Home » Akkala saraswathi baburao » Jeevana Valayam


    "కూర్చో" అన్నాడు కృష్ణ. తర్వాత "బాగా ఎదిగావ్" అన్నాడు నవ్వుతూ.
    "మీరుమాత్రం?" అంది సీత అతడిని సూటిగా చూస్తూ, "మీరు అసలు వచ్చిన తర్వాత కనిపించనే లేదు." బెదురుగానే అంది.
    "పెద్దవాళ్ళమయిన తర్వాత ఎలా కుదురుతుంది, చెప్పు? ఎన్నో పనులు." నసిగాడు కృష్ణ.
    తనకంటే ఎక్కువైన పనులున్నాయా కృష్ణకు? భారంగా అడుగులు వేస్తూ ఇంటికి వచ్చింది. సీత ఆ మరునాడే తెలిసింది సీతావాళ్ళకు కృష్ణకు బయటి సంబంధాలు చూస్తున్నారని. మరి కృష్ణకు ఈ విషయం తెలుసా? తెలిసీ ఒప్పుకొన్నాడా? ఆఖరి ప్రయత్నంగా సీత తండ్రి వెళ్ళి కృష్ణ తండ్రిని అడిగాడు. ఫలితం - అవమానంతో ఆయన తిరిగి వచ్చాడు. కృష్ణ తండ్రితో తాను ఏ విధంగానూ సరితూగలేడని, బయటి నుండి ముఫ్ఫైవేల రూపాయలతో కృష్ణను వెదుక్కుంటూ వస్తున్న ఆ సంబంధాలు కాదని తాను ఆ పేద పిల్లను తన కోడలిగా తెచ్చుకోలేనని ఖచ్చితంగా చెప్పాడాయన. ఉన్న ఒక్క ఇల్లూ, కొద్ది పొలమూ అమ్మి సీతను కృష్ణకే ఇచ్చి చేద్దామన్నాడు సీత అన్న, చెల్లెలి ప్రేమ విషయం తెలుసు కాబట్టి. కాని సీత "అన్నయ్యా, ఉన్న ఈ కొద్ది ఆస్తీ అమ్మి నీవూ, నాన్నా ఎవరి పంచనో, ఏ చెట్టు క్రిందో ఉండి బాధపడుతూంటే ఈ ఐశ్వర్యంతోను, అంతస్తుతోను నేను సుఖంగా ఉండగలననే అనుకొంటున్నావా? నేను నీకు భారమైన రోజు నీ చేత్తో ఇంత విషం ఇచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను గాని..." అంది.
    "చెల్లీ!" ఆమెను హృదయానికి హత్తుకున్నాడు అన్న.
    సీత మనస్సు మనస్సులో లేదు. చిన్ననాటి నుండి ఎంతో స్నేహంగా పెరిగారు తానూ, కృష్ణా, అన్నయ్య, కృష్ణ, తను ముగ్గురూ కలిసి స్కూల్ ఫైనల్ వరకు తమ ఊర్లోనే చదువుకొన్నారు. బడికి జట్టుగా వెళ్ళడం, రావడమేకాక ఊర్లో ఏ తోట దగ్గిర చూసినా, చెరువు దగ్గిర చూసినా ముగ్గురూ కలిసే కనిపించే వారు, తనతోటి అమ్మాయిలు తనను మగరాయుడని వెక్కిరించినా చలించలేదు. కృష్ణ స్నేహం మానలేదు. కాలం గడిచి వారు పెద్దవారైన తర్వాత వారి స్నేహం ఏమీ తరగలేదు సరికదా మరింత పటిష్టమై సీతా, కృష్ణల మధ్య ప్రేమాంకురం ఉదయించి పెరిగి పెద్ద దయింది.
    "నీ కళ్ళలో నా నీడను చూసుకొంటూ, నీ కనుసన్నలలోనే నా జీవితాన్ని గడుపుతాను."
    "నీ కళ్ళలో కనిపించే ఆ మెరుపుకోసం నా సర్వస్వం వదులుకోగలను."
    "జన్మజన్మలకూ నువ్వు నాకే కావాలి, సీతా."
    ఇలా మాట్లాడిన కృష్ణేనా ఈ రోజు తనను కాదని మరొకరిని చేసుకొనేది? తలుచుకొంటున్న కొద్దీ సీతకు దుఃఖం ముంచుకొచ్చింది. అసలు తానెలా జీవించగలదు కృష్ణ లేకుండా? చాలాసేపు ఆలోచిస్తూ అలాగే కూర్చుంది. తర్వాత లేచి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొంది. కృష్ణ ఇచ్చిన ముత్యాల గాజులు వేసుకొని బయలుదేరింది.
    తోటలో అటూ ఇటూ పచార్లు చేస్తూ సిగరెట్టు త్రాగుతున్న కృష్ణకు దగ్గరగా వెళ్ళి, "నేను మీతో మాట్లాడాలని వచ్చాను" అంది గంభీరంగా తిరుగుతున్న వాడు ఆగి ఆమెను చూశాడు.
    "కొంచెం ఇటు కూర్చోండి." గడ్డి మీద కూర్చుంటూ అంది సీత. తర్వాత సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు.
    "కృష్ణా, చిన్నప్పటినుండి మనం ఎంతో అన్యోన్యంగా పెరిగాం. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు నన్నూ ప్రేమించారు. కాని ఇప్పుడు వేరే సంబంధాలు చూస్తూంటే మాట్లాడకుండా ఊరుకొన్నారు."
    "ఏం చేయమన్నావ్, సీతా? జరిగిందంతా మరిచిపో. మీవాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకొని సుఖపడు."
    "ఎంత తేలికగా అనగలుగుతున్నారు మీరు ఆ మాట!"
    "నా పరిస్థితి కూడా ఆలోచించు. నాన్నకేమో బాగా కట్నం కావాలి. అమ్మకేమో అందమైన కోడలు కావాలి. అమ్మ మాట వినకపోతే ఆమె నూతిలో దూకుతా నని బెదిరిస్తూంది. నాన్న మాట వినకపోతే ఆయన దమ్మిడీ ఆస్తి ఇవ్వడు. నే నాయన మీద చాలా ఆశలు పెట్టుకొన్నాను ఫారిన్ వెళ్ళాలని. అమ్మా నాన్నలకు నే నొక్కడినే కొడుకుని. ఎవరి మనస్సు కష్టపెట్టటం నా కిష్టంలేదు."
    "అయితే ఇన్నాళ్ళ మన ప్రేమా, మనం కలిసి దిగిన ఫోటోలు, వ్రాసుకొన్న ఉత్తరాలు- ఇవన్నీ ఏమిటి? ఎందు కిలా చేశావ్? నా హృదయాన్ని ముక్కలుచేసి ఆనందించాలనుకొన్నావా?" ఆవేశంగా అరిచింది సీత.
    "ఇష్! గొడవ చేయకు. అనుకున్న వన్నీ అనుకొన్నట్లు జరగవు. నన్నేం చేయమన్నావు? ఇప్పుడు నన్ను ఫారిన్ పంపే పరిస్థితిలో నాన్న లేడు. ఆయన ఆస్తికి చాలా అప్పులు ఉన్నాయి. అందువల్లనే ఈ సంబంధం ఒప్పుకొంటున్నాను. ముఫ్ఫై వేలు కట్నం. తర్వాత వాళ్ళే నన్ను ఫారిన్ పంపుతారు. అదృష్టం నన్నిలా వరించి వస్తుంటే నా భవిష్యత్తును పాడు చేసుకొని నిన్ను చేసుకోవటానికి నే నేమైనా మూర్ఖుడి ననుకొన్నావా? మన ప్రేమ విషయం నేను బయట పెడతానని భయపడకు. కావాలంటే నీవు వ్రాసిన ఉత్తరాలు నీకే పంపుతాను."
    ఇంకేమీ మాట్లాడలేకపోయింది సీత. వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకొంది. చేతినున్న ముత్యాల గాజులు తీసి అతని ముందు ఉంచి లేచింది. దెబ్బ తిన్నట్లుగా చూసి, "సీతా, ఇవి ఉంచుకో. మనిద్దరం నుంచి స్నేహితులలాగే విడిపోదాం. ఇచ్చినవి తీసుకోవటం నా కలవాటు లేదు" అన్నాడు.
    "ఇచ్చిన హృదయాన్నే తీసుకోగలిగిన మీరు ఈ గాజులు తీసుకోలేరా?" కటువుగా అంటూ వాటి నక్కడే వదిలేసి వచ్చింది.
    ఎవరో మహాకవి అన్నట్లు హృదయానికి తగిలిన దెబ్బవలననే సీతలో నిద్రాణమై ఉన్న రచనా శక్తి పొంగి పొరలింది. ఫలితంగా ఆమె కలం నుండి వెలువడిన రచనలకు ప్రజలు జోహారు లర్పించారు. ఒక అంతస్తుతో, హోదాతో, డబ్బుతో తులతూగుతూ డాక్టరైన భర్తతో సభలు, సమావేశాలకు హాజరుకావాలని కలలు కన్న సీత అలా కాలేకపోయినా హృదయపూర్వకంగా పాఠకుల సన్మాన సభలకు హాజరు కాగలిగింది."

                              *    *    *

    'వెక్కి వెక్కి ఏడుస్తున్న సునీత దగ్గరగా వచ్చి కొంచెంసేపు అలాగే నిలుచున్నాడు మధు. ఆమె ఏడుపు విని ఎవరైనా వస్తారేమోనని అతనికి భయంగా ఉంది. కాని ఇంట్లో ఎవరూ ఉన్న అలికిడి లేదు,
    "సునీతా, ఊరుకోండి. ఎందుకలా ఏడుస్తున్నారు?"
    కన్నీటితో తలను పైకెత్తింది సునీత. కన్నీళ్ళు తుడుచుకొని, "నిజం చెప్పండి, మధుబాబూ. ఈ కథ ఎలా వ్రాశారు? దీనిని నిజంగా పత్రికకు పంపాలనే మీ ఉద్దేశ్యమా?" అంది.
    "కథ ఎలా వ్రాయటమేమిటి? మీ రెలా వ్రాస్తున్నారు? అలాగే. మీ కథలు మీరు పంపినప్పుడు నేను మాత్రం పత్రికకు ఎందుకు పంపగూడదూ? సునీతా, మీ ఆధ్వర్యంలో నేనూ ఒక రచయిత నవాలని నా ఆశ."
    "మధుబాబూ, మీ కాళ్ళు పట్టుకొంటాను. కాని ఈ కథ మాత్రం పంపవద్దు." ఆమె మళ్ళీ ఏడుస్తూంది. "నా కథను పంపవద్దనటానికి మీ అధికారం ఏమిటి?" కటువుగానే అన్నాడు.
    "అధికారం కాదు, ప్రార్ధన. నిజం చెప్పండి, మధుబాబూ. మిమ్ములను బ్రతిమాలుకొంటున్నాను. ఇది నా కథ అని తెలిస్తే వ్రాశారు గదూ? ఎలా తెలుసుకో గలిగారు మీరు? ఈ నాడు దీనిని పత్రికకు పంపితే, అది నా జీవితంలో గడిచిన ఘట్టం అని నలుగురికీ తెలిస్తే నా బ్రతుకేం కావాలి? చెప్పండి. నా మీద ఎందుకిలా మీరు కక్ష సాధించాలనుకొంటున్నారు? నవనీతం లాంటి మీ హృదయం ఎందుకిలా శిలలా మారింది?" ఏడుపుతో ఆమె కిక మాటలు పెగలలేదు. ఏడుస్తున్న ఆమెను జాలిగా చూశాడు మధు. వెంటనే ఆ కాగితాలు తీసుకొని కోటు జేబులో కుక్కుకున్నాడు. "మధుబాబూ!" భయంగా అతని చేతిని పట్టుకొంది సునీత.
    "భయపడకండి. జీవితాలను కథలలోకి ఎక్కించి, ఎదుటివారిని చిత్రహింసలు పెట్టి ఏడిపించడానికీ, చంపడానికీ నేను మీ అంత కఠిన హృదయుడిని కాను." "మధుబాబూ!" ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది సునీత.
    "మీకు ఆశ్చర్యం వేస్తూంది గదూ? ఎవరికీ తెలియదనుకొన్న ఈ రహస్యం నాకే తెలిసింది. మీరు రచయిత్రులే కావచ్చు. మహా రచయిత్రే కావచ్చు. కాని జీవితాలతో చెలగాటాలాడే ఈ హక్కు మీ కెవరిచ్చారు? మీకు కథావస్తువు దొరకకపోతే కథలు వ్రాయడం మానివేయండి. అంతేగాని సహజత్వం కోసం జీవితాలను పుస్తకాలలోకి ఎక్కించి మీ పేరు ప్రఖ్యాతుల కొరకు తాపత్రయపడి ఇతరుల జీవితాలను నాశనం చేయకండి."
    "మధుబాబూ, ఏమిటి మీ రంటున్నది?"
    "ఇంకా దాచాలనే ప్రయత్నం చేస్తున్నారా? రేడియో వారు నాటకం వేసుకొంటామని మిమ్ములను అడిగిందీ, నటులు ఉన్నంతకాలం చిరస్థాయిగా ఉండే నాటకమని పత్రికలు పొగిడిందీ, మీకు ఆంద్ర ప్రజలలో బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు గడించి పెట్టినదీ, మీకు సన్మానాలు చేయించినదీ ... ఏది..... ఆ 'పగిలిన హృదయాలు' జీవితం కాదా? అందులో సలీమ్, రమలు ఎవరు? నజ్ మా, ప్రభాకర్ లు కారా? ఒక అసహాయురాలిని నిర్దయగా శిక్షించి, ఆ ప్రభాకర్ కు ఎన్నో బోధలు చేసి ఉమాబాలతో వివాహం చేయించటంలో మీ పాత్ర ఏమీ లేదా? మీ బంధువు ఉమాబాల భర్తతో సుఖిస్తుంటే అతడి మొదటి భార్య జీవచ్చవంలా బ్రతకటం కూడా మీ కిష్టంలేక పోయిందా? 'పగిలిన హృదయాలు' వ్రాసి ఆమెను హత్యచేసిన మిమ్ములను.....మిమ్ములను ఏం చెయ్యాలి? ఓహ్..." ఆవేశంగా చెప్పుకుపోతున్న మధు ఒక్కసారి తెలివిలోకి వచ్చి కుర్చీలో కూర్చుని నుదురు అరచేత్తో రుద్దుకోవటం మొదలుపెట్టాడు. అతడి మాటలు లాభాలై పొడుస్తూంటే ఏమీ మాట్లాడలేక బాధ గాను, అంతకంటే ఆశ్చర్యంతోను అతడినే చూస్తూ నిలుచుంది సునీత. కొంచెం తేటపడిన తర్వాత సానునయంగా "సునీతా, మీరు రచయిత్రులని నే నెంతో అభిమానించాను. కాని మీలో ఇంత కఠినత్వమున్నదని ఏనాడూ ఊహించలేదు. ఒకనాడు... మన మొదటి పరిచయం రోజు .... కథలు ఎలా వ్రాయాలో చెప్పండి, వ్రాయటానికి ప్రయత్నిస్తానన్నారు. జ్ఞాపకముందా? ఇప్పుడు చెబుతున్నాను. ఒక వ్యక్తిని చెడు ఆలోచన నుండి, చెడు నడత నుండి తప్పించగలిగిన రచనే రచన. చూడండి, శరత్ కథలు కొన్ని విమర్శలకు గురి అయ్యాయి. కాని ఆయన 'చరిత్రహీనులు' చదివి ప్రేమించిన వాడితో పారిపోవలసిన ఒక యువతి ఆగిపోయిందట. సర్వం సర్దుకొని తల్లిదండ్రులకు తెలియకుండా అతనితో పరారీ అయిపోవాలని ఆమె అనుకొంది. అర్ధరాత్రి ఇంట్లోనుండి బయట పడాలి. అంతవరకు నిద్రపోకుండా కాలం గడపటంకోసం 'చరిత్రహీనులు' చదివింది. పుస్తకం పూర్తిచేయటంతోపాటు ఆమె హృదయం మారి అతడితో వెళ్ళలేదు. ఎంత గొప్ప పరివర్తన!" అని కొంచెం ఆగి, "కాని మీ 'పగిలిన హృదయాలు' నాటకం చూసి నజ్ మా మరణించింది" అన్నాడు.
    "మరణించిందా!" కొంచెంసేపు ఏమీ మాట్లాడ లేకపోయింది సునీత. తర్వాత మెల్లగా, "మధుబాబూ, ఇవన్నీ మీ కెలా తెలుసు?" అంది.
    "మీరు ప్రేమించిన డాక్టర్ కిషోర్ నా స్నేహితుడు. అందుకే మీ కథను అతని ద్వారా విన్నాను. 'పగిలిన హృదయాలు' చదివిన లతక్క కూడా మీలాగ ఏడిచింది. తర్వాత నజ్ మా కథ చెప్పింది. నజ్ మా, లత మంచి స్నేహితులు. అది విన్నప్పటినుండి నేను మీ జీవితాన్ని శోధించటం మొదలుపెట్టాను. మీరు జరిగింది జరిగినట్లు వ్రాయక ప్రభాకర్ ను నిర్దోషిగా వ్రాశారు. ఎందుకు? ఇప్పుడు అతడు మీ బంధువు కనక. రచనలలో కనిపించే మీ సహృదయత మీలో లేదని తెలిసినవాడు నే నెతో బాధపడ్డాను. మిమ్ములను ఒక మంచి స్నేహితురాలని నమ్మాను. కాని నా ఆశ నిరాశ అయింది..."
    "మధుబాబూ, నన్ను అపార్ధం చేసుకోవద్దు. నేను మీ రనుకొన్నంత కఠినాత్మురాలిని కాను. నజ్ మా మరణిస్తుందనే ఊహే నాకు రాలేదు. నన్ను మన్నించండి. మధుబాబూ... మ...ధూ..." సునీత మాటలు గాలిలో కలిసిపోతుంటే మధు చకచక అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.


                              ----:సమాప్తం:----

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra