తన వాళ్ళకి తెలుసు. ఫ్రెంచ్ పోలిసుల అధినంలో వున్నది కార్లోస్ కాదనీ డూప్లికేటనీనూ!
అసలు కార్లోస్ ని కాంట్రాక్ట్ చేసి ఇండియాని డిస్ట్రయ్ చేయడానికి ఫైనల్ సొల్యుషన్ అడగమని తనకు ఆర్డర్స్!
పిచ్చితనం అంటే ఇదేకదా!
ఇవాళ కార్లోస్ ఒక స్పెంట్ ఫోర్స్! ఆరిపోయిన మతాబాలాంటివాడు. అతనికి ఇన్నాళ్ళు వెనకదన్నుగా వున్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇవాళ అతన్ని సపోర్టు చేసే స్థితిలో లేవు. సపోర్టు చెయ్యడానికి ఇష్టపడడం లేదు కూడా!
ఇలాంటి పరిస్థితిలో
కార్లోస్ ద కాజాల్ ఒక టెర్రరిస్టుగా కంటే ఒక డిస్సారాడోగా మారి వుండడానికి అవకాశాలు ఎక్కువ!
డిస్పరాడో!
అన్నిచోట్లా అపజయం పొంది అసహనంగా వున్న వ్యక్తీ!
అలాంటి వ్యక్తీ చెప్పబోయే పైనల్ సొల్యుషన్ ఎలా వుంటుంది?
అదీ డిస్పరేట్ గానే వుంటుంది.
అంతేగానీ తెలివిగా మాత్రం వుండదు.
కార్లోస్ - ద జాకాల్!
ద పైనల్ సొల్యుషన్!
అసహనంగా కదిలాడు క్లయివ్.
అప్పుడు -
హటాత్తుగా వినబడింది ఒక గొంతు.
"కార్లస్ - ది- జాకాల్!!"
ఆ మాట పూర్తికాక ముందే డ్రమేటిక్ గా ఆ హల్లోకి అడుగు పెట్టాడు.
ఇల్లిచ్ రామిరేజ్ శాంచెజ్ అలియాస్ ............కార్లోస్ మార్టినేజ్ టోర్రెస్..........అలియాస్ ......కార్లోస్ ద జాకాల్!
అతను చెయ్యి ఉపుతూ హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం ఎలెక్ట్రిఫై అయిపోయినట్లనిపించింది.
ఆఫ్రికన్ మొబుటూ లేచి ఆఫ్రికన్ డాన్స్ మొదలెట్టాడు. అతని పక్కనే ఉన్న అరబ్ ఉద్విగ్నంగా లేచి చేతిలోని గన్ ఎత్తి ఠపఠప బుల్లెట్స్ ని కిటికీ వైపు రిలీజ్ చేసాడు. "ఠిష్యు' అని చివరి బులెట్ దూసుకుపోయాక కూడా కిటికీ అద్దాలు రాలిపడుతూనే వున్నాయి.
అలా బుల్లెట్స్ ని రిలీజ్ చేసి స్వాగతం పలకడం అరబ్స్ కి అలవాటే!
ఆనందంగా అందరి అభినందనలు స్వీకరించి కూర్చుని అందరిని కూర్చోమని సైగ చేశాడు కార్లోస్. తక్షణం అతని దృష్టి క్లయివు స్పెన్సర్ మీద పడింది. కాస్త అప్రసన్నంగా అయిపొయింది అతని మొహం.
అతనికి స్పెన్సర్ పట్ల అసహనం వుంది!
నిజంగానే!
ఏ రంగంలో అయినాసరే నెంబర్ వన్ పొజిషన్ ని సాధించగలిగినవాడికి , తన స్థానాన్ని ఆక్రమించేస్తాడేమో అనిపించేటంత టాలంటూ వున్న వాడిని చూస్తే అసహనంగానే వుంటుంది.
మరీ ముఖ్యంగా ........
తమ టాలెంటు కంటే కూడా ఎక్కువగా పత్రికల పబ్లిసిటి ద్వారా పైకి వచ్చిన వాళ్ళకి మరీనూ!
అరబ్ వైపు తిరిగాడు కార్లోస్!
"నీ గన్ లోని బుల్లెట్స్ అన్నీ అయిపోయాయా" అన్నాడు నవ్వుతూ!
"నీకోసం అన్నిటిని ఏమ్టీ చేసేసా కార్లోస్! వెల్ కమ్" అన్నాడు అరబ్!
"ఇంకెవరిదగ్గరన్నా గన్స్ వున్నాయా!" అన్నాడు కార్లోస్.
"లేవు" అన్నారు అందరూ.
"దటీజ్ గుడ్! కార్లోస్ ఈజ్ ద సన్ ఆఫ్ గన్! కార్లోస్ సమక్షంలో వున్నప్పుడు కార్లోస్ ఒక్కడి దగ్గరే గన్ వుండాలి. తక్కిన వాళ్ళ దగ్గర గన్స్ వుండడం క్షమించరాని నేరం! ఈ బవుడెయిన్ గన్ తీసుకుని నా ముందుకు వచ్చాడు. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పు తప్పే!" అని మెరుపు వేగంతో తన రివాల్వర్ తీసి ఆ అరబ్ ని కాల్చేసాడు కార్లోస్.
"రేపు ఈ విషయం అన్ని పత్రికలలో వస్తుంది! నేనే రాయిస్తాను......కార్లోస్ దగ్గరికి ఎవరూ గన్ తో రాకూడదన్న విషయానికి చాలా పబ్లిసిటి వస్తుంది. దట్ సేటిల్స్ ఇట్!" అని నవ్వి తరువాత హటాత్తుగా సీరియస్ అయిపోయి చటుక్కున క్లయివు వైపు తిరిగాడు కార్లోస్! "కమాన్! టెల్మీ! వాటీజ్ యువర్ ప్రాబ్లెం!" అన్నాడు అసహనంగా గొంతు పెట్టి బెల్టుతో కొడుతున్నంత పదునుగా! తను నెంబర్ వన్ తన ఆధిక్యత అందరికి ప్రతిక్షణం ప్రస్పుటం అవుతూ వుండాలి. తను ఎక్కువా అవతలివాడూ తక్కువా అని ప్రతి సెకండ్ కీ ప్రూవ్ అవుతూ ఉండాలి.
నిజం!
నెంబర్ వన్ పొజిషన్ లో వుండేవాడికి ఎంత ఇన్ సెక్యురిటీ ఫీలింగ్! ఎంత ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్!
ఇవన్నీ తెలిసిన క్లయివు నిదానంగా లేచి గొంతు సవరించుకున్నాడు.
* * *
"చూసావా! రష్యాలో మన షూటింగ్ పెట్టిస్తానన్నాను. పెట్టించాను . అవునా! ఇలా షూటింగులు పెట్టడంలో పెట్టించడంలో ఎక్స్ పర్ట్ ని నేను" అన్నాడు విజయ్ నారంగ్ మీనాక్షితో!
కమర్షియల్ సినిమాలలో వుండే చీఫ్ డబుల్ మీనింగు అతని డైలాగులో వినబడుతోంది.
మొహం అప్రసన్నంగా పెట్టింది మీనాక్షి.
ఆమె మొహంలోకి పరిశీలనగా చూసాడు హీందీ హీరో విజయ్ నారంగ్.
ఈ అమ్మాయి హైదరాబాదులో వున్నప్పుడు తనతో ఎంత చనువు ప్రదర్శించింది! దాదాపు ఓవర్ యాక్షన్ చేస్తున్నంత లెవెల్లో!
కానీ -
రష్యా రాగానే చాలా మారిపోయింది తను.
ఇంక యాక్షను అవసరం లేదన్నట్లు ముభావంగా వుంటోంది.
ఎందుకనీ?
ఈ పిల్ల పరాయి దేశం వచ్చేసినందుకు పరేషాన్ గా వుందా?
అక్కడెందుకంత అభిమానం ప్రకటించింది?
ఇక్కడెందుకిలా ముడుచుకుపోయి వుంటోంది?
సరైన కారణం అతనికి తెలీదు - మీనాక్షికి తెలుసు.
హైదరాబాదులో రాజా తన మాటలనీ , చేతలనీ గమనిస్తూ వున్నప్పుడు తను ఈ విజయ్ నారంగ్ పట్ల అతి అభిమానం ప్రదర్శించింది. అదో నాటకం -
ఇప్పుడు ఇక్కడ రాజా లేడు. రాజా కోసమే ప్రదర్శించిన నాటకం ఇక ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దట్ సింపుల్!
అది తెలియని విజయ్ నారంగ్ వదల్లేదు చెబుతూనే వున్నాడు.
"రష్యాలో కమ్యునిజమ్ వున్నప్పుడు చాలా స్ట్రిక్టుగా వుండేదిట. కమ్యునిష్టు ప్రభుత్వం పడిపోయాక ఇక్కడ అంతా విశుంఖలంగా తయారయింది. మాఫియా ముఠాలు ఏర్పడ్డాయి. ఇదివరకు ఇక్కడ నైట్ లైఫ్ వుండేదేకాదు. ఇప్పుడో! ఓహ్! నైట్ క్లబ్బులు! డిస్కోలు! సెక్స్ పార్లర్స్! పీప్ షోస్! మీనా - కమాన్ - ఎంజాయ్ చేద్దాం రా! అన్నాడు అతను తమకంగా.
హటాత్తుగా అలర్ట్ గా అయిపొయింది మీనాక్షి.
సెక్స్ పార్లర్స్ -
సెక్స్ షోస్!
పీప్ షోస్!
ఆడదాని ఒంటి నగ్న ప్రదర్శన!
అడ మాంసం అమ్మకం!
సరిగ్గా దీనికే తను మొదటినుంచి కూడా వ్యతిరేకం.
ఇప్పుడు తన జీవితంలో రాజా లేడు.
అర్ధం పర్ధం లేని తన జీవితానికి కూడా ఒక పరమార్ధం వుండాలంటే -
మొదటినుంచీ కూడా తను కోరుకుంటున్న ఈ సెక్స్ రాకెట్ లని అను ఆపెయ్యాలి!
ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా ఫర్లేదు!
"కమాన్ మీనా!" అంటున్నాడు నారంగ్.
"నేను రాలేను! మీరు వెళ్ళండి" అంది మీనాక్షి ముక్తసరిగా.
"వన్ మోర్ ఛాన్స్! వస్తావా? రావా?" అన్నాడు హీందీ హీరో విజయ్ నారంగ్ అల్టిమెటమ్ ఇస్తున్నట్టు.
"నీ భవిష్యత్తు నా చేతిలో వుంది అన్న బెదిరింపు వుంది అతని మాటల్లో.
"నేను రాలేను" అంది మీనాక్షి క్లుప్తంగా.
ముఖం అప్రసన్నంగా పెట్టుకుని చరాచర వెళ్ళిపోయాడు నారంగ్.
అతను అలా వెళ్ళిపోగానే చటుక్కున లేచి నిలబడింది మీనాక్షి.
ఆమె కళ్ళల్లో దృడ నిశ్చయం కనబడుతోంది.
సెక్స్ రాకెట్!


