Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2


                             ఎడిసన్


    19వ శతాబ్దములో పాశ్చాత్య దేశములు యంత్రనాగరకత యందు ముందంజవేసినవి. అనేకములైన క్రొత్త యంత్రములు కనిపెట్టబడి మానవ విజ్ఞానాభివృద్ధికి దోహదము చేసినవి. ఈ శతాబ్దము విజ్ఞాన యుగమని చెప్పవచ్చును. ఈ యుగమునకు 'థామస్ ఆల్వా ఎడిసన్' పితామహుడు.
    థామస్ ఆల్వా ఎడిసన్ 1847 వ సంవత్సరము ఫిబ్రవరి 11వ తేదీన అమెరికాలోని ఓహియో జిల్లాలోని మిలాస్ నగరములో జన్మించినాడు. అతని జనని స్కాటిష్ వనిత. అతని జనకుడు డచ్చి పౌరుడు. ఎడిసన్ కు ఏడు సంవత్సరములు వచ్చునప్పటికి, అతని తల్లిదండ్రులు తమ నివాసస్థానము 'పోర్ట్ హ్యురన్' నగరమునకు మార్చివేసిరి. ఎడిసన్ అచ్చటనే యున్న పాఠశాలకుఁబోయి మూఁడు నెలలు మాత్రము విద్యాభ్యాసము చేసెను.
    కాని యతని కా చదు వేమాత్రము గిట్టుబాటు కాలేదు. అనంతరము పాఠశాలకు స్వస్తిచెప్పి తన మాతృదేవి వద్దనే విద్యా వ్యాసంగమున కుపక్రమించెను. చిన్నతనమునందే ఎడిసన్ స్వయముగా కొన్ని పరిశీలనాత్మక ప్రయోగములు చేయుచు కొంతయనుభవము గడించెను. ఒకనాఁడు కోడిపెట్టవలె గ్రుడ్లపై గూర్చుండి వానిని పొదుగుటకై ప్రయత్నము చేసెను. ఇది యాతనిలోని విజ్ఞానతృష్ణకుఁ దార్కాణము.
    తనలోని విజ్ఞాన కాంక్ష ప్రోత్సహింప నతఁడొక చిన్న పరిశోధనాలయము నిర్మింపఁ బూనుకొనెను. ధనముగదా సర్వ ప్రయత్నములకు మూలసాధనము! భాగ్యహీనుఁడగు నాతడు పరిశోధనకుఁ గావలసిన పరికరములు సంపాదించుటకు కొంత ధనము సంపాదింపబూనెను. అందుకొఱకై యతడు పోర్ట్ హ్యురన్ నుండి డిట్రాయట్ వరకు ప్రయాణముచేయు రైళ్ళలో వార్తాపత్రిక లమ్ముకొనుటకు ప్రభుత్వమువారి యనుమతి సంపాదించెను.
    అతఁడు కొలఁదికాలములోనే వార్తాపత్రికల విక్రయములోని లాభమును గ్రహించెను. తానే యొక చిన్న ముద్రణ యంత్రమును సంపాదించెను. దానిని రైలునందే స్థాపించి స్వయముగా వార్తాపత్రికల నచ్చువేసి విక్రయింపసాగెను. ఈ వ్యాపారమునందు లభించిన ధనముతో సామానులను మోసికొనిపోవు రైలు నందొక పెట్టెలో నొక చిన్న పరిశోధనాలయము నిర్మించుకొని తన విశ్రాంతి సమయములందు టెలిగ్రాఫ్ ను గూర్చి పరిశోధనలు చేయ మొదలిడెను.
    ఒకరోజు రైలు హఠాత్తుగా నాగినది. పరిశోధనాలయమున్న పెట్టెనుండి యొక భాస్వరపు ముక్క క్రిందపడి పెట్టెకు నిప్పంటుకున్నది. రైలుగార్డు ఆగ్రహోదగ్రుడై నిప్పులు గ్రక్కుచు వచ్చి ఎడిసన్ పరిశోధనాలయమును, ముద్రణ యంత్రమును బయటకు గుంజివేసెను. అంతటితో నతని క్రోధ ముపశమింప లేదు. ఎడిసన్ పై ప్రళయకాలరుద్రునివలె దూకి గూబలు గుంయి మనునట్లు బలముకొలఁది గట్టిగా చెవిమీద కొట్టెను. అది మొదలుకొని ఎడిసన్ జీవితాంతము వరకు పాపము చెవిటివాడుగా నుండవలసివచ్చెను.
    ఒకనాఁటి ప్రాతఃకాలమున ఎడిసన్ అదే రైలు స్టేషన్ లో వార్తా పత్రికలమ్ముచుండగా నొక విచిత్ర సంఘటన జరిగినది. ఒక చిన్న పిల్లవాఁడు రైలు పట్టాలమీద నాడుకొనుచుండెను. అప్పుడే యొక రైలు మహావేగముతో వచ్చుచుండెను. క్షణకాలములో నా బాలుఁడు రైలుక్రిందఁ బడిపోయెడివాఁడే! వెంటనే ఎడిసన్ తన చేతిలోనున్న వార్తాపత్రికల నచ్చటనే పారవేసి యొక్క పరుగున నా శిశువు నివతలకు తీసుకొనివచ్చి వాని ప్రాణములు కాపాడెను.
    ఆ పిల్లవాడు స్టేషన్ మాస్టరు కుమారుడే! స్టేషను మాస్టరగు 'మెకంజీ' తన బిడ్డ ప్రాణములు కాపాడిన యాపద్భాంధవు డగు ఎడిసన్ మహాశయ నభినందించి. ప్రత్యుపకారముగా రైల్వే టెలిగ్రాఫ్ విద్య సతనికి నేర్పెను. సూక్ష్మగ్రాహియగు ఎడిసన్ అచిరకాలముననే యా విద్యయందు ప్రవీణుఁడై టెలిగ్రాఫ్ ఉద్యోగిగా కొంతకాలము జీవితము గడపెను. ఆ యుద్యోగ కాలమునందే యాతఁడు మరికొన్ని నూతన పరిశోధనలు జరిపి విజయము గాంచెను.
    ఎడిసన్ లోని పరిశోధనాత్మకమైనతృష్ణ యాయుద్యోగమునకు భరత వాక్యము పలికించినది. అతఁడు న్యూయార్కు నగరమునకుఁ బయనము సాగించినాఁడు. చేతిలో నెఱ్ఱని యేగానియైన లేని ఎడిసన్ రెండు రాత్రులు క్షుద్బాధాపీడితుఁడై గోల్డుఇండికేటర్ కంపెనీలో నొక గదిలో నిద్రించినాఁడు. మూఁడవనాఁడతఁడచటి యాఫీసు గదిలో కూర్చుండి యుండగా నొక యంత్రము చెడిపోయెను. అచటనున్న వారెల్లరు దానిని బాగుచేయలేక తెల్ల మొగములు వేసికొని దిగాలుపడి చూచుచుండిరి. ఎడిసన్ స్వయముగా నా యంత్రమును బాగుచేసి మఱల నెప్పటివలె చేయునట్లు చేసెను. అచ్చట నున్నవారందరు మహానందముతో నాతని వేనోళ్ళఁ గీర్తించిరి. ఎడిసన్ లోని ప్రజ్ఞ గుర్తించిన యా కంపెనీ ప్రధానోద్యోగి యతనిని కంపెనీ కంతటికి యజమానిగా నియమించి గౌరవించెను.
    తరువాత ఎడిసన్ 1869 అక్టోబరులో 'పోప్' అను పేరుగల టెలిగ్రాఫ్ ఇంజనీరుతో భాగస్వామిగాఁజేరి మఱికొన్ని పరిశోధనలు చేసెను. ఇట్లుండగా నొక భాగ్యవంతుఁడగు పాశ్చాత్య సంఘాధ్యక్షుడు టైపుయంత్రముపై పరిశోధనలు జరిపి దానిని మరింత యభివృద్ధికి తీసుకొని రావలసినదని ఎడిసనును ప్రార్థించెను. ఎడిసన్ ఆ పరిశోధనలోఁ గృతార్థుఁడయ్యెను. తాను చేసిన పరిశోధనలకు ప్రత్యామ్నాయముగా నైదువేల డాలర్లు కోరెను. విచిత్రమేమన ఆ సంఘాధ్యక్షుడు ఎడిసన్ కు నలుబదివేల డాలర్లు బహూకరించెను. 'ఎడిసన్' ఆశ్చర్యముగ్ధుడై లోలోన మిక్కిలి సంతసించెను.
    ఎడిసన్ జీవితమునందు నూతనాధ్యాయము ప్రారంభమైనది. అతఁడిక ధనముకొఱకై యితరుల దయమీద నాధారపడ వలసిన సమస్య నాఁటితోఁదీరి పోయినది. వెంటనే 'న్యూయార్కు' నందొక పెద్దసంస్థను ప్రారంభించెను. నిపుణులగు యువకులను చాలామందిని తనకు సహాయులుగా దగ్గరకు జేరఁదీసి తన మహోద్యమమును నిరంతరాయముగా సాగించు చుండెను. ఆ కాలమందే అతడు టెలిగ్రాఫ్ విషయమునందు పరిశోధనలు జరిపి దాని నభివృద్ధికిఁ దీసికొని వచ్చెను.
    1879వ సంవత్సరమునం దాతఁడు 'న్యూయార్కు' నగరమును వదలి 'మెన్లోపార్కు'లో నొక పరిశోధనాగారము నిర్మించి పరిశోధనలు చేయుట కారంభించెను. 'బెల్' కనిపెట్టిన టెలిఫోన్ పై కృషిచేసి దానిని సర్వజనోపయోగకరమగు పద్ధతిలో తీర్చి దిద్దేను. 1877వ సంవత్సరమునం దాతఁడు గ్రామఫోను యంత్రమును కనిపెట్టెను. ప్రపంచ మాతని నూతన పరిశోధన కద్భుతమందినది. తర్వాత విద్యుత్ పై నూతన పరిశోధనలు జరిపి యొకే విద్యుద్దీపమును వెలిగించగల విద్యుత్ప్రవాహమును విభాగించి యనేకములగు విద్యుద్దీపములను వెలిగించునట్లు చేయుటకు వీలగునని సిద్ధాంతీకరించెను. అంతేగాక దానిని ప్రత్యక్షముగా నిరూపించెను.
    ఇంతటితో నాతనిలోని యుత్సాహ మాగలేదు. ఇంకను క్రొత్త విషయములను సాధించుటకుఁ బూనుకొనెను. దృఢ ప్రయత్నమున్నచో కార్యసిద్ధి కేమి లోటు? అతని ప్రయత్నము ఫలించినది. అతఁడు చలన చిత్రములను గనిపెట్టెను. అతఁడు చేయని పరిశోధన లేదు. ప్రకృతి యా మహానుభావునకు లొంగి తనలో నిగూఢములైన రహస్యము లొక్కటొక్కటిగా వెల్లడించినది.
    మానవజాతికి విజ్ఞాన ప్రదాతయై తన కీర్తిలతలను దిగంత వ్యాప్తములు చేసి, ఆమరణాంతము పరిశోధనలకే జీవితము నంకితముచేసిన ఎడిసన్ మహాశయుఁడు 1931 అక్టోబరు 18వ తేదీన తన భౌతికదేహము చాలించెను.


                             * * * *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra