Home » Kolipaka ramamani » Yeti Odduna Neetipoolu

 

    శ్రీదేవి పెళ్ళిముహూర్తం సాయంత్రం ఏడుగంటల రెండు నిమిషాలకి. సాయంత్రం అయిదు గంటలకే పెళ్ళితంతు ప్రారంభించారు. లోపల శ్రీదేవి బుట్టలో కూర్చుని గౌరీపూజ చేస్తూ ఉంటే, పైన పందిరిలో పెళ్ళికొడుకుచేత మంత్రాలతో ఏవో పూజలు చేయిస్తున్నాడు పురోహితుడు. పెళ్ళికొడుకు పొడుగ్గా ఉన్నాడు. చక్కటి విగ్రహం, ప్రవర్తనతో హుందాతనం పెళ్ళికొడుకుకి అందాన్ని ఇస్తున్నాయి. అంత హుందాతనంలో కూడా అతనిలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టు తెలిసిపోతూ ఉంది.

 

                            
    "ఇంకా ఎంతసేపే పూజ, మీ ఆయన నీ కోసం అక్కడ క్షణం ఒక యుగంగా ఎదురుచూస్తూ ఉంటేను?" అని శ్రీదేవికి అన్న వరసైన ఒకతను వచ్చి శ్రీదేవిని, చుట్టుపక్కలవాళ్ళనీ నవ్వించి వెళ్ళిపోయాడు.
    పద్మకి శ్రీదేవి పెళ్ళి చూస్తూ ఉంటే తన పెళ్ళి గుర్తుకి వచ్చింది. శ్రీదేవిలాగే తనూ భక్తితో గౌరిని పూజించింది. మాధవరావుని పీటలమీద చూడాలని తహతహలాడింది.
    పురోహితుడు లోపలికి వచ్చి, "అమ్మాయిని తీసుకు రండమ్మా. ముహూర్తం సమీపిస్తూంది" అన్నాడు.
    "మేనమామలని పిలుచుకు రండి. బుట్ట ఎత్తాలి" అంది శ్రీదేవి తల్లి.
    "అమ్మా, ఇంత పెద్దదాన్ని ఎత్తడమేమిటి? వద్దమ్మా" అంది శ్రీదేవి మెల్లిగా.
    ఇంతలోనే ఆజానుబాహులైన నలుగురు మేనమామలు వచ్చి, శ్రీదేవిని బుట్టపాళంగా ఎత్తేసి, తీసుకు వెళ్ళి పెళ్ళికొడుక్కి ఎదురుగా కూర్చోపెట్టారు. శ్రీదేవి తెగ సిగ్గుపడింది.
    పెళ్ళికొడుకుకి, శ్రీదేవికి మధ్య తెర అడ్డం పెట్టారు. పెళ్ళికూతురితోపాటు బయటికి వచ్చిన చారుమతి, పద్మ కొంచెం దూరంలో ఎదురుగా కూర్చున్నారు. అక్కడినించి చూస్తే పెళ్ళికొడుకు, శ్రీదేవి ఇద్దరూ సమంగా కనిపిస్తారు.
    పురోహితుడు మంత్రాలు చదువుతూ అందరికీ అక్షింతలు ఇస్తూ, పద్మకీ, చారుమతికీ కూడా ఇచ్చాడు. భజంత్రీలు పెద్ద పెట్టున మోగాయి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి తలమీద జీలకర్ర, బెల్లం పెట్టాడు. శ్రీదేవి చెయ్యి పట్టుకుని పెళ్ళికొడుకు తలమీద జీలకర్ర, బెల్లం పెట్టించింది తల్లి. వాళ్ళలా ఉండగానే మధ్యతెర తీసేశారు. హిందూ వివాహపద్ధతిని వధూవరులకు అదే ప్రథమ వీక్షణం, శుభవీక్షణం కావాలి. వధూవరుల చూపులు కలుసుకున్నాయి. శ్రీదేవి వెంటనే సిగ్గుపడుతూ కళ్ళు దించేసుకుంది. వరుడు మాత్రం అమ్మాయి కళ్ళల్లోకి చిలిపిగా చూస్తున్నాడు.
    'ఇంతమంది మధ్యన కూర్చుని శ్రీదేవివైపు అలా చూస్తాడు. సిగ్గు లేదా?' అనుకుంది చారుమతి మనసులో. పైకిమాత్రం, "శ్రీదేవిని తినేసేటట్టు చూస్తున్నాడు కదూ?" అంది పద్మతో.
    పద్మ ఈ లోకంలో లేదు. పద్మ మనసు మాధవరావు చుట్టూ పరిభ్రమిస్తూంది. తెర తియ్యగానే తన పెళ్ళిలో సిగ్గువల్ల కళ్ళు దించేసుకుంది తను. 'మాధవరావు ఇలాగే చిలిపిగా చూశాడా తనని?' అనుకుంటూంది మనసులో.
    శ్రీదేవికి, పెళ్ళికొడుకుకి మధుపర్కాలు ఇచ్చి లోపలికి పంపించారు. వాళ్ళు అవి కట్టుకుని రావాలి.
    చారుమతి చుట్టూ చూసింది. ఆడవాళ్ళంతా పట్టుచీరలతో, నగలతో ఎలక్ట్రిక్ బల్బుల కాంతిలో మెరిసిపోతున్నారు. రకరకాల నగలూ, చీరలూ చూస్తూ పద్మవేపు దృష్టి తిప్పింది. పద్మ చెవుల నున్న దుద్దులు తళుక్కున మెరిశాయి.
    "కొత్తవా పద్మా, దుద్దులు? ఎప్పుడు చేయించుకున్నావు?"
    "ఈమధ్యే చేయించుకున్నాను. ఇవాళే పెట్టుకున్నాను" అంది పద్మ.
    "ఏమిటి, వజ్రాలదుద్దుల్లా అంతగా మెరుస్తున్నాయి? మీ అత్తగారు చేయించారా?"
    "అమ్మే చేయించింది. వజ్రాలే!" అంది పద్మ ముభావంగా.
    'ఒక్క కూతురు, వజ్రాలూ చేయిస్తారు, వైడూర్యాలూ పెడతారు' అనుకుంది చారుమతి, పద్మగురించి ఆలోచిస్తూ. కాని చారుమతికీ తెలుసు పద్మ ఇంటి స్థితిగతులు. పద్మ తండ్రి కాలేజీలో లెక్చరరు. ఆయనకీ జీతంతప్ప నేరే ఆదాయం లేదు. ఈమధ్యే పాతఇల్లు పడగొట్టి కొత్తఇల్లు కట్టారు. ఆయన దాచుకున్న సొమ్మంతా ఆ ఇంటికీ, కూతురు పెళ్ళికీ ఖర్చు అయిపోయింది. "నా పెళ్ళికే అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. తరవాత ఏం చేస్తారు అమ్మా, నాన్నా? నాకో అన్నేనా లేడు వాళ్ళని చూసుకోవడానికి" అంది పద్మ ఒకసారి మాటలలో. మరి ఇప్పుడు వజ్రాలదుద్దులు ఎందుకు చేయించారో? ఒక్క కూతురే ఉంటే అన్ని ముద్దుముచ్చటలూ జరపాలని ఉంటుందేమో!        
    చారుమతి ఆలోచనలలో ఉండగానే పెళ్ళికొడుకు వచ్చి పీటల మీద కూర్చున్నాడు. కుడివైపునించి శ్రీదేవిని తీసుకువస్తున్నారు. ఆమె ముందూ, వెనకా పెద్ద ముత్తైదువులు పళ్ళాలలో నేతిదీపాలు వెలిగించి పట్టుకున్నారు. ఇద్దరు ముత్తైదువులు పెద్ద పెద్ద పళ్ళాలలో పసుపు కలిపిన పచ్చటి తలంబ్రాల బియ్యం పట్టుకున్నారు. దీపాలమధ్య ఎర్ర జరీ అంచు తెల్ల చీరతో శ్రీదేవి పార్వతీదేవిలా మెరిసిపోతూంది. మూర్తీభవించిన పవిత్రతలా, ప్రేమమూర్తిలా కనిపిస్తూంది.
    మంగళసూత్రాలు వధూవరులమధ్య పెట్టి, పూజ చేయించాడు పురోహితుడు. తరవాత శ్రీదేవి తల్లికి మంగళసూత్రాలు, అక్షింతలు ఇస్తూ, "అమ్మా, అందరికీ ఇచ్చిరండి" అని చెప్పాడు. శ్రీదేవి తల్లి పెళ్ళిఅయిన ప్రతి స్త్రీ దగ్గిరికీ వెళ్ళి, వాళ్ళ మెడకి ఒకసారి మంగళసూత్రాలు తాకించి, అక్షింతలు ఇస్తూంది. పద్మ మెడలో పెట్టి, చారుమతిదగ్గరికీ వచ్చింది ఆమె. అలవాటు ప్రకారం మంగళసూత్రాలు పెట్టబోతున్న ఆమెని చూసి, చారుమతి తల వెనక్కి జరిపింది.
    "ఆనంద మానంద మాయెనె, సీతమ్మ పెళ్ళికూతురాయెనె" -సన్నాయివాళ్ళు గట్టిగా వాయిస్తూ ఉంటే, పెళ్ళికొడుకు మంగళసూత్రాలు తీసుకుని శ్రీదేవి మెడలో మూడుముళ్ళూ వేశాడు. అక్షింతలు వేసి అంతా దీవించారు. కుమారి శ్రీదేవి శ్రీమతి శ్రీదేవి అయింది.
    వధూవరు లిద్దరూ తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే ముచ్చటగా ఉంది. పెళ్ళికొడుకు చాలా అల్లరివాడిలా ఉన్నాడు. శ్రీదేవికి అవకాశం ఇవ్వకుండా రెండు పళ్ళాలలోనివి అతనే శ్రీదేవిమీద కుమ్మరిస్తున్నాడు.
    శ్రీదేవి అక్కలిద్దరూ పరిగెత్తుకువచ్చారు. "ఏమే, అలా కూర్చుంటావు? ఆ పళ్ళెం ఎత్తి మరిది గారి మీద పోసెయ్యి" అంటూ ప్రోత్సహిస్తున్నారు శ్రీదేవిని.
    శ్రీదేవి సిగ్గుపడుతూంది. శ్రీదేవివైపు చిన్నవాళ్ళంతా -అన్నలూ, అక్కలూ -చుట్టూ చేరి శ్రీదేవిని ప్రోత్సహిస్తున్నారు.
    మగపెళ్ళివారు, శ్రీదేవి అక్కల భర్తలు పెళ్ళికొడుకు వైపు చేరి అతనికి మద్దతు ఇస్తున్నారు.
    శ్రీదేవి అక్క ప్రభావతి భర్తని చూసి మందలిస్తూంది. "మీరు మగపెళ్ళివారివైపు చేరి పోయారేమిటీ? ఆడపెళ్ళివారు. మరిది గారిని వదిలి పెట్టి ఇటు రండి."
    "మీ కొంగు పట్టుకోవాలంటావు! బాబోయ్! ముగ్గురు అక్కచెల్లెళ్ళూ కలిస్తే మా మగవాళ్ళ పని అయినట్టే. ఎలాగేనా అబ్బాయ్ మా తెగవాడు. మా తమ్ముడు. అతనికే మా మద్దతు."
    వీళ్ళ గొడవలో ఎవరూ చూసుకోలేదు, శ్రీదేవి పళ్ళెం ఎత్తి పెళ్ళికొడకుమీద అక్షింతలన్ని కుమ్మరించడం. పురోహితుడితోసహా అందరు సంతోషంగా నవ్వారు.
    పెళ్ళిఅయిన ప్రతివాళ్ళు తమ వివాహం జ్ఞాపకం చేసుకుంటున్నారేమో, వారి పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తూంది.
    'ఎంత ఆనందం! ఎన్ని నవ్వులు! ఎంత సరదాగా ఉన్నారు అంతా! తనకి ఎప్పటికేనా ఇలా పెళ్ళి అవుతుందా? తను మధుపర్కాలు కట్టుకుని పెళ్ళి కొడుకు తలమీద తలంబ్రాలు పోస్తుందా?' చారుమతి మనసులోనే ఊహించుకుంది.
    చారుమతి ఏదో ఆలోచిస్తూనే ఎదురుగుండా ఉన్న మగవాళ్ళ కుర్చీలలోకి చూసింది. ప్లీడరుగారు ముందువరసలోనే కూర్చుని ఉన్నారు. చారుమతి కళ్ళు ఆత్రంగా పక్కన వెతికాయి. కాని నిరాశే అయింది. డాక్టరు గిరిధారి కనిపించలేదు.
    చారుమతి మనసులో డాక్టరు గిరిధారి మధుపర్కాలతో తనపక్కనే పెళ్ళి కొడుకై కూర్చున్నట్టు ఒక్కక్షణం ఒక ఊహ మెదిలింది. వెంటనే అనుకుంది, 'నే నెక్కడ? అతనెక్కడ?' అని.
    కాని మనసు చెడ్డది. విచక్షణజ్ఞానం ఉండదు. అది ఇష్టం వచ్చినట్టు, కళ్ళెం లేని గుర్రంలా పరిగెడుతూనే ఉంటుంది.
    పెళ్ళితంతు ముగియగానే, భోజనాల ఏర్పాట్లు మొదలుపెట్టారు. పందిరికింద శుభ్రం చేసి, అరిటాకువిస్తళ్ళు వేశారు. ప్రతి విస్తరి చుట్టూ ముగ్గులు పెట్టారు. వధూవరుల ఆకుల చుట్టూ రంగుముగ్గులు తీర్చిదిద్ది, ప్రమిదలు అమర్చి, దీపాలు వెలిగించారు. పచ్చటి ఆకులమధ్య తెల్లటి కొత్త వెండికంచాలు పెట్టారు. కంచాలలో విందుభోజనం అమర్చి శ్రీదేవినీ, పెళ్ళికొడుకునీ తీసుకువచ్చి కూర్చోబెట్టారు. శ్రీదేవితో కాలేజీలో చదివిన అమ్మాయిలుకూడా చాలామంది వచ్చారు. స్నేహితురాళ్ళంతా వధూవరులపక్కనే పంక్తులతో కూర్చున్నారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra