"నీ కథ మాకు తెలియదా? పగ్గాలు పట్టుకుంటావ్ గానీ, కాళ్ళతో వాడి కడుపులమీద తంతావంటావులే. అలా తంతూవుంటే పరిగెత్తకుండా ఛస్తాయా?" ఉక్రోషం కొద్దీ అన్నాడు.
వాళ్ళిద్దరికీ ఎద్దుల్లో పోటీ, ఒకరి ఎద్దులు భేషుగ్గా వున్నాయని ఇంకొంకరు చచ్చినా ఒప్పుకోరు.
"నాకలాంటి బుద్దులేం లేవు. అయినా నా ఎద్దులకున్న చురుకు నీ ఎద్దులకెక్కడిది?" అని ఎగతాళీగా నవ్వాడు శేఖరం.
పాపం సురేష్ ఆ మాటలకి లోలోపల ఉడుక్కున్నాడు.
వ్యవహారం ముదురుతుందని గ్రహించిన వేదవతి- "ఎద్దుల ఊసు తప్ప మరొకటి నీకు పట్టదు కదా " అని మొగుడ్ని చల్లబరిచింది.
ఆ తరువాత అందరం కలిసి ఏవేవో మాట్లాడుకుంటూ గడిపాం ఎనిమిదైంది.
"మరి నేవస్తా " జనాంతికంగా అని రమణ బయల్దైరాడు. అతను వెళ్ళిపోవడానికి లేవడంతో నేనూ ఇంటికెళ్ళడానికి లేచాను. అతను లేకపోతే నాకూ ఏమీ తోచక బహు బోర్ గా వుంటుంది.
రమణ వెళ్ళిపోయాడు.
"మీరిద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకేసారి లేస్తారు. ఏమిటి కథ?" అంది వేదవతి నావైపు అదే విధంగా చూస్తూ. నాకు చచ్చేంత సిగ్గేసింది. కానీ అడిగింది వేదవతి గనుక ధైర్యంగా అవుననుకో " అని అంతే కొంటెతనంతో జవాబు చెప్పాను.
"ఈడూజోడూ బావుంది. మొత్తానికి ఫ్యాంట్ లు వేసుకునే కుర్రాడ్నే పట్టావ్ " అంది అమె నైవైపు మెచ్చుకోలుగా చూస్తూ.
మగాడు ఫ్యాంటు వేసుకోవడం మగసిరికి నిదర్శనం. అని అమె నమ్మకం. ఆస్తి, చదువు తదితర విలువలన్నీ ఫ్యాంట్ తరువాతే.
ఇక ఇంటికి వెళతాననగా సురేష్ కంగారుగా తిన్నె దిగి పడమట వైపు పరిగెత్తాడు.
"ఏం జరిగిందో మాకు అర్దం కాలేదు. అయితే వీధిపై భాగాన ఎవరో ఆరుస్తున్నట్లు గందరగోళంగా మాటలు విన్పిస్తున్నాయి.
"ఏమైంది? " శేఖర్ కూడా కిందికి దీగాడు.
"అలా అడంగిలాగా ఇక్కడే వుండి అడగకపోతే అలావెళ్ళి చూసి రాకూడదూ " అని కసిరింది వేదవతి.
ఇక తప్పదని శేఖర్ బయల్దేరబోతుండగా సురేష్ వచ్చాడు. మా ముఖాల్లో ప్రశ్నలు కనిపించడంతో తనే చెప్పాడు. "రమణకి తేలు కుట్టింది "
రమణకి తేలుకుడితే నాకు చెమటలు పోశాయి. కాళ్ళూ చేతులు వణుకుతున్నాయి.
"అయ్యొయ్యో- వెళ్ళి చూసొద్దాం పద " వేదవతి అనడంతో నేనూ అమె వెంట బయల్దేరాను.
అయితే అంతలో రమణనే మా ఇంటివైపు వస్తున్నాడు. పక్కన అతని తల్లి ఏడుస్తోంది. అతను బాదనంతా పళ్ళమధ్య బిగిస్తున్నాడు.
"జ్యోతిర్మయి వుందా? వెంటనే మంత్రం వేయమను " శేఖర్ నాలుగిళ్ళ లోగిలివైపు తిరిగి అరిచాడు.
అంతలోనే అక్కడంతా అందరూ గుమిగూడారు.
తేలు ఎక్కడు కుట్టిందో అడగాలనుంది నాకు. కానీ అంతమందిలో ఎలా అడగడం? ఇంటిమధ్యనున్న తులసిచెట్టుముందు రమణను కూర్చోబెట్టారు.
జ్యోతిర్మయిపిన్ని వచ్చింది. అమె చేతిలో రెండు చీపురుకట్ట పుల్లలున్నాయి. అమె కళ్ళుమూసుకుని మంత్రాన్ని జపించడం మొదులుపెట్టింది. రమణ బాదను మరిచిపోవడానికన్నట్లు నావైపు చూస్తున్నాడు.
అది గ్రహించే కాబోలు పక్కన కూర్చున్న వేదవతి- "ఇలా వచ్చి కాలు కదపకుండా పట్టుకో " అంది.
నేను మౌనంగా వెళ్ళి అతని కాలు పట్టుకున్నాను.
మంత్రం వేయడం పూర్తయింది. "వడగళ్ళు వుంటే పట్టుకురండి " అంది జ్యోతిర్మయిపిన్ని.
"మా ఇంట్లో ఉన్నాయి " కుసుమకుమారి ఇంట్లోకివెళ్ళి ఓ ఇంజెక్షన్ సీసా తెచ్చింది.
వడగళ్ళు పడుతున్నప్పుడు వాటిని ఏరి సీసాలో భద్రపరుస్తారు. ఇలా పురుగు కుడితే వాటిని కరిచిన దగ్గర వేస్తే నయమవుతుందని నమ్మకం.
ఆ సీసాబిరడా తీసి అందులో వున్న నీటిని కాలుమీద పోసింది జ్యోతిర్మయి.
మరో అయిదు నిమిషాలకి రమణ సర్దుకున్నాడు. ఇప్పడతని ముఖంలో బాధల ఛాయలేంలేవు.


