Home » Kommuri venugopala rao » భారతి

    "మనిషిని చాలా పాడయిపోయావు. ఇదివరకు  నీ బంగారు రంగు ఒంటితో  మా అందరి కళ్లూ కప్పగలిగావు. ఇక్కడా  పై పూత చెరిగిపోయింది. నీ అసలు రూపుతో యిప్పుడు  నా ముందు నిలుచున్నావు. ఈ స్థితిలో వైద్యం చేయించుకుంటే మాత్రం ఏం గుణం కనిపిస్తుంది కనుక? పాపం, నీ జీవితం యిలా  తెల్లారిపోవలసిందే" సానుభూతి వ్యక్తపరుస్తూన్నట్లు  అన్నాడు.

    ఆయన మాటల్లోని  ఆంతర్యం, అవహేళనా  ఆమె అర్ధం చేసుకుంది. ఏమీ జవాబివ్వలేదు.

    "తండ్రి పోయాడు. ఆర్ధికమైన యిబ్బందులేవో  వుంటాయి, కాదనను."

    ఆమె ఒళ్ళు భగభగ మండిపోతున్నట్లనిపించింది.

    ఇందాకా ముందుకు వంగినవాడల్లా  ఆయన మళ్ళీ వెనక్కి వాలి, తాపీగా ఒకసారి పైప్ పీల్చి "చూడూ" అన్నాడు.

    ఆ 'చూడూ' అనే మాటలో  ఎన్నో విపరీతాలు ధ్వనించాయి. ఏ పిడుగుపాటుకో నాందీవచనంగా  స్పురించింది.

    కాని ,మీద ఎన్ని ఆశ విపాతాలు  పడినా  చలించకుండా  భరించే స్థితిలో  వుంది భారతి.

    "నీ జీవితం ఎలాగూ  భంగపడింది. కారణం__వ్యక్తులెవరూ  కాదు. విధి అంటే  ఒప్పుకుంటావనుకుంటాను. నువ్వు చాలా బుద్ధిమంతురాలివి. మారుమాట చెప్పకుండా  నేను వెళ్ళమనగానే  మౌనంగా పుట్టింటికి దారి తీసినప్పుడే  నీ వ్యక్తిత్వాన్నీ, శుశిక్షతనూ  అర్ధం చేసుకున్నాను. ఇన్నాళ్ళూ  మాతో మంతనాలు జరపకుండా నిశ్చలంగా ఊరుకున్నందుకు నీ ఆత్మగౌరవాన్ని  అభినందిస్తున్నాను. కాని, నీ కారణంగా మా సారధి జీవితం పాడు కాకూడదు "నువ్వు  వాడి జీవిత సుఖాలకు అడ్డు రాకూడదు" అని ఒక్కక్షణం ఆగి "నేను నిక్కచ్చి మనిషిని. అన్నీ ఖండితంగా  జరగాలి. ప్రతిదీ  చట్టబద్ధంగా  సమకూరాలి. ఆఁ" అన్నాడు.

    భారతి విషయాన్ని కొంతవరకూ  అర్ధం చేసుకుంది, అయినా గగుర్పాటు లేదు. ఎందుకంటే....అత్తవారింటి దగ్గర్నుంచి  వచ్చేశాక ఆమె పొరబాటున ఒక్కసారికూడా  ప్రలోభంలోపడి  ఆశల్ని పునర్నిర్మించుకోలేదు.

    "తెలుస్తూందను కుంటాను. సారధి  నీనుంచి  విడాకులు పొందాలి"

    భారతి  ఆలోచించింది. గంగాధరంగారు చతురుడు. భార్యాభర్తలు విడాకులు పొందాలంటే  వారిద్దరూ కొంత కాలపరిమితిపాటూ  ఒకరికొకరు  దూరంగా ఉన్నట్లు  నిరూపించబడనిదే  వీల్లేదు. అందుకని ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా గడిపాడు.

    "మీరిద్దరూ కోర్టు కెక్కక  తప్పదు. కాని, నీలోని  లోపాన్ని  బయటకీడ్చి, నిన్ను రచ్చకెక్కించి  అన్యాయం  చెయ్యటం నా కిష్టం లేదు. తలిదండ్రులు  నీకిష్టంలేని పెళ్ళి చేశారు. భర్తతో కాపరం చేయమని భీష్మించి, ఎవరెంత చెప్పినా  వినకుండా  పుట్టింటికి వచ్చేశావు. ఇహ వేరే గత్యంతరం లేక నీ భర్త నీతో  తెగతెంపులు  చెయ్యమని కోర్టుకు మొరపెట్టుకున్నాడు! వింటున్నావా?"

    ఆమె తల ఊపింది.

    "కోర్టులో కూడా మేము చెప్పిన ప్రతిదానికీ నువ్విలాగే  తల ఊపాలి. అలాకాక  స్వార్ధంతో  అడ్డుపుల్లలు  వేయటానికి ప్రయత్నించావా....నే నెలాంటివాడినో  ఈసరికి  అర్ధం చేసుకుని  వుంటావు."

    భారతి తల ఎత్తి  గంగాధరంగారి  కళ్ళలోకి  చూసింది. ఆయన క్రౌర్యం చూస్తూంటే  ఆమెకు భయం వెయ్యలేదు. అసహ్యం వెయ్యలేదు. ఒక విధమైన నిర్లిప్తత కలిగింది. ఆ సమయంలో రంగాజమ్మగారిని మనఃపూర్వకంగా అభినందించింది  హృదయంలో. ఈ వ్యక్తితో  ఇన్ని సంవత్సరాలు  సవ్యంగా  సంసారం చేసినందుకు.

    "ఒక  మనవి  మామగారూ" అంది చప్పున.

    'మామగారు!' ఈ పిలుపు విని ఉలికిపడ్డాడు గంగాధరంగారు. నొసలు  చిట్లించి  ఆమె వైపు చూశాడు.

    "నా మీద మీరు ఉంచిన  విశ్వాసానికి  కృతజ్ఞురాలిని. మీరేవిధంగా  ప్రవర్తించినా  మీ దారికి అడ్డురానని  హామీ ఇస్తున్నాను. మీ ఉద్దేశం నా కర్దమయింది. మీరు నిరాక్షేవణీయంగా  మీ అబ్బాయికి  మరో పెళ్ళి చేసుకోవచ్చు. జీవితంలో నా ముఖమెప్పుడూ మీకు చూపించను సరికదా, నేనెక్కడ వున్నానో కూడా తెలియనివ్వను. నా వల్ల  ఏమీ భయం లేనప్పుడు  ఈ కోర్టు లెందుకు? విడాకు లెందుకు?

    "అదెలా?" అన్నాడు గంగాధరంగారు ఉద్విగ్నుడై. "విడిపోదలుచుకున్నప్పుడు  పూర్తిగా, చట్టబద్ధంగా జరగవలసిందే. లేకపోతే  ముందు ముందు ఎన్ని కాంప్లికేషన్సు  వస్తాయో....చిన్నపిల్లవు నీకేం తెలుసు? దాపరికం లేకుండా  చెబుతున్నాను. అగ్నిసాక్షిగా  పెళ్ళాడిన స్త్రీ ఇంకోరు వున్నారంటే  మా వాడికి పిల్లనివ్వటానికి  ముందు కెవరొస్తారు? అయినా చట్టరీత్యా ఇది అసమ్మతం. నువ్వు విడాకులు పొందక తప్పదు"

    చాలాసేపు  ఆలోచించి  భారతి నిట్టూర్పు విడిచి అన్నది: "మీ ఇష్టం అలాగే కానివ్వండి, మామగారూ!"

    గంగాధరంగారి  ముఖంలో  సంతోషం  తాండవించింది. ఈజీ చైర్ లోంచి  లేచి నిలుచుని  ఎడమ చేత్తో పైప్ పట్టుకుని, కుడిచేత్తో చేతికర్ర అటూ యిటూ  ఊగిస్తూ  అన్నాడు: "అమ్మాయ్! నీ ఆత్మస్థయిర్యానికి  నేను మెచ్చుకుంటున్నాను కాని, మరో హెచ్చరిక కూడా చేస్తున్నాను. కోర్టులోకి లాగాక ప్లీడర్లు  చాలా నిర్దయగా  ఉంటారు. వాళ్ళకు జాలి  ఉండదు .నీమీద  ఎన్నో అభాండాలు  వేస్తారు. అవన్నీ నువ్వు సహించి, మాతో సహకరించాలి.

    భారతి పెదవులు బిగపట్టింది. "సరే" అంది కొంచెం సేపటికి అభయమిస్తూన్నట్లుగా.

    "వెరీ వెరీ గుడ్! నువ్వు నాకు నచ్చావమ్మాయ్! అభిమానంగల  ఆడపిల్ల అంటే అలా ఉండాలి." గంగాధరంగారు  సాభిప్రాయంగా ఆమె వైపు  చూసి ,చేతికర్ర వూగించుకుంటూ  బయటకు వెళ్ళిపోయాడు. మరో రెండు నిమిషాలకు కారు కదిలి వెళ్ళిపోయిన శబ్దం  వినిపించింది.         
   
    భారతి ఆచలనంగా వున్నచోటనే  నిలబడిపోయింది. ఆమె కళ్ళు శూన్యంలోకి  చూస్తున్నాయి, ఆ కళ్ళు వర్షించటంలేదు.

    ఆమె భుజంమీద మెత్తని చేయి  పడిన సంగతి  తెలిసినా  ఆమె తలత్రిప్పి  చూడలేదు. రాధమ్మే ఆమె ముఖం  పట్టుకుని  బలవంతంగా త్రిప్పుకుంటూ. "ఆఁ వూఁ.... ఏ...." అంటూ  నోటితో ఏవో శబ్దాలు చేసింది.

    భారతి అర్ధమైనట్లుగా  ఆమెవైపు  చూసి, "బాధ లేదు" అని గొణిగింది.

    'లోపలకు పోదాం రా' అన్నట్లు  సంజ్ఞలు చేస్తూ, ఆమె చేయి పట్టుకుని నడిపించబోయింది రాధమ్మ.
    భారతి మృదువుగా  విడిపించుకుని, "నా కిక్కడే  బాగుంది పిన్నీ. కాసేపాగి  వస్తాలే" అన్నది.

    'ఆకలి కావటంలేదూ?" అన్నట్లు చూసి, 'భోజనం చేద్దువు గాని రా' అని నోటిదగ్గర చెయ్యి  పెట్టుకుని  సంజ్ఞలు  చేస్తూ  చూపించింది రాధమ్మ.

    "కొంచెం ఆగి  తింటాలే, పిన్నీ. నువ్వు కానియి" అంది భారతి.

    రాధమ్మ ఆమెవంక   దిగులుగా చూసి, నెమ్మదిగా లోపలకు  వెళ్ళిపోయింది.

    భారతి పిచ్చిఎక్కినదానిలా   చాలాసేపు  అలానే  నిలబడి ఉంది. 'విడాకులు ఇచ్చి నాతో తెగతెంపులు చేసుకుందామని  చూస్తున్నారా? మీ దారికి  నేనిప్పుడు  ఏమి అడ్డం వచ్చాను? విడాకులు పొందినంత మాత్రం చేత  నేను దూరమయినాననే  తలపోస్తారా? వివాహబంధానికి మీరిచ్చే విలువ ఇంతేనా?'

    ఈ ఆలోచనలు  ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


                                  *    *    *


    ఆ తరువాత చాలా  సంఘటనలు స్వప్నంలో  దృశ్యాల మాదిరి చకచకా గడిచిపోయాయి.

    భారతి అన్నింటికీ  తెరిగించిన  దానిలా  అయిపోయింది. ఆమెకు కోర్టు నుంచి పిలుపు  వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ  ఆఖరిసారి  ఎక్కడ కలిసివున్నారో  అక్కడి  కచేరీలోనే విచారణ జరగాలి. అవసరమైనప్పుడల్లా  ఆమె నూజివీడు పోయివస్తూంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra