Home » Yandamuri veerendranath » రాధ-కుంతి


    అమ్మ నీ పెళ్ళి విషయమై చాలా తొందరపడుతూంది. ఈ వేసవిలో ఎలాగయినా నీ పెళ్లి చేసెయ్యాలని చాలా కోర్కెగా వుంది. నువ్వు నా మాట కాదనవని తెలుసు.
    నీకు తెలియకుండా వుండకపోవచ్చు. రంగారావ్ గారని మన దూరపు బంధువు ఒకాయన ఆ వూళ్ళోనే వుంటున్నారు. ఆయన మొన్న ఈ ఊరొచ్చారు. అమ్మాయి ఫోటో కూడా చూపించారు. అమ్మకి బాగా నచ్చింది. ఒక్కతే కూతురు. కాబట్టి నాకూ చేసుకోవాలనే వుంది.... ఆ అమ్మాయిని నీకు. నువ్వు చూడటం ఒక్కటే తరువాయి- నువ్వు కూడా సరేనంటే వేసవిలో చేసేస్తాం.
    సోమవారం సాయంత్రం అయిదింటికి మంచిది అని మన శాస్త్రులుగారు చెప్పారు. మళ్ళీ మంచి ముహూర్తం ఇంకో నెల వరకూ లేదట. అందుకని సరిగ్గా అయిదింటికి బయలుదేరి వెళ్ళు. అడ్రసు క్రింద ఇస్తున్నాను. నీకు అమ్మాయి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. ఏ విషయమూ తిరుగుటపాలో వ్రాయి. అసలు నేనే వద్దామని అని అనుకొన్నాను కానీ, అమ్మ ఆరోగ్యం దృష్ట్యా ఆగి పోవలసి వచ్చింది.
    నీ రూమ్ మేటు అప్పారావు బాగున్నాడని తలుస్తాను. మొన్న సెలవులకి ఈ ఊరొచ్చినప్పుడు వెంటనే పంపిస్తానని పాతిక తీసుకున్నాడు. ఇచ్చేటట్టయితే నువ్వు తీసుకో.
    ఉంటాను.
                                                                                  -పరంధామయ్య"
    ఉత్తరం పూర్తిగా చదివేసరికి కుమార్ మొహం తెల్లగా పాలిపోయింది. ఉత్తరం మడుస్తూ, "ఎలారా?" అన్నాడు.
    "ఏముందీ? అనూరాధ ఛాప్టర్ మూసేసి, ఈ అమ్మాయిని పెళ్ళాడెయ్యి" అన్నాడు అప్పారావు.
    "తెలివి తక్కువగా మాట్లాడకు, అనవసరంగా ఆ అమ్మాయిని ఊరించి...." కొంచెం సీరియస్ గా అన్నాడు కుమార్.
    "అయితే, వెంటనే మీ నాన్నకి ఉత్తరం వ్రాయి.... ఇలా అనూరాధ అనే అమ్మాయిని ప్రేమించానూ, ఆ అమ్మాయిని తప్ప...."
    "నీ మొహం- ఒకరితో ఒకరు ఇంకా మాట్లాడుకోలేదు. అప్పుడే పెళ్ళేమిటి?"
    "పోనీ, ఒక పని చెయ్యి. పెళ్లి చూపులకి మామూలుగా వెళ్ళి అమ్మాయి నచ్చలేదని వ్రాసెయ్యి. ఇంకో మూడు నెల్లు గడిచాక నెమ్మదిగా అనూరాధ విషయం చెప్పచ్చు."
    "కానీ, ఈ రోజు సాయంత్రం బీచ్ కి రమ్మని అనూరాధకి చెప్పి, ఇప్పుడు వెళ్ళకపోతే మొదటిరోజే ఆ అమ్మాయికి నా మీద అభిప్రాయం పోదూ?"
    "అలా అయితే బీచ్ కే వెళ్ళు. "పెళ్ళి చూపులకి వెళ్ళాను. అమ్మాయి నచ్చలేదు" అని వ్రాద్దువుగాని!"
    "తరువాత మళ్ళీ నాన్నకి జరిగిందంతా తెలిస్తే బాధ పడతారు. ఇంత చిన్న విషయానికి అబద్దాలెందుకూ" అన్నాడు కుమార్.
    "ఇటు తిరుగు" సీరియస్ గా అన్నాడు అప్పారావు.
    "ఎందుకు?"
    "ఇటే తూర్పు, దణ్ణం పెట్టటానికి".
    "నా పరిస్థితి చూస్తుంటే నీకు హేళనగా ఉందట్రా?" జాలిగా అడిగాడు కుమార్.
    అప్పారావు మాట్లాడలేదు.
    కుమార్ ప్రాధేయపడుతూ, "చెప్పు గురూ, కావాలంటే అయిదు రూపాయిలిప్పిస్తాను. ఏదైనా చెప్పు" అడిగాడు.
    అప్పారావు గబుక్కున లేచొచ్చి, "ఏమిటీ? హలోనా?" అన్నాడు.
    "ఒక్కహలో యేమిటి? హల్లో- తీసుకో. ఇదుగో, పది రూపాయలు, చెప్పు ఏం చెయ్యాలో?"
    అప్పారావు సీరియస్ గా క్షణం ఆలోచించాడు. తళుక్కున ఏదో మెరిసినట్లయింది. "ఐడియా" అటూ హుషారుగా లేచి "ఒరేయ్! నువ్వు బీచ్ కి పో" అన్నాడు.
    కుమార్ అర్ధంకానట్టు - "మరి పెళ్ళి చూపులకి?" అని అడిగాడు.
    "మనం..... అంటే శ్రీ శ్రీ శ్రీ అప్పారావుగారు వెళతారు."  
    "నువ్వా" అంటూ ఆశ్చర్యపోయాడు కుమార్.
    "ఏమిటి నీ ఉద్దేశ్యం, పెళ్ళిచూపులకి వెళ్ళే అర్హత నాకు లేదంటావా?"
    "అది కాదు- నువ్వెళ్ళితే....."
    "ఏం, ఆయన కనుమానం వస్తుందా? లేకపోతే నీ డిగ్నిటీకేమైనా భంగమా?" అని, "నీకిష్టంలేకపోతే చెప్పు- హాయిగా పడుకుంటాను" అంటూ వెళ్ళి పక్క ఎక్కబోయాడు.
    కుమార్ కంగారుపడి "సరేలే ఇంతకన్నా మంచి ఆలోచన నాకేమీ తట్టడం లేదు. అలాగే చేద్దాం" అన్నాడు.
    అప్పారావు హుషారుగా లేచి అద్దంముందు కూర్చున్నాడు.
    "స్నో"
    కుమార్ అందించాడు.
    "పౌడర్. ఇదికాదు. నీ పెట్లోది యార్డిల్లీ"
    అతను విసుక్కుంటూ పెట్టెతీసి యిచ్చాడు. అది రాసుకుని అద్దంలో చూస్తూ- "అగ్గిపుల్ల" అన్నాడు.
    కుమార్ పుల్ల వెలిగించి, ఆర్పేసి ఇచ్చాడు. దానితో మీసాలు దిద్దుకుని, "రేజరు" అన్నాడు అప్పారావు. అతడికి ఒళ్ళు మండింది. "ఏమిట్రా ఇది? ఇప్పుడు గెడ్డం గీస్తావా?"
    ఏదో పెద్ద త్యాగం చేస్తున్నవాడిలా "సరేలే టైమయిపోతోంది...." అంటూ లేచి హాంగరుకున్న షర్టుతీసి వేసుకోవటం మొదలు పెట్టాడు. కుమార్ కంగారుగా "అదేమిట్రా" అని అడిగాడు.
    "చూడు గురూ, పెళ్ళిచూపులనగానే ఏదో స్పెషల్ గా తయారవటం నా కిష్టం లేదు. అసలీ చూపుల వెనుక వున్న అర్ధం ఏమిటి? చూసుకొనే రెండు నిమిషాల్లో ఒకరి నొకరు పూర్తిగా అర్ధం చేసుకోవాలనేగా? అటువంటప్పుడు మనం ప్రతిరోజూ ఎలా వుంటామో అలాగే వుండకపోతే యిక ఈ చూపుల సార్ధకత ఏమిటి?...." అంటూ చిన్న లెక్చరిచ్చి "అందువల్ల మనం ఈ డ్రెస్సే వేస్తాం...." అంటూ గురూ షర్టు తీసి వేసుకొన్నాడు.
    కుమార్ ఇంకా తేరుకోకముందే పాంటూ, చెప్పులూ వేసుకుని, "పద" అంటూ తొందర పెట్టాడు.
    "పోనీ గెడ్డం గీసుకోరా, రేజరిస్తాను...." అంటూ బ్రతిమాలాడు కుమార్.
    "ఏమిట్రా ఇది! నన్ను చూస్తుంటే నీకేమైనా ఆటగా వుందా....? అప్పారావు మాటంటే మాటే గెడ్డం గీయను గాక గీయను. ఇక పద...." అంటూ బయటికి లాక్కొచ్చాడు.

    ఇద్దరూ రూమ్ మెట్లు దిగారు.
    "నువ్విటు బీచ్ కి, నేనటు రంగారావుగారింటికి. లెట్ అజ్ బోత్ బెస్ట్ ఆఫ్ లక్!" అంటూ సైకిలెక్కబోయాడు అతడు.
    "ఒరేయ్! ఆ డొక్కు సైకిలేసుకుని వెళతావుట్రా....?" అంటూ దాదాపు ఏడుపుమొహం పెట్టాడు కుమార్.
    సైకిల్ దిగకుండానే కాలు భూమిమీద ఆన్చి తాపీగా అన్నాడు అతడు.
    "చూడు బ్రదర్! ఈ మెయిన్ రోడ్ మీద రెండు మహత్తరమైన విషయాలు బోధించవలసి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మొదటిది పెళ్ళిచూపుల వేదాంతసారం. కనీసం ఇలాంటి సైకిలన్నా లేనివాళ్ళు, ఆ ఒక్కరోజుకీ టాక్సీ ఎక్కి ఠీవి ఒలకబోసినవాళ్ళు నాకు తెలిసినంతలో చాలామంది వున్నారు. మనకున్న తాహతు సైకిలు! అందువలన దీనిమీదే వెళతాం. పెళ్ళిచూపులకి టాక్సీలోవెళ్ళి పెళ్ళిరోజు మాత్రం టై కట్టుకొని, ఆ మరుసటిరోజు నుంచి జులాయి వెధవలా తిరగము! మనదెప్పుడూ ఒకటే స్టేటస్. ఇది నేను చెప్పదలచుకున్న మొదటి విషయం. ఇక రెండోది.... నువ్వు నా సైకిల్ మీద పాస్ చేసిన కామెంటు! బెల్లు, బ్రేకూ, లైట్లు లేని ఈ సైకిలు 'డొక్కు' అనే అర్హతకి సరిపోతే సరిపోవచ్చుగాక, కానీ యిది చేతిలో వుండటం వల్లే ఎన్నో ప్రాణాపాయ సమయాల్లో ఈ అప్పారావు అప్పుల వాళ్ళ బాధల్నుంచి తప్పించుకున్నాడని మరిచిపోకు వస్తా. మళ్ళీ ఏడింటికి కలుసుకుని అనుభవాలు చెప్పుకొందాం" అని రివ్వున వెళ్ళిపోయాడు.
    (చదువరీ! కుమార్, అనూరాధల బీచ్ ల సల్లాపముల గురించి తరువాత చదువుకొనెదము. ముందు అప్పారావుని పరిశీలిద్దాం)
    తీరిగ్గా, మధ్యలో సైకిలాపి, బాబాజర్దా పాన్ ఒకటి వేసుకొని మరీ ఆంజనేయుడు లంకని వెతుక్కుంటూ వెళ్ళినట్టు అప్పారావు రంగారావుగారి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో పెద్ద ఆటంకములేమీ రాలేదు. వచ్చిన రెండూ అంత ప్రమాదములైనవి కావు. ఎప్పుడూ జరిగేవే- ఒకటి: సైకిలు ఛెయిను ఊడుట, రెండు : ఒక గేదె అడ్డముగా వచ్చుటచేత బాలెన్సు తప్పి కిందపడుట. 
    ఛెయిన్ పెట్టిన చేత్తో తెలియకుండా మొహం తుడుచుకోవటం చేత ఏర్పడిన మరకలూ, పడుటచేత పాంటుకి అంటిన దుమ్ము... ఈ రెండు అలంకారములతోనూ శోభితుడై అప్పారావు దిగ్విజయంగా స్థావరం చేరుకున్నాడు.
    ప్రహరీ గోడకి సైకిలాన్చి, ముందున్న బోర్డు చదివాడు..... "రంగారావు(రిటైర్డు) కెప్టెన్."
    'యురేకా' అనుకొని కుడికాలు ముందుపెట్టి లోపలికి ప్రవేశించి-
    అరుగుమీద జైంటుసైజు ఆకారాన్ని చూసి, క్రిందే ఆగి, "నమస్కారమండీ" అన్నాడు.
    "నువ్వు అడగబోయేదీ నాకు తెలుసు.... కానీ, వెరీసారీ. మాకిప్పట్లో కారు డ్రయివర్ అవసరం లేదు" అంది గంభీరంగా ఆ ఆకారం.
    అప్పారావు కంగారుపడి, "ఏమిటి?" అన్నాడు.
    ఏదో హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి, ఆ ఆకారం "మీపేరు....?" అంది అనుమానంగా.
    ఒక కాలు మెట్టుమీదా, ఇంకో కాలు క్రిందా వుంచి స్టయిల్ గా కాలర్ పట్టుకొని, "రావ్ - అప్పారావ్" అన్నాడు బాండ్- జేమ్స్ బాండ్ లా.
    ఈసారి రంగారావుగారు కంగారుపడి- "ఏమిటి?" అన్నారు.

    చేసిన తప్పేమిటో తెలిసి నాలుక కరుచుకొని, "అదేనండీ కుమార్...." అని క్షణం ఆగి, "మా నాన్నగారూ...." అంటూ ఏదో చెప్పబోయాడు.
    "రండి- రండి మీ కోసమే చూస్తున్నాను- యు ఆర్ ఫైవ్ మినిట్స్ లేట్ అయామ్ సారీ ఫర్...."
    "ఫర్వాలేదులెండి. ఇటువంటివి నాకు అలవాటే" అంటూ ఆయన వెనకే లోపలికి ప్రవేశించబోయి గుమ్మం దగ్గరే క్షణం ఆగాడు.
    కుక్కలంటే అప్పారావ్ కి భయంలేదు. పైగా కట్టేసి వున్నకుక్కల్ని చూస్తే మంచి హుషారు వస్తుంది! తనలాటి అనుమానాస్పదమైన వ్యక్తిని చూసికూడా ఏమీ మొరగకుండా వేదాంతిలా పడుకొని వున్న ఆ శునకరాజాన్ని చూస్తే పాపం జాలేసింది. దానికి కాస్త హుషారు కలిగిద్దామని నాలుక బయట పెట్టి వెక్కిరించాడు. టాటా చెప్పి లోపలికి అడుగు పెట్టాడు.
    అక్కడే అప్పారావు పప్పులో కాలేశాడు. కుక్కల జ్ఞాపకశక్తి గురించీ, తెలివితేటల గురించీ అతనికి సరిగ్గా తెలియదు. వస్తున్న అపరిచితుడు తన యజమానితోపాటూ ఉన్నాడనీ, పైగా తను ప్రస్తుతం కట్టివేయబడి ఉన్నదనీ, అందువల్ల అనవసరంగా మొరగటం ఎందుకని టైగర్ అనుకొంది. దీన్ని అపార్ధం చేసుకొని అప్పారావు హేళన చేసేసరికి టైగర్ సహించలేక పోయింది. "సర్లే నువ్వెక్కడికి పోతావ్. అరిచే కుక్కలు కరవ్వనే విషయాన్ని రివర్స్ లో నీకు చూపిస్తాను...." అనుకొని మళ్లీ పడుకొంది.
    "కూర్చోండి" అంటూ కుర్చీ చూపించి, తనూ కూర్చుంటూ "ఏం చదువుతున్నారు మీరు?" అన్నాడు రంగారావు.
    "బి.ఏ. ఆరో సంవత్సరం!"
    కుర్చీలో ముందుకువంగి "ఏమిటీ?" అన్నాడు అర్ధం కానట్టు.
    "సారీ.... ఎమ్.ఎస్ సి, ఫైనల్."
    "మరి బి.ఎ. అంటారేమిటి?"
    అప్పారావు నవ్వాడు. "అదాండీ- నా రూమ్ మేట్ అప్పారావని ఒకడున్నాడులెండి. బి.ఏ. ఆరోసారి పరీక్షకి వెళుతున్నాడు. ఎవడన్నా అడిగితే అలాగే చెబుతాడు వెధవ. అదే సరదాగా నాకూ అలవాటైపోయింది."
    "ఐ.సీ!" అంటూ పైపు వెలిగించాడు కెప్టెన్ రంగారావు.
    "వ్వాట్ డు యూసీ?" అందామానుకొని బాగుండదని మానేశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra