు రోల్స్ రాయిస్ కారుమీద చంద్రకిరణం అందంగా మెరిసి పక్కకు తప్పుకుంటోంది. అప్పటివరకు వేగంగా వెళ్తూన్న కారు కీచుమన్న శబ్దంతో ఆగింది. కారుమీద మెరిసిన కిరణమే చెత్తకుండీ మీద కూడా పడుతూంది. కానీ నిస్తేజంగా!  

 Previous Page Next Page