Home » Yandamuri veerendranath » ఆనందోబ్రహ్మ

   

    ఆ రాత్రంతా ఆయన మౌనంగా, గంభీరంగా వుండటం సోమయాజి గమనించాడు. ఒక చిన్న విషయంపట్ల ఆయనంత తీవ్రంగా మారటం ఆ కుర్రవాడికి ఆశ్చర్యం అనిపించింది. అతడికో ముఖ్య విషయం - ఆయనకి చెప్పవలసింది - మనసులో దొలుస్తూ వుంది. రాత్రి పక్కలో పడుకున్నాక మాత్రం ఇక ఆపుకోలేకపోయాడు. నెమ్మదిగా "నా పుస్తకంలో తాతయ్య తోక అని వ్రాసిందెవరో కనుక్కున్నాను తాతయ్యా" అన్నాడు.
   
    ఆయన మొహంలో విస్మయం కనపడింది. "ఎవర్రా?" అని అడిగాడు.
   
    "చిన్నత్తయ్య"
   
    "ఎలా కనుక్కున్నావు?"
   
    "పొరపాటున వదిలేసినట్టూ మధ్యగదిలో పుస్తకాన్ని వదిలేశాను. ఎవరూ పట్టించుకోలేదు. కానీ చిన్నత్తయ్యకి మాత్రం తిరిగి అది అక్కడెందుకు వచ్చిందా అని అనుమానం వచ్చింది. తీసి, తను వ్రాసింది మరోసారి చూసుకుంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టూ పెట్టేసింది. అంతా నేను చాటునుంచి చూస్తేనే వున్నాను."
   
    ఆయన అభినందిస్తున్నట్టూ భుజం తట్టి నవ్వాడు. సాయంత్రం నుంచి వున్న గాంభీర్యం పోయింది. దాంతో సోమయాజికి ధైర్యం వచ్చింది.
   
    "తాతయ్యా" అన్నాడు. ఆయన మనవడివైపు చూశాడు.
   
    "కృష్ణుడిని తిట్టావా?" మనసులో మెదులుతూన్న సందేహాన్ని బయటపెట్టాడు.
   
    "వాడిని తిట్టటానికి మనకేం హక్కు వుందిరా? హక్కుల ప్రసక్తి వస్తే పంతులుగారిని పోషించవలసిన బాధ్యత కూడా అతడికి లేదు. తన కష్ట ఫలితాన్ని తానే అనుభవించవచ్చు. కానీ..... కానీ" ఆయన ఆగి అన్నాడు-
   
    "మనిషికీ మనిషికీ మధ్య హక్కులూ బాధ్యతలూ - ఇవేనా వుండేవి! ఇంకేవీ లేవా? అతడు నన్ను పోషించాడు కాబట్టి నేను అతడిని పోషించాలి. ఇంతేనా.....మా తరంలో మేమెప్పుడూ ఇలా అనుకోలేదురా. అప్పటికి ఇంకా స్వతంత్రం రాలేదు. యుద్ధంవల్ల పెరిగిపోతున్న ధరలొకవైపు, 'నా' అనేవారు లేని నలుగురం అన్నదమ్ములం మరోవైపు. అందరం చిన్నవాళ్ళమే మా చిన్నాయినే మమ్మల్ని పోషించాడు. ఇప్పుడు గుళ్ళకి పాత్రాలూ, హామీలూ ఎలా లేవో ఆ కాలంలో అలా ఇళ్ళకి కూడా లేవు. అయినా మోసం చేయాలన్న ఆలోచనే ఎవరికీ కలిగేదికాదు. పెద్దయ్యాక ఆయన మా అగ్రహారం, పొలాలు మాకిచ్చాడు. ఇప్పుడు ఆయన మనవలెవరో, మా పిల్లలెవరో కూడా తెలియకుండా అందరం కలిసిపోలేదూ! ఏ న్యాయం, ఏ చట్టం, ఏ బాధ్యతా, ఏ హక్కు-ఏదిరా మనిషిని కలిపేది? కేవలం మానవత్వం..... అది..... అదేరా ముఖ్యం."
   
    కాలువగట్టు మీదనుంచి వస్తూన్న చల్లగాలికి కదిలే కొబ్బరాకు కూడా తన అల్లరి చేష్టలాపి ఆయన మాటలు విన్నది. సోమయాజి కనులు మూసుకుని నిద్ర కుపక్రమించాడు.
   
    ఎంతో సమయం గడిచి వుండదు. మగతనిద్ర పట్టి వుంటుందంతే. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. పక్కన తాతయ్య లేడు.
   
    సోమయాజి కళ్ళు తుడుచుకుంటూ గదిలోంచి బయటకు వచ్చాడు. మధ్యగదిలో పిల్లలు నిద్రపోతున్నారు. ఒకరిద్దరు పెద్దలుకూడా.
   
    సింహద్వారం తెరిచి వుంది. అతడు బయటికి వచ్చాడు. ఎత్తరుగుల మీదకు వాలిన చూరు.
   
    అరుగుమీద వున్న పెద్ద చేతుల కుర్చీలో ఆయన కూర్చొని వున్నాడు. ఆయన ప్రక్కన చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు కృష్ణుడు.
   
    సోమయాజి ఊహించని దృశ్యం అది.
   
    "ఇంతకీ ఇప్పుడు ప్రమాదమేమీ లేదు కదురా! అలాంటిదేమైనా వుంటే చెప్పు ఇప్పుడే వస్తాను" తాతయ్య కంఠంలో కంగారు ధ్వనించింది.
   
    "లేదు లేదు. వెంటనే మేము బయటకు తీయటంవల్ల బ్రతికింది బాబుగారూ. నన్ను క్షమించినట్లు చెప్పటానికి మేరు రేప్రొద్దున రండి! లేకపోతే రేప్రొద్దున మళ్ళీ దూకుతుంది."
   
    "అయితే ఇంతకీ నువ్వా ముసలి దంపతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటా నంటున్నది వాళ్ళ మీద ప్రేమతోనా? నీ భార్య నూతిలో దూకినందుకా?"
   
    "అది ఎప్పటినుంచో నన్ను సాధిస్తూనే వుంది బాబూ నేనే విననట్టూ ప్రవర్తిస్తూ వచ్చాను. ఈ రోజు మీ మాటల్తో దాని వాదన మరింత బలం పుంజుకుంది. మీ చివరి మాటలకి బాగా బెదిరిపోయింది కూడా! మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి అయినా మీ శాపాన్ని ఉపసంహరించుకోకపోతే సర్వనాశనం అయిపోతామంది."
   
    "శాపమా! అంతంత పెద్ద మాటలెందుకురా ఏదో నిన్ను మందలించటానికే అన్నానే తప్ప నాకా అధికారం ఏముంది?"
   
    "లేదు బాబూ! మీ మాటలు నాలో పరివర్తన తెచ్చాయన్నంత పెద్ద మాటలు ఉపయోగించను కానీ, నాలోనే ఏ మూలో మనసులో నా ప్రవర్తనపట్ల రవ్వంత ఏహ్యభావం కలుగుతూ వచ్చింది. అదిప్పుడు మీ మాటలతో పూర్తిగా ప్రక్షాళన మయింది."
   
    "వెళ్ళిరా! రేప్రొద్దుణ వచ్చి చూస్తాలే."
   
    "మంచిది బాబూ" అతడు వెళ్ళిపోయాడు.
   
    ఆయన కుర్చీలోంచి లేస్తూ వెనుక మసక చీకట్లో నిల్చుని వున్న మనవడిని చూసి క్షణం మాత్రం విస్మయం చెంది అంతలోనే సర్దుకుంటూ "ఇంత చలిగా వుంటే బయటకెందుకు వచ్చావురా పద పద" అంటూ తొందరచేశాడు.
   
    సోమయాజి వెంటనే కదల్లేదు. లోపలికి వెళ్ళాక కూడా ఒకే అనుమానం అతడి మనసుని తొలిచేస్తూ వచ్చింది. పడుకున్నాక అదే అడిగాడు. "నీ మాటలకి అంత శక్తి ఎలా వచ్చింది తాతయ్యా?" అని.
   
    ఆయన నవ్వాడు. "నా మాటల్లో శక్తేమీలేదురా. కృష్ణుడు ఈతరం మనిషి యుగసంధిలో వున్నాడు. ఇంకా పూర్తిగా స్వార్ధంవైపు వెళ్లిపో లేదు. అటూ ఇటూ వూగుతున్న త్రాసుని నా మాటలు తిరిగి యధాస్థానానికి తోసినయంతే-"
   
    సోమయాజికి ఆయన మాటలు సగం అర్ధమయినవి. సగం కాలేదు. వాటినే మననం చేసుకుంటూ కళ్ళు మూసుకోబోతుంటే ఆయన అన్నాడు.
   
    "అందరం ఒకటి అన్న మా తరం నుంచీ - 'నేనూ నా కుటుంబం ఒకటి' అన్న ఆలోచనవైపు వెళుతున్నాడ్రా మనిషి చాలా భయంకరమైన ఆలోచన యిది"
   
    "తనూ - తన కుటుంబం అన్న ఆలోచనలో తప్పేముంది తాతయ్యా?"
   
    "అక్కడితో ఆగదురా అది. కొంతకాలానికి 'నేనే నేనొక్కన్నే, అన్న ఆలోచనకి అది దారితీస్తుంది. కేవలం అవసరాలే ముఖ్యమవుతాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు ముసలివాళ్ళు కాగానే మూటకట్టి అనాధాశ్రమానికి తోలేస్తాడు. భవిష్యత్తులో జరిగేదదే."
   
                                 2
   
    ప్రత్యూషం, ఆ రోజు సంక్రాంతి.
   
    భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు పసుపు! మిరపపంట కుంకుమా!!
   
    గరిక పోచలమీద రాత్రి తాలూకు నీటి చుక్కలు మంచిముత్యాల్లా మెరుస్తున్నాయి. సంక్రాంతి అవటంవల్ల మామూలుకన్నా ఊరు తొందరగా మేల్కొంది. ఆడపిల్లలు పోటీపడి వేసిన ముగ్గులు వీధిలోకి వ్యాపించి వున్నాయి.
   
    అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకెవేసి డొంకదారి బట్టింది. గెల్చిన రాజులా ఆమని, సర్వాంగ భూషితయై రావటానికి తయారవుతూంది.
   
    గోవు పేడతో చేసిన గొబ్బిళ్ళమీద అందంగా పసుపుబొట్టు పెట్టి - పిండి, కూర కొనలూ, తంగేడు పూలూ సర్ది, మీదే రేగుపళ్ళు పోసి, పదారేళ్ళ పడుచు పిల్లలు పరికిణీ గలగలలు వెనుక వాద్య సంగీతాలుగా శబ్దం చేస్తూంటే లయబద్దంగా తిరుగుతూ పాడుతున్నారు.
   
    "సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే   
    తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే.
    చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే -"
   
    మనసులో అసలు పాట అదికాదట. ఎవరో కవి అన్నాడు - ముసి ముసి నవ్వుల్తో రవ్వంత కంఠం తగ్గించి లోలోపల పాడే పాట వేరే ఇంకొకటట.
   
    మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే...
    గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే.
   
    అదట అసలు కోరిక! పండక్కొచ్చిన కూతుళ్ళూ, అల్లుళ్ళూ, పిల్లా మేకా మొత్తం యింటిల్లిపాది కోసం తెల్లారే లేచి వంట మొదలు పెట్టిన అమ్మకీ, నిద్రలేచీ పక్కమీద నుంచి ఇంకా లేవని నాన్నకీ వినపడకుండా, తమలో తామే మోచేత్తో పొడుచుకుంటూ గుసగుస నవ్వులమధ్య పాడే అసలు పాట అదట.
   
    ఊరికి ఇట్నుంచి బుడబుక్కలవాడు డమరుకాన్నీ, అట్నుంచి జంగందేవర గంటనీ పట్టుకుని బయల్దేరారు. అన్నాళ్ళూ ఏమయ్యారో గానీ బాలసంతువాడు, పెద్దమాలవాడు కూడా దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్క చిక్కిన గంగిరెద్దుకి వీలైనంతలో అలంకరణ చేసి ఇంటింటిముందూ ఆపి నమస్కారం చేయిస్తున్నాడు. పక్కూళ్ళో జరిగే పొట్టేళ్ళ పందేనికి కుర్రకారు అప్పుడే బయల్దేరుతున్నారు. కోడిపందేలు సరేసరి.
   
    అప్పటికే ఆలస్యమయిపోయిందని ఆయన వడివడిగా నడుస్తున్నాడు. ఆయన కదుల్తూంటే వరణా తరంగిణీ దరవికస్వర నూత్న కమలకషాయ గంధము.....ప్రత్యూష పవనాంకురములు పైకొనువేళ - అన్న ప్రవరాఖ్యవర్ణన గుర్తొస్తుంది. అయితే ఆయన ప్రస్తుతం భాషాపరశేషభోగి! అందానికి వారసుడు మాత్రం వెనుక నడుస్తూన్న సోమయాజి. అతడు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి ఇంకా కుర్రవాడు! అలేఖ్య తనూవిలాసుడవటానికి మరి నాలుగయిదేళ్ళు పడుతుంది. అయినా అప్పుడే అమ్మాయిలు గొబ్బిళ్ళు సర్దే మిషమీద, ముందున్న ముసలాయన గమనించకుండా వెనుకనున్న ఆ కుర్రాడిని ఓరగా చూస్తున్నారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra