"తల్లీ ఉమా! నీమీద అందరం గంపెడాశలు పెట్టుకున్నాం! ఇలా అన్యాయం చేస్తావా?" అని బావురుమంది కామాక్షమ్మ.
"ఎంతో ధైర్యంతో ఎన్నో గడ్డుపరిస్థితుల నెదుర్కొని నిలిచావు. జీవితాన్నే నీ అదుపులోకి తెచ్చుకున్నావు. చిట్టచివరకు నువ్వూ ఓడిపోయావా?" ఆక్రోశించింది శోభ.
ఉమ చలపతివంక నిదానించి చూసింది. చలపతి కర్థమయింది. మంగళసూత్రాలు తెచ్చి ఉమ మెళ్ళో వేశాడు. రావునూ, శోభనూ మార్చి మార్చి చూసింది ఉమ. ఇద్దరూ తలలు వంచుకున్నారు. కేశవ వంక తిరిగి చేతులు జోడించింది. మళ్ళీ ఉమ చూపులు చలపతి వంక తిరిగాయి. బలహీనంగా ఉన్న తన చెయ్యి జాపింది. ఆ చేతిని ఆప్యాయంగా గుండెల కదుముకుని ముద్దుపెట్టుకున్నాడు చలపతి. అంతలోనే అతని పెదవులనుంచి నిర్జీవంగా రాలిపోయిందా చెయ్యి.
36
ఉమ మరణానికి తానే కారణమని కుమిలిపోతున్న కేశవను మరపించటానికి అతని దగ్గరే ఉండిపోయాడు రావు.
"శోభ అన్నట్లు ఉమ ఒకరకంగా పిరికిది" అన్నాడు. అహర్నిశలూ ఉమను గురించే ఆలోచించే కేశవ.
ఎప్పుడు కేశవ ఉమ పేరెత్తినా అతనిని మరపించే రావు మనసు శోభ పేరు వినగానే గతులు తప్పింది.
"శోభ నీకెలా తెలుసు?"
"నేనుకూడా కొంతకాలం ఆ యువజన సాంస్కృతిక మండలిలో ఉన్నవాడినేగా? అదీగాక ఒక విచిత్ర సంఘటన ద్వారా ఆ పరిచయం బలపడింది."
"ఏమిటా విచిత్ర సంఘటన?" కుతూహలంగా అడిగాడు రావు.
"ఒకనాడు నేను అనుకోకుండా మన మూర్తి ఇంటికెళ్ళాను. ఆనాడు నేను చూసిన దృశ్యం ఇప్పటికీ మరిచిపోలేను. శోభ మహంకాళిలా కళ్ళలోంచి నిప్పులు రాలుస్తూ తన కాలిచెప్పుతో మూర్తి చెంపలు వాయించేస్తూంది. నన్ను చూసి ఆగిపోయింది.
"చూడండి కేశవరావుగారూ! ఈ దుర్మార్గుడు వాళ్ళావిడ టీకి రమ్మంటూందని ఎవరూ లేనిసమయంలో పిలిచి పశువులా ప్రవర్తించబోయాడు. పశువుకి చెప్పినట్లే బుద్ధి చెప్పవలసి వచ్చింది." అంటూ చీదరింపుగా మూర్తిని చూసి విసురుగా వెళ్ళిపోయింది.
"ఆవిడ మనోనిబ్బరానికి, ధైర్యానికీ ఆశ్చర్యపోతూ మూర్తి వంక చూశాను.
"వాతలు తేలిక చెంపలు తడుముకొంటూ 'వగలాడివేషాలు, భోగం వేషాలన్నీ వేసి వేసి చటుక్కున పతివ్రతలైపోతారు' అన్నాడు కసిగా.
"మూర్తి అవస్థకి జాలేసింది.
"అతని పరాభవానికి నవ్వొచ్చింది.
"ఇంకా వదలని అతని సంకుచితత్వానికి కోపం వచ్చింది.
'ఎందుకొచ్చిన గొడవలివి మూర్తీ! భార్యాపిల్లలూ ఉన్నవాడివి. ఆవిడ వేషాలజోలి నీకెందుకూ? నీ సంసారం నువ్వు చేసుకోరాదా?" అన్నాను సౌమ్యంగా.
"మనసులో ఏమనుకున్నాడో, పైకేం మాట్లాడలేదు మూర్తి.
"తరువాత శోభను క్షమాపణ వేడుకున్నాడనీ, తన తాత్కాలికమైన బలహీనతను క్షమించి తనను స్నేహితుడిగా అంగీకరించమని ప్రాధేయపడ్డాడనీ, మరెన్నడూ అనుచితంగా ప్రవర్తించనని వాగ్దానం కూడా చేశాడనీ తెలిసింది నాకు."
"ఆనాటి నుండీ శోభంటే సింహస్వప్నం మూర్తికి. పరిహాసం చెయ్యాలన్నా కూడా భయమే!
"నా చెప్పులు చాలా గట్టివి. ఎక్కడికైనా, ఎప్పుడైనా, నిర్భయంగా వెళ్ళగలను." అన్న శోభ మాటలు గుర్తొచ్చాయి రావుకు.
తనకర్థమయిన శోభకూ, మూర్తి పనికట్టుకు తన మనసులో సృష్టించిన శోభకూ మధ్యనున్న తెరలు కేశవ కథనంతో కరిగిపోయాయి.
"శోభ ఇప్పుడెక్కడుందో తెలుసా?"
"చలపతి ఇంట్లోనే ఉంది. రేపు వెళ్తానని చెప్పింది."
"నేను శోభను కలుసుకోవాలి. వస్తాను." అప్పటికప్పుడు లేచాడు రావు.
"కాని, ఆవిడ చెప్పులు గట్టివి" నవ్వాడు కేశవ.
రావు కూడా నవ్వాడు. "నాకు తెలుసు."
అతనికి ఒకనాటి శోభ చెంపదెబ్బ గుర్తుకొచ్చి చెక్కిలి తడుముకున్నాడు.
37
రావు ఇంటికి చేరుకునేసరికి అక్కడ శోభ అతనికోసం ఎదురుచూస్తూంది. రావును చూడగానే శోభ చటుక్కున లేచి నిల్చుంది.
"క్షమించండి. ఏ సీన్సూ సృష్టించడానికి రాలేదు. ఆశ నొక్కసారి చూడాలని వచ్చాను."
"నిస్సహాయుణ్ణి శోభా! ఆశనిప్పుడెవరూ చూడలేరు."
"ఇవాళ ఎంతటి అవమానానికయినా సిద్ధపడే వచ్చాను. పోనీయండి. ఆశను నేను చూడటానికి వీల్లేకపోతే పోయింది. ఈ చిన్న కానుక నేనిచ్చానని ఆశ కియ్యగలరా!"
ఫ్రాక్ నూ, బిస్కట్ల పాకెట్ నూ రావుకందియ్యబోయింది శోభ.
"పిచ్చిదానా! నువ్వు నాకెవరివో నీకు తెలియదు. నిన్ను అవమానించటం నన్ను నేను అవమానించుకున్నట్లు. నీకు ఏ కొంచెం బాధ కలిగించినా నన్ను నేను చిత్రవధ చేసుకున్నట్లు. నీకోసం చలపతి ఇంటికెళ్ళి నువ్వు లేవని తెలుసుకుని అక్కణ్ణుంచి వస్తున్నాను."
శోభ రావువంక విచిత్రంగా చూసింది.
"మీకంత దయుంటే ఆశ నొక్కసారి చూపించండి చాలు."
"నీకూ చూపించలేను, నేనూ చూడలేను. నాలాంటి కఠినాత్ముడితో వేగలేక తన పంతంకోసం, పట్టుదలకోసం పసిమనసులో మమకారాన్ని అర్ధంచేసుకోలేని తండ్రి సంకుచితత్వాన్ని క్షమించలేక నన్నంధకారంలో ముంచి శాశ్వతంగా ఈ లోకంలోంచి వెళ్ళిపోయింది."


