ప్రతి గంటకూ నందినిని నిద్రలేపి ఇంజక్షన్ చేసి, నులువెచ్చని నీళ్ళతో ఆమె వంటిని తుడుస్తూనే వుందామె.
లిపిలో సహనాన్ని, నందిని పట్ల ప్రేమనూ చూస్తుంటే అతనికి తల్లి గుర్తుకొచ్చింది.
బాధల్ని పంటి బిగువున దాచుకొని పెంచిన తల్లి.....
సరిగ్గా రెండు రోజుల క్రితం చెల్లెల్ని ఆమె తుడుస్తుంటే కోప్పడిన సందర్భం గుర్తుకొచ్చింది.
లిపి మనసుని తను తప్పుగా అర్ధం చేసుకున్నాడు. ఒక్కసారిగా లిపి వ్యక్తిత్వం పట్ల అవ్యాజమైన అనురాగం పెరిగిపోయింది అతనిలో. నిద్రలేక ద్వారాబంధానికి చేరబడి కూర్చున్న ఆమె వైపు తడి నిండిన కళ్ళతో చూశాడతను.
* * *
"యారు కాదె- యారు కాదె- ఇడంద మాలిగై. వసంత మాలిగై" శివాజీ గణేశన్ లెవల్లో అభినయిస్తూ సర్వర్ సుందరంలో నాగేష్ లా మెట్లు దిగుతూ హాల్లో సోఫాలో కూర్చుని పూలదండను కడుతున్న నందినిని చూసి ఆమె వైపు నడిచాడు తుషార్.
"హాల్లో..... హౌ ఆర్యూ?" తుషార్ వైపు తలెత్తి చూసి సన్నగా నవ్వింది నందిని. అతను ఆమెకేసి అలాగే చూస్తుండిపోయాడు.
"మీరు భలేవారండీ! మీరస్సలు కనబడటం లేదు. మీ మాటలు కూడా వినబడటం లేదు. ఏమయ్యారు? ఏదైనా సినిమా షూటింగ్ కి వెళ్ళారా?"
"సినిమా షూటింగ్ కి వెళ్ళాను కాబట్టి కనిపించలేదు అని మీరే అంటున్నారు కదా? ఆ సినిమా ఏంటో అడగొచ్చు కదా?"
"హాస్పిటల్లో పి.ఆర్.ఓ. జాబ్ మానేశారా?" అడిగింది నందిని.
"అయ్యబాబోయ్! అలాంటి తెలివితక్కువ పనిని చెయ్యనండీ బాబూ! రెండు నెలలు లీవ్ పెట్టా. ఆర్మూగం అని ఓ సినిమా డైరెక్టరు మన ఫ్రెండు లెండి. అస్సలు సినిమా ఎలా తీస్తారో తెలుసుకుందామని అతనితో పాటు చిన్న ట్రిప్ చేశాను."
"ఏ వూరేమిటి?"
"కొడైకెనాల్."
"మంచి ప్లేసే! షూటింగ్ అయిపోయిందా?"
"విలన్తో హీరోయిన్ ఫైటింగ్ సీను వుంది. హీరోయిన్ చనిపోవడంతో స్టోరీ అయిపోతుంది."
"హీరోయిన్ చనిపోతుందా? హీరోయిన్ చనిపోతే అడియస్సు చూస్తారా?"
"అస్సలు అందులోనే కిటుకుంది చెప్పమంటావా?" కుర్చీని దగ్గరగా లాక్కుని కూర్చుంటూ అన్నాడు తుషార్.
"కిటుకేమిటి?" అడిగింది నందిని ఆశ్చర్యపోతూ.
"మొదట్నుంచీ నాకు తమిళియన్స్ అంటే అభిమానం. వాళ్ళు వండ్రఫుల్ స్టోరీస్ వర్కవుట్ చేస్తారు. ఇందులో హీరోయిన్ చనిపోవడం అంటే...... విలన్ చనిపోవడం అన్నమాట."
"అదెలాగ.....?" అబిత్తరపోయి అతనివైపు చూస్తూ అడిగింది నందిని.
ఆమె కళ్ళలోకి క్షణం చూసి "మీ కళ్ళు చాలా బాగుంటాయి. మీరేమనుకోకండి. అర్జంటుగా దాచుకోకుండా నా ఒపీనియన్ ని చెప్పేయడం నా అలవాటు. ఇప్పుడు సిన్మా కథలోకొస్తే...." ప్రారంభించాడతను.
"అనగనగా ఒక హీరో. వాళ్ళూర్లో ఆవారాగా తిరిగి సిటీ కొస్తాడు. అక్కడ డిపార్ట్ మెంటల్ స్టోరులో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ స్టోరు ఓనరు హీరోయిన్! అతని మంచితనానికి ఆవిడ ముగ్ధురాలై పోయి అతనికి మనసిచ్చేస్తుంది. అంతే..... డ్యూయెట్లూ, పద్యాలూ మామూలే!
ఇలా స్టోరీ పరుగెడుతుండగా, ఆ డిపార్ట్ మెంటల్ స్టోర్సు కిందే విలన్ డెన్ వుంటుంది. అండర్ గ్రౌండ్ అన్నమాట. ఒకరోజు అర్దరాత్రి హీరోకి ఆ విషయం తెలుస్తుంది. అంతే..... ఆ డెన్ లోకి ప్రవేశించి విలన్ ను పట్టుకుని నాలుగు ఉతికేస్తాడు. ఆ పైన వార్నింగిచ్చి వెళ్ళిపోతాడు.
అక్కడ్నించి వస్తున్న సమయంలో విలన్ మనుషులు హీరోని యాక్సిడెంట్ కు గురి చేస్తారు. హీరో హాస్పిటల్లో వుండగా విలన్ స్వయముగా అక్కడకు వెళ్ళి హీరోని చంపబోగా, హీరో హాస్పిటల్లో వుండగా విలన్ స్వయముగా అక్కడకు వెళ్ళి హీరోని చంపబోగా, హీరో విలన్ మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఫైటింగ్ లో హీరో విలన్ ని చంపేస్తాడు.
శవాన్ని మార్పురీలో పెట్టి వచ్చేస్తాడు. ఇక్కడ ఇంట్రవెల్ అన్నమాట" అలసిపోతూ అన్నాడు తుషార్.
"మరి విలన్తో హీరోయిన్ ఫైటింగన్నారు?" ప్రశ్నించింది నందిని.
"అదే సస్పెన్స్ అని చెప్పానా? అప్పుడు మార్చురీలోంచి విలన్ ఆత్మ లేస్తుంది. హీరోయిన్లో ప్రవేశిస్తుంది. హీరో హీరోయిన్లు డ్యూయట్స్ పాడుకుంటున్న సమయంలో హీరోయిన్ సడన్ గా మాయాబజారులో సావిత్రిలా విలన్ ఆత్మతో హీరోని సుబ్బరంగా తన్ని వెళ్ళిపోతుంది.
అయిదారు పాటల తర్వాత హీరోయిన్ హీరోయిన్ కాదని హీరోకి తెలుస్తుంది" రొప్పడం ఆపుకుంటూ చెప్పాడు తుషార్.
"బాగుంది కథ! తర్వాతేం జరుగుతుంది?" ఆసక్తిగా ప్రశ్నించింది నందిని.
"అసలిక్కడ ఇంకొక మలుపు వుంది" గట్టిగా ఊపిరి పీల్చాడు తుషార్.
"ఇది సినిమా కథా?" నవ్వును ఆపుకోడానికి ప్రయత్నిస్తూ అంది నందిని.
"ఏం బాగా లేదా?"
"రెండ్రోజులాడుతుంది" నమ్మకంగా చెప్పిందామె.
"అందుకే ఆడవాళ్ళకు ప్రపంచ జ్ఞానం వుండాలన్నది. ఈ సినిమాకి కథెవరిదనుకుంటున్నారు నాదే. ఇప్పుడన్నీ ఇలాంటి సెన్సు ఫిక్షన్ స్టోరీసే. హండ్రెడ్ డేస్ ఆడుతున్నాయి. మీరు రెడీగా వుండండి. ప్రివ్యూకి తీసికెళతాను నెల రోజుల తర్వాత....."
"నెల రోజుల తర్వాతా...... బాగానే వుంది" అలా అంటున్నప్పుడు నందిని పెదవి పైనున్న పుట్టుమచ్చ వైపు చూసి-
"చాలా బాగుంది. పుట్టుమచ్చలు మగవాళ్ళ అందానికి వుపయోగపడవు కానీ, ఆడవాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తాయి."
ఓరకంటితో తుషార్ వైపు సీరియస్ గా చూసింది నందిని.
"సీయూ నందినిగారూ! నన్నెవరైనా తిట్టారనుకోండి. నేనస్సలు పట్టించుకోను. పొగిడినా కూడా. ఆడపిల్ల మీరు కూడా...... నాలా వుంటానంటే ఎలాగండీ. పొగడ్తలకు ఆడపిల్లలు సిగ్గుపడాలి. అది రూలు" చెప్పేసి బయటకెళ్ళిపోయాడు తుషార్.
జీవితంలో నందినిని, ఆమె అందాన్ని పొగిడిన మొదటి వ్యక్తి తుషారే. తను మగవాళ్ళని ఆకర్షించగలదు అనే ఆలోచనే ఆమెకు చాలా సంతోషంగా వుంది.


