Home » Mainanpati bhaskar » Buddijeevi

సంకెళ్ళు వేసిన అజిత్ నీ, అపురూపనీ మిలిటరీ వాన్ లో ఎక్కించి 'నెంబర్ వన్' గారి పాలెస్ కి తీసుకెళ్ళాడు మూడులక్షల ఒకటి. రోడ్ల పక్కన ఇళ్ళన్నీ అగ్గిపెట్టెల్లా ఒకేరకంగా వున్నాయి. వంద ఎకరాల స్థలంలో, దుర్భేద్యమయిన కోటలా వుంది ఆ పాలెస్. తాటిచెట్టు అంత ఎత్తయిన గేట్లు వున్నాయి దానికి. ఆ గేట్లమీద వాచ్ టవర్లు వున్నాయి. వాటిలో వున్న సోల్జర్లు పాలెస్ లోకి వాహనాల రాకపోకలని కట్టుదిట్టంగా అదుపు చేస్తున్నారు.
తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు మూడులక్షల ఒకటి. అప్పుడు తెరుచుకున్నాయి గేట్లు.
గేటుకి కొద్ది దూరంలోనే ఆ పాలెస్ కేర్ టేకరు తాలూకు క్వార్టర్లు వున్నాయి.
తనముందు ప్రవేశపెట్టబడిన కొత్త వ్యక్తులని ఎ చీమలనో, దోమలనో చూసినట్లు చిరాగ్గా చూశాడు ఆ కేర్ టేకర్. అతని నెంబరు నూట పదకొండు.
"ఎవరు వీళ్ళు!" అన్నాడు మోటుగా. విషయమంతా చెప్పి, వాళ్ళని నెంబర్ వన్ దగ్గరికి తీసుకెళ్ళమనీ, ఆయనే వాళ్ళనేం చేయాలో ఆలోచిస్తాడనీ చెప్పాడు మూడులక్షల ఒకటి.
"నేరుగా నెంబర్ వన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఎట్లా? ముందుగా నెంబర్ టూ దగ్గరికి తీసుకెళ్ళి, ఆయనేం చెబుతాడో అడుగుతాను" అన్నాడు కేర్ టేకర్ నూట పదకొండు.
"వీళ్ళకి నెంబర్ వన్నూ, నెంబర్ టూ ఇలాంటి పెర్లేమిటీ అసహ్యంగా?" అంది అపురూప గుసగుసగా.
"వెగటు కలిగించే బుద్ధులున్న వాళ్ళకి వెగటు కలిగించే పేర్లే సూటవుతాయి" అన్నాడు అజిత్ రహస్యంగా.
వీళ్ళ మాటలు గ్రహించినట్లు ఒక్కసారి కర్కోటకంగా చూశాడు నూట పదకొండు. "అసలు అన్నిటికన్నా ముందు వీళ్ళకి కాసేపు నా క్వార్టర్సులో బాగా అతిథి మర్యాదలు జరిపి ఆ తర్వాత నెంబరు టూ దగ్గరికి తీసుకెళతాను" అన్నాడు చాలా అర్ధవంతంగా. తను చెయ్యబోయే "అతిథి మర్యాదలు" తలుచుకుంటేనే అతని మనసు పులకించి పోతున్నట్లు మొహం వెలిగిపోతోంది.
స్వజాతి జంతువునే పీడించి, చిత్రవిచిత్రమైన హింసలు పెట్టి చంపడంలో మనిషిని మించిన మృగం లేదు!
నూట పదకొండు ఉన్మాదిలా సన్నగా నవ్వుకుంటూ తన కండలవైపు చూసుకుంటున్నాడు. అతని గొంతులో ధ్వనిస్తున్న క్రౌర్యానికి భయంతో గుండె జారిపోయినట్లయింది అజిత్ కి.
ఆ భయం తన గురించి కాదు. "ఏమీ జరగదు!" అని తను అపురూపకి అభయం ఇవ్వలేక పోతున్నందుకే ఆ భయం!
ఈ అమ్మాయిని తనతో తీసుకురావడం పొరబాటై పోయిందా? అపురూపని తనతోబాటే ఉంచితే చివరిక్షణం దాకా పోరాడి రక్షించగలడు.
అలా కాకుండా, తామిద్దరినీ వేరే వేరే గదుల్లో ఉంచితే?
ఆ ఆందోళనలో నోరు జారేశాడు అజిత్.
"మిస్టర్ కేర్ టేకర్! నువ్వు శాడిస్టువని తెలుస్తూనే ఉంది. నీ శాడిజానికి తృప్తి కలిగేలా హింసలు పెట్టాలంటే నన్ను నీ యిష్టం వచ్చినట్లు చేసుకో! చేతులు విరిచెయ్యి - కాళ్ళు మెలితిప్పేసెయ్యి. కళ్ళు పొడిచెయ్యి. ఏమన్నా చేసుకో! కానీ ప్లీజ్! ఈ అమ్మాయిని వదిలెయ్యి! ప్లీజ్! నేనెవరికీ తలవంచను! కానీ నీ దగ్గర తల వంచి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను చిత్రహింసలు పెట్టు. కాని ప్లీజ్! ఈ అమ్మాయిని మాత్రం వదిలెయ్యి!" అన్నాడు. అతని గొంతు కొద్దిగా బొంగురుపోయింది.
అతనివైపు ఆశ్చర్యంగా చూసింది అపురూప. ఆ పరిస్థితిలో అతను అలా మాట్లాడి ఉండకూడదని తనకీ అర్ధమయిపోతోంది. అదే అతని బలహీనతగా భావించి తనను మరింత చిత్రహింసలు పెడతాడు కేర్ టేకర్.
అయినా ఎందుకన్నాడు అతనలా?
ఈ కొద్ది పరిచయంతోనే అజిత్ అమోఘమైన మేధావి అని గ్రహించింది తను. అంతటి మేధావీ వివేకం కోల్పోయి మాట్లాడేలా చేసింది ఏమిటి?
దీన్నేలా ప్రేమ అంటారు పాతకాలం వాళ్ళు? మహామహులు కూడా విచక్షణా జ్ఞానం కోల్పోయేలా చేసే శక్తి వుందా దీనికి? ఒక మనిషికి ఇంకో మనిషిమీద ఇంత గాఢమైన అనురాగం సాధ్యమేనా అసలు? ప్రాణాలని గడ్డిపోచకన్నా తక్కువగా చూస్తూ, తన కోసం దారుణమైన చావు చావడానికి సిద్ధపడుతున్నాడా ఇతను. ఈ అజిత్ తనకోసం?
అప్రయత్నంగానే అపురూప కళ్ళు చెమ్మగిల్లాయి.
అజిత్ బలహీనత కనిపెట్టిన కేర్ టేకర్ నూట పదకొండు దయ్యం పట్టినవాడిలా నవ్వాడు. పెదిమలు తడిచేసుకుంటూ అపురూప వైపు చూశాడు.
బాగా పొడుగ్గా వుంది ఆ అమ్మాయి. భుజాలదాకా వచ్చిన సిల్కులాంటి జుట్టు, విశాల నేత్రాలూ, కొద్దిగా పొగరుగా వున్న ముక్కూ, కమలాఫలం తొనల్లాంటి పెదిమలూ, కొన్ని చోట్ల మృదువుగా, కొన్ని చోట్ల కఠినంగా వంపులు తిరిగిన ఒళ్ళూ-
"ఓహో! ఈ అమ్మాయి నీ ప్రేయసి అన్నమాట! వెల్! వెల్!" అన్నాడు హుషారుగా.
విలేకరి లేసర్ కిరణ్ తనని అజిత్ ప్రేయసిగా టీ.వీ.లో పరిచయం చేసినప్పుడు వచ్చినంత కోపం ఇప్పుడు రాలేదు అపురూపకి.
పై పెచ్చు తేనెచుక్కలు పెదవిపై పడుతున్నట్లు తియ్యటి అనుభూతి కలిగింది అతని మాటలు వింటుంటే - కొద్ది క్షణాల్లో తాము భయానకమైన అనుభవాలకు గురి కాబోతున్నామని తెలిసి కూడా!
"ప్లీజ్! రండి! నా ఆతిథ్యం స్వీకరించండి!" అని కొద్దిగా వంగి, నక్కలా వినయం ప్రదర్శించి, వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకున్నాడు నూట పదకొండు. అతని పిడికిలి అతి బలిష్టంగా ఉంది. చేతిలో నరాలకు బదులు ఉక్కు తీగెలు ఉన్నాయేమో అనిపించేటంత బలంగా వుందా పట్టు.
"స్స్... అబ్బ!" అంది అపురూప బాధగా. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగి ఒక కన్నీటి చుక్క బుగ్గమీదికి జారింది.
అది చూసి గట్టిగా శ్వాస తీసుకుని తిరగబడటానికి దేహాన్ని సన్నద్ధం చేశాడు అజిత్.
"సరే! సరే! ఇక్కడే తమాషాలు చెయ్యకు! లోపలికెళ్ళాక తేల్చుకుందాం!" అని పట్టు కొంచెం సడలించాడు నూట పదకొండు.
వాచ్ టవర్లో నుంచి చూస్తున్న సోల్జర్లు నవ్వారు. లోపలికెళ్ళాక నూట పదకొండు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తాడో కథలు కథలుగా విని ఉన్నారు వాళ్ళు.
అతని క్వార్టర్సు మామూలు క్వార్టర్సులా లేవు. చీమ కూడా తప్పించుకు పోవడానికి వీల్లేనంత పకడ్బందీగా ఇనప్పెట్టెలా ఉంది. ఎక్కడా ఒక్క కిటికీ కూడా లేదు.
ఇల్లంతా సౌండ్ ప్రూఫ్!
గోడలకి ఫోటోలూ, కాలెండర్ల లాంటి అలంకారాలేమీ లేవు.
కానీ సున్నితమైన, పదునైన ఆయుధాలెన్నో తగిలించి ఉన్నాయి. పొడుగాటి సూదులూ, సన్నటి కత్తెరలూ, ఫోర్ సెప్స్ టంగ్ క్లిప్పులూ, తోలు పటకాలూ.
పక్క పక్కనే రెండు కుర్చీలు వేసి వున్నాయి. వాటికి ఎన్నో ఎలక్ట్రిక్ వైర్లు కనెక్ట్ చేసి వున్నాయి. దాన్లో కూర్చున్న వాళ్ళు అటూ ఇటూ మెదలడానికి వీల్లేకుండా బిగించి కట్టడానికి బెల్టులు వున్నాయి. తలమీద బ్రహ్మాండమైన ఆర్క్ లైట్లూ, విపరీతమైన శబ్దం సృష్టించి మతిపోగొట్టడానికి స్పీకర్లూ -
అది టార్చర్ ఛాంబర్ అని గ్రహించాడు అజిత్. వెంటనే తప్పుచేసినట్లు గిల గిల్లాడిపోయింది అతని మనసు.
అపురూప ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కోవడానికి కారణం తనే! తనే! తనే! ఛీఛీ!
"ఈ కుర్చీల్లో కూర్చోండి. ఇంతకంటే మంచి కుర్చీలు లేవు ఈ దీనుడి ఇంట్లో. మన్నించండి! ప్లీజ్! రిలాక్సవండి!" అని అదోలా నవ్వుతూ అన్నాడు నూట పదకొండు.
వాళ్ళిద్దరూ అలా నిలబడే వున్నారు.
సున్నితమైన దౌర్జన్యంతోనే వాళ్ళిద్దరినీ కుర్చీల్లో కూలేశాడు నూట పదకొండు.
"వచ్చిన అతిథులకోసం వేడివేడిగా..." అని సగంలో ఆపేసి కిచెన్ లోకి వెళ్ళాడు.
కాసేపటి తర్వాత స్టౌ మీద మరుగుతున్న శబ్దం.
భయంతో ఒక్క గుటక వేసింది అపురూప.
అయిదు నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు నూట పదకొండు. అతని చేతిలో ట్రే - దానిమీద లేసు గుడ్డ కప్పి ఉంది. పొగలు వస్తున్నాయ్ అందులోనుంచి.
"ఫ్రెండ్స్! మీ కోసం ఆవిర్లు కక్కే కాఫీ!" అని లేసుగుడ్డ తీసేశాడు నూట పదకొండు. వెచ్చటి సువాసనలు వెదజల్లుతూ మూడు కాఫీ కప్పులు వున్నాయి అందులో!
దిగ్భ్రమ చెంది చూశారు అజిత్, అపురూపా.
"తాగండి ఫ్రెండ్స్! నిజంగానే కాఫీ ఇది! భయపడకండి!" అన్నాడు నూట పదకొండు ఒక స్టూలు లాక్కుని వాళ్ళముందు కూర్చుంటూ.
అపురూప సంశయంగా అజిత్ వైపు చూసింది. ఆమెను ఆగమని సైగచేసి తను కప్పు ఎత్తి రెండు గుటకల్లో తాగేశాడు అజిత్.
ఆశ్చర్యం! అది నిజంగా కాఫీనే! మత్తు మందుగానీ, మరే డ్రగ్ గానీ కలిపినట్లు లేదు. తాగగానే సేదతీరినట్లయింది ప్రాణం.
"నమ్మకం కుదిరిందా? ఊ! నువ్వుకూడా కానివ్వు అమ్మాయ్!" అన్నాడు కేర్ టేకర్ ఆప్యాయంగా.
పీడకలలో నుంచి అకస్మాత్తుగా మేలుకున్న దానిలా చూసింది అపురూప.
"ఆశ్చర్యంగా ఉందా? పైకి ఇంత రాక్షసుడిలా కనబడే నేను..." అని "అబ్బ" అంటూ చేతి వైపు చూసుకున్నాడు నూట పదకొండు. అతన్ని తీరిగ్గా కుడుతోంది ఒక ఎర్ర చీమ. "ఓసి పిడుగా!" అని దాన్ని మురిపెంగా కోప్పడి, వేలితో సున్నితంగా దాన్ని అదిలించి కిందపడేశాడు. అంతేగానీ దాన్ని నలిపి చంపెయ్యలేదు.
"చూశారా? చీమకి కూడా అపకారం చెయ్యలేను నేను. అదే నా బలహీనత" అన్నాడు.
"మరి ఇవన్నీ ఏమిటి?" అన్నట్లు చిత్రహింసకి పనికివచ్చే పరికరాలని చూశాడు అజిత్.
"ఓ అవా?" అని నవ్వాడు నూట పదకొండు. "అవన్నీ ఊరికే అలంకారానికి! ఈ టార్చర్ ఛాంబర్ లోకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కాస్త కాఫీ తాగించి, స్నేహంగా కాసేపు కబుర్లు చెప్పి పంపించేశానే గానీ ఎవరికీ, ఎప్పుడూ హాని చెయ్యలేదు. నిజం! ఈ సంగతి మా వాళ్ళెవరికీ తెలియదు" అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra