Home » Suguri santhadevi » Jeevana Sangeetam


    మెల్లని అడుగులు వేస్తూ వచ్చింది రూప, పసుపు పచ్చని దుస్తుల్లో.
    విస్మయంగా చూశాడు కళ్యాణ్. నుదుట కల్యాణ తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణి, జడ నిండా పువ్వులు! 'మళ్ళీ పిచ్చి తిరగబెట్టలేదు కదా!' కలవరపడ్డాడు, రూప వేషం చూసి, మాటల్లో కొంచెంవిపరీతం గోచరించినా అన్నిటిలో మామూలుగానే ఉంది ఆమె ప్రవర్తన, కొన్నాళ్ళుగా.
    రూప కల్యాణ్ కు సమీపంగా మరో రాయిమీద కూర్చుంది, సముద్రపు కెరటాలను తన్మయత్వంతో చూస్తూ.
    "రూపా!" మెల్లని స్వరాన పిలిచాడు కళ్యాణ్.
    గాలికి రేగుతూ ముఖంపై నర్తించడానికి ఉత్సాహ పడుతూన్న ముంగురులను సున్నితంగా వెనక్కు నెట్టుతూ, "ఊఁ" అంది మృదువుగా.
    "పెళ్ళికూతురు కావాలని కోరికగా ఉందా, రూపా?" మధుర మందహాసం చేస్తూ అడిగాడు.
    "రూప మీ ముందు పెళ్ళికూతురయ్యే ఉంది."
    "నిజంగా పెళ్ళికూతురివి కాలేదుగా? వట్టి వేషం...."
    "వట్టి వేషం ఒకటీ, అసలు వేషం ఒకటీ ఉంటుందా? నేనిప్పుడు పెళ్ళికూతురినే, కాదనడానికి ఏమున్నది?"
    "ఏం లేదు, ఏం లేదు." ఈసారి అడగడంలో పద్ధతి మార్చాడు. "పెళ్ళి చేసుకోవాలని కోరిక కలిగిందన్నమాట!"
    "కలిగింది." నిర్వికారంగా అంది. "స్త్రీ ఒంటరితనం ఓపలేదు, డాక్టర్! అధికుడనిపించినవాడికి అర్పితం కావాలని తహతహ ఉంటుంది, ఆమెలో."
    "ఇంతటి అపూర్వ సౌందర్యార్పణను అందుకొంటున్న ఆ భాగ్యశాలి ఎవరో?"
    "ఎంతటి కళంకచరితలనైనా స్వీకరించి తన వేణువుపై మోహనరాగంగా మార్చి పాడగల కలువకన్నుల కరుణామూర్తి, ప్రణయోపాసకుడు, మాధవప్రభువు నా వరుడు. ఆయన సన్నిధికోసం తపిస్తున్న నా హృదయం ఇక వియోగం సహించలేదు. ఆయనను చేరనిది నిలవలేను."
    "ఆయన పిలుపు లేనిదే ఎలా వెళ్ళగలవు రూపా?"
    "వెళ్ళగలను, మృత్యుసఖి కే లందుకొని."
    "రూపా!" అదిరిపడ్డాడు. "ఆత్మహత్య చేసుకొంటావా, రూపా? ఎంతటి దుర్భరవేదన పొందాలి, ప్రాణం పోవడానికి ముందు?" ఆమెలో భీతి పుట్టించబోయాడు.
    "సహజమరణం ప్రాప్తించినా మరణయాతన ఉండనే ఉంటుంది. ఆ భయమేమీ లేదు నాకు."
    "చావన్నది ఎంత భయంకరమైనది! సౌందర్యాన్ని ప్రేమించేవారు ఎవరూ మృత్యువును ప్రేమించరు."
    "నేను ప్రేమిస్తున్న మృత్యువు, కోరి కౌగిలించుకో బోతున్న మృత్యువు; అందరిని బలవంతాన కౌగలించే మృత్యువు కాదు. నన్ను నా స్వామిదరికి దయతో చేర్చే నెచ్చెలి!" రూప కన్నులు వింత కాంతులీనుతుండగా మధురస్వరాన చెప్పుకుపోసాగింది. "నందనవనంలో నల్లనివాడు సుతారంగా వేణువు పెదవి కావించి సుమధుర రాగాలు ఒలికించుతున్న వేళ, పశుపక్ష్యాది ప్రాణులన్నీ ఆ గానస్రవంతిలో చైతన్యం కోల్పోతున్న వేళ, తెల్లని మేనిఛాయతో, ధవళవస్త్రాలలో మునికన్య వేషధారిణి నయి ఆ ప్రభునిమ్రోల అంజలి ఘటించి కరుణప్రేమలు చిందించుతున్న ఆ స్వామి నీలికన్నులలోకి విస్పారిత నేత్రాలతో చూస్తూ వంశీ రాగసుధకు కరిగి కరిగి ఆయన వంశీరాగాలలో నే నొక రాగంగా మారిపోతాను."
    రూపలో భక్తిభావం అంకురించడం గుర్తించాడు కాని, అది ఈవిధంగా పరిణమిస్తుందని ఊహించలేదు కళ్యాణ్. అతడి ఆశలపై రూప మాటలు గొడ్డలివేటుల్లా తగులుతున్నాయి. కల్లోలితమై పోతున్నది హృదయం.
    "భక్తితత్వంలోనూ సౌందర్యభావం ఉండాలి. అట్టి భక్తినే భగవంతుడు స్వీకరిస్తాడు..."
    ఎటో చూస్తున్నాడు కళ్యాణ్. 'ఇవి పిచ్చి మాటలా? నిజంగానే రూపమనస్సు అలా భగవంతుని కేసి పరుగులు పెడుతున్నదా? "అవి పిచ్చిలో మాట్లాడుతున్న మాటలే!" అని ఎవరైనా వచ్చి చెబితే బాగుండేది! కాని రూపధోరణి అలా అనుకోడానికి వీల్లేకుండా ఉంది."
    కాస్సేపటివరకు మౌనంగా కూర్చొన్న రూప ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లని స్వరాన అంది: "నాకు తెలుసు; నా మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నా యని. కాని, ఈ బాధ భరించక తప్పదు. ఈ కలుషిత జీవితాన్ని మానవమాత్రులెవరూ భరించలేరు. భగవంతుడే అందుకు సమర్దుడు."
    "రూపా..." కరుణకంపిత స్వరాన ఏదో చెప్పబోయాడు.
    "మీరు చెప్పవలిసిన మాటలేమీ లేవు. నాకు అన్నీ తెలుసు, మీ ఆరాధనను నేను గ్రహించకపోలేదు; దాన్ని నీడలా వెన్నంటిన ఆ కాంక్షనూ గుర్తించక పోలేదు. నాలో ఏదైనా ఔన్నత్యం ఉన్నదంటే, మీ ఆరాధన అందుకోవడంలోనేగాని మీకు అనుభవవస్తువుగా మారిపోవడంలో లేదు. ఒకసారి కిషన్ కు చేసిన అపచారాన్ని నేను మరిచిపోలేదు. ఆ అనుభవంతో మిమ్మల్ని మలినపరచలేను. ఉత్తమ కళాకారులుగా, సౌందర్యారాధకులుగా మీ జీవితం సాగిపోవాలని నా ఆకాంక్ష, ఆరాధనలో ఉండే సౌందర్యానంద మాధుర్యాలు అనుభవించడంతో మాయమౌతాయి.
    "ఈనాడు నాది దైవార్పితం కాగల మనస్సు అయినదంటే అందుకు మీ సేవాసహృదయతలే కారణం. ఆ ఉన్మాదస్థితిలో నా మనస్సు దేవుని వైపు ఆకరి తమయ్యేదో, దయ్యాలచుట్టూ తిరిగేదో, నా మనస్సే ఓ దయ్యమై పోయేదో చెప్పలేను. ఆ దుర్గతి తప్పించిన మీకు నేను మనఃపూర్వకంగా కృతజ్ఞురాలిని." నెమ్మదిగా లేచింది రూప.
    కల్యాణి మనస్థితి అగాధమైపోయింది. 'కడాకు రూప నన్నీగతికి తెచ్చిందేమిటి? రూపతో నా సాహచర్య పర్యవసానం ఇంత దుఃఖంగా రూపొందిన దేమిటి? ఆరాధనా సౌందర్యాల గొడవ తప్పితే ప్రేమించినది పొందలేనప్పుడు మనస్సు పడే ఆవేదన అర్ధం చేసుకోదు ఎందుచేత?'    
    ఏదో అడగాలని హఠాత్తుగా తల ఎత్తిన కళ్యాణ్ ఒక్క వెర్రికేక వేశాడు. "రూపా!"
    కళ్యాణ్ వేగంగా సమీపించేలోగా నీటిలో నడుం దాకా దిగిన రూపను విసురుగా వచ్చిన కెరటం అడ్డంగా పడగొట్టి కసిగా లోనికి ముంచివేసింది.
    "రూపా!" అంటూ సముద్రంలోకి ఉరికిన కళ్యాణ్ ను స్పృహ కోల్పోతూన్న తరుణంలో కడలి కెరటం ఒడ్డున పడవేసింది. అతడి కళ్ళజోడు కడలిలో దాగిపోయింది. కళ్ళలో నీళ్ళు నిండుకొని అంబుధీ, అంబరమూ కలిసి అలికివేసినట్లు చిత్తు చిత్తుగా కనపడింది.
    "రూపా! రూపా! రూపా!"
    దిక్కులు ప్రతిధ్వనించే కళ్యాణ్ పిలుపుల కడలి ఘోషలో కలిసిపోయాయి!

        

                                  -:సమాప్తం:-

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra