"అదేమిటండీ! మేము ఎప్పుడైనా చూస్తాం. ముందు ఇంకా చాలా సమయం వుంది. మీలాంటివారు ఇంకెప్పుడు చూస్తారు? బయలుదేరండి" అన్నాడు వెంకట్రావు.
"మా నాయనే!" మనస్సులోనే మురిసిపోయింది పున్నమ్మ.
పున్నమ్మ విశాఖపట్నంలో వున్న ఆ రెండు నెలలూ అల్లుడూ కూతురూ రోజూ ఎక్కడికో ఒక చోటకు తీసుకెడుతూనే వున్నారు. కూతురు కాపరం చూసి పున్నమ్మ పొంగిపోయింది.
ఆరో నెల జొరబడకముందే కూతుర్ని తీసుకొని పున్నమ్మ పాలేనికి పయనం అయింది.
బయలుదేరివస్తూ నాగమ్మ భర్తకు ఎన్నో అప్పగింతలు పెట్టింది. వేళకు భోజనం చెయ్యమనీ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనీ ఇంకా ఏమేమో చెబుతూనే వుంది. కూతురూ అల్లుడి అన్యోన్యతనూ, సంసారాన్నీ చూసి "అసలు చదువుకున్న వాళ్ళ దారే వేరు. ఇన్ని రోజులుగా చూస్తున్నా - ఒకర్నొకరు పొరపాటుగా కూడా నొప్పించుకోలేదు" అనుకుంది పున్నమ్మ.
బండి బయలుదేరబోయేముందు కిటికీదగ్గర కూచున్న నాగమ్మ ప్లాట్ ఫారంమీద నిల్చున్న భర్త ముఖంలోకి దిగులుగా చూసింది. వెంకట్రావు చిరునవ్వుతోనేకనిపిస్తున్నాడు. కాని ఎందుకో అతనికీ చెప్పలేని దిగులుగా వుంది.
"నేను చెప్పింది గుర్తుందా?" చిలిపిగా చూస్తూ అన్నాడు భార్యతో వెంకట్రావు.
వెంటనే అర్ధంకాని నాగమ్మ తెల్లముఖం వేసింది.
"అదే.....అమ్మాయి......" కొంటెగా చూశాడు.
నాగమ్మ బుగ్గల్లోకి రక్తం చిమ్మింది. గులాబి ఛాయలు వెలుగు జిమ్ముతున్న పాలరాతి విగ్రహంలా ఉంది.
"లేదా నువ్వు మళ్ళీ విశాఖపట్నం రానక్కరలేదు...." తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అన్నాడు వెంకట్రావు.
నాగమ్మ ఉలిక్కిపడింది. భర్త సరదాకే అన్నా ఆ మాటల్లో ఆమెకు ఏదో అపశ్రుతి వినిపించింది. పున్నమ్మ నోరుతెరుచుకొని కూతురి వైపు చూసింది. బండి కదిలింది.
వెంకట్రావు కిటికీలోంచి భార్య చేతిని అందిపుచ్చుకొని మెత్తగా నొక్కాడు. ప్లాట్ ఫారం పైన భర్త కనిపించినంతవరకూ వంగి చూస్తూ చెయ్యి ఊపుతూనే వుంది. వెంకట్రావు కూడా కనిపించినంతవరకూ చెయ్యి వూపుతూ వీడ్కోలు యిచ్చాడు.
"ఏమిటే అమ్మాయ్! బండి బయలుదేరేముందు అల్లుడు ఏదో అన్నాడు!" సందేహంగా అడిగింది పున్నమ్మ.
నాగమ్మ మాట్లాడలేదు. ఆమెను ఆవరించిన దిగులు ఇంకా చుట్టుకొనే వుంది.
"ఏం తల్లీ! మళ్ళీ విశాఖపట్నం రావద్దంటాడేమిటి?" భయంగానే అడిగింది పున్నమ్మ.
నాగమ్మకు చెప్పాలంటే సిగ్గనిపించింది. మాట్లాడలేదు. కూతురు మౌనం పున్నమ్మను మరీ భయపెట్టింది.
"చెప్పమ్మా! నా దగ్గర దాపరికం ఎందుకూ?" దిగులుగా వుంది పున్నమ్మ కంఠస్వరం.
"ఏం లేదమ్మా, ఆయనకు ఆడపిల్లే కావాలంట!" అంటూ నాగమ్మ సిగ్గుతో ముఖాన్ని తల్లి గుండెల్లో దాచుకుంది. పున్నమ్మ ఆనందంతో పరవశమయిపోయింది.
"నా తల్లీ! ఎంత సిగ్గే నీకు?" అంటూ బిడ్డను గుండెలకు అదుముకుంది. వారికి ఆ బండిలో ఇతర ప్రయాణీకులు వున్నారనేది కూడా జ్ఞాపకం లేదు.
"పన్నెండువేల కట్నంతో లక్షరూపాయల అల్లుణ్ణి సంపాదించుకున్నాం!" అనుకుంది పున్నమ్మ.
13
పుట్టింటికి వచ్చిన నాగమ్మను అన్నలూ, వదినలూ ఆప్యాయంగానే ఆహ్వానించారు.
"పెద్దవాణ్ణి! నాగమ్మ పురుడు నా ఇంట్లోనే పోసుకుంటుందమ్మా" అన్నాడు సుబ్బారాయుడు."
"చిన్నవాణ్ణి గనుక ఆ అవకాశం నా కివ్వాలి" అన్నాడు నాగభూషణం.
"మీ ఇల్లూ నా ఇల్లూ ఏమిటిరా? నాకు తెలియదూ మీకు చెల్లెలంటే ఎంత అభిమానామో? ఇంక పెద్దవాళ్ళం మేము బతికి వున్నాంగా? ఆ తరువాత ఎటూ దానికి మీరే వున్నారు" అంది పున్నమ్మ.
"అలా అనకమ్మా! చెల్లాయి పురుడు అయిందాక నువ్వూ నాన్నా కూడా నా దగ్గరే వుండండి." ప్రాధేయపడుతూ అన్నాడు సుబ్బారాయుడు.
"నేను పెద్దవాణ్ణి వున్నాగా, మీకెందుకులే ఇప్పటినుంచే ఈ బాధ్యతలు అన్నాడు మాధవయ్య.
సుబ్బారాయుడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
"ఏమిటన్నయ్యా నీది మరీ చాదస్తం! అందరం ఒక ఇంట్లో ఒకేచోట వున్నాముగా. వేరు కుండలు కాగానే పరాయివాళ్ళం అయిపోయినట్లా! ఈ మర్యాదలేమిటి మనలో మనకి!" అంది నాగమ్మ.
నాగమ్మని ముగ్గురు అన్నలూ వదినలూ ఆప్యాయంగానే చూశారు. నాగమ్మకు తినాలని వున్న పిండివంటలు వదినలు పోటీపడి చేసి పెట్టారు. నాగమ్మ అప్పుడప్పుడూ వదినెల బలవంతంమీద అన్నల ఇళ్ళల్లో భోజనం చేస్తూ వుండేది. అన్నల పిల్లలు 'అత్తయ్యా' అంటూ ఒక క్షణం వదిలేవారు కాదు. మధ్యాహ్న సమయాల్లో నాగమ్మ వదినల దగ్గర కూచుని పట్నం కబుట్లు చెబుతూవుంటే వాళ్ళు కుతూహలంగా వినేవారు. తను పురుడు పోసుకొని వెళ్ళాక వాళ్ళందర్నీ రమ్మని రోజుకు ఒకసారయినా చెప్పేది.
నాగమ్మ ప్రసవించింది.
ఆడపిల్లను కన్నది.
అన్నలూ వదినెలూ, అందరూ హడావుడి చేశారు. ఆడపిల్ల అచ్చం నాగమ్మ పోలికే అన్నారు చూసినవాళ్ళంతా. ఆ మాటలు విని నాగమ్మ భర్తను తలుచుకుంటూ తృప్తిగా నిండుగా నవ్వుకొనేది.
సుబ్బారాయుడు బామ్మరిదికి ఉత్తరం రాశాడు బారసాలకు రమ్మనమని.
"మొగపిల్లవాడు కలిగితే బాగుండేది." భార్యదగ్గర గుణిసాడు మాధవయ్య.
"అల్లుడికి ఆడపిల్ల కావాలటండీ! మేము వచ్చేరోజు స్టేషనుకు వచ్చి ఆడపిల్లను కనకపోతే మళ్ళీ విశాఖపట్నమే రానక్కర్లేదు అన్నాడండీ!"
మాధవయ్య ముందు తెల్లబోయి, అంతలోనే తేరుకొని గొల్లున నవ్వాడు. ఆయన చాలాకాలానికి హాయిగా మనసారా నవ్వాడు.
"ఏమండీ!"
"ఆఁ- ఏమిటి?" భార్య ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మనం కూడా అమ్మాయి దగ్గరకే వెళ్ళి ఉందామండీ!" అంది పున్నమ్మ బతిమలాడుకుంటున్నట్లు.
మాధవయ్య అర్ధంకానట్లు చూశాడు. ఓ క్షణం గడిచాక అన్నాడు:
"నీకేమయినా మతిపోయిందా? ఇంత బతుకు బతికి......"
"తప్పేమిటి? మనకు ఏ పదిమంది వున్నారు గనుక!"
"అందుకని అల్లుడింట్లో వుండమంటావు. నలుగురు కొడుకుల్ని పెట్టుకొని!" విసురుగా అన్నాడు మాధవయ్య.
"అల్లుడింట్లో ఉంటే తప్పేమిటి? అల్లుడిల్లని కాదుగా- అమ్మాయి యిల్లని."
"చాల్లే వూరుకో. ఎవరయినా నవ్విపోతారు."
"కాదండీ! అలా అని అల్లుడే అమ్మాయితో చెప్పాడట. 'పెద్దవాళ్ళ అండ మనకూ వుంటుంది. వాళ్ళకూ కొంత మనశ్శాంతిగా ఉంటుంద'న్నాడట. అమ్మాయి వచ్చినప్పటినుంచీ ఒకటే గొడవ. అల్లుడు అందరిలాంటివాడు కాదండీ! ఎంత మంచివాడో! 'అత్తయ్యగారూ! అత్తయ్యగారూ!' అంటూ ఎంత యిదిగా పిల్చేవాడనుకున్నారు?"
మాధవయ్య ఆలోచనలో పడ్డాడు.
"మీకు అంతగా ఇష్టం లేకపోతే కొంతకాలం వెళ్ళివద్దాం. పసిపిల్ల తల్లిని ఒంటరిగా ఎలా పంపించను? మీరు ఈ వయసులో చెయ్యి కాల్చుకోవటం నా కిష్టంలేదు" అంది పున్నమ్మ భర్త జవాబుకోసం ఎదురుచూస్తూ.
"సరే, చూద్దాంలే!" అన్నాడు మాధవయ్య.
"నాన్నా!" పెద్దకొడుకు సుబ్బారాయుడు వచ్చాడు.
"ఏరా! పొలంనుంచి వచ్చి ఎంతసేపయింది?" అన్నాడు మాధవయ్య.
"ఇప్పుడే వస్తున్నాను. వస్తూవస్తూ వెంకట్రావుని తప్పక రమ్మని ఉత్తరం రాసి పడేసి వచ్చాను" అన్నాడు.
"నేను కూడా రాశాలే. తప్పక వస్తాడనే అనుకుంటాను" అన్నాడు మాధవయ్య.
"బారసాలకు ఎంతవుతుంది నాన్నా? తమ్ముళ్ళు కూడా అడగమన్నారు. తలకొక రెండొందలు వేసుకుందాం అనుకుంటున్నాం!" నీళ్ళు నములుతూ అన్నాడు సుబ్బారాయుడు.
మాధవయ్య సుబ్బారాయుడి ముఖంలోకి అదోలా చూశాడు. ఆ చూపుని తట్టుకోలేని సుబ్బారాయుడు తల తిప్పుకున్నాడు. తల్లివైపు చూశాడు. తల్లికూడా ఆలోచిస్తూ ఎక్కడో చూస్తూంది.
"ఏం నాన్నా?" తలవంచుకొని అన్నాడు.
"ఎందుకురా! మొన్ననే పంట అమ్మానుగా, ఆ డబ్బు వుందిలే" అన్నాడు తండ్రి.
తండ్రిమధ్యా తమమధ్యా చాలా పెద్ద ఆగాధమే ఏర్పడినట్లు అనిపించి బాధపడ్డాడు సుబ్బారాయుడు. బరువుగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
"పోనీ తీసుకోకపోయారా? బిడ్డ మరీ చిన్నపుచ్చుకున్నాడు!" అంది పున్నమ్మ. ఎంత కాదన్నా మాతృహృదయం.
"నువ్వూరుకో! నేను బతికుండగానే నా బిడ్డ మొదటికాన్పు ఖర్చు చందాలమీద జరిపిస్తారనుకున్నారా?"
"చందా లేమిటండీ? అన్నలేగా ఆ మాత్రం ఇయ్యతగరా?"
"అది వాళ్ళనుకోవాలిగా? నా దగ్గరకొచ్చి తలవొక రెండు వందలు వేసుకోవాలనుకుంటున్నాం అంటాడా?" మాధవయ్య గుర్రు మన్నాడు.
పున్నమ్మ మరి మాట్లాడలేదు.
ఇరవై ఒకటోరోజున పిల్లను తొట్లోవేసి బారసాల చేశారు. దగ్గర వాళ్ళను పదిమందిని పిల్చి చేతులు కడిగించింది పున్నమ్మ. ముగ్గురు వదినెలూ నాగమ్మకు పట్టు చీరెలు పెట్టారు. సుబ్బారాయుడు పిల్లకు పులి గోరుతో గొలుసు చేయించాడు. రామదాసు మొలకు బంగారు మొలతాడు చేయించాడు. నాగభూషణం చేతులకు మురుగులు చేయించాడు.
"దానికేం తక్కువ? నలుగురు అన్నలున్నారు, రామలక్ష్మణుల్లా!" అనుకుంది ఇదంతా చూస్తున్న పున్నమ్మ.
బారసాలనాటికి వచ్చిన బావమరిదిని బావలు చాలా గౌరవించారు.
వెంకట్రావు కూతుర్ని చూసుకుని మురిసిపోయాడు.
"చూశావా నా పంతమే నెగ్గించుకున్నాను" అన్నాడు వెంకట్రావు భార్య కళ్ళలోకి లోతుగా చూస్తూ.
"మహా గొప్ప" ముద్దుగా మూతి తిప్పింది నాగమ్మ.
పిల్లకు నాగమ్మ ఇష్టప్రకారమే "పార్వతి" అని నామకరణం చేశారు.
వచ్చినప్పటినుంచీ వెంకట్రావు ఖళ్ళు ఖళ్ళున దగ్గటాన్ని గమనించింది నాగమ్మ.
"మరీ చిక్కిపోయారు. ఒక్కటే దగ్గుతున్నారు. వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను ఒంట్లో బాగుండటం లేదా?" భర్త మొహంలోకి దిగులుగా చూస్తూ ప్రశ్నించింది నాగమ్మ.
వెంకట్రావు చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు.
"నవ్వుతారేం? నేను వచ్చేటప్పటికి ఎంత బాగున్నారు? ఈ నాలుగు నెలల్లోనే ఏమయింది మీకు? హోటలు భోజనం పడటంలేదా?" బాధ ఉట్టిపడే గొంతుతో పలికింది.
"ఏం లేదు, బాలా! ఆ మధ్య ఏదో నాలుగు రోజులు కాస్తజ్వరం వచ్చింది. అదే తగ్గిపోతుందిలే. అంత భయపడాల్సిందేమీలేదు. హోటలు భోజనం కదా! మళ్ళీ నువ్వు రాగానే మామూలుగా అవుతాను" అన్నాడు వెంకట్రావు మామూలుగానే."
కాని నాగమ్మకు మాత్రం ఏదో దిగులు దిగులుగా అనిపించింది.
పున్నమ్మ, మాధవయ్య కూడా అల్లుణ్ణి ఆరోగ్యం గురించి మరీ మరీ హెచ్చరించారు.
బారసాల అయిన రెండోనాదే విశాఖపట్నం బయలుదేరిన భర్తను చూసి నాగమ్మ బెంబేలుపడిపోయింది.
"నాలుగు రోజులు ఉండి పోకూడదూ? కాస్త మీ ఆరోగ్యం కుదుటపడుతుంది" అంది దిగులుగా.
"సెలవులేదు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ రెండు రోజులు కూడా అతికష్టంమీద దొరికింది" అన్నాడు వెంకట్రావు.
"అయితే పదండి నేనూ వస్తాను."
భార్య మాటలకు తెల్లబోయాడు వెంకట్రావు.
"నిజంగా అంటున్నాను. మిమ్మల్ని యీ స్థితిలో ఒంటరిగా వదిలి ఇక్కడ ఉండలేను."
"ఓస్. అంతేగదా? ఇంకా ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకేం అయిందని? మనుషులన్నాక కాస్త చిక్కకుండా బలవకుండా వుంటారా" వెంకట్రావు నవ్వుతూ తేల్చేశాడు.
"ఏమోనండి, నాకు భయంగా వుంది."
"పిచ్చిదానా! వెర్రి వెర్రి ఆలోచనలు పెట్టుకోకు" అంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.
నాగమ్మ దిగాలుపడి కూర్చుంది.
"ఏమిటే అమ్మాయి, అల్లుడు అప్పుడే వెళ్ళిపోతానంటున్నాడట?"
"అవునమ్మా, సెలవు లేదట" అంది నాగమ్మ.
"నాలుగు రోజులుంటే బావుణ్ణు. అబ్బాయి మరీ నలతగా కనిపిస్తున్నాడు." గొణుక్కున్నది పున్నమ్మ.
మామగారు, బావలు కూడా వెంకట్రావును నాలుగు రోజులుంది వెళ్ళమన్నారు.
వెంకట్రావు ప్రయాణమై వెళుతూ, ఉయ్యాలలో నిద్రపోతున్న కూతుర్ని ఒకసారి వంగి తనివితీరా చూసుకున్నాడు. నాగమ్మను "నీ ఆరోగ్యం జాగ్రత్త" అంటూ హెచ్చరించాడు.
వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ, మనిషి సగం అయిపోయారు అనుకుంది నాగమ్మ నిట్టూర్చి.
14
పుట్టింట్లో ఉన్నా నాగమ్మ ధ్యాసంతా భర్తపైనే. ఆరోగ్యం ఎలావుందో! రోజూ భోజనం సరిగా చేస్తున్నారో లేదో! డాక్టర్ కు చూపించుకున్నారో లేదో! ఆలోచించగా ఆలోచించగా ఒకరోజు నాగమ్మ మనసు మరీ కలతపడేది. రెక్కలు కట్టుకుని భర్తముందు వాలిపోవాలనిపించేది. వెంకట్రావునుంచి వారానికో ఉత్తరం వస్తూనే వుంది. అందులో సగభాగం కూతురును గురించి మిగతా సగభాగం నాగమ్మ ఆరోగ్యం గురించి ఉండేది. చివరి వాక్యంలో మాత్రం తన ఆరోగ్యం బాగానే వుందనీ, ఆ విషయం గురించి ఆదుర్దా పడవద్దనీ రాసేవాడు. అయినా నాగమ్మకు దిగులుగానే వుండేది.


