వీరూలో మొట్టమొదటిసారి ఆవేశాన్ని, ఆవేదనని ఆక్రందనని కలగలుపుకొన్న కసి, ఉక్రోషం, బ్లాక్ పర్సనాలిటీ రూపంలో వేళ్ళూ ను కుంది. బహుశా అతనిలో తిరుగుబాటు ధోరణి ఏర్పడటానికి అదే తోలి కారణం అయి వుండవచ్చు.
మరుసటి రోజు మిత్రుడి శవాన్ని గ్రామం మధ్య పడుకోబెట్టి ఇకపై కూడా ఆ కంట్రాక్టర్ దగ్గరే పని చేయాలను కుంటే ఆ శవాన్ని దాటి వెళ్ళండని ఆవేశంగా అరుస్తూ , నానా రభసా చేశాడు వీరూ.
ఎంత అమాయకులైనా , జరిగింది తమ పట్ల అన్యాయమనే విషయం వారికీ తెలీకుండా పోలేదు. వాళ్ళకు వీరూ ఆవేశం, ఆవేదనా, అర్ధమై పనికి వెళ్ళటం మానేసి, శవం చుట్టూ చేరి ఏడుస్తూ కూర్చుండిపోయారు.
మేన్ పవర్ లేదంటే అడవిలో ఏమీ చేయలేని కంట్రాక్టర్ జరిగింది తెలుసుకొని పళ్ళు నూరాడు.
ముందుగా తేరుకున్నది వీరూనే.
ఊరి జనాల్ని పోగేసుకొని కాంట్రాక్టర్ ఉంటున్న ట్రావెలర్స్ బంగ్లా కి వెళ్ళాడు. అప్పుడు మిత్రుడి శవం వీరూ భుజం మీద వేలాడుతూనే ఉంది.
అప్పటికే కంట్రాక్టర్ పదిహేడు, పద్దెనిమిది ఏండ్లకే నాయకుడిలా పెరిగి ఊరిని తన కట్టుబాటుకి , సెంటిమెంట్ కి గురిచేసిన వీరూ మీద పగ, ప్రతీకారాల్ని పెంచుకొని ....కర్తవ్తం అని మధనపడుతూ మందు తాగుతున్నాడట. అతనితో పాటు అతనికి సహకరించే ఒక ఫారెస్ట్ రెంజర్, ఎక్స్ ప్లాయిటేషన్ విభాగం అధికారి ఒకరు, టేరి టోరియల్ విభాగం అధికారి ఒకరూ ఉన్నారు.
వీరూ మిత్రుడి శవాన్ని బంగ్లా వరండాలో పడుకోబెట్టి నష్ట పరిహారం చెల్లించమని డిమాండ్ చేశాడు.
అసలే కల్లు తాగిన కోతిలా వున్న కాంట్రాక్టర్ , దాంతో నిప్పు తొక్కినట్లు ఉగ్రరూపం దాల్చాడు.
"నేనివ్వను -----ఏం చేస్తారు? ఏం బెదిరిస్తున్నారా? వాడు తాగి పనిలోకి వచ్చాడు - తూలీ పడ్డాడు. నేను వ్యాపారం చేస్తున్నానా లేక ప్రజా వైద్యశాల పెట్టి వైద్యం చేస్తున్నానా?" అని బెదిరించాడా కంట్రాక్టర్.
"నువ్వు చేస్తున్నది వ్యాపారం కాదు - దాన్ని వ్యాపారం అనరు స్మగ్లింగ్ అంటారు. నా కళ్ళముందే నీ లారీ లేన్నింటినో చెక్ పోస్ట్ దాటించాను.
అధికారులకు, లంచాలివ్వటానికి, పార్టీ లివ్వటానికి వేలకు వేలు ఖర్చు పెట్టె నువ్వు, మావాళ్ళ కిచ్చే రోజు కూలి ఎంత..../ అయిన సహించి ఆ కూలికే చేస్తున్నారు.
ఒక నిండు ప్రాణాన్ని కాపాడటానికి నీ జీప్ ఇవ్వలేని నీవు నరరూప రాక్షసుడివి - పచ్చి స్వార్ధపరుడువి , అహంభావివి. మర్యాదగా నష్ట పరిహారం చెల్లించు ....."అంటూ తిరిగి ఎదురు తిరిగాడు వీరూ.
అప్పటివరకు సువిశాలమైన ఆ పశ్చిమ శ్రేణి అటవీ ప్రాంతంలో అలా ఎదురు తెరిగి మాట్లాడిన వారు లేరు - కనీసం ఒకింత హెచ్చు స్థాయిలోనైనా మాట్లాడగలిగిన వాళ్ళు లేరు.
దాంతో కాంట్రాక్టర్ , ఫారెస్ట్ సిబ్బందే కాదు వీరూ గ్రామ ప్రజలు వారితో కలిసి పనిచేసే చుట్టుపక్కల ప్రజలు సయితం ప్రపంచ వింతగా చూస్తున్న భ్రాంతికి లోనయ్యారు. కాలో నిజమో తెలీక విస్తు పోయారు. అదేక్కడి దారి తీస్తుందోనని భయపడి పోయారు.
కొద్ది క్షణాలక్కడ నిశ్శబ్దం అలముకుంది. బహుశా వీరుకి అప్పుడు తన తాతకు జరిగిన అన్యాయం తాలూకు సంఘటన గుర్తుకొచ్చి ఉండవచ్చు. అందుకేనేమో తన తోటి ఈడు వార్ని కనుసైగతో బంగ్లా నలువైపులా కమ్ముకోమన్నట్లు సంజ్ఞ చేశాడు.
తన ప్రజల్ని మంత్రించి మంత్రముగ్ధుల్ని చేయటం అప్పటి నుంచి ప్రారంభమయిందో ఏమో....?!"
"నష్టపరిహారం నేనివ్వను - ఏం చేస్తారు" అంటూ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు.
"అయితే పనిలోకి రాం....మేం లేకుండా నువ్వెలా స్మగ్లింగ్ చేస్తావో చూస్తాం.....?" అని వీరూ అడ్డం తిరిగాడు "గొర్రెలకు బుర్రలు మొలకెత్త కూడదు. అదే జరిగితే మనలాంటి వాళ్ళం జేబులు నింపుకోలేం , జల్సాలు చేయలేం -- అని పక్కనున్న రెంజర్ సలహా ఇచ్చాడు.
మత్తు తలకెక్కి ఉన్న కంట్రాక్టర్ రెంజర్ మాటల్లోని ఔచిత్యాన్ని గ్రహించలేక తిరిగి ఆగ్రహించాడు.
మిగతా ఇద్దరు అధికారులు కంట్రాక్టర్ చెవిలో ఏదో చెప్పారు.
"పనిలోకి రాకుండా ఎలా బతుకుతారు? బ్రతకండి చూస్తాన" ని సవాల్ విసిరాడు కంట్రాక్టర్.
ఆ పరిస్థితిని చివరకు వీరూ కూడా ఊహించలేదు. కానీ అక్కడి దాకా వచ్చాక ఇక తను వెనకడుగు వేస్తే ఎలా అన్న సందిగ్ధంలో పడ్డాడు కొద్ది క్షణాలు. వెంటనే తేరుకున్నాడు.
"అసలు నువ్వీ పనెలా చేస్తావు? నీ మీద గవర్నమెంట్ కి పిటీషన్స్ పంపిస్తానని ఊరికే నోటికొచ్చింది అన్నాడు బెదిరించాలని.
దానికి కంట్రాక్టర్ భయపడలేదు కానీ - అతని పక్కనున్న అటవీ శాఖ అధికారులు భయపడ్డారు. అటవీ సంపద దోచుకోబడుతోందని అప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కర్ణాకర్ణిగా వార్తలు వెళుతున్నాయని వారికీ తెలుసు.
అలాంటి వాళ్ళకు మాంసం ముక్కలు విసురుతూ , వారీ అమాయకత్వం పై సొమ్ము గడించాలి. తప్ప పిల్లుల్ని గదుల్లో వేసి కొట్టి ఎదురు తిరిగే స్థితికి వార్ని ఎదగనివ్వకూడదని క్షణాల్లో వాళ్ళు నిర్ణయాని కొచ్చారు.
కంట్రాక్టర్ చెవిలో తిరిగి ఏదో చెప్పారు.
ఇష్టం లేనట్లుగా ముఖం పెట్టినా , కంట్రాక్టర్ కి ఒప్పుకోక తప్పింది కాదు- మొత్తానికి రెండు వేలు నష్టపరిహారం ఇచ్చాడు కంట్రాక్టర్.
అప్పుడు వీరూ మీద ఆ ప్రాంత అమాయకపు ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది ? - సరిగ్గానే ఊహించగలరనుకుంటాను .
అది జరిగాక కంట్రాక్టర్, ఫారెస్ట్ అధికారులు వీరూ మీద ఓ కన్నేసి ఉంచారు.
ఈలోపు వీరూని ఎవరైతే చెక్ పోస్టు దగ్గర డైలీ వేజ్ కి పెట్టుకున్నారో , ఆ గార్డ్ ని కేరళ బోర్డర్ లో వున్న ఫారెస్ట్ రెంజ్ కి ట్రాన్స్ ఫర్ చేశారా అధికారులు.
దాంతో వీరూకి పనిలేకుండా పోయింది.
సరీగ్గా అదే సమయంలో ఒక నరరూప రాక్షసుడు లాంటి వేటగాడి దృష్టిలో కొచ్చాడు వీరూ. అతని పేరు సాలవై గౌండర్. నోటో రియర్ ఎలిఫెంట్ పోచర్ .....దాదాపు మూడు వందల ఏనుగుల్ని దంతాల కోసం చంపిన ప్రమాదకరమైన అడవి దొంగ.
అతను వీరూనే చేరదీశాడు. పని కల్పించాడు. వీరూ స్వగ్రామం గోపీనాధానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో వున్న కాలంగారు అనే గ్రామానికి చెందినవాడు. వీరూలోని ఒడుపు, వేగం, దృడ దీక్ష, ఏకాగ్రత ధైర్యం , మొండితనం గౌండర్ కి బాగా నచ్చాయి.
అప్పటి నుంచి వీరూ గౌండర్ కి ప్రియ శిష్యుడయి పోయాడు. గౌండర్ వీరూకి ఏనుగుల్నివేటాడ్డం బాగా నేర్పించాడు. అప్పటికే గౌండర్ కి వయస్సు మీరటంతో జవసత్వాలు ఉడికిపోయాయి. కానీ డబ్బు మీద ప్రేమ పోలేదు.
ఏనుగుల్ని (టాస్కర్స్) వేటాడి, చంపి, దంతాలను పెరుక్కోవటం తో గంధం చెట్లు నరికి స్మగుల్ద్ చేయటం కూడా గౌండర్ కార్యకలాపాల్లో ఒకటి.
గౌండర్ బాగా పిసినారి.
చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని తన పనికి వాడుకొని , అతి తక్కువ కూలి ముట్టజేప్పే వాడు. గౌండర్ మీద వీరూకి గౌరవాభిమానాలున్నా, తన గురువు పిసినారితనం నచ్చేది కాదు.
విచిత్రం ఏమిటంటే గౌండర్ కి దైవభక్తి ఉండటం. ఏనుగుని చంపి వచ్చినప్పుడల్లా దేవుడి గుడి ముందు లెంపలేసుకొనేవాడు మరెందుకో. ఇంకేందుకో సరీగ్గా తెలీదు గానీ వీరూకి కూడా దైవభక్తి వచ్చింది.
వీరూకి తన ఇద్దరు చెల్లెళ్ళ అంటే చచ్చేంత ప్ర్రేమ - వార్ని చూడకుండా ఉండలేకపోయేవాడు. వారేది అడిగినా కాదనలేకపోయేవాడు.


