నాగరత్నంకు ముచ్చెమటలు పట్టాయి. "ముదనష్టపోడు కొడతాడా ఏం? కోపం వస్తే మరీ కిందా మీదా తెలియదు" అని భయపడిపోయి దొడ్లోకి పరుగు తీసింది.
సుబ్బారాయుడు ముల్లుకర్ర తీసుకొని గబగబా బయటకు నడిచాడు.
"అన్నం తినకుండానే పొలం పోతున్నాడు" అనుకుంది నాగరత్నం భర్త వెళ్ళినవైపే గోడమీదగా తొంగిచూస్తూ.
ఆ రాత్రి మాధవయ్యగాని, పున్నమ్మగానీ భోజనం చెయ్యలేదు. సుబ్బారాయుడు రాత్రి పొలంలోనే పడుకున్నాడు. తల్లి తండ్రులకి మొదటిసారిగా ఎదురు తిరిగిన సుబ్బారాయుడు రాత్రంతా నరకయాతనే అనుభవించాడు.
తెల్లవారి మాధవయ్య కొడుకులు ముగ్గుర్నీ పిలిచాడు.
"రిజిస్ట్రార్ ఆఫీసుకి పదండి. ఎవరిదీ వారికి గీటు పెట్టిస్తాను" అన్నాడు.
రాత్రంతా నిద్రలేక బరువుగావున్న సుబ్బారాయుడి కళ్ళనుంచి ఆవేదన తొంగిచూసింది. "నాన్న చాలా బాధపడ్డట్లున్నాడు" అనుకొన్నాడు.
"ఇప్పుడు దానికి తొందరేం వచ్చింది నాన్నా! మీ హయాంలో యిలాగే జరిగిపోనివ్వండి" అన్నాడు తలవంచుకుని.
రామదాసూ, నాగభూషణం ముఖ ముఖాలు చూసుకున్నారు.
"అవును నాన్నా......." అంటూ గడపలో అలికిడై చూశాడు రామదాసు. పెళ్ళాం కమల కొరకొర చూస్తూంది అతడికేసి.
"అవును నాన్నా.....మీ వుద్దేశం బాగుంది. ఎవరికి వారికి పంచయిస్తే యే గొడవా వుండదు" అని గబగబా అక్కడనుండి వెళ్ళిపోయాడు రామదాసు.
నాగభూషణం మౌనంగా యింటి లోపలికి వెళ్ళిపోయాడు.
సుబ్బారాయుడు సిగ్గుపడుతూ తండ్రి ముఖంలోకి చూశాడు.
"ఎంతయినా పెద్దవాడి బుద్దే వేరు" అనుకున్నాడు మాధవయ్య.
"పన్నెండు గంటలకల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు రండి!" దృడంగా వుంది మాధవయ్య స్వరం. కొడుకు జవాబుకు కూడా యెదురు చూడకుండానే బయటకు వెళ్ళిపోయాడు ఆయన.
"మంచిదే అయింది. లేకపోతే ఆ ముసలాడు మనకు సెంటుభూమికూడా దక్కనివ్వడు" అంది నాగరత్నం సుందరమ్మతో.
"ఆ నాగమ్మ యీ కొంప ఆర్పటానికే పుట్టింది. ఇక దాని బిడ్డలు పుడితే బతకనిస్తుందా ఈ ముసల్ది?" అంది కమల.
సుబ్బారాయుడు ఆలోచిస్తూ నిలుచున్నచోటునే చాలాసేపు నిలబడిపోయాడు.
పున్నమ్మకు పుట్టెడు దుఃఖం వచ్చింది వాళ్ళమాటలు వింటూంటే.
"పోనీయ్ లే, యిప్పటికైనా మన దేవయ్యలు కళ్ళు తెరిచారు" అంది సుందరమ్మ.
పున్నమ్మ అన్ని మాటలూ వింది. గుడ్లనీరు గుడ్ల కుక్కుకుంది. ఒకనాడు కోడళ్ళకు తనముందు నోరు తెరవాలంటేనే భయంగా వుండేది. కొడుకులు తండ్రి యెదుట పడటానికి జంకేవారు. ఏది కావాలన్నా తనకు చెప్పి తండ్రికి చెప్పించేవారు. చెల్లెలు కింద నడిస్తే అరిగిపోతుందనుకునేవారు.
తనూ ఒకనాడు ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. అప్పటికి అత్తగారు పోయారు. మంచానపడిన మామగారు తనకుకాని, తన భర్తకుకానీ యెప్పుడూ భారంగా తోచలేదు. తన భర్త యే పని చేసినా మంచంమీదవున్న తండ్రికి ముందు చెప్పి చేసేవాడు.
ప్రతి బిడ్డా పుట్టినప్పుడు తను ఎన్నెన్నో వూహించుకొని పొంగిపోయింది. తన కొడుకులు తనంత యెత్తు పెరిగి, మళ్ళీ తనకంటే ఎత్తు పెరిగిపోతుంటే తన మనస్సు గర్వంతో నిండిపోయేది. వాళ్ళు పెద్దవాళ్ళు కావాలనీ, వాళ్ళకు పెళ్ళిళ్ళు చెయ్యాలనీ మనవల్నీ, మనవరాళ్ళనూ యెత్తుకావాలనీ ఎన్నెన్నో కలలు కన్నది.
ఒకనాడు ఈ యిల్లు తనది. ఈ ఇంట్లో తన మాటకు యెదురు వుండేది కాదు. ఈనాడు తనింట్లోనే పరాయిదానిలా తలదాసుకోవటానికి వచ్చినట్టు అనిపిస్తూంది.
లోకధర్మం యింతేనా?
పెద్దతనంలో యిలాంటి రోజు యెదుర్కోటానికేనా అందరూ పిల్లలు కావాలని కోరుకుంటారు?
పున్నమ్మ మనస్సు ఆలోచిస్తూంది. కళ్ళనుంచి కన్నీరు ధారాపాతంగా కారిపోతూంది.
చిన్న కొడుకు జ్ఞాపకం రాగానే బావురుమని ఏడవాలనిపించింది. సత్యం జైల్లో పడ్డప్పటినుంచీ రోజూ ఆ మాతృహృదయం క్షోభిస్తూనే వుంది.
వాడే యింటిపట్టున వుంటే యిలా జరిగేదా? ఏమో, యెవరు చెప్పగలరు? వీళ్ళు మాత్రం యింతగా మారిపోతారని అనుకుందా?
భోజనం చేసి రిజిస్ట్రారాఫీసుకు బయలుదేరుతున్న పెద్దకొడుకుతో పెద్దకోడలు అంటున్న మాటలు పున్నమ్మను యీ లోకంలోకి తెచ్చాయి.
"ఏమండీ!"
"ఆఁ ఏంటి?" కసురుకున్నట్లన్నాడు సుబ్బారాయుడు.
"ఏమిటండీ! ప్రతిదానికీ కసురుకుంటారు?" నిలదీసినట్లు అడిగింది. సుబ్బారాయుడు ఓ క్షణం భార్య ముఖంలోకి చూశాడు. నాగరత్నం ఇటీవల భర్తదగ్గర ధైర్యంగానే మాట్లాడుతూంది.
ఆడదానికి ఒకసారి భర్తముందు నోరు చేసుకొనే ధైర్యం వచ్చాక మగవాడు నోరు మూసుకోక తప్పదు.
సుబ్బారాయుడికి పిల్లలు పెద్దవాళ్ళవుతూ వుంటే భార్య దగ్గర గట్టిగా మాట్లాడే శక్తి తగ్గుతూ ఉంది.
"సరేలే త్వరగా చెప్పు."
"మీ తమ్ముడి భాగం ఆ ముసలోళ్ళకు అప్పజెప్పారు. రేపువచ్చి నా భాగంమీద వచ్చిన అయివేజు ఏమయిందని మనల్నడుగుతాడు!"
"ఇంతకీ నువ్వానే దేమిటే?" కసురుకున్నాడు సుబ్బారాయుడు. సుబ్బారాయుడికి మనస్సు మనస్సులో లేదు.
"నా రాత! నా ఖర్మ!" నెత్తి బాదుకుంది నాగరత్నం.
"వాగబాక. ఏడ్చేదేదో సరిగా ఏడు!" విస్సుక్కున్నాడు సుబ్బారాయుడు.
"ఏమిటా? మరిది ఆస్తిమీద అజమాయిషీ మీరే తీసుకోండి. ముసలోళ్ళకిస్తే అంతా నాగమ్మకే దోచి పెడతారు. ఎప్పటికైనా సత్యం తిరిగిరావచ్చు. పెళ్ళి చేసుకుని ఒక ఇంటివాడు కావచ్చు. 'అన్నయ్యా! నువ్వుండి కూడా నాకు అన్యాయం ఎలా జరగనిచ్చా'వని మిమ్మల్ని నిలదీసి అడగవచ్చు. ఇంటికి పెద్దవాడిగా మీదే తమ్ముణ్ణి ఒక ఇంటివాణ్ణి చేసే బాధ్యత చివరకు!"
భార్య ఆంతర్యం అర్ధం చేసుకోలేని సుబ్బారాయుడికి ఆమె మాటలు సబబుగానే తోచాయి. జవాబివ్వకుండా గబగబా బయటకు వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ 'నా రాత! నా ఖర్మ' అంటూ తలబాదుకుంది.
రాతకోతలు అయిపోయాయి. ముప్పై ఎకరాల మాగాణి ఐదు భాగాలుగా చేశారు. తల్లిదండ్రులకు వచ్చిన భాగం వాళ్ళు అమ్ముకో కూడదు. వాళ్ళు బతికున్నంతవరకూ దాని మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించాల్సిందే. వాళ్ళ తదనంతరం అదీ కొడుకులకు సమంగా పోతుంది. తండ్రి అదేమనలేదు. మౌనంగా సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. సత్యం ఆస్తిమీద అజమాయిషీ పెద్దకొడుకు తీసుకున్నాడు. సత్యం వాటాగా వచ్చిన తూర్పువైపు రెండుగదుల్లో తల్లీతండ్రీ ఉండటానికి నిశ్చయం అయింది.
పున్నమ్మ ఆ రాత్రికి రాత్రే తన కోసం కేటాయించిన గదుల్లోకి వచ్చేసింది. మాధవయ్య, పున్నమ్మ దిగాలుపడి ఒకరి ఎదురుగా ఒకరు కూచున్నారు. గతాన్ని నెమరువేసుకుంటూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఆ రాత్రి గడిపారు.
నాగభూషణం రిజిస్ట్రాఫీసునుంచి ఇంటికి రాలేదు. ఏదో డ్రామా ఉందని చెప్పి బస్తీకి వెళ్ళిపోయాడు. సుబ్బారాయుడు పొలంలో కుప్పదగ్గిరగా మంచం వేసుకుని రాత్రంతా జాగారం చేశాడు. రామదాసు మాత్రం బాధపడినా భార్యముందు ఉత్సాహంగా కనిపించటానికే ప్రయత్నించాడు.
ఊళ్ళో, ఒకప్పుడు మాధవయ్యంత అదృష్టవంతుడు లేడన్నవాళ్ళే, మాధవయ్యను చూసి జాలిపడ్డారు.
12
భాగాలు పంచుకున్న రెండో రోజు ఉదయమే సుబ్బారాయుడు తల్లి దగ్గరకు వచ్చాడు.
"అమ్మా!" అటు తిరిగి పొయ్యి ఊదుతున్న పున్నమ్మ వెనక్కు తిరిగి చూసింది.
సుబ్బారాయుడు అపరాధిలా నిలుచుని ఉన్నాడు.
తల్లి హృదయం కరిగింది.
"ఏం బాబూ!" అంది ఏమీ జరగనట్లే.
"ఈ వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉంచమ్మా౧ చెల్లాయికి సూడిదలు పట్టించుకెళ్ళు. నేను డబ్బు యిచ్చినట్లు నీ కోడలుకు తెలియనివ్వకు" అని రూపాయల కట్ట పున్నమ్మ చేతిలో పెట్టి గబగబా బయటకు వెళ్ళిపోయాడు. పున్నమ్మ చేతిలో డబ్బువైపు చూస్తూ కూర్చుంది.
"పెద్దవాడు వచ్చి బోతున్నాడు ఎందుకూ?" అడిగాడు అప్పుడే లోపలకు వచ్చిన మాధవయ్య భార్య చేతిలో డబ్బు చూసి ఆశ్చర్యపోయాడు.
"డబ్బు ఇవ్వటానికి వచ్చాడు. ఎట్లాగయినా వాడిబుద్దే వేరు. వాడు ఇలా వేరుల పడినందుకు ఎంత బాధ పడుతున్నాడో వాడి ముఖమే చెబుతుంది. వాడికి చెల్లెలంటే ఎంత అభిమానమో_ సూడిదలు పట్టించుకెళ్ళమని వెయ్యి రూపాయలిచ్చాడు. వాడు ఏం చేస్తాడు పాపం! పెళ్ళాం నోటికి భయపడుతున్నాడు."
"మన బంగారం మంచిదయితే ఎవరేం చేస్తారులే. అనవసరంగా పరాయితల్లి కన్నబిడ్డను ఎందుకనాలి?"
"నేను ఎవర్నేమన్నానని ఇప్పుడు?"
"ఆహాఁ_ నువ్వన్నావనికాదు - అసలు విషయం చెబుతున్నాను."
"పిల్లకు సూడిదలు తీసుకొని వెళతాను. ఎల్లుండి మంచిది" అంది పున్నమ్మ.
మాధవయ్య పలుకలేదు.
రకరకాల పిండివంటలూ, కూతురికి, అల్లుడికి బట్టలూ వగైరా తీసుకొని విశాఖపట్నం వచ్చి వాలిపోయింది పున్నమ్మ. తల్లిని చూడగానే నాగమ్మ పరిగెత్తుకొచ్చి కౌగలించుకొంది.
"అమ్మా! నాన్న రాలేదేమే?" అడిగింది బాలనాగమ్మ.
"మీ నాన్నకు పొలంపనులు ఉన్నాయి. నిన్నే అక్కడకు తీసుకొచ్చెయ్యమన్నారు" అన్నది పున్నమ్మ.
కొడుకులు వేరుపడిన సంగతి నాగమ్మకు పున్నమ్మ చెప్పలేదు. "పిల్ల బెంబేలు పడిపోతుంది, అసలే వట్టిమనిషికూడా కాదు" అనుకుంది.
"అల్లుడు ఇంకా రాలేదా?"
"లేదమ్మా, ఆయన ఐదు గంటలకుగాని రారు. అందుకే నీకోసం స్టేషన్ కు ఆయన స్టూడెంటును పంపించారు."
"ఏమ్మా! ఒంట్లో కులాసాగా ఉంటుందిగా?" కూతుర్ని తనివితీరా చూసుకుంటూ ప్రశ్నించింది.
"ఆ బాగానే ఉన్నాను. నువ్వు స్నానం చెయ్యమ్మా! పెందరాళే భోజనం చేదువుగాని, రాత్రనగా ఎప్పుడు తిన్నావో?" అంటూ తల్లి తెచ్చిన సామాను ఒక్కొక్కటే సర్దసాగింది.
నాగమ్మ తనకు తెలిసిన వాళ్ళందరకు తల్లి తెచ్చిన సూడిదలు పంచింది. ఇంటి దగ్గరగా వున్న వాళ్ళకు తల్లిని వెంటబెట్టుకొని వెళ్ళి ఆమెచేత ఇప్పించింది. మాటల్లో పున్నమ్మ భాగాలు పంచుకున్న సంగతి నాగమ్మకు చెప్పింది. నాగమ్మ ముందు నమ్మలేదు. నమ్మాక ఆశ్చర్యపోయింది. ఆ తరువాత బాధపడింది- తన బాధను భర్తముందు వెళ్ళబోసుకుంది.
"కాలం మారుతూంది బాలా! ప్రతివాళ్ళూ సుఖంగా స్వతంత్రంగా బతకటం నేర్చుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యీ నాటి పరిస్థితులకు అనుకూలంగా లేదు. కష్టమో నిష్ఠూరమో ఎవరి బ్రతుకు వాళ్ళు బతకాలనుకోవటం తప్పుకాదు" అన్నాడు వెంకట్రావు.
"అన్నయ్యలు అమ్మా నాన్నా అంటే ఎంత గౌరవం చూపించేవారు! నాన్న మాటకు ఎదురు చెప్పేవారు కాదు. పెళ్ళిళ్ళయాక అన్నయ్యలు పూర్తిగా మారిపోయారు." బాలనాగమ్మ గొంతుకు ఏదో అడ్డం పడ్డట్టయింది.
"అదేంమాట బాలా! వాళ్ళకి పెళ్ళయి పిల్లలు కలిగాక వాళ్ళమీద కొన్ని బాధ్యతలు పడతాయిగా! ఎప్పుడూ ఒకటిగానే ఉండాలంటే కుదురుతుందా?"
"కావచ్చుకాని_ కని, పెంచి అంతవాళ్ళను చేసిన తల్లి తండ్రుల్ని వృద్ధాప్యంలో వదిలివేయటం న్యాయమంటారా? రేపు వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళను అలాగే చూస్తారుగా!" ఆవేశంగా అంది బాలనాగమ్మ.
వెంకట్రావు మాట్లాడలేదు. భార్య ఆవేదనను అర్ధంచేసుకున్నాడు.
నాగమ్మ చిన్నన్నయ్య కబుర్లు చెబుతుంటే పున్నమ్మ కంటతడి పెట్టుకునేది.
"అలా చూస్తుండమ్మా, చిన్నన్నయ్య ఎంత గొప్పవాడవుతాడో! వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే చిన్నన్నయ్య తప్పక మంత్రి అవుతాడట. ఆయన చెబుతూ ఉంటారు."
"ఏమోనమ్మా! ఈ జన్మలో మళ్ళీ వాడు నా కళ్ళకు కనిపిస్తాడో లేదో?" పున్నమ్మ ముక్కు చీదేసింది.
"అవేం మాటలమ్మా అపశకునపు మాటలు! చిన్నన్నయ్య తప్పక వస్తాడు. చాలా గొప్పవాడువుతాడు. చిన్నన్నయ్య అందరిలాంటివాడుకాడు. అన్నయ్యలు వేరుపడ్డారనీ, నాన్నా, నువ్వూ వేరుగా వుంటున్నారని తెలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాలిపోతాడు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళడు" అంటున్న నాగమ్మ కంఠం గద్గదం అయింది.
"ఏమోనమ్మా! నాకు ఆ ఆశ లేదు. అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలు వచ్చాక బిడ్డలా? ఎక్కడయినా వాడు సుఖంగా వుండటమే కావల్సింది_" పున్నమ్మ రుద్దకంఠంతో అంది.
"బాలా, త్వరగా బయలుదేరండి!" వెంకట్రావు వస్తూనే హడావిడి చేశాడు.
"ఎక్కడికండీ?"
"సినిమాకు!"
"సినిమాకా?" నాగమ్మ సందేహిస్తూ అంది.
"మీ అమ్మగారికి సినిమా చూపిద్దాం. అందుకే ఈ ప్రోగ్రాం. వెంటనే బయలుదేరండి."
"అమ్మా, ఆయన సినిమాకు వెళదాం అంటున్నారు." ఆనందంగా అంది నాగమ్మ.
"వెళ్ళిరండి తల్లీ!"
"నువ్వు కూడా రావాలమ్మా! అసలు ఇవ్వాళ ఈ ప్రోగ్రాం వేసింది నీ కోసమే."
"నే నెందుకమ్మా! చిన్నవాళ్ళు మీరిద్దరూ వెళ్ళిరండి."
"అదేమిటండీ అత్తగారూ! మీరు ఇక్కడ వున్నన్నాళ్ళూ మేం ఎక్కడికి వెళితే అక్కడకు రావాల్సిందే!" అన్నాడు వెంకట్రావు గౌరవం ఉట్టిపడే స్వరంతో.
"ఇక మా కెందుకు నాయనా ఇవన్నీ?"


