Home » Yandamuri veerendranath » ఆనందోబ్రహ్మ

 

       "మారుతున్న కాలంలో మనిషికీ మనిషికీ మధ్యనున్న సంబంధాలలో వచ్చిన మార్పు గురించిన ఒక గొప్ప సత్యం నాకు నిన్న బోధపడింది. అసలే సెక్సూ, హింసా, న్యూట్రాన్ బాంబుల ప్రాణభయం, ఉడకబెట్టీ డబ్బాలో సీల్ చేసిన అన్నం, మెకానికల్ లైఫ్ లతో అనుక్షణం విసిగిపోయిన ఈ తరానికి కావల్సింది 'రేప్ దై మదరూ', 'నా హత్యకి హంతకుడూ' కాదేమో అనిపిస్తూంది. మీ కథని అందుకే తిరిగి వ్రాయాలనుకున్నాను. అదో అద్భుతమైన కావ్యం అవుతుందని హామీ యివ్వలేనుగానీ, ఈ తరానికి తెలియని విషయాలతో వ్రాద్దామనుకుంటున్నాను" అంటూ లేచాడు. లేస్తూ అన్నాడు -"బహుశా ఇదే నా ఆఖరి నవల అవుతుంది. ఈ రచన కూడా ఫెయిల్ అయితే నేను మార్కెట్ లో మరి వుండనని నాకు తెలుసు. అయినా కూడా మామూలు నవలా లక్షణాలన్నీ  వదిలిపెట్టి దీన్ని వ్రాద్దామనుకుమ్టున్నాను. రచయితగా నేను సర్వనాశనమైన సరే"
   
    యాజీ లేస్తూ "అలా అవధానే ఆశిద్దాం" అన్నాడు.
   
    "నేను వెళ్లొస్తాను. ఆర్నెల్ల తర్వాత కనిపిస్తాను"
   
    "ఆర్నెల్లా?" ఆశ్చర్యంగా అడిగాడు యాజీ.
   
    "ఒక ఆవేశం తల్లి గర్భంలో సంపూర్ణత్వాన్ని సంతరించుకోవటానికి పట్టేకలం ఆర్నెల్లయితే, మరో ఆవేశం కవి మనసులో కమనీయ కల్పనగా రూపుదిద్దుకోవడానికి ఆర్నెల్లు కూడా ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. పుడమితల్లి గడ్డిపోచని ప్రసవించడానికి ఎంతకాలం పడుతుందో తెలీదుగాని, నిశ్చయంగా మా రచయితల్లా రాత్రికి కూర్చుని ప్రొద్దునకల్లా విసర్జించేది మాత్రం కాదు....."
   
    యాజీ చిరునవ్వుతో తలూపాడు.
   
    "అంతేకాదు. ఇది వ్రాయటానికి కొంతకాలంపాటు ఎక్కడికయినా వెళ్లిపోదామనుకుంటున్నాను."
   
    "ఎక్కడికి?"
   
    "ఏదయినా ప్రశాంతమైన స్థలానికి..... ప్రొఫెషనల్ రైటర్ అనేవాడు బస్ స్టాప్ లోనయినా నిలబడి వ్రాయగలిగి వుండాలి అని అప్పుడు నేను అనుకునేవాడిని కానీ అలా ఏ స్పందనా లేకుండా వ్రాయటం దేనికన్నా హీనమో నా కిప్పుడు అర్ధమైంది."
   
    "దేనికన్నా హీనం భరద్వాజా?"
   
    "రేప్ దై మదర్ - కన్నా."
   
    బుల్లెట్ లా  వచ్చిన ఆ సమాధానానికి యాజీ వెంటనే మాట్లాడలేకపోయాడు. అతడి మోహంలో ఒక అనూహ్యమైన సంతృప్తి మాత్రం కనిపించింది.
   
    అదే సంతృప్తితో యాజీ వంగి డ్రాయరులోంచి ఒక పుస్తకాల కట్టతీసి అతడి ముందు పెడుతూ, "రచన మొదలు పెట్టబోయేముందు ఇవి చదవండి. ఉత్తేజం వస్తుంది" అన్నాడు.
   
    "ఎవరివి ఇవి?"
   
    "వంద సంవత్సరాల క్రితం  ముగ్గురు గొప్ప కవులుండేవారు. విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జంధ్యాల పాపయ్యశాస్త్రి అని.......భజంత్రీగాళ్ళూ, భజనపరులూ లేక ఆ రోజుల్లో వాళ్లకి రావలసినంత ప్రచారం రాలేదుగానీ, కలం గడిచేకొద్దీ కడిగిన ముత్యాల్లా మాలాటివాళ్ళ హృదయాల్లో నిలిచిపోయారు. వాళ్ళ రచనలు యివి!" అంటూ పాకెట్ ఇచ్చాడు.
   
    పుస్తకాలు అందుకుంటూ భరద్వాజ "ఇదేమిటి - ఈ ప్యాకెట్ మీద నా పేరు వ్రాశారు? నేను మళ్ళీ తిరిగి వస్తానని మీకు తెలుసా?" అని అడిగాడు అమితమైన ఆశ్చర్యంతో.
   
    "పైకి ఎంత మెటీరియస్టిక్ గా కనపడినా, రచయిత మనసులో ఏమూలో ఆర్ద్రతా, స్పందనా వుండితీరాలి. నా మాటలు మీ మనసులో ఎక్కడో దేన్నో కదల్చి మిమ్మల్ని పునర్ ఆలోచించుకునేలా చేస్తాయని నాకు నమ్మకం వుంది. రచయితలకీ, వ్యాపారస్థులకీ ఆ మాత్రం దూరదృష్టి వుండాలి కదా" అంటూ నవ్వాడు.
   
    భరద్వాజ లేస్తూ "వంద సంవత్సరాలు వెనక్కెళ్ళి వ్రాస్తే, పాఠకులు రచయితతోపాటు వెనక్కి వెళ్ళలేక ఉక్కిరిబిక్కిరి అవుతారేమో చూడాలి" అన్నాడు.
   
    "వంద సంవత్సరాలు ముందుకెళితే అలా అవుతారేమో కానీ, వెనక్కి సులభంగానే వెళతారు. అయినా మీరిది వ్రాస్తున్నది నా కోసం....పాఠకుల కోసం కాదు."
   
    "ఉహూ నేను ఇది వ్రాస్తున్నది మీ కోసమూ, పాఠకుల కోసమూ కాదు."
   
    "మరి?"
   
    "నా కోసం...."
   
                                   15
   

    కొద్ది రోజుల్లో రచన పూర్తయింది. అనుకున్న దానికన్నా తొందరగానే అలా అని అతడు కష్టపడలేదని కాదు.
   
    నిజానికి ఈ రచన అతడు చేసే మామూలు రచనల సైజులో పదోవంతు కూడా రాలేదు. అయినా దీనికి మామూలుకంటే వందరెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. అసలే అలవాటులేని ప్రక్రియ. దానికితోడు భావుకత్వం..... అలవాటులేని సున్నితత్వం.... పొందికైన ఘర్షణ.....
   
    అప్పుడప్పుడు జుట్టు పీక్కునేవాడు. వ్రాస్తూ వ్రాస్తూ పెన్ను విసిరేసేవాడు. పిచ్చివాడిగా శూన్యంలోకి..... తనకి తెలియని..... తను ఊహించని ప్రపంచంలోకి వెళ్లి..... గంటల తరబడి చూస్తూ కూర్చునేవాడు. కానీ నేలని తవ్వుతూంటే జలపడ్డాక నీళ్ళు ఒక్కసారిగా ప్రవహించినట్టూ ఒకసారి మొదలుపెట్టాక యిక అది ఆగలేదు.
   
    కొద్దిరోజుల తర్వాత వ్రాతపత్రిని తీసుకొచ్చి యాజీ కిచ్చాడు.
   
    "అప్పుడే అయిపోయిందా?"
   
    భరద్వాజ మాట్లాడలేదు.
   
    రచన చేస్తున్నంతసేపూ, మళ్ళీ అది పూర్తి అయ్యాక మరికొంత కాలమూ, రచయితమీద ఆ రచన తాలూకు ప్రభావం కాస్తో కూస్తో పడి తీరుతుంది. ప్రస్తుతం ఈ రచన పూర్తిచేశాక కలిగిన సంతృప్తి అతడికి ఋషత్వాన్ని ఆపాదించింది.
   
    అందుకే తను వ్రాసినదాన్ని యాజీ చదువుతున్నంతసేపూ అతడు ఏ విధమైన ఉద్వేగాన్నీ (పూర్వంలాగా) పొందలేదు. ఒకే వేదాంతిలా నిర్వికారంగా కూర్చుండిపోయాడంతే!
   
    యాజీ చదవటం పూర్తిచేసి తలెత్తాడు.
   
    అతడి కళ్ళనిండా నీళ్ళున్నాయి! ఎంతో చలించిపోయినట్టూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. తర్వాత లేచివచ్చి భరద్వాజ చేతులు పట్టుకుని, "ఇదే..... ఇదే నాకు కావాల్సింది" అన్నాడు ఆవేశం, ఆనందం నిండిన స్వరంతో.
   
    తన పని అయిపోయినట్టూ భరద్వాజ తలూపి లేచి నిలబడి, జేబులోంచి చెక్కుతీసి బల్లమీద పెట్టాడు.
   
    "ఏమిటిది భరద్వాజా?"
   
    "మీరిచ్చిన చెక్కు నాకు చాలా సంతృప్తిగా వుంది యాజీ! అది చాలు.....పోతే ఈ రచనకి కమర్షియల్ విలువలేదు. నా మూలాన మీకు నష్టం రావటం నా కిష్టంలేదు. నాకు మిగిలిన సంతృప్తే చాలు. మీది మీరు తీసుకోండి."
   
    "నాన్సెన్స్" అన్నాడు యాజీ "ఎవరన్నారు దీనికి విలువలేదని?"
   
    "మీకు చూపించటానికి ముందే ఈ ప్రతిని దాదాపు అన్ని పత్రికలకీ చూపించాను బిస్సీయాజీ! కొంతమంది నాకు మతిపోయిందన్నట్టూ చూశారు. మరికొందరు మొహంమీదే నవ్వారు. పాపులారిటీ తగ్గిపోయాక పెర్వెర్షన్ ప్రారంభమయిందా అని మరొకరు అడిగారు. చివరికి నా రచనల్ని వెన్వెంటనే వేసుకునే పత్రికాధిపతి కూడా దీన్ని ప్రచురించడానికి వప్పుకోలేదు."
   
    "ఎవరు?"
   
    భరద్వాజ చెప్పాడు.
   
    యాజీ ఇంటర్ కమ్ లో సెక్రెట్రీని పిలిచి, ఆ పత్రికాఫీసుకు ఫోన్ చెయ్యమని చెప్పాడు.
   
    మిగతా వాళ్ళయితే ఏమనునోగాని, యాజీ స్వయంగా మాట్లాడేసరికి ఆ పత్రిక ఎమ్.డి. మొహమాటంగా "నాకు తెలీదు యాజీ! ఇలాటివన్నీ ఎడిటర్ చూసుకుంటాడు" అన్నాడు.
   
    "అతడిని ఒక్కసారి నా దగ్గిరకి పంపించండి."
   
    అయిదు నిమిషాల్లో పత్రిక తాలూకు ఎడిటరూ, సర్క్యులేషన్ మానేజరూ యాజీ ఆఫీసుకి వచ్చారు. వాళ్ళ మొహాలు ధుమధుమలాడుతున్నాయి. కేవలం ఎమ్.డి. చెప్పబట్టి వచ్చామన్న విసుగు వాళ్ళలో స్పష్టంగా కనబడుతూంది.
   
    "దీన్ని ఎందుకు వేసుకోరు?" అని అడిగాడు యాజీ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra