Home » Kommuri venugopala rao » పెంకుటిల్లు


    రాత్రి పదిగంటలకు తిరుగుముఖం పట్టారు. నున్నగా, అద్దంలా వున్న రోడ్డు మీదనుంచి కారు పాములా మెత్తగా జారిపోతోంది. రామారావు గారన్నారు. "డాన్సు నేర్చుకోవే అని కొన్నాళ్ళు చెప్పాను మా అమ్మాయికి. కాని వినలేదాయె"

    శకుంతల దీనికి సమాధానం చెబుతూ "పొండి నాన్నా, మీరలాగే అంటారు. మనలాంటివాళ్ళు ఈ డాన్సులు నేర్చుకోవడంవల్ల ప్రయోజనం ఏమిటి?" అంది.

    "ప్రయోజనం - ఒక్క ప్రయోజనం కోసమే మనం అన్ని పనులూ చేస్తామా అమ్మాయి? సరదాకి- అంటే హాబీకి యెందుకని నేర్చుకోకూడదు?"

    "సరదాకి నేర్చుకునేవి డాన్సులు కాదండి నాన్నా. హాబీగా కాలక్షేపానికి నేర్చుకుని, ఆనందించడానికి తగిన కళకాదు ఇది ఇంక సంగీతం అనండి ఒప్పుకుంటాను."

    "నాకు తెలుసు, నువ్వీమాట అంటావని, అసలు డాన్సులంటే నీకెప్పుడూ గిట్టదు. డాన్సు చేసేవాళ్ళంటే నీకసహ్యం అనికూడా నాకు తెలుసు. పోనీ నువ్వు సంగీతం అయినా యెందుకు నేర్చుకోలేదో కాస్త చెబుదూ?"

    శకుంతల సిగ్గుతో మంచిదని నేనన్నానుగాని నాకందులో అభిలాష ఉందని నేనన్నానా?" అంది.

    రామారావుగారి పెదలామీద చిరుహాసం తాండవమాడింది. మాధుర్యంతో కూడిన గొంతుకతో ఆయన అన్నాడు, "నేను చెబుతాను ప్రకాశరావుగారూ? మా అమ్మాయి సంగీతం నేర్చుకున్న వైనమంతా చెబుతాను" అని ఒక్కసారి ఓరగా కూతురివైపు చూసి "చిన్నప్పుడు ఈమెగారికి సంగీతం నేర్పించాలని నేను చాలా కుతూహలం పడేవాడిని. వయోలిన్ ఒకటి కొని మాష్టారుగారిని యేర్పాటు చేశాను. సరిగ్గా రోజూ మాష్టారు వచ్చే సరికి ఇంట్లో ఉండేదికాదు. ఆయనకు జీతం డబ్బులు దండగ అయ్యేవి. ఆయన  అదృష్టవశాత్తూ యెప్పుడైనా ఇంట్లోవున్నా, ఆ పూట తలకాయ నొప్పో, కడుపునొప్పో వచ్చేది. ఆ మాష్టారుగారు కూడా మాకు తగ్గట్లే దొరికారు. ఎప్పుడైనా కర్మవశాత్తు పాఠం జరిగిన రోజున ఆయన ఫార్సు చూడాలి. తన ధోరణిలో తను చెప్పుకుపోతూ తన ప్రావీణ్యానికి తనే మురిసి, ముగ్ధుడైపోయి, ఒకోసారి మూర్ఛకూడా పోయేవాడు. మా అభిమానాన్ని సంపాదించుకోవటానికి అనుకుంటాను- అప్పుడప్పుడూ మా అమ్మాయి తలనొప్పి అనేసరికి 'నీకోసం మందు తీసుకొచ్చానమ్మాయి' అని జేబులోంచి ఏవేవో పొట్లాలు బయటకు తీసేవాడు. అదేం మందో మా శకుంతల మారాం చేయకుండా గుటగుటా మింగేది" అని ఆయన విరగబడి నవ్వాడు. శకుంతల నవ్వాపుకోలేక పమిటచెంగు నోటికి అడ్డంగా పెట్టుకొనీ తల ప్రక్కకి త్రిప్పుకొంది. ప్రకాశరావు చిన్నగా నవ్వి వూరుకున్నాడు.

    "మా అమ్మాయిలో ఒక సుగుణం ఉండేది. ఎంత ఇష్టం లేకపోయినా ఆ బాధ ఏదో తనే పడేది కాని, నోరువిప్పి నాతో ఇష్టంలేదని ఎప్పుడూ చెప్పలేదు. కాని ఇలాగే బలవంతంగా నేర్చుకున్నా కొంతకాకపోతే కొంతైనా వయోలిన్ వాయించటం వచ్చేదేమో కాని ఒకసారి  ఏం  జరిగిందటే...." అని 'చెప్పనా' అన్నట్లు కూతురివైపు నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూశాడు. శకుంతల సిగ్గుతో ముసిముసిగా నవ్వి కళ్ళను క్రిందకు వాల్చింది.

    ఆయన చెప్పాడు. "ఒకసారి ఏం జరింగిందంటే- వయోలిన్ అనే ఆ మరణాయుధం అమాంతంగా మా ఇంట్లోంచి మాయం అయిపోయింది. ఎలా మాయమయిందో ఎక్కడకు పోయిందో కొన్ని రోజులదాకా ఎవరికీ తెలీదు. దాంతో విసుగుపుట్టి ఆ మాష్టారుగారినికూడా మానిపించేశాను. కాని తరువాత మహెంజదారో, హరప్పాలలో శిధిలాలు దొరికినట్లు ఆ ఫిడేలు తాలూకు కొయ్యముక్కలు మా ఇంట్లో అక్కడక్కడా దొరకసాగాయి. కాని మా అమ్మాయిమటుకు ఈ రహస్యం ఇంతవరకూ నాతో చెప్పలేదు."

    రెండు మూడు క్షణాలు మౌనంగా గడిచాయి. బహుశా గడిచిపోయిన జీవితం తాలూకు అనుభవాలు తండ్రీ కూతుళ్ళిద్దరూ నెమరు వేసుకుంటున్నారేమో. ప్రకాశరావుకు కూడా అదే అలవాటు. ఇటువంటి విశేషాలని విన్నప్పుడు ఒకానొకకనాడు ఈ విషయాలు ఏ విధంగా జరిగివుంటాయి. అని వాటికో స్వరూపం  మనసులో కల్పించుకొని తను ప్రేక్షకుడుగా నిలిచి ఆనందిస్తూ వుంటాడు. ఇప్పుడూ అదేపని చేస్తున్నాడు.

    టాక్సీవచ్చి ఇంటిముందు ఆగింది. దిగి టాక్సీవాడికి ఒక అర్థరూపాయి టిప్ ఇచ్చాక రామారావుగారు లోపలకు వెళ్ళి, ఈజీచైరులో కూర్చుని బూట్లు విప్పుతూ "ఆకలి చచ్చిపోయింది. అయినా మా అమ్మాయి ఊరుకోదు. భోజనం చేయకపోతే. వంటమనిషి వెళ్ళిపోయినట్లుంది. త్వరగా తెముల్చుకొని వడ్డించు అమ్మా" అన్నాడు.

    ప్రకాశరావు కాళ్ళు కడుక్కుందామని పంపుదగ్గరకు వెళ్ళాడు. ఎదురుగా శకుంతల నడిచివస్తోంది. అతను వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు మొదట. కాని వెళ్ళలేకపోయాడు. దారికి అడ్డంగా వున్న ఈ మనిషిని చూసి ఆమెకూడా సంశయాత్మురాలై ఇఅతని ముఖంవంక చూస్తూ నిలబడిపోయింది.

    ప్రకాశరావు తెగించి, చనువు తీసుకొంటూ "నా మీద కోపం పోయిందో, ఇంకా వుందో చెప్పాలి" అన్నాడు.

    ఆమె అతని ప్రశ్నకు మాత్రం చెప్పకుండా "అడ్డు లేండి" అంది.

    ప్రకాశరావు కొంచెం దెబ్బతిని, భయపడుతూనే "ఉహుఁ మీరు బదులు చెప్పేదాకా నేనిక్కడనుంచి కదలనే కదలను" అన్నాడు.

    శకుంతల అతని ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి, ఒకక్షణం సేపు సందేహాస్పదంగా నిలబడిపోయింది. తరువాత ఏదో ఆలోచించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

    ప్రకాశరావు వ్యదగా "నాదే పొరపాటు, మీకు దారివుంది. ముందుకే వెళ్ళవచ్చు" అంటూ అడ్డుతొలగి పంపుదగ్గరికి వెళ్ళిపోయాడు. శకుంతల లోపలకి వెళ్ళింది. ప్రకాశరావు ప్రశ్నకు జవాబు చెప్పకుండా పోవటం ఆమెకూ సుఖంగాలేదు. జవాబు చెప్పకూడదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడకుండా వుండలేదు. అతనలా ఆకస్మికం అడిగేసరికి ఈ సమయంలో ఆమెకేమనడానికీ తోచలేదు. ఆమెపోయి చేయడని ఆమెకు తెలుసు. ఏదయినా ఫలహారం ఏర్పాటు చేద్దామనుకొంది.

    ఇంతలో రామారావుగారు బట్టలు మార్చుకొని లోపలికివస్తూ "అన్నట్లు మరచిపోయాను. ఆయన  విషయం ఏమిటి?" అన్నారు.

    "వారినే అడగండి నాన్నా" అని కూతురు అంది.

    ఆయన  గబగబా అతని దగ్గరకువెళ్ళి బయటనుంచే "ఇన్నాళ్ళబట్టి ఈ ఇంటిలో వుంటున్నా ఇక్కడ ఎప్పుడూ భోజనం చేయలేదు. ఇవ్వాళ మాతో కూచోవాలి" అని అన్నారు.

    ప్రకాశరావు ఇవతలకి వచ్చి, తత్తరపాటుతో "నాకు ఆకలిగా లేదండీ" అన్నాడు.

    "ఒకరికి మట్టుకు ఆకలిగా ఉందా? మనం రోజూ నిద్రవస్తేనే పడుకొంటామా? రాత్రి అయేసరికి పడుకోవాలి కాబట్టి పడుకొంటాం. తర్వాత నిద్ర అదే పడుతుంది. అలాగే వేళయింది కాబట్టి భోజనం చేయాలి. దానంతట అదే....." అంటూ నవ్వారు. ప్రకాశరావు చెప్పింది చాలా తేలికగా తీసుకొంటూ.

    "పది దాటితే నాకు భోజనం చేసే అలవాటే లేదండి" అని తప్పించుకోబోయాడు.

    కాని రామారావుగారు అంత తేలికగా విడిచిపెట్టే మనిషి యెప్పటికీ కాదు ఎందుకని అనిపించిందో ఆయనకి, ఏమయినా సరే ఇవాళ తనతో కూర్చుంటేగాని వీలులేదని పట్టుపట్టి కూర్చున్నారు.

    ప్రకాశరావు యేమనటానికి తోచని ఇబ్బందిలో పడిపోయి, ఆలోచిస్తూ ఊరుకొనేసరికి ఇందాకటినుంచి తలుపుచాటునుంచి వింటూన్న శకుంతల అతని కా అవస్థను తప్పించింది.

    "వారు మనతో తినరులే నాన్నా? వారూ మనమూ ఒకటికాదు."

    తన నోటిగుండా చెప్పించకుండా, తనకావస్థను తప్పించినందుకు సంతోషిస్తూ మనసులో ఆ అమ్మాయికి ధన్యవాదాలు అర్పించినా ఒక విధమైన సిగ్గు, అభిమానం అతన్ని పీడిస్తూనే వున్నాయి. అంతేకాదు. ఆ పెద్దమనిషి ఏమనుకొంటాడోనన్న భయంకూడా అతన్ని కదిలించి వేసింది.

    కాని అతననుకొన్నట్లు రామారావుగారు కోపం తెచ్చుకోలేదు సరిగదా - పెద్దగా నవ్వుతూ "ఓష్, ఇదా? నేను ఒప్పుకోను. మద్రాసులాంటి సిటీలో ఉండి లా చదువుతూ ఇంకా యి చిన్న చిన్న విషయాలలో గింజుకొంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ అంతకులం లేకపోయినా మేమూ శాకాహారులమే. మా అమ్మాయి చాలా కాలం క్రిందట పట్టుపట్టి శాకాహరుడ్ని చేసింది. ఇంకా మీకేమిటండీ? అయినా ఇటువంటివి పట్టించుకొకూడదసలు. ఈ ఇరవయ్యో శతాబ్దంలో పుట్టి ఉన్న వూరు విడిచి, ఎక్కడో వుంటూ ఇవన్నీ పారిస్తూ మడికట్టుకు కూర్చుంటే ఎలా గడుస్తుంది? ఈ విషయం తెలిశాక నేనొప్పుకొనేది లేదు. మీరు ఏమైనా అనుకోండి. నేను చెప్పినట్లు చేయాల్సిందే" అని ఆయన భల్లూకపు పట్టు మాటలతో పట్టి కూర్చున్నారు.

    ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న నిగ్రహం, నిష్ఠ ఒక్క చిన్న సంఘటనతో అడలిపోవటానికి జీవితంలో ఎన్నో అవకాశాలు వుంటాయి. సంవత్సరాల తరబడి ఉంచుకొన్న ద్వేషాలు, క్రోధాలు, అసూయలు ఒక్కమాటతో, ఒక్కనవ్వుతో ఒక్క సంఘటనతో ఆగిపోవచ్చు.

    ఇంతకీ ప్రకాశరావు మొహమాటానికి లోబడిన మనిషి. ఇదివరకు ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలివిగా తప్పించుకొన్నాడు రామారావుగారి దాకా పోనివ్వలేదు.

    కాని చివరికి ఆయనే ముఖాముఖీగా ఎదురు నిలిచేసరికి అతను తల్లడిల్ల సాగాడు. గంభీరమైన ఆయన విగ్రహం ముందు అతను నోరు మెదపలేకపోయాడు. ఆయన వాగ్ధోరణికి దాసోహం చేశాడు. అతని నిగ్రహం పటాపంచలయింది. నిష్ట ఛిన్నా భిన్నమైంది. ఆ రాత్రి పదిన్నర వేళప్పుడు ఆ పట్టణంలో ఒక నాగరికుల కుటుంబంలో రామారావుగారికి ఎదురు చెప్పలేని ప్రకాశరావు హృదయం భోరున విలపిస్తూన్నా, మనస్సు కల్లోల పరుస్తున్నా లొంగిపోయి ఆత్మార్పణ గావించుకొన్నాడు.

    భోజనాల సమయంలో రామారావుగారన్నారు; "మీరంతా యువకులోయ్! యువకులు. మా కాలమంతా ఇంచుమించు అయినట్టే. మీరే ఈ పాత పద్ధతులకు లొంగిపోయి భేషజంగా ప్రవరిస్తే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది? మన సాంఘిక సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయి? కాలం మారిపోతుందని అంతా అనుకుంటున్నారు. కాని అదేమీ నిజంకాదు. ప్రతి యుగంలోనూ ప్రతితరంలోనూ కూడా ఈ కొత్తపాతల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే వుంది. పురాతనపు ఆచారలన్నీ క్షయం పొందుతున్నాయనీ, అనాచారాలూ, అత్యాచారాలూ ప్రబలిపోతున్నాయనీ ఆచార పరాయణులయిన పెద్దలంతా గగ్గోలు పెడుతున్నారు. అదంతా అబద్ధం. మంచివాడి కడుపున దుష్టుడి కడుపున సుబుద్ధి జన్మిస్తున్నట్లే ఇప్పుడు ఉద్భవిస్తున్న యువకుల్లో కూడా రెండు రకాలకు చెందినవారున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ కులమత భేదాలూ, అవన్నీ ఎప్పటికీ సమసిపోవేమోనని నాకనిపిస్తుంది. అనాదినుంచీ వుంటున్నాయి. ఇప్పుడూ వున్నాయి. ఇహ ముందు మాత్రం వుండవని నమ్మకం ఏమిటి?" అని తన చిన్నతనపు అనుభవం ఒకటి చెప్పారు.

    "నామట్టుకు నేను చెబుతున్నాను. ఈ పెచ్చులూ, చాదస్తాలూ, నాకెప్పుడూ వుండేవికావు. నేను కలకత్తా యూనివర్సిటీలో చదువుతున్నానప్పుడు. మా మెస్ లో వంటవాడు బెంగాలీవాడు. సదాచార పరాయణుడు. మాలో అన్నిరకాల కుర్రవాళ్ళం. వాడికీ మాకూ రోజూ తగాదే. అందరికీ ఒకే పంక్తిన భోజనం పెట్టమనేవాడిని. మాబ్యాచ్ కి నేనే రింగు లీడర్ని. మా వేషాలన్నీ చూసివాడు ఏడ్చుకునే వాడు. రహీమ్ అని నాకో తురక స్నేహితుడు వుండేవాడు. ఇప్పుడు లేడు  పాపం, చచ్చిపోయి పదేళ్ళయింది. ఒకసారి ఏం జరిగిందనుకున్నారు? మేమంతా పిక్నిక్ కి వెళ్ళాం. తురకలకీ, మనకూ అప్పుడు ముమ్మరంగా తగాదాలు జరుగుతున్నాయి. రహీమ్, నేనూ కలిసి వంట వండాం. పడోసి అన్నం. అంతా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మళ్ళీ మేమంటే అందరికీ భయమే. అలా లీడ్ చేశాం నోరెత్తకుండా శుభ్రంగా తిన్నారు. మరేమిటండీ? కాస్మాపాలిటన్. అదే వుండాలి కొంతకాలం. ఈ వూళ్ళో కాస్మోపాలిటన్ క్లబ్ కి సెక్రటరీని" అని ముగించారు.

    శకుంతలా, ప్రకాశరావు ఈ ఇద్దరిలో యెవరూ మాట్లాడలేదు. వింటూ - - - మౌనంగా కూర్చున్నారు.

    మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రకాశరావు ఆలోచిస్తూ కూర్చుని వున్నాడు. రాత్రి అతను చాలాసేపు నిద్రపోలేదు. దాంతో ముఖమంతా ఉబ్బరించి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా వున్నాయి.

    నిన్న చేసిన పనికే అతను రాత్రి ఎంతసేపో బాధపడ్డాడు. తనకోసం తను పడే బాధకన్నా ఇంట్లో వాళ్ళకోసం తను పడే బాధ ఎక్కువగా వుంది. నాయనమ్మ దగ్గర్నుంచీ ఛాయదాకా అంతా ఒకటే పద్ధతి. తను ఆ ఇంట్లో చెడబుట్టాడా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత గోల అవుతుంది?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra