Next Page 
గెస్ట్ హౌస్  పేజి 1

                                 


                     గెస్ట్ హౌస్


                                        -ముచ్చర్ల రజనీ శకుంతల

                                

 

కళ్ళెర్ర చేసిన కాళరాత్రి.
'చేతబడి' చేసినట్టున్న చీకటి.
పాములా మెలికలు తిరిగిన తారు రోడ్డు.
ఒళ్ళు విరుచుకుని, కుంభవృష్టిని కురిపించే మేఘాలు.
వికృత ఆరాధన.
మధ్య మధ్యలో పిడుగుల పొలికేకలు...
ఆ శబ్దానికి అంధకారమైన నగరం...
అసలే అమావాస్య. అందులోనూ ఆదివారం...అర్దరాత్రి.

                                        * * *
ఉలిక్కిపడి లేచాడు నచికేత.
మొహమంతా చెమట పట్టేసింది. గదంతా చీకటిగా వుంది.
కరెంటు పోయిందని అర్ధమైంది.
తడుముకుంటూ లేచి టేబుల్ దగ్గరికి వెళ్లి సొరుగులాగి మ్యాచ్ బాక్స్ తీసి క్యాండిల్ వెలిగించాడు.
కిటికీ బోల్టు సరిగ్గా పెట్టనందువల్ల తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి గాలికి.
కిటికీ రెక్కలు గట్టిగా వేయాలని కిటికీ దగ్గరకు వెళ్లి రెక్కలు మూయబోయి...
అవతలివైపు దృశ్యం చూసి స్థాణువయ్యాడు. కిటికీకి అవతలివైపు గార్డెన్ వుండాలి. కానీ అక్కడ ఉండాల్సిన గార్డెన్ లేదు.
అదెలా సాధ్యం?
క్యాండిల్ కి చెయ్యి అడ్డం పెట్టి మరోసారి చూశాడు అనుమానంగా.
దట్టమైన అడవి.
తనింటి ముందు అడవి ఉండడమేమిటి?
క్యాండిల్ తీసుకుని తన గదిలోంచి బయటకు నడిచాడు.
"రా...మ...య్యా" ఇంటి నౌకరు రామయ్యను పిలిచాడు.
ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే రామయ్య బదులివ్వలేదు.
సోఫా దగ్గరకి వెళ్లి చూస్తే రామయ్య లేడు.
ఆ టైములో తల్లిదండ్రులను నిద్రలేపడమెందుకని వరండా తలుపు తెరిచాడు.
తలుపులు తెరవడంతోనే రయ్...మంటూ ఈదురుగాలి లోపలికి చొచ్చుకు వచ్చి క్యాండిల్ ని ఆర్పివేసింది. కళ్ళు చిట్లించి చూసినా కానరాని కటిక చీకటి.
జడలు విరబోసుకున్నట్టున్న అడవి.
నచికేత గబగబా తడుముకుంటూనే తన గదిలోకి వెళ్లి టార్చిలైటు వెతికి తీశాడు. అతను నడుస్తుంటే అతని వెనకే మరెవరో నడుస్తున్న చప్పుడు.
అదంతా తన భ్రమేమో అనుకున్నాడు.
టార్చిలైట్ వేసి ఆ టార్చిలైట్ వెలుగులో వరండాలో నుంచి బయటకు వచ్చాడు.
ఎదురుగా అడవి.
ఆశ్చర్యమూ, భయమూ ఏకకాలంలో కలిగాయి.
తన ఇంటి ఎదురుగా రోడ్డు ఉండాలి. అటువైపు బిల్డింగులు ఉండాలి.
కానీ...కానీ...
ఇదేలా సాధ్యం...?
ఒక్కరోజులో అంతా ఎలా మారిపోయింది?
మెల్లగా నాలుగడుగులు వేశాడు.
దట్టమైన చెట్లు.
టార్చిలైట్ పోకస్ లో చూశాడు
దూరంగా చెట్లమధ్య నుంచి టార్చిలైట్ ఫోకస్ అయిన మేర...
ఆ ప్రాంతంలో...ఓ
గె...స్ట్...హౌ...స్?
మరో నాలుగడుగులు వేసి తన ఇంటివైపు చూశాడు.
తనిల్లు...తన ఇల్లులానే వుంది.
తన ఇంటిముందు మాత్రం అడవి.
ఆ అడవి మధ్యలో కనిపించే గెస్ట్ హౌస్.
గబగబా ఆ గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటే ఓ చోట...శిథిలావస్థలో ఉన్న చెక్కబోర్డు...
దానిమీద చెరిగిపోయిన అక్షరాలు...
అక్షరాలు సరిగ్గా కనిపించడంలేదు..
'ని...షి...ద్దం' అన్న పదం మాత్రం కనిపిస్తోంది.
రెండు క్షణాలు తీక్షణంగా దూరంగా కనిపించే గెస్ట్ హౌస్ వైపు చూశాడు.
వెళ్లాలా? వద్దా? అన్న డైలమా...
ఓ క్షణం ఆలోచించి వెనక్కి తిరిగాడు.
ఓ పది అడుగులు వేశాడు.
అక్కడ...
అక్కడ ఉండాల్సిన తన ఇల్లు లేదు...చుట్టూ అడవి...
ఇల్లు మాయం అయిందా? ఎలా? ఇప్పుడేగా తన ఇంట్లో నుండి వచ్చింది...
ఎలా మాయం అయ్యింది? ఏమిటీ విచిత్రం? ఏమవుతోంది తనకి..
అప్పుడు...సరిగ్గా...అప్పుడు...
భయంతో బిగుసుకుపోయాడు.
గుండె వేగం రెట్టింపయింది.
మరోసారి అనుమానంగా టార్చిలైట్ ను సరిగ్గా పోకస్ చేసి చూశాడు.
తను నాలుగు అడుగులు వేస్తే అడవి వచ్చింది.
ఇప్పుడు పది అడుగులు వేసినా తన ఇల్లు రావడంలేదు.
వెంటనే మరింత వేగంగా నడవసాగాడు.
ఒకటి...రెండు...మూడు...
అలా ఎంతసేపు నడిచాడో అతనికే తెలియదు.
అయినా తన ఇల్లు రాలేదు.
అప్పుడు అతని భుజంమీద చేయి పడింది...
చిన్నకేక అతని గొంతులో నుంచి బయటకు రాకముందే...
-లబ్ డబ్...మీ గుండె చప్పుడు వినిపిస్తోందా?
గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకుంటున్నాయి. బివేర్...
నచికేత వణికిపోయాడు.
తన భుజం మీద పడ్డ చేయి ఎవరిది?
అతనికి నాలుగురోజుల క్రితం చూసిన హర్రర్ సినిమా గుర్తొచింది. హీరో భుజంపై చేయివేస్తుంది ఈవిల్.
హీరో వెనక్కి తిరిగి చూడగానే ఈవిల్ మొహం వికృతంగా మారుతుంది. కనుగుడ్ల స్థానంలో గుంటలు...తల గిర్రున వేగంగా తిరుగుతూ వుంటుంది.
ఇప్పుడు తన పరిస్థితీ అంతేనా?
అతనికేం చేయాలో తోచడంలేదు.
అంతా   అయోమయంగా   వుంది. తన   ఇల్లు మాయమవ్వడేమేంటి? తన ఇంటిముందు అవి ఉండడమేంటి? ఆ అడవిలో గెస్ట్ హౌస్???
ఏమిటిదంతా? భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.
ఒక్కసారిగా గాలి...సుడి...గా...లి
అప్రయత్నంగా నచికేత గొంతులో నుంచి పెద్దకేక వెలుపడింది.

                                        * * *
ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నచికేత.
ఎదురుగా నౌకరు రామయ్య
తన మొహంలోకి ఆదుర్దాగా చూస్తూ...
నలువైపులా చూశాడు నచికేత...
అది తన గదే...లైటు కాంతలో గదిలోని ప్రతీమూల స్పష్టంగా తెలుస్తోంది.   
కళ్ళు నలుపుకుని మరీ చూసాడు.
అడవిలేదు. గెస్ట్ హౌస్ లేదు.
ఒక్క ఉదుటున లేచి, కిటికీ దగ్గరికి వెళ్లి, కిటికీ తలుపులు తెరిచి చూశాడు అనుమానంతో.
ఎదురుగా లాన్స్...పూలచెట్లు...ఏమీ మార్పులేదు...హాలులోకి వచ్చి, మెయిన్ డోర్ తీసాడు. ఎదురుగా రోడ్డు. అటువైపు బిల్డింగ్...అంతా ఎప్పట్లానే.
"బాబూ..." రామయ్య పిలిచాడు.
"రామయ్యా...మన ఇంటి ముందు నీకు అడవి కనిపించింది?"
"మీకేదో పీడకల వచ్చినట్టుంది...మీరు గట్టిగా అరిచారు...వెంటనే మీ గదిలోకి వచ్చాను..." చెప్పాడు రామయ్య.
"పీడకలా? నిజంగా నేను చూసాను..." అయోమయావస్థలో అన్నాడు నచికేత.
నచికేత ఏదో ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్లాడు.
రామయ్య ఏదో గొణుక్కుంటూ పడుకుండిపోయాడు హాలులో...
నచికేతకు నిద్రరావడంలేదు.
తన కొచ్చింది కలా? తనకలాంటి కల ఎందుకు వచ్చింది?
మెల్లిగా కిటికీ దగ్గరికి వెల్లాడు. కిటికీ తలుపులు తెరచి చూసాడు. మామూలుగానే లాన్స్, పూలచెట్లు...
కాసేపు అటూ, ఇటూ పచార్లు చేశాడు. కాన్వాసు దగ్గరికి నిలిచాడు.
బ్రష్ స్టాండ్ ను దగ్గరకు జరుపుకున్నాడు. దానిలోనుంచి బ్రష్ తీసాడు.
అతని చేతిలోని బ్రష్ కాన్వాస్ మీదికి చేరింది.
ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు.
కలలో కనిపించిన దృశ్యాన్ని విజువలైజ్ చేసి కాన్వాసు మీద పరిచే ప్రయత్నం చేస్తున్నాడు.
ఒకటి...రెండు...మూడు...

Next Page