అప్పుడు వీరూకి పంతొమ్మిదో ఏడు వచ్చింది.
పెళ్ళి - ఈడే - ఆ ప్రయత్నాలు కూడా తల్లి దండ్రుల వైపు నుంచి జరిగాయి. కాని వీరూ అందుకు ఒప్పుకోలేదు. కారణం ముందు తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావాలని.
అప్పుడే ఒక యువతి - పేరు తెలీదు - వీరూ వల్ల ఆకర్షణను పెంచుకుంది . ఎప్పటికయినా అతన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ వీరూ చెల్లెళ్ళతో స్నేహం పెంచుకుంది.
వీరూ చెల్లెళ్ళ ద్వారా తనను పెళ్ళి చేసుకొమ్మని , వీరూ మీద ఒత్తిడి తెప్పించేది - వెంటపడి వేదిస్తుండేది - అయినా వీరూ చలించలేదు.
మొదటి నుంచి వీరూకి కుక్కలన్నా - కోతులన్నా చాలా ఇష్టం. గుర్రం తరువాత తెలివైన పెంపుడు జంతువులూ , విశ్వాస పత్రమైనవి, కుక్క , కోతి అనే ఉద్దేశం అంతర్లీనంగా ఉండేదేమో తెలీదు. అందువల్లనే వాటిమీద తనకు ప్రేమేమో కూడా తెలీదు.
వీరూకి వయస్సు పంతొమ్మిదే అయినా పాతికేండ్ల వాడిలా , దృడంగా బలంగా ఉండేవాడు. గురిచూసి కాల్చటమే కాదు - శబ్దాన్ని బట్టి కూడా రైఫిల్ ని ఫైర్ చేయటం, వాసన బట్టి ఏ జంతువయింది, ఎంత దూరంలో ఉందీ పసిగట్టటం - భూమి ఆదరటాన్ని బట్టీ ఎన్ని జంతువులయిందీ - ఏ దిక్కు నుంచి వచ్చేది ఇట్టే చెప్పగల సూక్ష్మ దృష్టి - అప్రమత్తత అబ్బాయి.
ఎలాంటి ప్రాంతంలో నైనా లేడి కంటే వేగంగా పరిగెత్తగలగటం , కొండల్ని, గుట్టల్ని అవలీలగా ఆయాసం లేకుండా - రాకుండా ఎక్కగలటం - దిగ గలగటం , చలికి, వర్షానికి , మంచుకి,ఎండకి , వేడికి తట్టుకోగలగటం , చెట్ల కింద, మంచెల కింద , కొండ వాల్లుల్లో, పర్వత శ్రేణుల తోరల్లో, లోయల్లో , గుహల్లో జీవించగలగటం. అడవిలో దొరికే ఏ ఆహారాన్నైనా తిని జీర్ణించుకోగలగటం - రోజు రోజుకు శారీరక దృడత్వాన్ని పెంచుకోవటం - వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవటం అతనికి బాగా వంట బట్టాయి.
పైగా అడవిలో జీవించటం అతనికి ఒక వ్యసనమై పోయింది. ఇటీజ్ హిజ్ అన్ డిటాచ్ బుల్ అబ్సెషన్.....
ఇకపోతే గౌండర్ కి వయస్సు మీరేకొద్దీ వీరూ మీద ఆధారపడటం ఎక్కువయింది.
గంధం చెక్కని కొనే వ్యాపారుల్ని , ఏనుగు దంతాల్ని కొనే వ్యాపారుల్ని వీరూకి పరిచయం చేయటమే కాకా , వారి ముందు వీరూని తన కొడుకులా ఎస్టాబ్లిష్ చేశాడు. సరుకుని ఎలా దాటించటం - ఎక్కడకు చేర్చటం డబ్బెలా తీసుకు రావటం - ఎంత సరుక్కి ఎంత డబ్బు , అనే వివరాలు క్షుణ్ణంగా నేర్పాడు.
వీరూకు మాట తప్పటం - మాట మార్చటం - దొంగ బుద్ది తెలీదు. లక్షలు తెసుకొచ్చి గౌండర్ కిచ్చినా పైసా ముట్టుకొనేవాడు కాదు. అంత నిజాయితీని , విశ్వసనీయతను చూపెట్టేవాడు.
హరిహరాదులే ఎదురయినా గౌండర్ అప్పగించిన సరుకుని వ్యాపారులకు అప్పజేప్పటం - వాళ్ళిచ్చిన డబ్బు తిరిగి తెచ్చి ఇవ్వటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
అయితే వీరూకి అప్పటికి కూడా ఆ వ్యాపారంలో చేతులు మారే డబ్బు వివరాలు తెలిసేవి కావు, ఎక్కువ డబ్బు తనకోస్తుందని తెలిస్తే తన సంపాదనలో వాటా అడుగుతాడని గాని- ప్రలోభపడవచ్చును అని గానీ వివరాల్ని తక్కువ చేసే చెప్పేవాడు గౌండర్.
30 సంవత్సరాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అడవుల్లో రారాజులా వెలుగుతున్న గౌండర్ కి , అతి శక్తివంతమైన పోచర్ గేంగ్స్ కి నాయకుడు అయిన గౌండర్ కి ఎవరిమాట కైతే తిరుగు లేదో - ఎవరికైతే ప్రతి ఒక్కరూ భయపడి చస్తారో - అలాంటి గౌండర్ కి తను ప్రధాన శిష్యుడు కావటం - విశ్వాస పాత్రుడు కావటం - క్యాష్ డీలింగ్స్ నిర్వహణ బాధ్యతను పొందగలగటం గొప్ప ప్రివిలేజ్ గా భావించి - మరేమీ ఆలోచించే వాడు కాదు వీరూ.
గౌండర్ దగ్గరకు రాజకీయ నాయకులూ సయితం వచ్చి పార్టీ ఫండ్ ఎలక్షన్ ఫండ్ అడగటం చూసి మురిసిపోయేవాడు. తను అడక్కుండానే గౌండర్ భవిష్యత్ లో ఈ సువిశాల అటవీ ప్రాంతానికి రారాజు, వీరూనే నా వారసుడు వీరూయే , అని నలుగురు ముందు చెప్పటం గొప్ప గౌరవంగా భావించేవాడు వీరూ.
ఆ సమయంలోనే ఒక చిన్న సెంటిమెంట్ వీరూ జీవన గతినే మార్చివేసింది. అప్పట్లో గోపీనాధం గ్రామంలో మంచినీళ్ళ బావి లేదు. రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి కావెరీ నదిలో కడవలతో నీళ్ళు తెచ్చుకొనే వారు.
ఒకరోజు వీరూ చిన్న చెల్లెలు మంచినీళ్ళకనీ వెళ్ళి వస్తూ, కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో గాయాలు కూడా తగిలాయి. ఆ మాత్రానికే వీరూ కళ్ళనీళ్ళు పెట్టుకొని రెండు రోజులు చెల్లెలి మంచం దగ్గరే కుర్చుండిపోయారు.
గౌండర్ కబురు పెట్టినా వెళ్ళలేదు.
మూడో రోజు వీరూ తనే స్వయంగా గౌండర్ దగ్గరకు వెళ్ళి , జరిగింది చెప్పి బావి తవ్వించుకునెందుకు డబ్బు ఇవ్వమని అడిగాడు.
బావి తవ్వాలి, సిమెంట్ చప్టా కట్టాలి, గిలకలు వేయాలి , బకేట్స్ చాంతాడులు కొనాలని వీరూ ఉద్దేశం.
ఉడికినప్పుడు - అడిగినంతా ఇస్తే పనివాళ్ళు యజమానుల మాటలు వినడనే ఒక మూర్ఖమైన సిద్దాంతానికి వెళ్ళిన గౌండర్ , 'నా దగ్గర లేదు -- నిన్ననే అటవీ శాఖ సిబ్బందికి లంచాల రూపంలో పంచాన' ని అన్నాడు. దానికి నిట్టుర్చాడే తప్ప వీరూ మరే విధంగానూ రియాక్ట్ అవ్వలేదు.
వచ్చేముందు గౌండర్ ఒక మాట అన్నాడు -
పిచ్చి పిచ్చి సెంటిమెంట్లకు వేళ్ళకు - ఎవడిది వాడిదే భోగం , ఏ రోజుకారోజే స్వర్గం - నీ చెల్లెలి ఖర్మ అలా రాసి పెట్టి ఉంది - అందుకే అలా జరిగింది - దానికే ఇంత ఇదయిపోతావెం....? మన ఆడవాళ్ళకి ఈ కష్టాలు ఇప్పటివా? ఆ మాత్రమైన పని లేకపోతే సోమరి పోతులయి పోతారు.
నీ చేల్లెలంత సుకుమారమైందెం కాదులే - నీదేదో నువ్వు చూసుకో. ఇకపై నీకు నా వ్యాపారంలో వాటా కూడా ఇవ్వాలను కుంటున్నాను - వెళ్ళిరా రేపు సరుకు రెడీ అవుతుంది - అని అనేసి గౌండర్ అప్పుడే వచ్చిన ఫారెస్ట్ గార్డ్ ని లోనికి తీసుకెళ్ళాడు.
అప్పటికే వీరూ మనస్సు బాగా గాయపడింది.
తనను అన్నా పట్టించుకొనే వాడు కాదేమో....
ప్రాణానికి ప్రాణంగా చూసుకొనే చెల్లెల్ని అలా అన్నాడే అని చిన్న బుచ్చుకున్నాడు.
వెళ్ళబోయిన వాడల్లా , మరోసారి బ్రతిమలాడి చూద్దామని గౌండర్ ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఒక దృశ్యం కన్పించింది. ఆ దృశ్యాన్ని వీరూ చూస్తున్నాడని గౌండర్ కి గానీ, గార్డ్ కి గానీ తెలీదు.
గౌండర్ రెండు వేల రూపాయలు ఆ గార్డ్ కి ఇవ్వాతమే ఆ దృశ్యం . ఆ గార్డ్ తనకు రెండో ప్యామ్లీ ఉందని - మరో రెండు వేలు సర్దమనంటే గౌండర్ నవ్వి -" నివ్వడిగితే నేనెప్పుడన్నా కాదన్నానా? రెండో ప్యామ్లీ అన్నాక ఖర్చులుండవా" మరి అని మరో రెండు వేలు ఇవ్వటం ఆ దృశ్యానికి రెండవ భాగం.
ఆగ్రహావేశాలతో వీరూ కళ్ళు ఎర్రబడ్డాయి.
మరుసటి రోజు తనలోని భావాలను బయటకు కనబడనీయకుండా సరుకును తీసుకెళ్ళి కోయంబత్తూర్ లో అప్పగించి ఆ వ్యాపారిని రెండు వేలు ఇవ్వమని అడిగాడు. సరీగ్గానే ఇచ్చానే అని ఆ వ్యాపారి అన్నాడు. వీరూ తన అవసరం చెప్పి తనకి ఇవ్వమని అడిగాడు. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. సరుకు దింపి ఇచ్చిన డబ్బు సంచీ తీసుకొని లారీ ఎక్కబోతూ ఒక్క క్షణం ఆగాడు. పోనీ అప్పుగా ఇప్పుడు అడిగితే అని ఒక్క క్షణం అలోచించి తిరిగి వ్యాపారి గోడౌన్ లోకి వెళ్ళాడు.
గొప్ప యాదృచ్చికం....
ఆ వ్యాపారి లోపల బొంబాయి వ్యాపారితో సంభాషణ లో ఉన్నాడు. రేటు పెంచకపోతే ఎలా సాబ్.....! మీకు తెలియనిదేముంది ? అడవి నుంచి ఎన్నో చెక్ పోస్టు ల్ని దాటుకొని సరుకు రావాలి. ఎన్ని ఇబ్బందులుంటాయి....?


