"స్కూల్ వుంది. మనమే స్కూల్ కి సెలవిచ్చేస్తున్నాం."
అందర్లోనూ ఉత్సాహం కనిపించింది. ఒక్క చినబుజ్జిలో తప్ప.
"స్కూల్ కి వెళ్ళకుండా ఏంచేద్దాం?" ప్రభావతి అడిగింది. ఆ పిల్ల ఏడో క్లాస్.
"ఇంట్లో తెలిస్తే" ప్రమీల భయం భయంగా అడిగింది.
"అందరం ఎగ్గొడుతున్నాం. మనమెవరం ఇళ్ళల్లో చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ?"
ప్రమీల సమాధానపడింది.
"నేను మాత్రం పోతా" చిన్నబుజ్జీ ఏడుపు ముఖంపెట్టి చెప్పాడు.
"మమ్మల్నికాదని నువ్వు వెళ్ళావనుకో రేపటినుంచి నువ్వు మాతో రావడానికి వీల్లేదు. స్కూల్ కి ఒంటరిగా పోవాలి. ఒంటరిగా రావాలి." ప్రకాష్ బెదిరింపుకి పాపం చినబుజ్జి కుదేలైపోయాడు. రెండు కిలోమీటర్లు ఒంటరిగా ఎలా రాగలడు? ఎలా పోగలడు. అందుకే మీ ఇష్టం అన్నట్లు తల ఊపాడు.
"మనం ఈ రోజు గుజ్జులకూడు వండుకుందాం" నేను ప్రకటించాను.
అందరిలోకి ఉత్సాహం పెల్లుబికింది.
"మరి గుజ్జులకూడు వండడానికి బియ్యం, పెసరపప్పు, బెల్లం ఎక్కడ?" ప్రమీల అడిగింది.
గుజ్జులకూడు వండుకునేందుకు అవన్నీ కావాలిగా. ఎలా?
"మీ దగ్గర ఎంతవుంటే అంత ఇవ్వండి" అని నేను అనడం తరువాయి అందరూ తమ చేతినున్న పది పైసలు, అయిదు పైసలు, పావలా ఇచ్చారు.
"మరి నువ్వు ఏమీ ఇవ్వలేదేంరా" ప్రకాష్ బెదిరిస్తూ చినబుజ్జీ దగ్గిరకెళ్ళాడు.
"నా దగ్గర లేవు" అంటూ వాడు నిక్కర్ జేబు పట్టుకున్నాడు. దాంతో ప్రకాష్ కి డౌట్ వచ్చింది.
"ఏదీ నిన్ను చూడనీ" అని నిక్కర్ జేబులో చేయిపెట్టాడు ప్రకాష్.
చిన్నబుజ్జి ముఖం ఏడుపురంగులోకి మారింది.
ప్రకాష్ చేయి బయటికి లాగి అందరికి చూపించాడు. చేతిలో రూపాయిబిళ్ళ.
చినబుజ్జి ఏడుపు లంకించుకున్నాడు. ప్రకాష్ చేతిలోని రూపాయిబిళ్ళను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ "అది నాదికాదు. సాయంకాలం సాంబ్రాణి వత్తుల కట్టతెమ్మని మా అమ్మ ఇచ్చింది" అన్నాడు.
"ఫరవాలేదులేరా. స్కూల్ కి వెడుతూ వుంటే పడిపోయిందని చెప్పు" ప్రమీల చక్కటి ఐడియా ఇచ్చినా వాడు వినలేదు.
ప్రకాష్ తిరిగి పాతబెదిరింపునే రిపీట్ చేశాడు. దెబ్బకి దిగిరాక తప్పలేదు చినబుజ్జికి.
"దార్లో పోగొట్టుకున్నానని మీరంతా వచ్చి మా అమ్మ దగ్గర సాక్ష్యం చెప్పాలి" అన్నాడు వాడు రాజీకి వచ్చేసి.
అంతా ఓకే అయిపోవడంతో అందరం పక్కనే వున్న మామిడితోటకి వెళ్ళాం.
ప్రకాష్, రామాంజనేయులు అనే కుర్రాళ్ళు బియ్యం, బెల్లం తేవడానికి వెంకటగిరికి వెళ్ళారు.
ఆడపిల్లలం మేం అక్కడక్కడున్న పుల్లలు ఏరి పొయ్యి ఏర్పాట్లో పడ్డాం.
మరో గంటకు ప్రకాష్ వాళ్ళు వచ్చారు.
మరి గుజ్జులకూడు వండటానికి, బియ్యం సక్కబెట్టడానికి, బెల్లం దంచడానికి పాత్రలు కావాలిగా.
"మన టిఫిన్ క్యారియర్లలోని అన్నం పారబోసేస్తాం" ప్రమీల ఇచ్చిన ఐడియాకు ఆ పిల్లని అభినందించి అందరం అలా చేశాం.
గుజ్జులకూడు వండటం పూర్తయ్యేటప్పటికి రెండుగంటలైంది. అందరికీ తలా పిడికెడు వచ్చింది దాన్ని తినే సరిపెట్టుకున్నాం.
తిరిగి మూడుగంటలకి ఇంటికి బయల్దేరాం.
అంతలో వాన మధ్యలో అనుకోకుండా పిడుగు పడ్డట్టు పరీక్షలు వచ్చిపడ్డాయి.
టెన్త్ క్లాస్ పరీక్షలకు ప్రెపేర్ కావడం ప్రారంభించాను. కానీ ఒక్కముక్క అర్దంకాలేదు. ఏ రోజైనా క్లాసులో పాఠాలు వినివుంటే కదా అర్ధం కావడానికి.
ఏదో బుద్ధిపుట్టినప్పుడు చదివి మిగిలిన సమయంలో ఏదో కాలక్షేపం చేసేదాన్ని.
పరీక్షలు అయిపోయాయి.
అంతవరకు అలవికాని భారాన్ని మోసి, అప్పుడే కింద పెట్టేసినంత రిలీఫ్ గా ఫీలయ్యాను. స్వేచ్ఛగా ఎగరడానికి రెక్కలు మొలిచినట్లు భావించాను.


