Home » Yandamuri veerendranath » ఆఖరి పోరాటం


    వాళ్ళు తన ప్రాణాలు తీయటానికి వచ్చారన్న సంగతి అర్ధమై పోయింది. కారణమే తెలియదు. చాలా దారుణమైన, నిస్సహాయమైన పరిస్థితి. ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలియకపోవడం,

    పులి వేషగాళ్ళు మళ్ళీ చుట్టుముట్టారు.

    పద్మాకర్ తన శక్తినంతా చేతుల్లోకి తీసుకున్నాడు. మరణం ఎలాగూ ఖాయమని తెలిసిపోయింది. హఠాత్ గా విజృంభించి ఒకడిచేతిలో కత్తి లాక్కొన్నాడు. అవతలివాడు దీన్ని ఊహించేలోపులో వాడి మెడ మీద పొడిచాడు. వాడి ఆర్తనాదం పార్కులో ప్రతిధ్వనించింది. ఈ లోపులో వెనుకనుండి ఎవరో పద్మాకర్ ని వెన్నులో మరోసారి పొడిచారు. ప్రాణాలు పోతున్నట్టు తెలిసిపోతోంది. పద్మాకర్ వెనుతిరిగి అదే ఊపులో రెండోవాడి గుండెల్లో కత్తి దింపాడు.

    పద్మాకర్ తో సహా ఇద్దరు దుండగులు కూలిపోయారు. మిగతా వారు వెళ్ళిపోయారు. కొన్నిరోజుల క్రితం ఇదే సీను "నటించారు". ఇప్పుడు అదే నిజమయింది. విధి ఆడిన కాస్ట్ లీ గేములో పావుగా మారి వెల్లకిలా పడివున్నాడు. ఒక్కొక్క ప్రాణమే పోతూంది. పైన ఆకాశం కనబడుతూంది. సూర్యకిరణాలు నిలువునా కళ్ళలోకి పడుతున్నాయి. కళ్ళు మూయటానికి ప్రయత్నించాడు. రెప్పలు సహకరించలేదు. ప్రాణం పోవడం అంటే ఏమిటో అర్ధం అవుతూంది అతడికి. దుఃఖం రాలేదు. విహారి గుర్తువచ్చాడు. ఎవరో రచయిత అన్నట్టు మరణం అంటే ఏమిటి? మనం తప్ప మిగతా ప్రపంచం అంతా వుండడం....! తన నెవరు చంపేరో, ఎందుకు చంపారో కూడా తెలీదు అతడికి. చిన్నప్పుడు చనిపోయిన తల్లి గుర్తువచ్చింది. పెంచి పెద్ద చేసిన తండ్రి గుర్తువచ్చాడు. ఆయన తనని చూస్తే బ్రతికించగలడా? అంత పెద్ద డాక్టరు బ్రతికించలేడా? అయినా ఈ పార్కులో తమ శరీరాన్ని ఎంతసేపటికి చూస్తారు? అప్పటికి ప్రాణం ఎంత దూరం పయనించి వుంటుంది? తన తండ్రి కూడా వెనక్కి తీసుకురాలేనంత- అన్నట్టు. తను స్వర్గానికి వెళతాడా? నరకానికా? ఇంకొద్ది క్షణాల్లో తెలుస్తుంది కదా ఎందుకంత ఆతృత?

    అతనికి నవ్వొచ్చింది.

    నవ్వులోనే ప్రాణం పోయింది.


                                                                        15


    వరండాలో నిలబడ్డ విహారి, డాక్టరు కృష్ణమూర్తి దగ్గిరకు వెళ్ళాడు. "...సాయంత్రానికి స్పృహ వస్తుంది. అయితే రెండు మూడు రోజుల వరకూ మాట్లాడించక పోవడం మంచిది" అన్నాడు కృష్ణమూర్తి.

    "అతను మన దగ్గరున్న విషయం సీక్రెట్ గా వుంచాలి డాక్టర్" అంది ప్రవల్లిక.

    డాక్టరు తలూపేడు.

    ఈ లోపులో A-5ని తీసుకొస్తున్న స్ట్రెచరు వాళ్ళ దగ్గర కొచ్చింది. ఆ చూపులో సంతృప్తి వుంది. ఎన్నో గంటలు కష్టపడిన చేతివేళ్ళ శ్రమ, నైపుణ్యం, మెదడు తాలూకు ఏకాగ్రత, వృత్తిపట్ల కృతజ్ఞత... ఆ చూపులో వున్నాయి. కేవలం డాక్టర్లకే తెలుస్తుంది ఆ సంతృప్తి.

    స్ట్రెచరు స్పెషల్ గదివేపు వెళుతోంది.

    ఎదురుగా మరో స్ట్రెచరు వస్తూంది.

    కృష్ణమూర్తి నుదుట ముడత పడింది. మళ్ళీ ఇంకో ఆపరేషన్?

    "అవసరం లేద" న్నట్టు ఆ స్ట్రెచరు అతడిముందు ఆగింది.

    మామూలుగా దానివేపు చూసిన కృష్ణమూర్తి వెంటనే నిలువెల్లా వణికిపోయాడు. చూస్తున్నది కలా, నిజమా అన్న సందిగ్ధంలో క్షణం సేపు అయోమయంగా కనిపించాడు. ఆ తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా "బాబూ" అని అరిచిన అరుపుని సంస్కారం కప్పేసింది. అరుపుని కప్పగలిగింది కానీ, ప్రేమని ఆపలేకపోయింది. పోయిన ఒక్కగానొక్క కొడుకునీ చేతుల్లోకి తీసుకుని హృదయ విదారకంగా రోదించసాగాడు. మిగతా స్టాఫ్ ప్రేక్షకుల్లా దూరంనుంచి సానుభూతితో చూడ్డం తప్ప ఓదార్చే సాహసం చేయలేకపోయారు.

    విహారి స్థబ్దుడై నిలబడి వున్నాడు. ఆ తండ్రి పద్మాకర్ ని ఎంతగా ప్రేమిస్తాడో అతడికి తెలుసు. ఒక్కగానొక్క కొడుకే అతడికి ప్రపంచం అయ్యాడు. వృత్తి, కొడుకు తప్ప డాక్టర్ దయానంద కృష్ణమూర్తికి ప్రపంచంలో మరేమీ లేవు. ఇప్పుడు వృత్తికోసం కొడుకుని వదులుకోవలసి వచ్చింది.

    విహారి మనసంతా శూన్యత ఆవరించింది. పద్మాకర్ గొప్ప తెలివైనవాడు కాకపోవచ్చు. గొప్పగా చదువుకుని వుండకపోవచ్చు. కాని అతడి హృదయం కోమలం. నవ్వు అతడి ఆభరణం. అసలు బాధంటే ఏమిటో తెలియనట్టు నిష్కల్మషంగా నవ్వుతూ వుండగలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది? ఎంతో పెద్ద వేదాంతులకీ, చాలా అదృష్టవంతులకీ తప్ప మామూలువారికి వీలవదు.

    అతడికి 'ఏమిటీ ప్రపంచం' అనిపించింది. చనిపోయిన వినీల్ గుర్తొచ్చాడు. అప్పుడు వినీల్... ఇప్పుడు పద్మాకర్... పంజాబులో చనిపోతూన్న అమాయక రైతులకి ప్రతీకలు. తమ తప్పు లేకుండా టెర్రరిస్టులు ఆడే ఆటలో బలి అయిన పావులు.

    అతడి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.

    అచేతనమైన పద్మాకర్ ని చూడబుద్ధి కాలేదు. 'ఇదంతా నీవల్లే-నీవల్లే' అని తన స్నేహితుడు వేలెత్తి చూపుతున్నట్టు అనిపించింది. ప్రేమ అన్నది చివరి చూపులో వుండదు. సంవత్సరీకంనాడు మాత్రమే గుర్తొచ్చేది కాదు. అతడు తన గుండెల్లో ఉంటాడు. తన కనుపాపలో ఉండే స్నేహితుడ్ని చూడటం కోసం స్ట్రెచర్ దగ్గరికి వెళ్ళడం దేనికి?

    ఒక రకమైన వేదాంతంతో కూడిన నిర్లిప్తభావం మనసంతా నిండిపోగా అతడు బయట వరండాలోకి వచ్చాడు. అక్కడ రెయిలింగ్ ని ఆనుకుని నిలబడి వున్నది ప్రవల్లిక. ఆకతాయి కుర్రవాడు కాటిల్ బార్ తో కొడితే నెలరోజుల రెక్కలురాని పక్షిపిల్ల నేల వాలిపోగా, కొమ్మమీదనుంచి దానివైపే జాలిగా చూస్తూ నిస్సహాయంగా కూర్చున్న జంటపక్షుల్లా వున్నారు వాళ్ళిద్దరూ. పత్రతృణ సస్యాలు పెనుగాలికి కొట్టుకుపోగా, క్రిందికి వ్రేలాడే వర్షమేఘంలా ఆత్మ విడిచిపోయిన శరీరం, వేదనతో బరువెక్కిన నిశ్శబ్దం, దుఃఖాశ్రవుల్ని జపమాల చేసుకుని తిప్పే ఋషిలాంటి కాలం...

    "ఇదంతా నీ తండ్రే... నీ తండ్రే చేశాడు" హిస్టీరిగ్గా నిశ్శబ్దం బ్రద్దలు చేస్తూ అరిచింది ప్రవల్లిక. ".... అవును! ఇదంతా నువ్వు బాధపడతావని చెప్పలేదు విహారీ! నీ ఆనందం. మీ కుటుంబం సంతోషం పాడుచేయటానికి ఇష్టం లేకపోయింది. ఇప్పుడు నేనిక ఇదంతా దాచలేను. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిందీ- ఆ రోజు స్టేజిమీద పిస్టల్ మార్చి నిన్ను జైల్లోకి పంపాలనుకున్నదీ- ది గ్రేట్ లాయర్ పరమేశ్వరం. నీ తండ్రి! నన్ను క్షమించు! నీకీ విషయం తెలియకముందే నిన్ను రక్షించుకోగలను అనుకున్నాను. స్వామి అంతమైతే, నీ తండ్రి నీకు మిగుల్తాడనుకున్నాను. నేనెంత నిస్సహాయురాలినో నాకిప్పుడు అర్ధమైంది. నిన్నూ- నన్నూ చంపి మాఫియాకి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలన్న ప్లాన్ చేస్తున్నది నీ తండ్రి...!"

    ఆవేశంగా చెపుతున్నదల్లా - "నాకు తెలుసు" అని కామ్ గా అన్న అతడి మాటలకి విస్తుబోయింది.

    "అవును ప్రవల్లికా! అరగంట క్రితమే నా తండ్రి నిజస్వరూపం నేను చూశాను. పద్మాకర్ ని చంపడానికి ప్లాన్ చేసింది అతడే. టెర్రరిస్టులు ఊరికే బెదిరించరనీ, చెప్పింది చేస్తారనీ అతడు నిరూపించాడు. నేను సిగ్గుపడుతున్నాను ప్రవల్లికా! ఇంతకాలం ఇంత తెలివయినవాడు నా తండ్రి అయినందుకు ఎంతో సంతోషించాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను-"


                                                         *    *    *


    విహారి ఇంటికొచ్చేసరికి తల్లి లేదు. పద్మాకర్ మరణం వర్ధనమ్మకి పిడుగుపాటులా తగిలింది. అతడిని స్వంత కొడుకులాగానే చూసుకుంది. నిజానికి విహారిది కాస్త రిజర్వ్ డ్ టైప్ అయితే, పద్మాకర్ దానికి పూర్తి వ్యతిరేకం. వంటింటిలో చెరి మూకుడులో వేపుడు ముక్కలు తింటూ కబుర్లు చెప్పేటంత చనువు ఉంది. అటువంటి పద్మాకర్ మరణించాడని తెలియగానే ఆమె ఆస్పత్రికి బయలుదేరింది.

    ఇంట్లో పరమేశ్వరం ఒక్కడే వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. జరిగిన ఈ ఘాతుకం తాలూకు ప్రభావం అతడిమీద ఏమీలేదు.

    కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ పరమేశ్వరం" అన్న మాటలకు తలెత్తాడు. విహారి తననే చూస్తూ కనిపించాడు. ఆవేశాన్ని బలవంతాన అణుచుకుంటున్నట్టు తోచాడు.

    కొడుకు భావం కాస్త అర్ధమైంది. కాస్త కాలేదు. "అదేం సంబోధన?" అన్నాడు.

    "నువ్వు చేసిన పనికి నిన్ను ఒరేయ్ అని పిలవాలి నాన్నా! పేరుతో పిలిచి గౌరవమిచ్చాను. సంతోషించు."

    "ఓహో! ఇదే నాటకంలో డైలాగు!" వెటకారంగా అన్నాడు.

    "నాన్న పాత్రలో నువ్వాడుతూన్న నాటకంలో క్లైమాక్స్ డైలాగు."

    "చాలా గొప్పగా మాట్లాడుతున్నా ననుకుంటున్నావేమో! నేను నీ తండ్రిని అన్న విషయం మర్చిపోకు."

    "తల్లి దండ్రులందరూ సిగ్గుపడవలసిన మాట అన్నావ్ పరమేశ్వరం! 'తండ్రి' అన్నది చాలా గౌరవమైన పదం! ఒక డబ్బున్న అమ్మాయిని వలవేసి పట్టుకుని, పెళ్ళి చేసుకుని, ఆమెని తల్లిని చేశావు. ఆస్థిరాదని తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు నటించావు. నీ దారిన నీవు వెళ్ళిపోయావు. అటువంటి నీకు ఇప్పుడు తండ్రి అన్న పదం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది?"

    "ఓ.... నీకు చాలా విషయాలు తెలుసే!"

    "చాలా ఆలస్యంగా తెలిశాయి. అదే విచారం. ఎంత మురిసిపోయాను నాన్నా నిన్ను చూసుకుని! ఎప్పుడూ నిశ్శబ్దం తాండవించే ఈ ఇంటిలోకి ఒక అపురూపమైన వ్యక్తి ప్రవేశించాడనుకున్నాను. ఇన్నాళ్ళూ ప్రాణంలో ప్రాణంగా పెంచిన అమ్మకన్నా నిన్నెక్కువ అభిమానించాను. తెలివితేటలు మూర్తీభవించిన నువ్వు నా తండ్రివి అవడం అదృష్టం అనుకున్నాను. ప్రాణంలో ప్రాణంగా ఇన్నాళ్ళూ బ్రతికిన స్నేహితుడ్ని మింగేసే కొండచిలువంత భయంకరమైనది నీ తెలివి అనుకోలేదు."

    "నేను అనుకున్న దాన్ని సాధించడంలో ఏ బంధమూ నన్ను అడ్డుకోలేదు."

    "నువ్వసలు మనిషివేనా నాన్నా?"

    "అవును. మనిషినే! ఈ ప్రపంచంలో మనిషికి కావల్సిన ఆరు ముఖ్యావసరాలేమిటో తెలుసా? గాలి, నీరు, తిండి, డబ్బు, డబ్బు, డబ్బు, చివర చెప్పిన మూడు అవసరాల కోసం మొదటి మూడు వదిలేసుకో గలిగినవాడే సిసలైన మనిషి. చిన్నప్పటినుంచీ, నేను డబ్బు కోసమే బ్రతికాను. బీదతనం అంటే ఏమిటో తెలిస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది. నేను చదివిన న్యాయశాస్త్రం నాకు డబ్బు అవసరాన్ని మరింత తెలియజెప్పింది. డబ్బు మీద తప్ప మరి దేనిమీదా నాకు ప్రేమలేదు. నీ తల్లి ద్వారా డబ్బేమీ రాదని తెలిసింది. అందుకే ఆమె జీవితంలోంచి తప్పుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యగలవు నువ్వు? ఏం చేస్తావు నువ్వు?" పరమేశ్వరం గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది.

    విహారి కూడా అంతే ఆవేశంగా మాట్లాడతాడనుకున్నాను. కానీ దానికి వ్యతిరేకంగా అతడు కామ్ గా "నాన్నా" అనడంతో ఆశ్చర్యపోయాడు. విహారి మొహం నిర్మలంగా వుంది.

    "నాన్నా! కెన్ ఐ ఆస్క్ యూ త్రీ క్వశ్చన్స్.... మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగవచ్చునా?"

    "ఏమిటవి?"

    "ఇన్నాళ్ళూ మీరేం చేశారో, ఎలా బ్రతికారో తెలియకుండా అమ్మ మిమ్మల్ని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానించింది?"

    "భర్తని కాబట్టి-" నిర్లక్ష్యంగా అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra