"ఈ పుస్తకం నాక్కావాలి" అన్నాడు ఆయనవేపు చూసి.
"మీరు సబ్ స్క్రైబరేనా... సబ్ స్క్రైబరైతే పట్టుకెళ్ళండి. నాకేం అభ్యంతరం లేదు. పదేళ్ళుగా ఆ పుస్తకాన్ని ఎక్కడుందో, అక్కడే చూస్తున్నాన్నేను. ఏ ఒక్కరు ముట్టుకున్న పాపానికి పోలేదు. మీరెందుక్కావలంటున్నారో నాకేం అర్థం కావడం లేదు.
చాలా ఆసక్తిగా అన్నాడు ఆయన.
"మంచి పుస్తకాన్ని చదవాలనుకోవడంలో తప్పులేదు కదా" జవాబిచ్చాడు మధుకర్.
"ఈ రోజుల్లో సెక్స్, బూతు, రొమాన్స్, వూహలు, మేడలు, వయోలెన్స్, గేంగ్ వార్స్ గురించి వున్న పుస్తకాల్నే అందరూ ఇష్టపడుతున్నారు. అందుకే దేశం ఇలా తగలబడిపోతుంది" లైబ్రేరియన్ తన ధోరణిలో అన్నాడు.
మధుకర్ పెదాలు విడవకుండా నవ్వుకున్నాయి.
"అయితే సబ్ స్క్రిప్షన్ కడితే ఇస్తారా?" అన్నాడు మధుకర్.
"ఓ! నిరభ్యంతరంగా" చెప్పాడాయన.
"సబ్ స్క్రిప్షన్ కి ఎంత కట్టాలి?" అడిగాడు మధుకర్.
"మీరు సబ్ స్క్రిప్షన్ కట్టినా యివాళ మాత్రం మీకా పుస్తకం రాదు. ఇవాళంతా అక్కడ కూర్చుని ఆ పుస్తకం చదువుకోండి. రేపుదయాన్నే తొమ్మిదికల్లా వస్తే, ఆ పుస్తకం మీకిస్తాను" ఆ వ్యక్తి చెప్పడంతో మళ్ళీ తన ప్రదేశంలోకి తనొచ్చి కూర్చున్నాడు మధుకర్.
అప్పటికి పదిన్నర గంటలయింది.
మరోసారి పుస్తకం తిరగేశాడు. ఆ పుస్తకంలో చాలా అమూల్యమైన విషయాలున్నాయి.
ఆ పుస్తకాన్ని వదలగూడదు. తన దగ్గర సబ్ స్క్రిప్షన్ కట్టే డబ్బు లేదు. కనుక దొంగతనం చేసి ఎందుకు తీసికెళ్ళకూడదు? ఎవరికీ అక్కర్లేని,ఉపయోగపడని పుస్తకం తనకు వుపయోగపడుతుంది అనుకున్నప్పుడు తను తీసికెళ్ళడంలో తప్పులేదు. అక్కడ నుంచి ఎలాగయినా తీసికెళ్ళాలనే నిర్ణయానికొచ్చాడు.
ఎలా... ఎలా... ఎలా... తీసికెళ్తాడు?
ఆ గది నాలుగువేపులా చూశాడు. కిటికీలోంచి బయటకు విసిరేసి, కిందకెళ్ళి పట్టుకుపోదామంటే కిటికీలన్నీ గట్టిగా మూసి వున్నాయి. ఇలాంటి దొంగతనాలకు ఆస్కారం వుంటుందనే మూసేసారేమో...
తలతిప్పి- దూరంగా కన్పిస్తున్న లైబ్రేరియన్ టేబుల్ వేపు చూశాడు.
అక్కడ కూర్చున్న వ్యక్తికి అనుమానం వచ్చిందేమో... మధుకర్ వేపే చూస్తున్నాడు.
ఎలా... ఎలా... ఇక్కడనుంచి దీనిని తీసికెళ్ళడం ఎలా...
జనరల్ బుక్స్ విభాగానికి ఆనుకుని చిన్నపిల్లల డివిజన్ వుంది. అక్కడ దాదాపు ఒక పదిహేనుమంది పిల్లలు, అందరూ అయిదు, పదేళ్ళలోపు పిల్లలు బొమ్మల పుస్తకాలు, కథలూ చదువుకుంటున్నారు.
అయిదేళ్ళ చిన్నపిల్లల పక్కన స్కూలు బ్యాగ్స్ వున్నాయి.
వాళ్ళందరూ చిక్కడపల్లిలో వున్న 'ఆగ్నేష్ కాన్వెంట్ స్కూలు'పిల్లలు.
అక్కడ ఒకచోట ఒక పాప బుద్ధిగా 'శ్రీ కృష్ణుడు' బొమ్మల కథల పుస్తకాన్ని చదువుకుంటోంది.
ఆరేళ్ళపాప ముద్దుగా, బొద్దుగా, తెలుపు, ఆకుపచ్చరంగు యూనిఫారంలో ఆకుతో కోసిన తెల్లగులాబీలా వుంది.
ఆ పాప దగ్గరకు నడిచాడు. ఆ పాప పక్కనేవున్న 'స్కూల్ బేగ్' వేపు చూస్తూ-
పక్కన కూచుని ఏం బేబీ, ఏం పేరు నీ పేరు..." అని అడిగాడు.
ఆ బేబీ సీరియస్ గా తలెత్తి తనవేపే చూసి నవ్వుతున్న అంకుల్ అందమైన ముఖాన్ని చూస్తూ-
"డాలీ" అంది ముద్దుగా.
"గుడ్... నేమ్..."
"ఏం క్లాస్ చదువుతున్నావ్?"
"ఫస్టు క్లాస్..." చెప్పింది.
"రోజూ ఇక్కడకొస్తావా... నువ్వు..."
"బుక్స్ రీడింగ్ పీరియడ్ వున్నప్పుడు వస్తాం" అని చెప్పి మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోయింది సీరియస్ గా.
పిల్లలందర్నీ చూస్తూ, ఆ పాప చుట్టూ అటు యిటూ తిరిగి, ఆ పాప హేండ్ బేగ్ లో తన చేతిలోని బుక్ ని పడేశాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి జనరల్ బుక్స్ విభాగంలో కూర్చున్నాడు.
లైబ్రేరియన్ సీటువేపు చూశాడు. ఆ సీట్లో లేడాయన.
ఆ పిల్లలు ఎప్పుడు కదుల్తారా... అని ఎదురుచూస్తున్నాడు. పది నిమిషాల తర్వాత వాళ్ళు టీచర్ రావడంతో పిల్లలందరూ లేచారు. మధుకర్ కుర్చీలోంచి లేచాడు.
పిల్లలందరూ చిల్డ్రన్ విభాగంలోంచి బయటకెళ్లిపోయారు. వరండాలోంచి మధుకర్ గబగబా మెట్లు దిగి వెళ్ళి కింది హాల్లో, బయట లాన్ లో, గేటువేపు పరుగెత్తుకెళ్ళి చూశాడు.
ఎక్కడా ఆ పిల్లల జాడ కనబడలేదు.
"ఆ ఆగ్నేష్ స్కూలెక్కడో, ఆ స్కూల్లో ఆ పిల్లెక్కడో ఏమిటో... అని మనసులో అనుకొని రోడ్డుమీద కొచ్చాడు. ఒకరిద్దర్ని ఆ స్కూలెక్కడుందో అడగ్గా, వాళ్ళు చెప్పిన అడ్రస్ పట్టుకుని, మార్కెట్ ప్రాంతంలో వున్న స్కూలు దగ్గరకొచ్చాడు. గబగబా లోనకెళ్ళబోతున్న మధుకర్ ని-
"అరె భాయ్... జరఠైరో... పేరెంట్ వా... లంచ్ టైమ్.. ఇంకో గంటుంది అప్పుడు రా..."
"రెణ్నిముషాల్లో వచ్చేస్తానయ్యా..."
"లాభంలేదు... స్ట్రిక్టంటే స్ట్రిక్టే..." లోనికెళ్ళనివ్వలేదు వాచ్ మెన్.
ఇంకో గంటసేపు తను ఇక్కడ వెయిట్ చెయ్యక తప్పదు- అనుకుంటూ ఎదురుగా వున్న ఫుట్ పాత్ మీద నిలబడ్డాడు మధుకర్.
అదే సమయంలో-
ఆ స్కూలు హెడ్ మిస్ట్రెస్ గదిలో కూర్చుంది మహతి. తన ప్రయత్నంలో భాగంగా ముందు ఇమ్మీడియట్ గా చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. ఆ హెడ్ మిస్ట్రెస్ సుధాచౌదరి, హేమలత పక్కింట్లోనే వుంటుంది. హేమలత రికమెండ్ చేయగా అక్కడకొచ్చింది మహతి.
"సీ... మై చైల్డ్... ఏం చదువుకున్నానన్నావ్..."
చెప్పింది మహతి.
"డిగ్రీల్లేని వాళ్ళకు, పూర్తికాని వాళ్ళకు ఉద్యోగాలిస్తే మా స్కూల్ ప్రెస్టేజేం కాను... మేం ఇప్పటివరకూ తీసుకున్న స్టాఫ్ అంతా డిగ్రీలుండడమే కాకుండా, ట్రైనింగ్ వున్నవాళ్ళూ, ఎక్స్ పీరియన్స్ డ్. అండర్ గ్రాడ్యుయేట్లని తీసుకోలేదు. ఓ పని చెయ్యి... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిరా... ఉద్యోగం ఇస్తాను" చెప్పింది హెడ్ మిస్ట్రెస్.
నవ్వొచ్చింది మహతికి, ఏదో సామెత గుర్తుకొచ్చింది.
"నాకు ఉద్యోగం చాలా అవసరం అండి... అందుకే హేమలత రికెమెండ్ చేసింది."
"అవునమ్మా... హేమలత రికమండ్ చేసింది కాబట్టే, ఈ ఇంటర్వ్యూకైనా నువ్వు రాగలిగావ్... ఉద్యోగం అవసరం అంటే ఖాళీలుండొద్దా?" అంది మహతి ముఖంవైపు తేరిపార చూసి.


