ఒక్కోసారి స్ట్రీట్ ఆఫీసర్ చెక్ పోస్ట్ లో ఉంటే లారీల్ని వదిలేసి మా మనుష్యులు పారిపోవాలి. లారీలు పోతాయి .....సరుకు పోతుంది. అలా కాదనుకున్నా ఎందరి జేబులు తడపాల్సి వస్తుందో తెలుసా?
నేను కొనే రేటే 75 వేలు. మీకు లక్ష కిస్తే నాకేం మిగులుతుంది ....? నామీద దాడులు....కేసులు వస్తుంటాయి. వాటిని మాఫీ చేసుకొని ఈ వ్యాపారంను కొనసాగించాలంటే అటు రాజకీయ నాయకుల్ని - ఇటు ఫారెస్ట్ సిబ్బందిని - అటు పైన పోలీసు శాఖనీ మేపాలి. మీకు తెలియనిదేముంది? లక్షా పాతికవేలు ఖాయం చేసుకోండి" అని ఈ వ్యాపారి - ఆ వ్యాపారి తో అనటం విని వీరూ షాక్ తిన్నాడు.
అంత డబ్బు తనకు తెలీకుండానే , తన చేతుల మీదుగా మారుతోందా? అని ఆశ్చర్యపోయిన వీరూ వెంటనే బయటకు వచ్చి లారీ ఎక్కి బ్రీఫ్ ని ఓపెన్ చేసి డబ్బు లెక్కేస్తే యాభై వేలుంది. వీరూకి కళ్ళు బైర్లు కమ్మాయి. అటవీ సంపాదకు అంత విలువుందా? అని మొదటిసారి తెలుసు కున్నాడు.
తనకు గౌండర్ పాతికవేలిస్తాడు తెమ్మని చెప్పాడు. ఈ వ్యాపారి యాభై వేలిచ్చాడు - ఆ వ్యాపారికి మాత్రం 75 వేలని చెప్పాడు.
అంటే......తన గురువు తన నుంచి పాతికవేలు దాస్తే. ఈ వ్యాపారి ఆ వ్యాపారికి మరో పాతిక వేలు కలిపి చెప్పాడు?!!
దేవుడిలా చూసుకుంటున్న గౌండర్ తనని మోసం చేస్తున్నాడు. తనకు అబద్దాలు చెబుతున్నాడు. తనెంత రిస్క్ తీసుకొని సరుకుని అడవి దాటిస్తున్నాడు? ఎంత నిజాయితీగా బ్రీఫ్ కేస్ తెరవకుండా తెచ్చిస్తున్నాడు ? కొన్నిసార్లు ప్రమాదం అంచుల్లోకి కూడా తను వెళ్ళి చావు తప్పి కన్ను లోట్టపోయిన పరిస్థితుల్లో బయటపడ్డాడు. అలాంటి తనని మోసం చేస్తాడా?
కేవలం బావి తవ్వించుకోటానికి డబ్బడిగితే - లేదని , గార్డ్ కి మాత్రం రెండో ప్యామ్లికి అడిగినంత డబ్బిస్తాడా? చూస్తాను ....అని పగబట్టిన వీరూ బ్రీఫ్ లోంచి పాతికవేలు తీసి, వాటిని ముందుగా తన ఊరు వెళ్ళి, తన చెల్లెలికిచ్చి అప్పుడు గౌండర్ దగ్గరకు వెళ్ళాడు.
"మర్చేపోయాను - ఎంత తెమ్మన్నావు డబ్బు " అని కావాలనే అడిగాడు వీరూ.
గౌండర్ కి అనుమానం రాలేదు వీరూ మీద.
అందుకే పాతిక వేలన్నాడు. వీరూ బ్రీఫ్ అందించాడు.
గౌండర్ ఇచ్చిన సొమ్ము తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడు వీరూ. ఆ తరువాత గౌండర్ బ్రీఫ్ కేస్ తెరచి డబ్బు లెక్కపెట్టుకొని షాక్ తిన్నాడు. వీరూని అనుమానించాడు. వీరూని పిలిపించి కదిగేయాలనుకున్నాడు. కాని ఫారెస్ట్ గార్డ్ అడ్డుపడటంతో ఆగిపోయాడు.
"మరో పాతిక ఏదని నువ్వడుగుతావు? మరో పాతికేమిటి? పాతికవేలే ఇస్తారన్నావ్....? అని వీరూ అంటాడు....అప్పుడేమంటావ్ ....? యాభై అంటావా? అంటే నువ్వు చేస్తున్న మోసాన్ని నువ్వే అంగీకరించి నట్లవుతుంది. మనమిప్పుడు తేలు కుట్టిన దొంగల్లాగే ఉండిపోవాలి. అదను చూసి దెబ్బ తీయాలని గార్డ్ చెప్పిన పధకం గౌండర్ కి బాగా నచ్చింది.
మరికొన్నాళ్లకు గౌండర్ ఒక లారీ సరుకు అప్పగించి ఎప్పటిలాగే పాతిక తెమ్మని చెప్పాడు. మరో మాట కూడా కావాలనే యధాలాపంగా అన్నాడు, వీరూకి అనుమానం రాకుండా ఉండేందుకు.
"మొన్న నువ్వు తెచ్చిన పాతిక బ్రీఫ్ కేస్ తో సహా ఎమ్. ఎమ్ హిల్స్ రెంజర్ పట్టుకెళ్ళి పోయాడు. ఇలా నువ్విచ్చావో లేదో అలా తీసుకెళ్ళి పోయాడు. అందులో ఎంతుందో కూడా చూసుకోకుండా తీసుకెళ్ళిపోయాడు ఏం చేస్తాం....? తప్పదు మరి" అని అన్నాడు.
దాంతో వీరూకి అనుమానం తీరిపోయింది. ఊపిరి పీల్చుకొని లారీ ఎక్కాడు. తను కొట్టేసిన పాతికవేలు ఆ విధంగా బయటపడనందుకు. ఆ మరుక్షణం గౌండర్ దగ్గర వేలకు వేలు తినే గార్డ్ - గౌండర్ సొమ్ములో వాటా తీసుకునే రెంజర్ సహాయంతో వల పన్ని - సీన్ లోకి తాము రాకుండా మరో రెంజర్ కి ఇన్ ఫర్మేషన్ అందించాడు. ఆ రేంజర్ స్ట్రిక్ట్ కావటంతో వీరూ లారీని పట్టుకొని- లారీని సీజ్ చేసి - వీరూని అరెస్ట్ చేసి స్టేషన్ కి అప్పజెప్పాడు.
అప్పటికి అది గౌండర్ పన్నిన వలె అని వీరూ అనుమానించలేదు.
వీరూ లాకప్ రూమ్ లోకి తోయ్యబడ్డాడు.
ఆ స్టేషన్ ఎస్.ఐ. కూడా గౌండర్ వాటాదారుడే , అది వీరూకి తెలీదు.
"నువ్వు లీడర్ వా? చచ్చిన దరిద్రపు వెధవకు నష్టపరిహారం అడుగుతావా? ఊరి ప్రజల్ని పనిలోకి వెళ్ళవద్దని కట్టడి చేస్తావా?" అంటూ టార్చర్ కి గురి చేస్తుండగా వీరూకి అనుమానం వచ్చింది - అది ఆ కంట్రాక్టర్ పనేఅని - అదను కోసం చూసి దెబ్బ తీశాడని అనుకున్నాడు, దెబ్బలని ఓర్చుకుంటూ.
ఆ కంట్రాక్టర్ - గౌండర్ పార్టనర్స్ అని - "వీరూని అనవసరంగా నాయకుడ్ని చేయకు - తెలివిగా దువ్వి వాడుకుందామ"న్న సలహా మీద గౌండర్ వీరూని దగ్గరకు తీసినట్లు వీరూకి తెలీదు.
అవే రాజకీయాలంటే....
తను అరెస్ట్ అయిన సంగతి - లారీ సీజ్ అయిన సంగతి గౌండర్ కి తెలిస్తే - డబ్బిచ్చి తనను విడిపిస్తాడని వీరూ ఆశపడ్డాడు. తను అరెస్ట్ అయిన వార్తను పక్క లాకప్ రూమ్ లో ఉన్న ఒక చిన్న రౌడీకి కొంత డబ్బిచ్చి అతను విడుదలయ్యే ముందు చెప్పి పంపించాడు.
అది గౌండర్ కి తెలిసినా తెలీనట్లే ఉండిపోయాడు. కేస్ ఫైల్ చేయకుండా - కోర్ట్ కి హాజరు పర్చకుండా వారం రోజులు వీరూని కుళ్ళ బొడవమని ఆ స్టేషన్ ఎస్. ఐ కి మాత్రం డబ్బు పంపించాడు గౌండర్.
రోజూ రెండు మూడు సార్లు లాకప్ లో వీరూని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గౌండర్ - కాంట్రాక్టర్ - ఫారెస్ట్ గార్డ్- రెంజర్ ఆ విషయాన్ని తెలుసుకొని కాళ్ళ బేరానికి రానున్న వీరూని తలుచుకొని అనందించసాగారు.
ఈలోపు ఎందుకైనా మంచిదని గౌండర్ తన మీద తనే ఒక పుకారు లేవదీసుకున్నాడు. వీరూ అదృశ్యమై పోయాడని, అడవిలో ఏ క్రూర జంతువయినా అతన్ని పొట్టన పెట్టుకుందేమోనని, తన ప్రియ శిష్యుడు తనకు దూరమై పోయినందుకు గౌండర్ కన్నీరు మున్నీరై పోతున్నాడనేదే ఆ పుకారు, దాని మూలంగా గౌండర్ మనాదితో మంచం పట్టాడని - చేతి కందిన కొడుకు దూరమైనంతగా ఇదయి పోతున్నాడని , వీరూ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి కొంత సొమ్ము కూడా ముట్ట జెప్పాడని కూడా పుకారు పుట్టించాడు.
ఎందుకైనా మంచిదని వీరూ ఇంటికి వెళ్ళి , వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి , కొంత డబ్బు కూడా యిచ్చి వచ్చాడు. రేపు వీరూ తిరిగొచ్చాక అటు కంట్రాక్టర్ దెబ్బకు భయపడటం - ఇటు తన ఔదార్యానికి కట్టుబడటం జరిగి , తిరిగి తను చెప్పినట్లు చేస్తాడని గౌండర్ ఆశ.
కానీ అవలించకుండానే పేగులు లెక్కించగల తెలివితేటలు, కావాలనుకొనేవాడికి ప్రాణ మివ్వటం - కాదనుకొనేవాడి ప్రాణాలు తియ్యటం అనేంత స్థాయికి ఆ లాకప్ రూమ్ రోజురోజుకి అతన్ని తీసుకెళ్తుందని ఊహించలేకపోయాడు.
ఈలోపు వీరూ అరెస్ట్ అయి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కస్టడిలో ఉన్నట్లు తెలుసుకున్న వీరూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై పొతే - అమాయకురాలైన వీరూ చెల్లెలు అన్నమీద ప్రేమతో వెనకా ముందు చూసుకోకుండా స్టేషన్ కెళ్ళిపోయి ఎస్.ఐ కాళ్ళ వీళ్ళా పడింది.
అప్పుడే అక్కడి కొచ్చిన గౌండర్ మనుష్యులైన రెంజర్, గార్డ్ ఆ దృశ్యాన్ని చూశారు. వీరూ చెల్లెళ్ళు ఇద్దరూ అందమైన వాళ్ళే - ఆ ,మారుమూల ప్రాంతంలో అంత అందగత్తెలుండటం చాలా అరుదు. పైగా పరువంలో ఉండటం - ఆ సమయంలో వాళ్ళు మందులో ఉండటంతో వారిలో విచక్షణా జ్ఞానం కోల్పోయి , కామం పడగేత్తింది. వీరూ చెల్లెల మీద వారి కన్ను పడింది.
వీరూని మచ్చిక చేసుకోగల ఖడ్గమృగంగా - శీలం గురించి పెద్ద నమ్మకాలు లేని గిరిజన యువకుడిగా భావించారు తప్ప - అతనిలోని సెంటిమెంట్ ని దెబ్బకొట్టి నిద్రిస్తున్న చిరుతపులితో అడుకోబోతున్నామని గానీ గ్రహించలేదు. వీరూ పిల్లి అనే గానీ ఆ పిల్లి జాతికే చెందిన చీటా అని గాని ఊహించలేదు.
"మీ అన్నను వదలాలంటే నువ్వు మాతో గడపాలనే నిబంధన పెట్టారు. లేదంటే కేస్ పైల్ చేసి సెంట్రల్ జైలు కి పంపిస్తాం . గంధం చెక్క ఏనుగు దంతాల స్మగ్లింగ్ చాలా పెద్ద నేరమని చెప్పటంతో ఆ అమాయకురాలు మరింత భయపడి పోయింది.


