"మాస్కో వీధుల్లో నడుస్తోంది మీనాక్షి ఒంటరిగా.
అయితే ఎక్కువసేపు ఒంటరిగా లేదు తను.
కొంతదూరం వెళ్ళాక.....
చెర్రి కాసినో అనే నియోన్ లైట్స్ కనబడ్డాయి. జూదం నిరంతరంగా సాగిపోతూ వుంటుంది అక్కడ.
చూస్తూ నడుస్తోంది మీనాక్షి.
"లిప్ట్?" అని వినబడింది ఒక గొంతు.
తిరిగి చూసింది మీనాక్షి.
"ఒక మోపెడ్ మీద కూర్చుని వుంది అర్ధనగ్నంగా వున్న ఒక అమ్మాయి.
"నువ్వు ఎటు వెళ్ళాలి? నేను ఆఫ్ అండ్ డవున్ స్ట్రిప్ టీజ్ క్లబ్ కి వెళుతున్నా! వెనుక కూర్చో! ఈ మాస్కో వీధుల్లో ఒంటరిగా నడవడం డేంజరు" అంది ఆ అమ్మాయి పట్టి పట్టి మాట్లాడుతోంది ఇంగ్లీషులో.
ఆ మోటారు సైకిల్ అమ్మాయి వైపు పరీక్షగా చూసింది మీనాక్షి. రష్యన్ లలో వుండే స్లావ్ జాతి పోలికలు కనబడుతున్నాయి. అందంగానే వుంది. కానీ సున్నితత్వంలేదు. ఒళ్ళంతా సగం కనపడేలా బట్టలు వేసుకుని వుంది.
"నాపేరు వాలెంటినా - లేవషోనా స్ట్రిప్ టీజ్ డాన్సర్ ని. మసేజ్ ఏక్స్ పర్ట్ ని. ఆడవాళ్ళయినా , మగవాళ్లయినా కూడా ఫర్లేదు. ఏసీ డీసీ!" అంది అర్ధవంతంగా కన్నుగీటుతూ.
మీనాక్షి మొహం ఎర్రబడింది.
ఒకప్పటి కమ్యునిస్టు దేశం అయిన రష్యాలో ఇంతటి విచ్చలవిడి విశ్రుంఖల శృంగారం నట్టనడిరోడ్డు మీద నాట్యం చేసే రోజు వస్తుందని కలలో కూడా ఉహించి వుండలేకపోయిందేమో తను!
మీనాక్షి మోహంలో భావాలు చదివేస్తున్నట్లు నవ్వింది వాలెంటీనా.
"కార్మిక కర్షక వర్గాల ఉద్యమాలకు కేంద్రమయిన రష్యాలో ఇప్పుడీలాంటి స్థితి వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా అమ్మడూ? ఏం జరిగిందో నేను చెబుతాను. వెరీ సింపుల్. కమ్యూనిస్టు రాజ్యం వున్నప్పుడు అప్పట్లో చాలామందికి తినడానికి తిండి, తల దాచుకోవడానికి గూడూ దొరుకుతుండేది. కానీ స్వేచ్చ వుండేది కాదు. ఇప్పుడు అనంతమైన స్వేచ్చ. కానీ కూడూ, గుడ్డ లేవు. దీన్ని గురించి మాంచి జోక్ వుంది. హె! నిలబడే వున్నావేం. మోపెడ్ ఎక్కు. వెళుతూ చెప్పుకుందాం" అంది.
సంకోచిస్తూనే మోపెడ్ వెనక కూర్చుంది మీనాక్షి. తను ప్రమాదంలోకి పయనిస్తున్నానేమో అని అనుమానంగా వుంది తనకి. కానీ ఈ సెక్స్ రాకెట్ ల గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని తను చెయ్యగలిగింది తాను చేయాలి. ఆ ప్రయత్నంలో ప్రాణాలే పోవచ్చు. తన జీవితం హటాత్తుగా ముగిసి పోవచ్చు కూడా.
బట్ హో కేర్స్?
పొతే పోనియ్ ప్రాణాలు.
మోపెడ్ కదిలింది.
వాలేంటినా చెప్పడం మొదలు పెట్టింది.
"ఈ జోకు పాతదే కావచ్చు. కానీ నిత్యనూతనం. కమ్యూనిజం రష్యాలో రాజ్యమేలుతున్న రోజుల్లో ఎక్కువగా చెలామణిలో వుండేది ఈ జోకు, ఏమిటి అంటే......"
వింటోంది మీనాక్షి.
"ఒక రష్యన్ కుక్క వుండేదిట. అది ఒకసారి అమెరికా వెళ్ళింది. అక్కడ ఒక అమెరికన్ కుక్క దానికి ఎదురయింది. ఇంక రష్యన్ కుక్క పుంజుకుని రష్యా గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టింది.
"మా రష్యన్ ఎంత గోప్పదేశామో తెలుసా? అక్కడ తిండికి లోటులేదు. నామటుకు నా సంగతే తీసుకో. నాకు రష్యాలో రోజూ చికెన్ తో భోజనం పెడతారు. దానికి తోడూ మంచి బ్రెడ్డు కూడా. నా భోజనం ఇంకా రుచిగా వుండడానికి గాను రొట్టెల మీద ఒడ్కా పోస్తారు. భలే గమ్మత్తుగా వుంటుందిలే. భోజనం అయిందా? ఇంక పడక. నాకోసం మెత్తటి చిన్న పరుపు ఒకటి వుంది. కడుపునిండా భోజనం చేసి ఆ మెత్తటి పక్కమీద నడుం వాల్చనంటే చాలు ......అబ్బ! ఇంక నిద్రే నిద్ర!
ఇదంతా వింటున్న అమెరికన్ కుక్క ఇంక ఉండబట్టలేక రష్యన్ కుక్క మాటలకి అడ్డం వచ్చింది.
"మరి రష్యాలో నీకు అంత రంగరంగ వైభవంగా జరిగిపోతూ వుంటే అమెరికాకు ఎందుకు వచ్చావు?" అంది.
"ఎందుకు వచ్చానంటే ......." అని నసుగుతూ చెప్పింది రష్యన్ కుక్క. "నాకు అప్పుడప్పుడు అరవాలనిపిస్తోంది. కానీ అక్కడ నోరెత్తనివ్వరు. అందుకే ఇక్కడికి వచ్చా!" అంది సిగ్గుపడుతూ - అని చెప్పి నవ్వింది వాలేంటినా.
వింటున్న మీనాక్షికి నవ్వు రాలేదు . బాధ కలిగింది.
అది గమనించింది వాలంటీనా.
"ఏం! నవ్వు రావట్లేదా? నువ్వు రష్యాలో పుట్టివుంటే నీకు ఈ జోకు బాగా అర్ధం అయివుండేదిలే. అప్పట్లో కూడు గుడ్డ దొరికేవి. కాస్త సెక్యురిటి వుండేది. కానీ నోరెత్తడానికి స్వేచ్చ వుండేది కాదు. ఇనుప చట్రంలో బిగించినట్లు వుండేది జీవితం! చెబితే నమ్మవేమో! మేము ఇంటినుంచి కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళడానికి కూడా ఒక రూట్ నిర్ణయించేది ప్రభుత్వం. మేం ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ దారిలోనే ఇంటికి రావాలి. పొరబాటున పక్కసందులోకి తిరిగామో పార్టీ వ్యతిరేకచర్య అని అరెస్టు!
"అన్నట్లు ఈ పార్టీ జోకులు విన్నావా?" అంది.
మౌనంగా వుండిపోయింది మీనాక్షి.
చెప్పడం మొదలుపెట్టింది వాలెంటీనా.
"కమ్యూనిస్టులు రాజ్యం చేస్తున్నప్పటి జోకులే ఇవన్నీ కూడా. ముళ్ళపంది మీద కూర్చోవడం సుఖంగా ఉంటుందా? వుండదా? అని ప్రశ్న వేసుకునేవాళ్ళం. దానికి జవాబు ఏమిటో తెలుసా? ముళ్ళపంది మీద కూర్చోవడం రెండు సందర్భాలలో సుఖంగా ఉంటుందిట. ఒకటి నీ ప్యాంటు రేకుతో చేసినప్పుడు, రెండు కమ్యూనిస్టుపార్టీ నిన్ను ఆ ముళ్ళపంది మీద కుర్చోమన్నప్పుడు. అర్ధమయిందా! పార్టీ చెప్పాక ఇంక నోరెత్తకుండా చేసి తీరాల్సిందేనన్నమాట. నసిగితే నామరూపాలు లేకుండా చేసి పారేస్తారు. ఇలాంటిదే ఇంకో జోకు వుంది."
అది ఏమిటని మీనాక్షి అడగకుండానే చెప్పడం మొదలెట్టింది వాలెంటీనా.
"ఓ సారి రష్యాలో జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. పొరపాటున అందులో ఒక స్త్రీ విధవగా రాసుకోవడం జరిగింది. అది ఆమెకి తెలిసి ప్రభుత్వంతో మొరపెట్టుకుంది.
మీరు తప్పుగా రాసుకున్నారు. నేను విధవను కాను. నా భర్త బతికే వున్నాడు" అని.
"అలాగా! అయితే తక్షణం ఆ తప్పు ఒప్పుగా మార్చాల్సిందే" అని వెంటనే వచ్చి ఆమె భర్తని కాల్చి చంపేసి "లేక్కసరి చేశారుట" రష్యన్ అధికారులు! అని నవ్వింది వాలెంటీనా! కానీ ఆమె నవ్వులో సంతోషం లేదు. బాధ వుంది.
వున్నట్టుండి నవ్వు ఆపేసి "నవ్వు రావట్లేదా?" అంది మీనాక్షితో.
"ఎట్లా వస్తుందిలే. మనుషులందరూ మంచిగా బతకాలనీ, బీదా బిక్కి తేడాలు ఉండకూడదని చెమటోడ్చి పనిచేసే వాడికి రాజ్యాధికారం వుండాలని , ఎన్నెన్నో ఆశయాలతో మొదలుపెట్టిన మహా సంకల్పం ఇలా కుప్ప కూలిపోతే నవ్వేలా వస్తుంది. అవునా? ఒకవేళ నవ్వినా కూడా అది ఏడవలేక నవ్వడమే అనుకో! నాలాగా!" అంది.
ఆ అమ్మాయి నాన్ స్టాప్ గా మాట్లాడే రకం అని అర్ధమయింది మీనాక్షికి.
మళ్ళీ వాలెంటీనానే చెప్పింది.
"ఇంతకీ చెప్పోచ్చేదీ ఏమిటంటే అప్పట్లో అన్నిటికి సంకెళ్ళు. కానీ తిండి వుండేది. ఇప్పుడు ఈ కేపిటలిజమ్ లో కావాల్సినంత స్వేచ్చ, విశృంఖలత్వం. కానీ "అమ్మా అన్నం తిన్నావా?" అని అడిగే వాళ్ళు లేరు. అతివృష్టి, అనావృష్టి కదూ! అందుకే నాలాంటి వాళ్ళం ఇలా ఒళ్ళమ్ముకోవాల్సిన స్థితిలోకి వచ్చేశాం" అని ఆగి "అరె మాటల్లో ఇటు వచ్చేసాం! గాడ్! ఇటీజ్ టూ లేట్! అమ్మో అదిగో అటు చూడు!" అంది విహ్వలంగా.
* * *
మస్కోలోనే -
"స్లావ్ జాన్స్కాయా రాడిసన్" అనే ఖరీదైన లగ్జరీ హోటల్ వుంది. (అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రష్యాను సందర్శించినప్పుడు ఇందులోనే దిగాడు)
అందులో కూడా వ్యభిచారం నిరంతరం విచ్చలవిడిగా సాగిపోతూ వుంటుంది. రష్యాలో కేపిటలిజమ్ ఎలా వెర్రితలలు వెస్తోందంటే ప్రస్తుతం అక్కడ ప్రతిచోటా ప్రతిది అమ్మకమే!
ఆ హోటల్లో లాబీలో కూర్చుని వున్నాడు హీందీ హీరో విజయ్ నారంగ్. అతని పక్కనే కూర్చుని వుంది నలభై ఏళ్ళు వస్తున్నా పాతికేళ్ళ పడుచులాగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్న కామిని. లేడీ రిపోర్టర్ 'ఫ్రం బాంబే విత్ లవ్!
ఇద్దరి చేతుల్లోనూ ఓడ్కా గ్లాసులు వున్నాయి. ఆరారా సిప్ చేస్తూ వున్నారు. ఇద్దరి చేతుల్లోనూ బెన్సన్ అండ్ హేడ్జేస్ సిగరెట్లు వున్నాయి.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?" అంది కామిని విజయ్ నారంగ్ వైపు పరీక్షగా చూస్తూ.
విజయ్ నారంగ్ జవాబు చెప్పలేదు. అతని ఆలోచనలన్నీ మీనాక్షి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి తిరస్కారం అతని గుండె మండించేస్తోంది.
తనతో రమ్మంటే రానంటుందా?
ఇలాంటివాళ్ళని ఎలా టాకిల్ చెయ్యాలో తనకి బాగా తెలుసు!
"నిన్నే!" అంది కామిని.
చటుక్కున కామిని వైపు తిరిగాడు విజయ్ నారంగ్.
"కామినీ! నువ్వు నాకు నీ మేగజైన్ లో అద్భుతమైన బిల్డప్ ఇచ్చి నన్ను పాపులర్ చేసావు. నేనిప్పుడు నిన్ను హటాత్తుగా ధనవంతురాలిని చెయ్యాలనుకుంటున్నాను. నీకు బోలెడంత డబ్బు వస్తుంది. ఏమంటావు?" అన్నాడు.
"ఇందులో క్యాచ్ ఏమిటి? నేనేం చెయ్యాలి?" అంది కామిని జాగ్రత్తగా.
చెప్పడం మొదలుపెట్టాడు విజయ్ నారంగ్.
అతని కళ్ళముందు మీనాక్షి కదులుతోంది.
* * *
ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సుకి ఇంకో రూపమే సుపీరియారిటీ కాంప్లెక్సు అని కొందరంటారు.
తమ ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకోవదానికే లేనిపోని ఆధిక్యత ప్రదర్శిస్తారు కొందరు.
కార్లోస్ ద జాకాల్ కూడా అదే కేటగిరికి చెందినవాడు. క్లయివుని చూస్తే అతనికి ఏదో రకమైన జంకు ఉంది. తనేమో దబాయింపు సెక్షన్ ఉపయోగించి షో నడిపిస్తున్నాడు. కానీ క్లయివు మేధావి .......అదీ తేడా!
ఆ అక్కసుని దాచుకుంటూ , పరుషంగా గొంతుపెట్టి అన్నాడు కార్లోస్ ద జాకాల్.
"నువ్వు చేస్తున్నదేమిటో నాకు అర్ధం కావట్లేదు క్లయివు! ఆ రాజాని అడ్డం పెట్టుకుని ఎందుకీ నాటకాలు! ఆప్టరాల్! వాటీజ్ హీ? అసలు వాడెవడు? మనం వాడిముందు ఒకలా మాట్లాడి, వాడ్ని మన ఏజెంటు గా అపాయింట్ చేసినట్లుగా బల్;బ్లఫ్ చేస్తూ, వాడ్ని సాగనంపాక మళ్ళీ కలిసి రహస్యంగా మాట్లాడుకోవలసిన గతి ఏమిటి? ఇదంతా చాలా చీప్ గా లేదూ?"
వెంటనే తను కూడా చాలా షార్ప్ గా అన్నాడు క్లయివు.
"రాజా ఈజ్ వెరీ డేంజరస్ బగర్!"
"దెన్ కిల్ హిమ్!" అన్నాడు కార్లోస్, క్లుప్తంగా.
పొడిగా నవ్వాడు క్లయివు. కార్లోస్! బాస్! నీకు ఎలుకల సంగతి తెలుసా! మనం ఒక ఎలుకకి మందుపెట్టి చంపాం అనుకో! ఆ విషానికి అది చస్తుంది. కానీ, చచ్చేముందు తక్కిన ఎలుకలని తన పద్దతిలో హెచ్చరిస్తుంది.........."నేను విష ప్రయోగం వల్ల చచ్చిపోతున్నాను ......మీరు జాగ్రత్త!" అని. అంతే! ఇంక ఆ తర్వాత అక్కడున్న ఏ ఎలుకా కూడా మళ్ళీ ఆ విషాహారాన్ని ముట్టదు!"
"సో" అన్నాడు కార్లోస్.
"ఛత్రపతి శివాజీ కి కొండ ఎలుక అనే పేరు పెట్టాడు చక్రవర్తి జౌరంగజేబు . ఈ రాజా కూడా ఆ కొండ ఎలుకలాంటివాడే! అతన్ని చంపామానుకో! చచ్చేముందు అతను ఎలోగో అలాగ ఇండియాలో ఇంకా మిగిలి వున్న తనలాంటి కొంతమంది దేశభక్తులకు మన ప్రయత్నాల గురించి చెప్పేస్తాడు. అందుకని, అతన్ని చంపడం డేంజరు .............అలాగని మన ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేసే టైంలో అతన్ని ఇండియాలో వుండనివ్వడం కూడా డేంజరే! అందుకనే కాస్త డొంకతిరుగుడు పద్దతిలో, అతన్ని మనం నమ్మిస్తున్నట్లు నటిస్తూ........
"బుల్ షిట్!" అని అరచేతితో బల్లమీద గట్టిగా చరిచాడు కార్లోస్.
"మీలో మగతనం చచ్చిందా? ఏ,ఎలుకేమిటి? పందికోక్కేమిటి? ఈ దాగుడు ముతలేమిటి? అందుకే అంటాను నేను - అతి తెలివి , అజ్ఞానంతో సమానమని! టేక్ మై ఆర్డర్స్! ఎలిమినేట్ దట్ బాస్టర్డ్! ఇంకో గంటలో ఆ రాజా తన పుర్వికుల్ని వెదుక్కుంటూ పైకి వెళ్లి పోయినట్లు నాకు తెలియాలి. దట్ సేటిల్స్ ఇట్! ఓకె! ఇకపోతే ........క్లయివ్! నువ్వు ముఖ్యంగా వినాల్సినమాట ఒకటి వుంది."
తన అసహనాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఏమిటన్నట్టు చూశాడు క్లయివు.
కార్లోస్ చెప్పడం మొదలెట్టాడు. "ఇదిగో! నీ గ్రీన్ పారేట్స్.............లాండ్ మైన్సు........ఇవి ప్రయోగించి ఇండియాని టేర్రరైజ్ చెయ్యడం - ఇదంతా బాష్.........అయ్యేపనికాదు. ఇండియా అంటే ఎట్లాంటిదో తెలుసునా? అదో మొండి మొక్కలాంటిదన్నమాట! ఓ పట్టాన చావదు! ఇండియాకి ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర వుంది! ఆ చరిత్రలో ఇండియా ఎన్నిసార్లు దండయత్రలకి గురి అయిందో చెప్పలేం! గ్రీకుల మొదలుకుని డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లిషు వాళ్ళదాకా! అందరూ అందినంతవరకు దోచుకుపోయారు. అయినా ఇవాళ మళ్ళీ సూపర్ పవర్లని ఎదిరించి, నిలబడే స్థితిలో వుంది ఇండియా........అవునా! అలాగే అక్కడి హిందూమతం! ఎన్ని మతాలు వచ్చినా హిందూమతం అలాగే వుంది. అక్కడి వింతలలో ఇంకొకటి ఏమిటంటే.........అక్కడ తెలుగు అనే ఒక భాష వుంది. వినసొంపుగా వుంటుందని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు దాన్ని "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని మెచ్చుకుంటూ పిలుస్తారు. ఇండియాలో అతి పురాతనమైన భాషలు కొన్ని వున్నాయ్. వాటితో పోలిస్తే ఈ తెలుగు అనేది చాలా యంగ్ లాంగ్వేజ్. కానీ అసలా తెలుగువాళ్ళకే తెలుగంటే అభిమానం వుండదు. సగటు తెలుగువాడు తెలుగుకి బజారులో బట్టలిప్పించినట్లు అవమానం చేస్తే తప్ప తన బతుకుకి సార్ధకత లేదన్నట్లు మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటాడు. తెలుగుకి ఏ తెలుగు ప్రభుత్వం దగ్గరనుంచి కూడా ఏ మాత్రం సహకారం, సహాయం దొరకవు. తెలుగుపిల్లలు, తెలుగు నేర్చుకోవడమే ఇష్టపడరు. అయినా చిత్రం ఏమిటంటే......మొండి మొక్కలా చావకుండా పెరిగిపోతూనే వుంటుంది ఆ తెలుగుబాష! ఇవాళ తెలుగు మాట్లాడే వాళ్ళు ఏడు కోట్లమందికి పైనే వుంటారు. అంటే ఏమిటి? దిస్ ఇండియా ఈజ్ పుల్ ఆఫ్ కాంట్రీడిక్షన్స్. అన్నీ విపరీతాలే అక్కడ! అందుకని.........అలాంటి ఇండియాని నీ గ్రీన్ పెరట్స్ తో, తక్కిన చిల్లర సరుకులతో దారికి తెచ్చుకోలేవు. ఇండియా నీడ్స్ షాక్ ట్రీట్ మెంట్! వన్ ఫైనల్ పనిష్ మెంటు! అదేమిటని అడుగు!"


