4
భుజంగరావు గారింటికి అమల వచ్చి సరిగ్గా వారం అయింది.
అమల ధైర్యస్తురాలే అయినా, తల్లిదండ్రులకు దూరంగా, పరాయి ఇంటిలో పిచ్చిదానిలా..... తనే పోయి దొరికిన కూతురనుకుంటూ వెర్రిభ్రమతో ఆనందం పొందుతున్న భుజంగరావు గారిని మోసం చేస్తూ...... ప్రతి నిమిషం తనని పలకరించే ఇంటిలో బంధువులు, నౌకర్లు ఓ నాటి రోజా ఫ్రెండ్స్.... అందరి మధ్య సతమతమవుతూ రోజులు గడుపుతూంది. తను భగవాన్ రూపురేఖలు బాగా గుర్తుంచుకుంది. వీరిలో భగవాన్ ఉన్నాడు. కాని ఎవరు భగవాన్ అయినదీ తెలియటం లేదు.
అమ్మా, నాన్న, ఫ్రెండ్స్, కాలేజీ, సినిమాలు షికార్లు బి.ఏ. పరీక్షలు - అన్నీ గుర్తొస్తున్నాయి అమలకి. అందుకే వంటరిగా గదిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది.
భుజంగరావు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చాడు. అమల పక్కనే కూర్చుని అమల భుజం మీద చెయ్యివేశాడు.
"ఎందుకు తల్లీ ఏడుస్తున్నావు? నిన్నేవరయినా ఏమన్నా అన్నారా? చెప్పు తల్లీ! వాళ్ళను ముక్కలు చేయిస్తాను."
చివ్వున తల ఎత్తింది అమల. కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. తెల్లని వెండిరంగు తలకట్టు, పండుటాకులా ఉన్న భుజంగరావు ప్రపంచంలో ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని తనవైపు చూస్తుంటే అమల నోరు తెరవలేకపోయింది.
"చెప్పుతల్లి ఎందుకు కన్నీరు కారుస్తున్నావు" భుజంగరావు అమల కళ్ళు తుడుస్తూ అడిగాడు.
"మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు, నా తల్లిదండ్రులను చూడ నోచుకోగలనో..... లేదో అని....." అమల అనుకుంది.
"నేను.....నేను.....చచ్చిపోతాను...... అందుకేడుస్తున్నాను. ఇంకా బాగా ఏడవనా?" అమల పిచ్చి ధోరణిలో చేతులు తిప్పుతూ అంది.
"అలా అనొద్దు తల్లీ నే చూడలేను. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావని, అదే వెయ్యివరహాలని ఆనందిస్తున్నాను. క్షణం నీవు దూరమయితే ఇహపై నేను బ్రతకను తల్లీ" కళ్ళనీళ్ళతో అన్నాడు భుజంగరావు.
"ప్రభా! ప్రభ, దేముడూ రేగే ప్రభ" పిచ్చిగా అనసాగింది అమల.
పక్కగదులలోంచి మేనేజరు రామచంద్ర, దూరం చుట్టం అయిన శంకరం వచ్చారు.
రామచంద్ర, శంకరం ఈ ఇంటిలో వున్న మనిద్దరు భగవాన్ ఎత్తు, లావుతో వుంటారు. వీళ్ళల్లో యెవరో ఒకరు భగవాన్. అంతవరకూ ఖాయం. ఎవరు తనని తీసుకొచ్చిన భగవాన్?
"బాబుగారూ! అమ్మాయిగారికి పిచ్చి ఇదివరకటికన్నా ముదిరింది. మళ్ళి యింట్లోంచి వెళ్ళిపోతారేమో? గొలుసుతో ఓ కాలు కట్టేసి వుంచితే మంచిది." మేనేజరు రామచంద్ర అన్నాడు భుజంగరావుతో.
అమల ఉలిక్కిపడింది.
"మనమంతా లేమా? ప్రతి నిమిషం చూస్తూ రోజాని కాపాడటమే. కాళ్ళూ చేతులు కట్టమని ఏం సలహా అంది?" శంకరం అన్నాడు.
"నాకెవరూ, ఏ సలహాలు ఇవ్వకండి. నా తల్లి ఎన్ని పిచ్చి పనులు చేసినా జాగ్రత్తగా చూడటమే మీ పని. అంతే!" కఠినంగా అన్నాడు భుజంగరావు.
'అమ్మయ్య! అనుకుంది అమల. ఈ గదులలో తిరగటానికి లేకుండా కాళ్ళూ చేతులు కట్టి పడేస్తే అంతకన్నా వేరే నరకం లేదు.
"మీరంతా వెళ్లిపోండి. లేకపోతే నే నేడుస్తాను. ఆ..... అంతే!" అంది అమల పిచ్చిగా చూస్తూ.
"వద్దు తల్లీ! నీవు కళకళలాడుతూ వుండటమే నాకు కావలసింది. నీ కంట నీరు చూడలేను. పద శంకరం, పద రామచంద్రం" భుజంగరావు లేస్తూ అన్నాడు.


