"నువ్వు నన్ను నమ్మావు. నేను నిన్ను నమ్మవద్దూ!" అన్నాడతడు.
4
"మీ కబురంది-వెంటనే వచ్చాను....." అన్నాడు రాజు.
"మిష్టర్ రాజూ! నేను నీ శత్రువుని కలుసుకుని వచ్చాను....." అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
"అతణ్ణి బాగా హెచ్చరించారా?"
"హెచ్చరించాను. కానీ అతడు భయపడలేదు...."
"నాకు తెలుసు. కరీంసాహెబ్ కు భయంలేదు...."
"ఉత్తరం అందడానికి కొద్దిరోజులు ముందుకానీ వెనుకకానీ చెప్పుకోతగ్గ విశేషాలేమైనా జరిగాయేమో నువ్వు నాకు చెప్పాలి...." అన్నాడు వెంకన్న.
"ఏమీ లేవు...." అన్నాడు రాజు.
"బాగా ఆలోచించి చెప్పు ఒకోసారి అతి సామాన్యంగా కనిపించే కొన్ని విశేషాలెంతో ముఖ్యమైనవై వుంటాయి..."
రాజుకు సునీత ప్రేమ గుర్తుకు వచ్చింది. అయితే అంతరంగిక విశేషాలనతడు వెంకన్నకు చెప్పకూడదనుకున్నాడు.
"ఏమీలేవు....." అన్నాడతడు.
"ఒకోసారి నీకు తెలిసిన వ్యక్తే నిన్ను హత్య చేయవచ్చు. ఆ వ్యక్తి నీ శ్రేయోభిలాషి కావచ్చు. స్నేహితుడు కావచ్చు. ప్రియురాలు కావచ్చు. గడువు సమయం వరకూ నువ్వు చాలా జాగ్రత్తగా వుండాలి...." అన్నాడు వెంకన్న.
"వెంకన్నగారూ-నాకు భయంలేదు. జరిగేది జరక్కమానదు....."
"నువ్వు నాకు సాయపడితే జరిగేది జరక్కుండా ఆపుతాను-...." అన్నాడు వెంకన్న.
"నా ప్రాణాలు నిలబెట్టాలనుకుంటున్న మీకు నేనెలాగైనా సాయపడగలను...." అన్నాడు రాజు.
"అయితే నేను చెప్పేది శ్రద్దగా విను. ఇక్కడ నా మిత్రుడు డాక్టర్ రంగరాజున్నాడు. ప్రతిరోజూ అతడి చేత వైద్యపరీక్ష చేయించుకో అనుమానాస్పదమైన ప్రాంతాలకు వెళ్ళకు. ముఖ్యంగా భోజనం విషయంలో జాగ్రత్తగా వుండు. ఎక్కడపడితే అక్కడ తినకు. ఆఖరికి మంచినీళ్ళ విషయంలోకూడా! ఎందుకంటే నీకు స్లో పాయిజనింగయ్యే అవకాశముంది....." అన్నాడు వెంకన్న.
"మీరు చెప్పినవన్నీ పాటిస్తాను-" అన్నాడు రాజు.
"మరోసారి గుర్తుచేసుకో.....ఉత్తరం రావడానికి ముందుగానీ వెనుకగానీ-విశేషాలేమైనా జరిగాయా?" అన్నాడు వెంకన్న.
అప్పుడు కూడా రాజు వెంకన్నకు సునీతగురించి చెప్పలేదు.
5
రాజు ఒంటరిగా నదీతీరంలో కూర్చున్నాడు.
దూరంగా కారొకటి ఆగింది. అందులోంచి దిగివచ్చింది సునీత-అతడి దగ్గరగా!
రాజు తలెత్తి ఆమెను చూసి-"నువ్వా?" అన్నాడాశ్చర్యంగా.
"మీకోసం యెక్కడెక్కడని తిరిగానో చెప్పలేను" అంది సునీత. ఆమె కనులలో సంతోషముంది.
"ఎలా వుంది జీవితం?"
"రాజూ-ఐ థాంక్యూ వెరీమచ్......ఇలాంటి వైభవాన్ని నేను కలలోకూడా ఊహించలేదు-" అందామె.
"అయితే యింకేం-త్వరగా నన్ను మోసంచేసి- ఆ వైభవాన్ని నీ స్వంతం చేసుకో ఈరోజింకా మూడో తారీఖు ఇంక నీకు పదిరోజులు గడువుంది....."
"రాజూ-నాకు నువ్వు కావాలి. నీ వైభవమూ కావాలి....."
"అది కుదరదు..."
"ప్లీజ్.....రాజూ! మనం పెళ్ళిచేసుకుందాం....."
"నాకంటే మంచివాణ్ణీ గొప్పవాణ్ణీ పెళ్ళి చేసుకో....."
"అలాగనకు రాజూ......నేను నిన్నే ప్రేమిస్తున్నాను....."
"నన్ను ప్రేమిస్తే నాకులా జీవించాలి. ఈ వైభవం నీకు దూరమవుతుంది."
"ఎందుకు దూరమవుతుంది? నేను నిన్నూ, నీ వైభవాన్ని కూడా స్వంతం చేసుకోగలను...."
రాజు సూటిగా ఆమె కనులలోకి చూసి-"నేను-నా వైభవం.....ఈ రెంటిలో ఒకటి వదులుకోక తప్ప దంటే నువ్వేం చేస్తావ్?" అన్నాడు.
"వైభవాన్ని వదులుకుంటాను....."
"ఎందుకని?"
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను....."
"ఇదేమాట పదమూడో తారీఖున చెప్పు చాలా సంతోషిస్తాను....." అన్నాడు రాజు.
"పదమూడో తారీఖునేం కర్మ-జీవితమంతా చెబుతూనే వుంటాను....."
"ఆలాంటప్పుడు నా వైభవం గురించి ఎందుకాశపడుతున్నావు?"
"నాకు వైభవంమీద మోజుంది, నీవంటే ప్రేముంది. ఆ ప్రేమ నీతో కలిసి వైభవంగా జీవించమంటోంది. ఆ వైభవాన్ని నువ్వు నిరసిస్తూంటే అదే ప్రేమ నా కోర్కెలను త్యాగం చేయమంటోంది....."
"అంటే?"
"నీతో కలిసి జీవిస్తే నాకు సంతోషం నీతో కలిసి వైభవంగా జీవిస్తే నా కింకా సంతోషం వైభవం లేక పోవడంవల్ల నా సంతోషం తగ్గవచ్చు కానీ నీతో కలిసి జీవించడంలోనే నా సంతోషముంది....." అంది సునీత.
రాజు సునీత వంకే చూస్తున్నాడు.
ఆమె కనులతడికి నిజం చెబుతున్నాయి.
6
"మిస్టర్ రాజూ-సునీత యెవరు?" అన్నాడు వెంకన్న.
"సునీత-మీకెలా తెలుసు?"
"ఆమె నిన్న కార్లో యీ ఊరొచ్చింది. తన అన్నను కలుసుకుంది. ఆ తర్వాత నిన్ను కలుసుకుంది. ఆమె యింట్లో ఎవరూ-సునీత గురించి సరిగా చెప్పడంలేదు. ఆమెకింకా పెళ్ళికాలేదు. వీధిలో వాకబు చేయగా ఆమె గురించి కొన్ని వివరాలు తెలిశాయి. ఆమెకూ నీకూ పెళ్ళవుతుందన్నారు. కాలేదు. కట్నమిచ్చుకోలేని స్థితిలో వున్నాడామె అన్న మంచి సంబంధం కావాలి ఇప్పుడామె మరో ఊళ్ళో నీ ఆస్తికి వారసురాలిగా ఉంటోంది. ఏమిటిదంతా?"
"వెంకన్నగారూ-ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం...."
"డిటెక్టివ్ ల దగ్గర వ్యక్తిగత విషయాలు దాచిపెడితే వ్యక్తికి గతమేకానీ వర్తమానముండదు-...." అన్నాడు వెంకన్న గంభీరంగా.
అప్పుడు రాజు వెంకన్నకు సునీత గురించి పూర్తి వివరాలు చెప్పాడు.
వెంకన్న కంగారుగా-"సునీత గురించి ఇంతవరకూ నాకెందుకు చెప్పలేదు?" అన్నాడు.
రాజు నవ్వి "వెంకన్న గారూ! సునీత నన్ను చంపుతుందనుకుంటున్నారా?" అన్నాడు.
"ఎవరెవరిని చంపుతారో తెలియదు. ఇలాంటి సమయాల్లో యెవరినీ ఉపేక్షించకూడదు...." అన్నాడు వెంకన్న.
"సునీత నన్ను చంపాలనుకుంటే-నా జీవితమే వ్యర్ధం.....ఆమెకోసమే నాకు జీవితమంటే మోజు పుడుతోంది....." అన్నాడు రాజు.
"సునీత మధ్యతరగతి అమ్మాయి అన్నావదినెలవద్ద వుంటోంది. ఇప్పుడు పొరుగూరికి మారింది. అందుకామె యింట్లో ఎందుకభ్యంతరంపెట్టలేదు? పెళ్ళికానిపిల్లనలా ఒంటరిగా వారెందుకుండనిస్తున్నారు? ఆమె గురించి వాకబుచేస్తూంటే ఇంట్లో సరైన వివరాలివ్వరేం? అంటే సునీతకూ, ఆమె అన్నావదినలకూ వెనుక ఎవరో వ్యక్తి వున్నాడు. వారిని భయపెడుతున్నాడు. ఉన్నట్లుండి సునీత నీమీద మోజు చూపించడానిక్కారణం.....ఆ వ్యక్తి ప్రోత్సహామేనని నా అనుమానం. ఆ వ్యక్తి కరీంసాహెబ్ కావచ్చు...." అన్నాడు వెంకన్న.


