విషాదాంధ్ర
బాకాలు లాభంలేదు బాజాలు లాభంలేదు
ఎంత యీదినా ఎం ఫాయిదా ఎక్కడా తీరం కనపడదు
తలమాత్రం మీదికుంచి నిలువీత ఈదుతున్నాం
గమనం పిసరూ లేదు గమ్యం అసలే లేదు
పట్టాభిరావఁస్వామ్మీద ప్రమాణంచేసి చెబుతున్నా
అంతా గజీతగాళ్ళే మళ్ళీ అరగజం పురోగమనం లేదు
ఆదర్శప్రాయంగా అభినయిస్తున్నాం అయినా ఎవరూ మనల్ని చూడ్రు
అరుస్తున్నాం గొంతు చించుకుని అయినా ఎవరూ విన్రు
మనలో కొంతమంది కవులు మధురంగా నిశ్వసిస్తారు
యతిప్రాసలు సరిపోతాయి పదాలు మజాగా పడతాయి
పౌరుషానికి లోటులేదు ప్రశస్తికి కూడా డిటో
పద్యాలకి పళ్ళు రాలవు చింతకాయలు చెట్టుమీదే ఉన్నాయి
ఈ గొంగళీ వయస్సు ఇరవై అయిదేళ్ళు
ఇంకా ఎక్కువే అనుకో ఎవడు చూశాడు లెక్కలు
తీర్మానాలూ ఉపవాసాలూ చేశాం ఖద్దరూ కేకలూ వేశాం
మోసుకొచ్చాం స్వరాజ్యమ్మూట మూట విప్పితే ఏమీలేదు
అరవింద ఘోస్టు ఆశీర్వదించాడు కదా
ముమ్మిడివరం బాలయోగి ఏమంటాడో
ఆంజనేయదండకం వల్లిస్తేనో
అన్నట్టు సాయిబాబాకి మొక్కుకోకూడదూ
మహారణ్యంలో మధ్యాహ్నంలాగ ఒక స్తబ్దత నిశ్శబ్దత
రాత్రిపూట వేట ముగించుకొని కౄరమృగాలు నిద్రిస్తున్నాయి
చిల్లర జంతువులు భయంతో ఎక్కడివక్కడ ఇరుక్కుపోయాయి
ఎప్పుడేనా ఒక పక్షి ఎగిరితే ఎక్కడో ఒక ఆకురాలి చప్పుడు
శిశువుకి దక్కని స్తన్యంలాగ ప్రవహిస్తున్నాయి గోదావరి నీళ్ళు
బద్దలైన గుండెల్లాగా బీటలు వేశాయి పొలాలు
మన పరిశ్రమలు ప్రణాళికల్లోనే మన ప్రతిభ చాకిరీకి తాకట్టు
మనకో ఇల్లంటూ లేదు రచ్చకెక్కి రాద్ధాంతాలు
కొంగల్లారా జపం చెయ్యండి పిల్లీ పఠించు మంత్రాలు
ఎలకల్లారా సభ జరపండి ఎవరు గంటకట్టాలని
ఇంకోమారు ఎగరవే నక్కా ఈసారి అందవచ్చు ద్రాక్షపళ్ళు
కోతీ తీసుకురా త్రాసు పంపకం తెగడంలేదు.
- తెలుగు స్వతంత్ర - 29.7.1949


