Read more!
 Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 5

 

విద్యావతి తన బాక్స్ లోనుంచి ఉప్మా కొంచెం పెట్టింది రుచి చూడండని.
నోట్లో వేసుకుని ఓహ్ టేస్ట్ అదిరింది అన్నాడు.
అయితే మొత్తం తినండి అంటూ కృష్ణ కుమార్ పళ్లెంలో బోర్లించింది.
ఏయ్ ఏంటి ఇది. మరి నీకు అన్నాడు.
ఫైవ్ స్టార్ చాక్లెట్ ఉందిగా అంది.
అదేం కుదరదు అని ఇంకో ప్లేట్ తెప్పించి చపాతీ, కూర తనే వడ్డించాడు. తినండి ప్లీజ్ అంటూ. 
సరే అంటూ తీసుకుంది. మీరు అస్సలు డ్రింక్స్ తీసుకోరా అని ఆశ్చర్యంగా అడిగింది. 
ఊహూ. అస్సలు తీసుకోను. 
గ్రేట్ అంది మెచ్చుకోలుగా.
ఇంతలో రేణుక ఫోన్. ఏమండీ లంచ్ చేశారా అంటూ.
ఇప్పుడే తింటున్నానురా. చాలా బాగున్నాయి ఐటమ్స్. ఉప్మా తింటూ లొట్టలేస్తూ చెప్పాడు.
ఎవరు మీ అబ్బాయా అంది.
కాదు మై వైఫ్ అన్నాడు. మా అబ్బాయి మిత భాషి.
ఓ గుడ్. బాగా చదివేవాళ్ళు అలానే ఉంటారు  అంది విద్యావతి తన చెవుల జూకాలు ఊపుతూ .
ఇద్దరూ లంచ్ ముగించుకుని చక చక మిగతా ప్రాసెస్ లు చూసారు.
అప్పటికే టైం ఐదు అయ్యింది. 
చైర్మన్ గారికి బై చెప్పి కారులో బయలుదేరారు. 
****
ఇప్పుడు బ్యాంకుకు వెళతారా అడిగింది విద్యావతి కృష్ణకుమార్ వైపు చూస్తూ.
ఊహూ  ఇటునుంచి ఇంటికే వెళతాను మిమ్మల్ని దింపేసి. బాగా టైర్డ్ గా ఉంది అన్నాడు.
మా ఇంటికి వచ్చి వెళ్ళండి దారిలోనేగా అంది.
టైం చూసాడు ఐదున్నర. ఓకే అన్నాడు.
థాంక్యూ అంది 
విద్యావతి ఇల్లు రాగానే రాముకి చెప్పాడు కారు పార్క్ చేసుకోమని. మేడం వాళ్ళింటికెళ్లి ఒక గంటలో వెళదాం అని.  
నువ్వు టిఫిన్, కాఫీ కావాలంటే తీసుకో అని డబ్బులిచ్చాడు.
వారిని ఇంటిదగ్గర దించేసి రాము వెళ్ళాడు.
రోడ్ మీదే ఉంది ఇల్లు. బస్సులు కూడా వెళుతున్నాయి ఈ రూట్లో అన్నాడు అటూ ఇటూ చూస్తూ.
అవును సర్. ఒక విధంగా బిజీ రోడ్ ఇది. మా ఫాదర్ వాళ్ళు కట్టినప్పుడు అసలు ఏమీ ఉండేది కాదంట ఇక్కడ. మేము ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాము. మా చిన్నప్పుడు కూడా మామూలుగా ఉండేది. అంత బిజీ గా ఉండేది కాదు. 
గేటు తీసి లోపలివెళ్లే ముందు కుడి పక్కకి చూస్తే పెద్ద మల్లె చెట్టు కనిపించింది. బాగా పొదలా పైకి అల్లుకుని ఉంది. మల్లెలు విరగబూసున్నాయి సువాసనలు వెదజల్లుతూ.
ఓహ్ ఇదన్నమాట మీ జడలో నిత్య పూల రహస్యం. మల్లెపూలు అదృష్టం చేసుకున్నాయి అన్నాడు.
ఎందుకో అంది తలుపు తాళం తీస్తూ కొంటెగా నవ్వుతూ.
రోజూ ఆ నల్లని వాలుజడని అలంకరిస్తున్నాయిగా. అందుకు.
ఫరవాలేదు. మాటల్లో రచయిత గారి రొమాంటిక్ టింజ్ కూడా దాగుంది.
హాల్లో లైట్స్ వేసి లోపలికి రండి అంది. 
షూస్ విప్పుతున్న కృష్ణకుమార్ ని వారించింది. ఫరవాలేదు రండి. మళ్ళీ అవన్నీ విప్పడం ఎందుకు అంది.
అప్పటికే షూస్ విప్పేసి లోపలికి వచ్చాడు ఓకే అనుకుంటూ.
ఏ సి వేసి అడిగింది. ఏంతీసుకుంటారు అని. 
జస్ట్ కాఫీ చాలు అన్నాడు.
ఉప్మా వద్దా అంది  కొంటెగా నవ్వుతూ.
ఉంటె టిఫిన్ బాక్స్ లో పెట్టి ఇవ్వండి . మా రేణు కి తీసుకెళతాను. తను కూడా టేస్ట్ చేస్తుంది మీ ఉప్మా ని అన్నాడు.
లేదు లెండి . అంతా తెచ్చాను వచ్చేప్పుడు . ఈ సారి మీకోసం స్పెషల్ గా చేసి ఇంటికి పంపిస్తాను. సరేనా అంది నొచ్చుకుంటూ. 
ఆన్ చేసిన టి వి లోనుంచి భానుమతి గారి మధురమైన పాత పాట వస్తోంది 'నేనే రాధనోయి గోపాల,  అందమైన ఈ బృందావనిలో' అని. లిరిక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణ కుమార్.
కాఫీ తెచ్చేలోపు ఈ ఆల్బమ్ చూడండి అని ఒక స్పైరల్ బుక్ అతని చేతికిచ్చింది.
ఓపెన్ చేసి చూసాడు. అన్నీ రేఖా చిత్రాలు. ఓహ్ గ్రేట్. మీరు వేసారా అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ 
అవును అంది కొంచెం గర్వంగా ఇంకొంచెం హ్యాపీ గా మోహంలో రంగులు మారుతుంటే. అది నా హాబీ. చిన్నప్పటినుంచి నాకు   అలవాటు.
చూస్తూ ఉండండి కాఫీ తెస్తాను అని కిచెన్ లోకి వెళ్ళింది.
ఆ పొడవాటి జడ నడుము మీద అటూ ఇటూ ఊగుతుంటే చూడొద్దనుకుంటూనే చూసాడు.
మామూలు అందం కాదు ఈవిడది. ఎంత వద్దనుకున్నా చూడాలనిపిస్తుంది.
ఇదివరకెప్పుడు అదుపు తప్పని మనసు ఈమెను చూస్తే తన కంట్రోల్ లో ఉండటం లేదు. కొంచెం కష్టం మీద మళ్ళీ దాన్ని కంట్రోల్ కి తెచ్చుకుంటున్నాడు  కృష్ణకుమార్. 
ఒక్కొక్కటిగా రేఖాచిత్రాలు చూస్తూ ఒక షీట్ దగ్గర ఆగాడు. అందులో తన పోలికలు కనిపించాయి. ఎప్పటిది ఇది అని ఆలోచించాడు. పదేళ్ల క్రితం తను అశోక్ నగర్ బ్రాంచ్ ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు వేసినట్టుంది. పదేళ్ల క్రితం పోలికలు అందులో ప్రస్ఫుటమవుతున్నాయి. చాలా బాగా గీసి ఉంది. ఎవరైనా చూస్తే టక్కున నేనే అని చెప్పగలరు. అంత శ్రద్ధ తో గీసి ఉంది. 
తీసుకోండి కాఫీ అని ట్రే లో ఉన్న కాఫీ అందించింది. 
థాంక్యూ అన్నాడు.
తను కూడా  కాఫీ కప్పుతో ఎదురుగా సోఫాలో కూర్చుంది వాలు జడ ముందుకు వేసుకుంటూ.
నా రేఖా చిత్రం కూడా చూసాను. చాలా బాగా వేశారు అన్నాడు మెచ్చుకోలుగా.
థాంక్యూ అని నునుసిగ్గుతో అంది. 
బుగ్గలు కొంచెం ఎరుపెక్కినట్లు కనిపించాయి కృష్ణకుమార్ కి.
అవును. అది మీదే. మీ ఇన్స్పెక్షన్ పదిరోజులూ కొంచెం కొంచెం వేస్తూ మీరు వెళ్లే లోపు పూర్తి చేసాను.
మరి నాకు అప్పుడే ఇవ్వొచ్చుగా అన్నాడు.
అది నాకోసం గీసుకున్నాను. మీకు వేరేది చక్కగా గీసి ఇస్తానులెండి మీరు బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోపు అంది నవ్వుతూ.
అయితే రోజు నన్ను చూస్తూ గీస్తారన్నమాట ఇకనుంచి. జాగ్రత్తగా ఉండాలేమో నేను అన్నాడు.  
అలా ఏమీ లేదు. ఒక ఫ్రేమ్ మైండ్ లోకి వస్తుంది. అది వేస్తూ ఎక్కడెక్కడ సరిదిద్దాలి అని చూస్తాను. పోలికలు కరెక్ట్ గా మైండ్ లోకి వస్తేనే చిత్రం చక్కగా గీయగలను అని వివరించింది.
ఓకే ఓకే. వెరీ గుడ్. మీ ఇంటికి రావడంవల్ల ఒక కొత్త విషయం మీ గురించి తెలిసింది.  
మీరు వచ్చినందుకు నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఈ సారి మేడం, అబ్బాయి ని కూడా తీసుకు రండి. నా చేతి వంట మీ వాళ్లకి కూడా రుచి చూపిస్తాను.
తప్పకుండా. మీరు మీ శ్రీవారు కూడా మా ఇంటికి రండి. మా ఆతిధ్యం కూడా స్వీకరించవచ్చు. ఇంతకీ మీ వారి పేరు చెప్పలేదు.
ఆయన పేరు ఎస్ ఎల్ యెన్ మూర్తి . ఆయన అక్క కూడా మన బ్యాంకు లోనే స్టాఫ్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు.
ఓహ్ నైస్. మంచి మిత్రురాలు దొరికారు మీ రూపంలో అన్నాడు. మీ అక్కగారు పైనే ఉంటారన్నారు కదా !
అవును. రాత్రి ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాము. తను కూడా కామర్స్ లెక్చరర్ గా చేసి హస్బెండ్ చనిపోయిన తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. పిల్లలు లేరు. తనని నేనే ఎంటర్టైన్ చెయ్యాలి. భోజనాల తరువాత కిందకి వచ్చి ఆయనతో , పిల్లలతో ఒకమారు మాట్లాడి, కాసేపు టి వి చూసి నిద్రకు ఉపక్రమించడం అంది.  
ఓహ్ నైస్. బ్రిస్క్ రొటీన్  అన్నాడు మెచ్చుకోలుగా. కృష్ణకుమార్ తన కుటుంబం గురించి చెప్పాడు. భార్య రేణుక రచనల గురించి, అబ్బాయి చదువు గురించి మధ్య మధ్య లో జోక్స్ వేస్తూ నవ్విస్తూ చెప్పాడు.
అప్పటికే ఎనిమిదయ్యింది. ఆమ్మో గంట పైనే కూర్చున్నాను అంటూ లేచాడు.
ఎక్కువసేపు కూర్చుంటే ఛార్జ్ చెయ్యనులెండి అంది నవ్వుతూ విద్యావతి.
మీరు ఛార్జ్ చెయ్యరు. కానీ మీ సమ్మోహనం లాంటి నవ్వు, మాట్లాడేప్పుడు ఆ పెదాలు చేసే నాట్యం తీరు భరించే శక్తి నాకు లేదు అని మనసులో అనుకుంటూ ప్లీజ్ టేక్ కేర్, రేపు బ్రాంచ్ లో కలుద్దాం అంటూ బయటికొచ్చాడు.
రాముకి కాల్ చేస్తే కారు తెచ్చాడు వెంటనే.  
మరోసారి ఆమెకు బై చెప్పి బయలుదేరాడు. 
దారిలో పునశ్చరణం చేసుకుంటే తన చిత్రమే అందులో ఎందుకు ఉందొ కృష్ణకుమార్ కి అర్ధం కాలేదు. ఆమె గీసిన చిత్రాల్లో  మిగతావన్నీ జనరల్ గా ఉన్నాయి.  జాతీయ నాయకులు, దేవుడి చిత్రాలు, తన పిల్లల చిత్రాలు అలా ఉన్నాయి. ఓపికగా చాలానే గీసి ఉన్నాయి. అందులో తనదే ఆడ్ మాన్ అవుట్ గా ఉంది.
ఆలోచనలు అటువైపు వెళుతుంటే బలవంతంగా ఆపి మనసు బ్యాంకు వైపు మళ్ళించాడు రేపు టార్గెట్స్ ఏమిటా అనుకుంటూ. 
****
ప్రక్క రోజు జోనల్ ఆఫీస్ కి వెళ్లి జోనల్ మేనేజర్ ని కలిసి బ్రాంచ్ గురించి అంతా వివరించాడు కృష్ణ కుమార్.
జోనల్ మేనేజర్ స్పెసిఫిక్ గా నిన్న విసిట్ చేసిన విరాజ్ స్పిన్ టెక్స్ యూనిట్ గురించి అడిగాడు. 
తనకున్న డౌట్స్ ఆయనకు చెప్పాడు.
యూ ఆర్ రైట్ కృష్ణ. నాకూ అదే అనుమానం. అందులో ఎదో జరుగుతోంది. వాళ్ళు ఇంకా వంద కోట్లు లోన్ కావాలని అడుగుతున్నారు. సరే నువ్వు వచ్చిన తరువాత నీ ఒపీనియన్ తీసుకుని డిసైడ్ చేద్దామని ఆగాను. కొద్ధి రోజులు గమనించు ఆ అకౌంట్ ని. ఏదన్నా ఉంటె నాకు ఇమ్మీడియేటగా రిపోర్ట్ చెయ్యి. చాలా జాగ్రత్త ఆ యూనిట్ తో. పెద్ద వాళ్ళ హస్తం ఉంది దాని వెనుక అని హెచ్చరించాడు ఆయన. 
ఓకే సర్. మీ సపోర్ట్ ఉంటె చాలు. ఆ లోన్ గురించి మీకు రెగ్యులర్ గా ఫీడ్ బ్యాక్ ఇస్తాను  అన్నాడు.
గుడ్, మిస్టర్ కృష్ణ. బై ది బై మీ  బ్రాంచ్ లో ఆ అకౌంట్ ఎవరు మానిటర్ చేస్తున్నారు అని అడిగాడు. 
విద్యావతి చూస్తున్నారు సర్. తనని అడిగాను. ఆవిడకి ఇన్ డెప్త్ తెలీదు. మానిటరింగ్ వరకు చూస్తుంది. వాయిదాలు సరిగా కట్టడం అలాంటివి ఓకే. హెల్త్ అఫ్ యూనిట్ కరెక్ట్ గా అస్సెస్స్ చెయ్యాలి అని నా ఐడియా. 
కరెక్ట్. మీ ఐడియాస్ ఆవిడకి కూడా చెప్పండి. తను కూడా అదే డైరెక్షన్లో ఫాలో అవుతుంది. అప్పుడు మీకు ఈజీ అవుతుంది అన్నాడు.
ఎస్ సర్. కొంత రైట్ అప్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఒక కాపీ తనకి కూడా ఇస్తాను. 
 

 

 Previous Page Next Page