"అక్కరలేదు. కాసేపు నోరుమూసుకుని కూర్చో" మధు విసుగ్గా చెప్పాడు.
"మరి ఫోన్ బూత్ సంగతో?" అని మధు కోపం చూసి మాట మింగేసింది శ్రీజ.
* * * *
"వాడు నాకు కావాలి. ఇప్పుడే కావాలి. ఎక్కడుంటాడు?" చిందులు తొక్కాడు లోకనాధం.
ఆశ్రిత మాటలు మరిచిపోయిన ప్రతిమలా నిలబడింది.
"చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు" అని అరిచాడు లోకనాధం.
ఆశ్రితలో మార్పులేదు. అలానే చలించకుండా నిలబడింది. లోకనాధం లింగంవేపు తిరిగి "నువ్వయినా చెప్పరా? వాడు ఎక్కడుంటాడు?" అనడిగాడు.
లింగం భయం భయంగానే "మన భారత్ టాకీస్ లో మేనేజర్ ఉద్యోగానికి కొత్తగా కుదిరాడండీ?" అన్నాడు.
లోకనాధం మొహం వెలిగిపోయింది. "మన థియేటర్ లోనా?" అన్నాడు.
"చిత్తం! నాకు అంతే తెలుసండీ" అన్నాడు లింగం.
"చాలు! ఇంకేం చెప్పకు. తెల్లవారేటప్పటికి వాడ్ని మన కళ్ళముందు వుంచే మనుషులు నాకు తెలుసు" అని లోకనాధం ఫోన్ వేపు నడిచాడు.
ఆశ్రిత చిగురుటాకులా వణికిపోతూ నీళ్ళు నిండిన కళ్ళతో లింగం వేపు చూసింది.
లింగం ఆమె కళ్ళల్లోకి చూడలేక తల వంచుకున్నాడు.
* * * *
రిషీ, మధు, మల్లేష్ కలిసి అతి సీరియస్ గా డిస్కస్ చేస్తుండగా మళ్ళీ తలుపు చప్పుడైంది.
రిషి మంచం క్రిందకి దూరదామా, వద్దా అని చూస్తుండగా "ఎవరో నా బాయ్ ఫ్రెండ్స్ అయ్యుంటారు, చూసొస్తాను" అని వెళ్ళింది శ్రీజ.
తలుపు తీసి చూడగానే నోట్లో వేళ్ళు పెట్టుకుని రయ్యమని విజిల్ వేసింది.
"ఎవరు నీ బోయ్ ఫ్రెండ్సా?" అడిగాడు మధు.
"ఛీ నాది ఇంత వరెస్ట్ టేస్ట్ అనుకుంటున్నావా? ఒకడికి గుండూ ఇంకొకడికి జడా!" అంది శ్రీజ.
ఆ మాటకి మల్లేష్, మధూ ఇద్దరూ బయటికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు పచ్చి నెత్తురు తాగే కిరాయిగూండాలని చూడగానే తెలిసిపోతోంది.
"మీలో రిషి ఎవరు?" ఒకడు చాకు తీస్తూ కర్కశంగా అడిగాడు.
"ఎందుకన్నా?" అడిగాడు మల్లేష్.
"మర్యాద చెయ్యడానికి" చెప్పాడు జడ వేసుకున్న రౌడీ.
"చూడండీ రిషి ఇక్కడ లేడు. మీరు అనవసరంగా గొడవ చెయ్యకండి. చూడబోతే పెద్ద మనుషుల్లా వున్నారు" అని మధు నచ్చ చెప్పబోయాడు.
వెంటనే "రేయ్!" అని అరుస్తూ గుండువాడు మధు కాలర్ పట్టుకున్నాడు. "నీకు మేము పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నామా? ఇంతకంటే అవమానం ఏవుందిరా?" అన్నాడు.
"కసుక్కున పొడిచి పారెయ్యి. మన తడాఖా తెలిసొస్తుంది" జడవాడు అరిచాడు.
ష్! చప్పున అడ్డుపడి "ఏ వన్ దాదా లెక్క కొడ్తున్రు అన్నా! ఇడిసెయ్యండ్రి" అన్నాడు.
గుండువాడు సాధ్యమైనంత క్రూరంగా నవ్వి "ఆ రిషి ఇక్కడే ఎక్కడో వున్నాడని మాకు బాగా తెలుసు! వీడ్ని విడిచి పెడ్తే వాడు దొరకడు. వీడ్ని వేసేద్దాం రా" అన్నాడు.
జడవాడు ఉత్సాహంగా "ఇదిగో చాకు. వేసేయ్" అన్నాడు.
మధు భయంతో కీచుగా అరిచాడు.
శ్రీజ కోపంగా ముందుకు వచ్చి అతన్ని చంపితే ఏం వస్తుంది మీకు? కూరకి కూడా పనికిరాడు" అంది.
గుండువాడు నవ్వి "చంపము. శాంపుల్ కి ఓ చెయ్యి తీసేస్తాం. అప్పటికీ రిషి బయటికి రాకపోతే ఓ కనుగుడ్డు పెకిలించేస్తాం" అన్నాడు.
మధు మళ్ళీ భయంతో పెద్దగా అరిచాడు.
"చూస్తాంవేంరా! ఓ కన్నులాగి పారెయ్యి" అరిచాడు జడవాడు.
గుండువాడు మధు చెంపమీదుగా కత్తిని కన్ను వరకూ తీసుకువెళ్ళాడు.
"ఆపండి!" అని రిషి బయటికి వచ్చాడు.
"రిషీ .... పారిపో!" అని మధు అరిచాడు.
"వీడేనా రిషి!" మధుని వదిలి రిషి దగ్గరకు వచ్చాడు గుండువాడు.
"అవును నేనే. అయితే ఏంటట? ఏం చేస్తావు?" మీద మీదకి వెళ్తూ అడిగాడు రిషి.
గుండువాడు అడుగు వెనక్కి వేసాడు.
రిషి వాడి చేతిలోని చాకు అందుకుని "శ్రీజా ఇదిగో తీసుకో. కూరగాయలు తరుక్కోడానికి పనికొస్తుంది" అన్నాడు.
శ్రీజ హుషారుగా విజిల్ వేసి రిషి చేతిలోంచి చాకు అందుకుని "వీళ్ళిద్దర్నీ వేసేద్దామా" అంది.
"ఆకు రౌడీలు. మనం ఎదురు తిరిగేవరకే వీళ్ళ ప్రతాపం. ఏంట్రా? ఓ చెయ్యి తీసేస్తావా?" అంటూ రిషి గుండువాడి చెంపల మీద వాయించాడు.
జడవాడు కోపంతో వూగిపోతూ "ఇంకా చూస్తావేం అన్నా, గాంధీ మహాత్ముడిలా! వేసేద్దాం" అని అరిచాడు.
"ఏవిటి నువ్వు వేసేది? మేమే వేస్తాం నిన్ను మున్సిపాలిటీ చెత్త వ్యాన్ లో" అంది శ్రీజ.
గుండువాడు చెంపలు తడుముకుంటూ అన్నాడు. "బాస్ చెప్పింది మరిచిపోయావా? మనం ఆయన ఆర్దర్సు ఫాలో చెయ్యాలి" మల్లేష్ గట్టిగా నవ్వి "మీ బాస్ బీ మీ లెక్క కోడి దమాక్ గాడేనా? చెంపలు వాయిగొడ్తుంటే కూడా సప్పుడు చెయ్యద్దన్నాడా" అన్నాడు.


