Home » Kolipaka ramamani » Yeti Odduna Neetipoolu


    రామారావుగారు కాసేపు భానుమతినే చూస్తూ నిలుచున్నారు.
    "మీ వయస్సెంత?"
    "ఇరవై ఏడు వస్తాయి."        
    "నా వయస్సెంతో తెలుసా? నలభై రెండు. అంటే మనిద్దరికీ పదిహేను ఏళ్ళు తేడా. మీరే చెప్పండి మిమ్మల్ని పెళ్ళి ఎలా చేసుకోమంటారో?"
    "ఎందుకు చేసుకోకూడదూ? మా పెద్దమ్మకీ, పెదనాన్నకి ఇరవై ఏళ్ళు తేడాట." భానుమతి తల వంచుకుని పైటచెంగు వేలికి చుట్టుకుంటూ చెప్పింది.
    "ముందర మీరు కూర్చోండి. ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారో వివరంగా చెప్పండి" అన్నారు రామారావుగారు, భానుమతికి కుర్చీ చూపిస్తూ.
    భానుమతి కూర్చుని వరసగా తమ కుటంబం సంగతి, తండ్రి చనిపోవడం, ఆర్ధికమయిన ఇబ్బందులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళ సమస్యలు వరసగా వివరించి చెప్పింది రామారావుగారితో. టేబిల్ మీద రెండు చేతులు ఆనించుకుని కుతూహలంగా విన్నారు ఆయన. మెల్లగా ఉన్నా భానుమతి కంఠస్వరం మధురంగా ఉంది. నిశ్శబ్ద ప్రకృతిలో దూరదూరాలనించి వినిపించే తీయని వేణుగానం వింటున్న అనుభూతి కలిగింది ఆయనకి.
    అంతా విని నవ్వుతూ, "అయితే మీ చెల్లెళ్ళ పెళ్ళి కోసం మీ జీవితాన్ని త్యాగం చేసుకుంటారా? నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా?" అన్నారు రామారావుగారు.
    "మిమ్మల్ని భర్తగా పొందడంకంటే గొప్ప అదృష్టం వేరొకటి ఉండదు" అంది భానుమతి.
    "అలా అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారేమో?"
    "మాస్టారూ! ఇది నేను ఇవాళ హఠాత్తుగా చేసుకున్న నిర్ణయం కాదు. మీరు మీ కథ శంకరానికి చెబుతూంటే నేను విన్నాను. ఆ రోజే నేను నా భర్తగా  ఎవరిని పొందాలో నిశ్చయించుకున్నాను. ఇన్ని రోజులూ మౌనంగా ఉండడానికి కారణం స్త్రీ సహజమైన నా సిగ్గు. మీరు నన్ను అపార్ధం చేసుకుంటారేమోనని భయం. మీరు నన్ను భార్యగా స్వీకరించడానికి అంగీకరిస్తే, నేను చాలా ధన్యురాలిని."
    రామారావుగారు భానుమతినిచూస్తూ కూర్చున్నారు. అమాయికంగా కనిపించే ఆ ముఖం వెనక ఎంత నిగూఢత్వం! ఎంత ధైర్యం! ఎంత మనస్సు నిబ్బరం!
    భానుమతి ఒక చెయ్యి టేబిల్ మీద వేసి, రెండో చేతితో వీపు మీద నించి కప్పుకున్న పైట చెంగు పట్టుకుంది. తల వంచుకుని కదలకుండా బొమ్మలా కూర్చుంది.
    రామారావుగారు భానుమతి చెయ్యిమీద తన చెయ్యి ఉంచి, "నిన్ను నేను తప్పక పెళ్ళి చేసుకుంటాను భానుమతీ! మోడుగా ఉన్న నా జీవితంలో ఒకనాడు అమృతం కురుస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు" అన్నారు. ఆయన చేతిలోని భానుమతి చెయ్యి వణికింది. ఆమె కళ్ళనించి జలజలా కన్నీరు ప్రవహించింది. రామారావుగారు భానుమతిపక్కకి వచ్చి ఒక చెయ్యి ఆమె భుజం మీద వేసి, రెండో చేత్తో ఆప్యాయంగా కన్నీరు తుడిచారు.
    గంట తరవాత భానుమతి నిశ్శబ్దంగా తమ ఇంటి భాగంలోకి వచ్చి, తలుపు తీసుకుని గదిలో ప్రవేశించడం ఎవ్వరికీ తెలియదు.

                                     23

    "పద్మకు,
    ప్రేమతో చారు ఉత్తరం.
    నీకు ఉత్తరం రాసి ఎన్నో రోజు లయింది కదూ! ఇంత హఠాత్తుగా పెద్ద ఉత్తరం ఎందుకు రాస్తున్నా ననుకున్నావు? మంచి సంతోషవార్త ఉంది. భానక్కకి నిన్న పెళ్ళి అయింది. బావగారి పేరు రామారావుగారు. ఈ ఊళ్లోనే హైస్కూలులో లెక్కల టీచరు.
    పెళ్ళి ఎలా అయింది? సంబంధం ఎవరు తెచ్చారు? పెళ్ళి ఎక్కడ జరిగింది? అంటూ ప్రశ్నలు అడుగుతావు. నాకు తెలుసు. అన్నిటికీ ముందే నేను జవాబు రాసేస్తాను.
    పదిరోజుల కిందట ఒక రోజు సాయంత్రం అమ్మ నాతో మెల్లిగా చెప్పింది, 'భానుమతి మాస్టారిని పెళ్ళి చేసుకుంటుందిట. వాళ్ళిద్దరికీ ఇష్టమేనట' అని. నాకు ఆశ్చర్యం వేసింది. వింత అనిపించింది. మాస్టారు మా ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. ఆయన వయస్సు నలభై దాటి ఉంటుంది.
    భానక్కని నేను ఒంటరిగా డాబామీదికి లాక్కువెళ్ళి అడిగాను: 'నువ్వు ఎవరిని చేసుకుంటున్నావో తెలుసా? ఎందుకు చేసుకుంటున్నావు?'
    'నేను మాస్టారిని చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నావు అని అడగటంలో అర్ధం లేదు చారూ!ప్రతి స్త్రీకి ఒక పురుషుడు కావాలి. అందుకే పెళ్ళి అవసరం.' భానక్క జవాబు విని నేను కోపం తెచ్చుకున్నాను.
    'స్త్రీకి పురుషుడు అవసరమని నాకు చెప్పనవసరం లేదు. దానికోసమని వయస్సు, వావి లేకుండా పెళ్ళి చేసుకోవడమేనా? ఆయన నీకంటే ఎంతో పెద్దవారు!'
    'ఎంత పెద్దవారని నీ ఊహ, చారూ? నాకంటే పదిహేను ఏళ్ళుమాత్రం పెద్ద మన పెద్దమ్మకి, పెదనాన్నకి ఇరవై ఏళ్ళు తేడా అని అమ్మ చెప్పింది. గుర్తులేదూ?' నవ్వుతూ అంది భానక్క.
    'అయినా ఎవరికోసం ఈ త్యాగం, భానక్కా? నువ్వు తొందరపడుతున్నావేమో?' అన్నాను నేను.
    'ఇందులో నా త్యాగమేమీ లేదు. మాస్టారంటే ముందరనించీ గౌరవం నాకు. ఆయనని భర్తగా పొందగలగటం నా అదృష్టం.'
    భానక్క కళ్ళల్లో వెలుగు చూసిన నేను ఇంక ఏమీ మాట్లాడలేకపోయాను.
    'కాని, భానక్కా, ఏమీ అనుకోను అంటే ఒక్క మాట అడుగుతాను, చెప్పు. మాష్టారే నిన్ను అడిగారా పెళ్ళి చేసుకోమని?' అన్నాను చివరికి.
    'లేదు, చారూ! నేనే మాస్టారిని అడిగాను. మన జీవితానికి ఒకటి కావాలని అనుకున్నప్పుడు, అందులో అధర్మం, తప్పు లేదనే నిశ్చయం మనకి ఉన్నప్పుడు, దాన్ని సాధించటంకోసం ప్రయత్నించటంలో, ధైర్యం చెయ్యటంలో తప్పు లేదనిపిస్తుంది నాకు. ఎవరో పైవాళ్ళు వచ్చి మన జీవితాన్ని సరిదిద్దుతారని, మన సమస్యలని తీరుస్తారని చేతులు ముడుచుకుని కూర్చునే కంటే, మనమే మన సమస్యలని పరిష్కరించుకోవటం వివేకం కదూ?'    
    భానక్క ధైర్యానికి వివేకానికి మనసులోనే జోహారు లర్పించాను, పద్మా భానక్కకి ఉన్న నిబ్బరం, ధైర్యం చదువుకున్న మనలో ఎవరికేనా ఉన్నాయంటావా?
    మాస్టారికి వయస్సు ఎక్కువతప్ప, తక్కిన విషయాలలో ఆయన మణిపూసలాంటివారు. ఆయన మా బావగారవడం మా అదృష్టం.    
    నిన్న ఉదయం భానక్క పెళ్ళి అన్నవరం కొండమీద సత్యనారాయణమూర్తి సన్నిధిలో జరిగింది. పెళ్ళి చాలా నిరాడంబరంగా జరిగింది. ఇక్కడినించి నేను, మాలతి, భగవతి వెళ్ళాం. విశాఖనించి రేవతక్క, బావ వచ్చారు. విజయవాడ నించి మాస్టారి చెల్లెలు, భర్త వచ్చారు.
    ఇవాళ అందరం తిరిగి వచ్చాం. భానక్క, బావగారు నమస్కారం చెయ్యగానే మామ్మకి ఎంత ఆనందమైంది అనుకున్నావు! భానక్కని చేర్చుకుని ఆనందబాష్పాలు రాల్చింది ఆవిడ. ఇంక ఆశీర్వచనాలు చెప్పనవసరం లేదు. సంతోషం సగం బలం అంటారు. అది ఎంతో నిజమని మామ్మని చూస్తే తెలుస్తుంది. ఇవాళ ఆవిడ మంచం మీదనించి లేచి కూర్చోగలుగుతూంది. అమ్మకూడా చాలా సంతోషంగా ఉంది. శంకరం వెళ్ళిపోయిన దగ్గిర నించి ఆవిడకి మాస్టారంటే ఎంతో అభిమానం. ఈ రోజు ఆయనే అల్లుడుగా లభ్యమైనందుకు ఆవిడికి చాలా ఆనందంగా ఉంది. ఒక్కటే లోపం మాకు. నాన్న లేరు; శంకరం మా ఆనందంలో పాల్గొనలేదు.
    పద్మా, నాన్న చనిపోయిన ఇన్నాళ్ళకి మా ఇంట్లో మనుష్యులు నవ్వటం జ్ఞాపకం చేసుకున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. మనసులో ఒక సంతోషం కలిగినా, ఒక అందమైన వస్తువుని చూసినా, ఆ అనుభవం ఇష్టమైన వాళ్ళతో పంచుకోవాలనే భావన కలుగుతుంది. అందుకే నీకు, శ్రీదేవికి ఈ రోజే ఉత్తరాలు రాస్తున్నాను.
    ఇప్పటికే చాటభారతమంతైన ఈ ఉత్తరం ఇంక ఆపుతున్నాను. నువ్వు నీ సంగతులన్నీ వివరంగా రాయి. పరీక్షలై పోగానే నువ్వు తప్పక కాకినాడ రా. నిన్ను చూసి రెండేళ్ళు అయిపోతూంది. పదిరోజుల కిందట శ్రీదేవి వచ్చింది. దానికి రెండు నెలలలో బాబు పుట్టబోతున్నాడు. మరి నువ్వెప్పుడిస్తావు పాపని?
    ఉంటా.
                                                                        -చారు."
    పద్మ ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టి, లైటార్పి పడుకుంది. ఆ ఉత్తరం చదవటం పద్మకి నాలుగోసారి. భానుమతికి ఉన్న తెగువ తనకి లే దెందుకని? అని ఆలోచిస్తూ పడుకుంది.

                                  *    *    *

 

             

    తొమ్మిది గంటలకే పుస్తకాలు పుచ్చుకుని కాలేజీకి బయలుదేరిన పద్మ, పావు తక్కువ పది అయినా బస్సు స్టాండులోనే నిల్చోడం చూసి ఆశ్చర్యపోయాడు మాధవరావు. ఇంటిదగ్గిరనించి పద్మ బయలుదేరిన అరగంటకి బయలుదేరతాడు మాధవరావు. అప్పటికి పద్మ బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. కాని ఈ రోజు పుస్తకాలు పట్టుకుని ఇంకా అక్కడే నిలుచుని ఉంది. మాధవరావు పద్మ దగ్గిరికి వెళ్ళి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఒక పక్కన నిలుచున్నాడు.
    పద్మ మెల్లిగా భర్త పక్కకి వచ్చి నిలబడి, "మీతో మాట్లాడాలి. అలా ఒకసారి వస్తారా?" అంది.
    మాధవరావు తెల్లబోయాడు. రెండడుగులు నడిచి బస్సుస్టాండు నించి దూరంగా వచ్చి అడిగాడు:
    "నాతో ఏం మాట్లాడాలి?"
    "నేను చాలా మాట్లాడాలి" అంది పద్మ.
    "అందరూ చూస్తే ఏమనుకుంటారు? నా ఆఫీసుకి వెళ్ళిపోతూందికూడా."
    "అందరూ ఏమనుకుంటారు. తన భార్యతో భర్త మాట్లాడడంలో తప్పేముంది? నే నివాళ కాలేజీకి వెళ్ళడం లేదు. మీరూ ఆఫీసుకి సెలవు పెట్టండి."    
    "సెలవు పెట్టి ఏం చేద్దాం?"
    "ఎక్కడికేనా వెళ్ళి మాట్లాడుకుందాం."
    "నాకీ రోజు ఆఫీసుకి సెలవుపెట్టడానికి వీల్లేదు. పని ఉంది."
    "రేపు పెడతారా? నేను బస్సుస్టాండ్ లోనే కలుసు కుంటాను."పద్మ భర్తని గుచ్చి చూస్తూ అడిగింది. మాధవరావు ఏమనుకున్నాడో "సరే" అని బస్సుస్టాండు వేపు వెళ్ళిపోయాడు.    
    పద్మ తన బస్సు రాగానే ఎక్కి కాలేజీకి వెళ్ళింది. బస్సులో కూర్చున్నంతసేపు మనిషి కంపిస్తూనే ఉంది. మనసులో మాత్రం 'ఊహించుకున్నంత కష్టం కాదు' అనుకుంది.
    మరునాడు పద్మ తిరిగి బస్సుస్టాండులో భర్త కోసం ఎదురుచూస్తూ నిలుచుంది. మాధవరావు మామూలుగా ఆఫీసువేళకేవచ్చాడు. వెంటనే పద్మ అతనిపక్కకి వెళ్ళి నిలుచుని, "ఎక్కడికి వెళదాం?" అంది.
    "ఏదైనా హోటల్ కి వెళదాం" అన్నాడు మాధవరావు.    
    "హోటల్ కి వద్దు. మీతో ఏకాంతంగా చాలాసేపు మాట్లాడాలి" అంది పద్మ.
    మాధవరావు కాసేపు ఆలోచించి, "సరే, పీపుల్స్ పార్కుకి వెళదాం" అన్నాడు.
    ఇద్దరు బస్సు ఎక్కి, సెంట్రల్ స్టేషన్ దగ్గిర దిగి, మూర్ మార్కెట్ దాకా నడిచారు. పద్మకి మద్రాసులో ఇల్లూ, కాలేజీ తప్ప వేరే ప్రదేశం తెలియదు. మూర్ మార్కెట్ లో రకరకాలైన వస్తువుల్ని, వింతైన షాపుల్ని చూడగానే కళ్ళు అటే నిలిచిపోయాయి. అవన్ని చూడాలని ఉన్నా, భర్త ముభావంగా ఉండడం చూసి, తను తల వంచుకుని అతన్ని అనుసరించింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra