Home » Kommuri venugopala rao » భారతి

    కాంపౌండర్ దిగ్ర్బాంతి  పొంది దూరంగా  నిలబడి చూస్తున్నాడు .డాక్టర్ సాగర్ ఆమె భుజంచుట్టూ చేయిపోనిచ్చి  గట్టిగా పట్టుకుని  నడిపించటానికి  ప్రయత్నించాడు, సాధ్యం కాలేదు. చేసేదిలేక  ఆమెని రెండు చేతులతో పైకి ఎత్తి, ఎగ్జామినేషన్ టేబిల్ దగ్గరకు తీసుకొని వెళ్ళి దానిమీద  పడుకోబెట్టాడు. చెయ్యి పట్టుకుని నాడి చూస్తే సరిగ్గా అందటంలేదు. గబుక్కున ఆమె తలక్రింద  దిండు తీసేసి ,కాళ్ళక్రింద ఎత్తుగా వచ్చేటట్లు ఎడ్జస్ట్  చేయమన్నాడు. తరువాత అతన్ని స్టిమ్యులెంట్  మిక్స్ చర్ తీసుకురమ్మని  మళ్ళీ చేయిపట్టుకుని చూశాడు. నాడి చేతికి అందుతూంది. ముఖంవంక  చూసేసరికి  కొంచెం రక్తం వచ్చినట్లయి, పోయిన కళ తిరిగి  వస్తూంది. తరువాత కాంపౌండరు తెచ్చిన మందు ఆమె పెదవుల దగ్గరపెట్టి ,ఒక చేత్తో  తల కొంచెం ఎత్తి కొద్దికొద్దిగా త్రాగించాడు. ఆమె ముఖం కేసి  ఆతృతగా  చూస్తున్నాడు.

    రెండు నిమిషాల్లో  ఆమెకు జీవం  వచ్చినట్లయింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి  చూసేసరికి  ఎదురుగా  డాక్టరుగారి ముఖం అస్పష్టంగా గోచరించింది. ఆమె అయోమయంలో పడిపోయి, ఏం జరిగిందా అని ఆలోచిస్తూ కదలటానికి ప్రయత్నించింది.

    "కాసేపు  అలాగే  పడుకోండి. మరేంలేదు. నీరసం మీద  కళ్ళు తిరిగి పడిపోయారంతే" అతడి కంఠం ఆమె ప్రయత్నాన్ని వారించింది.

    అతడి సన్నని వ్రేళ్ళు  ఆమె మణికట్టు  దగ్గర మృదువుగా స్పృశిస్తున్నాయి. ఆమెకు తల త్రిప్పి  చూసే శక్తి కూడా  లేకపోయింది. "ఇంకా బాగా  బలహీనంగా ఉన్నారు. ఒక గ్లూకోజ్ ఇంజక్షన్ ఇస్తాను. ఏం?" అతని కంఠం అనునయిస్తున్నట్లుగా  వినిపించింది.

    అది యదార్ధమే అయినా, ఆమెకు ఎక్కడో  లీలాసదృశ్యంగా ఇదంతా జరుగుతున్నట్లు  తోచింది. 'మీ ఇష్టం' అందామనుకుంది. కాని, ఆమె పెదవులు  దాటి ఆ మాట  బయటకు వెలువడలేదు.

    కాసేపటికి  ఆమెకు కాంపౌండరు  తన మూచేతిపై  భాగం  గట్టిగా పట్టుకోవటమూ, డాక్టరు చర్మంలోకి  సూది గ్రుచ్చటమూ  తెలిసింది. చురుక్కుమంది, రక్తంలోకి ఇస్తున్నాడు గావును__మెల్లిగా, జాగ్రత్తగా ఇస్తున్నాడు. ఒంట్లోకి ఎక్కడి నుంచో వేడి ప్రవేశిస్తున్నట్లయింది. కళ్ళు పూర్తిగా  తెరుచుకుని  అతనివంక విచిత్రంగా చూస్తూంది!

    ఇంజక్షన్  చెయ్యటం  అయిపోయింది. రెండున్ నిమిషాలు  తను మెదలకుండా  పడుకున్నాక "నీరసం తగ్గిందా?" అని అడుగుతున్నాడతను. ఆమె తల వూపి "లేవగలననుకుంటాను" అని మెల్లిగా లేచి కూర్చుంది. తరువాత కొంచెం  సత్తువ వచ్చినట్లుగా  తోచి  బల్లదిగి, కుర్చీలోకి వచ్చి కూర్చుంది.

    డాక్టరు సాగర్ తన సీటులోకి వెళ్ళి కూర్చుని "ఎందుకలా కళ్ళు తిరిగాయి! ఎవరిమీద కోపం వచ్చి ఉపవాసాలు చేస్తున్నారు?" అని అడిగాడు.

    భారతి సిగ్గుపడుతూ  నవ్వి "కోపంవస్తే ఉపవాసాలు  చేస్తారా? క్షమించండి మీకు చాలా శ్రమ ఇచ్చాను" అంది.

    "శ్రమా డాక్టరుగా  నా కర్తవ్యం నెరవేర్చానంతే"

    ఇంతలో   కాంపౌండరు  ఎప్పుడు బయటకు వెళ్ళాడోగాని, మూతలువున్న రెండు గ్లాసుల నిండా కాఫీ తీసుకు వచ్చి బల్లమీద పెట్టాడు.

    "తీసుకోండి" అన్నాడు డాక్టర్, ఒక గ్లాసు ఆమె ముందుకు జరుపుతూ.

    "ఇప్పుడా? వేళకాని వేళ  దేనికండీ  కాఫీ?" అన్నది లఙ్ఞాభారంతో తల ముక్కలవుతూ.

    "నా విషయం ఎలా ఉన్నా, మీ రిప్పుడువున్న  శరీరస్థితికి ఇది సరి అయిన వేళే....అయినా మీరు మొహమాట పడతారని నేను కూడా తెప్పించుకున్నాను. ప్లీజ్, తీసుకోండి" అంటూ అతనూ గ్లాసు అందుకున్నాడు.

    ఆమె విధిలేక కాఫీగ్లాసు  చేతిలోకి తీసుకుని కొంచెం  కొంచెం తీసుకోసాగింది. కాఫీ త్రాగటం  పూర్తయేవరకూ యించుమించు ఇద్దరూ  మౌనంగా ఉన్నారు.

    హఠాత్తుగా అతను  సంభాషణ మొదలుపెడుతూ  "మీరు ఆరోగ్యాన్ని  అలక్ష్యంగా  ఎప్పుడూ  చూడకూడదు. మన ప్రయత్నమంతా  బూడిదలో  పోసిన పన్నీరవుతుంది. మీరు మామూలు  మనిషి కావాలంటే  జనరల్ హెల్త్ కంటికి రెప్పలా  కాపాడుకోవాలి" అన్నాడు. అతని ముఖంలో వేదనా చిహ్నాలు  గోచరించాయి.

    ఆమె ఒళ్ళు ఝల్లుమంది. బూడిదలో  పోసిన పన్నీరు....! అలా ఎప్పటికీ కావటానికి వీల్లేదు. ఈ రహస్యం ఎవరయినా గ్రహించినా గ్రహించకపోయినా, దీనివల్ల తన జీవితంలో విచిత్ర పరిమాణాలేవో  జరుగుతాయని భ్రాంతి లేకున్నా__తను సాధించి తీరాలి.'

    ఆమె తల ఎత్తి అతని  కళ్ళలోకి  చూసింది. "క్షమించండి, నావల్ల  ఎటువంటి పొరపాటూ రానీయను. మామూలుతనం  రావటానికి  నా సర్వశక్తులూ  ధారపోస్తాను" అంది దృఢస్వరంతో.

    డాక్టరు నవ్వాడు. "సర్వశక్తులూ  ధారపోయనక్కర్లేదు .మీలాంటి వారిని విధి ఎప్పుడూ  ముందుకే నడిపిస్తూంది" అన్నాడు.

    భారతి లేచి నిల్చుంది. "థాంక్సండీ. ఇహ  వెడతాను  చాలా ఆలస్యమైపోయింది."

    అతను ఆమె వెంట  గుమ్మంవరకూ  వచ్చాడు. రిక్షా ఒకటి పిలిచాక  ఆమె అందులో  ఎక్కి కూర్చుంది. అతను మెట్లుదిగి  రిక్షావరకూ  వచ్చి "వెళ్ళగలరా? మరో రిక్షాలో మీ వెంట బస్ స్టాండ్ వరకూ సాయం రమ్మంటారా?" అనడిగాడు   అనుమానం వ్యక్తంచేస్తూ.

    ఆమె నవ్వి, మృదువుగా  "అఖ్కర్లేదండీ  నీరసమూ మచ్చుకైనా  లేకుండా  ఎగిరిపోయింది" అంది.

    డాక్టరు పెదవులమీద ఎప్పటి  మందహాసం  లాస్యంచేసింది. "నెల తరబడి  మీకు ఇంజక్షనివ్వకుండా  వైద్యం  నడిపించుకువచ్చాను. ఈ వేళ  సూది ఇవ్వక తప్పలేదు" అన్నాడు.

    భారతి అప్రయత్నంగా  తన మోచేతి  మధ్య చూసుకుంది. సూది గ్రుచ్చిన చోట తెల్లని శరీరం మీద ఎర్రని, సూది మొనంత  మచ్చ కనిపించింది. "ఇన్నాళ్ళూ  మీరు బాధ కలిగించని డాక్టరుగారనుకున్నాను కాని ఈ వేళ  మిగతా డాక్టర్ల జాబితాలో  చేరిపోయారు" అంది.

    రిక్షా కదిలింది. అతనికి  రెండు చేతులూ  ఎత్తి నమస్కారం చేసి, భారతి అటు తిరిగి కూర్చుంది. తలుపులు వెయ్యటంలో  కాంపౌండరుకు  సాయం  చెయ్యటానికి  డాక్టరు సాగర్ లోపలకు వెళ్ళాడు.


                               *    *    *


    హఠాత్తుగా జరిగిన సంఘటన ఎంత విపరీతంగా  తోస్తుందో__ఎంతో కాలంగా  ఎదురుచూసిన  సంఘటన కూడా ఏదో ఒకనాడు  సంభవించినప్పుడు  విపరీతంగా  తోస్తుంది. ఒక్కోసారి భరించలేనంతగా తోస్తుందేమో కూడా. చివరకు ఆ ఘడియ రానే  వచ్చింది. ఆ తీర్మానమూ  జరిగిపోయింది.

    భారతి చలించకూడదనుకుంది. అయినా ఆమె  ఆపాదమస్తకమూ చలించి పోతున్నది. భారతి ఏడవకూడదనుకుంది. అయినా ఆమె కళ్ళ నుండి  నీటి చుక్కలు  జారిపడ్డాయి.

    వార్త తెలిసిన  రాధమ్మ  భారతిని  కౌగిలించుకుని  భోరుమని ఏడ్చింది. ఆమె  చెక్కిళ్ళూ, ఫాలబాగమూ, శిరస్సూ  మాటమాటికీ  స్పృశిస్తూ, ఆకృతిలేని  అక్షరాలను  ఉచ్చరిస్తూ, గుండెలు బద్దలయ్యేలో  ఏడుస్తూంది.

    కాసేపటికి  భారతి తెప్పరిల్లి  గుండెలనిండా  ఊపిరి పీల్చుకున్నది, "ఎందుకేడుస్తున్నావు, పిన్నీ! నీ జీవితం కాలిపోయినప్పుడు....ఆ మహాగ్ని గుండాన్ని  భరించినదానవు. ఈపాటి దుఃఖాన్ని దిగమింగలేవా? నువ్వు మరిచిపోతావు, పిన్నీ  కొన్నాళ్ళకు  మరిచిపోతావు. ఇలాంటి  దుఃఖాల  కూర్పులను  అనుభవించి మరచిపోవటానికి నువ్వు శాసించబడ్డావు" అంది ఆవేశంగా.

    ఈ దెబ్బ ఎక్కడ  తగిలిందోగాని, రాధమ్మకు తట్టుకోవటం  సాధ్యం కాక పోయింది. మెల్లగా భారతిని వదిలేసి గోడమూలకు చేరి కూర్చుని, మోకాళ్ళమీద తల ఉంచుకుని  వెక్కి వెక్కి  ఏడుస్తూంది.

    భారతికి తెలియటంలేదు. పిన్నిని అలా చూడటం  ఆమెకిష్టం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపలి గదిలోకి  వెళ్ళి కూర్చుంది. ఆ గదిలోకి గాలీ, వెలుతురూ రావటంలేదు. ఆ వాతావరణమే ఆమెకిప్పుడెంతో  బాగుంది.
 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra