Home » Yandamuri veerendranath » Anaithikam


    "ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరూ చేయలేదు. మనకిగానీ, మన చర్యవల్ల ఇతరులకిగానీ జరిగే హాని ఒక్కటే 'తప్పు' యొక్క తీవ్రతని నిర్దేశిస్తుంది. భర్తని వదిలేసి హాయిగా వున్నాననుకున్న అహల్య, కూతుర్ని కూడా తను నమ్మిన సిద్దాంతం కోసం వదిలేసుకోగలిగితే ఇక క్షోభ ఎక్కడుంది? మరోవైపు తల్లి ఏ పరిస్థితుల్లో ఆ పని చేసిందో అర్థం చేసుకోగలిగితే శ్యామలకి ఇంత కలవరపడాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రపంచంలో ఏ సమస్యకీ నిర్దిష్టమైన పరిష్కారాలంటూ ఏమీ వుండవు. అలా వుండివుంటే ఇప్పటికే అన్ని సమస్యలూ పరిష్కారమైపోయి వుండేవి. స్త్రీ గురించిన సమస్యనే తీసుకో. పాతిక సంవత్సరాల క్రితం తెలుగులో పాతికదాకా వారపత్రికలు, దినపత్రికల అనుబంధాలు వుండేవి. కొంతమంది రచయిత్రులూ, వారిని సమర్థిస్తూ మరికొంత మంది రచయితలూ పుంఖానుపుంఖాలుగా స్త్రీ విమోచన గురించి కథలూ, కవితలూ, వ్యాసాలూ రాసేవారు. ఆ రోజుల్లో చాలా మందితో నేనా వ్యాసాలపై చర్చించేవాణ్ణి. వారి అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. చాలా ఆశ్చర్యకరంగా వేరు వేరు అభిప్రాయాలు వెలిబుచ్చారు. కొంతమంది పరిష్కారం తెలీదన్నారు. మరికొంతమంది అసలు సమస్యే తెలీదన్నారు. మరెందుకు రాస్తున్నారంటే ఒకరిద్దరు మాత్రం నిర్మొహమాటంగా "ఇలారాస్తే ఎడిటర్లు వేసుకుంటారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. పైగా అధిక శాతం పాఠకుల్ని కూడా ఆకట్టుకోవచ్చు" అని చెప్పారు. స్త్రీల సమస్యల్లో సగం పైగా పరిష్కారాలు స్త్రీ జనావళి సమస్య అనుకోవడంవల్ల వచ్చిన పరిస్థితి ఇది. అందుకే ఆ రోజుల్లో ఆ సమస్య ఎంత తీవ్రంగా వుందో ఇప్పుడూ అలాగే వుంది. ఆ శతాబ్దంలో ఏమనుకునేవారు? పురుషులతో సమానంగా స్త్రీ ఉద్యోగం చేసి, ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే సగం సమస్యలు పరిష్కారమై పోతాయనుకునేవారు. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఇప్పుడేం చూస్తున్నాం? ఆర్థిక స్వతంత్రం స్త్రీకి ఏ సుఖాన్నిచ్చింది? అ మాటకొస్తే మనం ఇప్పుడు సాధించింది విదేశీ వనితలు గత శతాబ్దంలోనే సాధించారు. అయినా సమస్య అలాగే వుందిగా!"

 

    "మరి ఎన్ని శతాబ్దాలైనా స్త్రీ ఇలా దేవుడు చేసిన దురన్యాయానికీ, మనిషి నిర్మించుకున్న నైతిక ధర్మానికీ, సంఘం నిర్దేశించిన సామాజిక సూత్రానికీ బలైపోవలసిందేనా? ఆమెకు వ్యక్తిత్వం లేదా?"

 

    "తను బలి అవుతున్నానా లేదా అన్న విషయం ప్రతి స్త్రీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. సామాజికం, వ్యక్తిత్వం, నైతికం- అని మూడు పదాలు ఉపయోగించావు. ఆ ముగ్గురు ప్రతినిధులూ మనమధ్యే వున్నారు. నైతిక నిబద్ధతని అహల్య ప్రశ్నించింది. వ్యక్తిత్వం గురించి పోరాడుతూ, శ్యామల సూర్యాన్ని నిరాకరించింది..." అంటూ ఆగాడు.

 

    "మరి సామాజికం?" అన్నాను.

 

    ఆయన మాట్లాడలేదు.

 

    "సామాజిక నిబద్ధతని ప్రశ్నించిందెవరు?" రెట్టించాను.

 

    ఆయన నవ్వి "నువ్వే" అన్నారు.

 

                                            2

 

    స్కూల్లో చేరినవారికి మధ్యాహ్న భోజనం పెదతారనీ, పైగా కొద్దిగా డబ్బు కూడా ఇస్తారనీ తెలియగానే మా నాన్న నన్ను స్కూల్లో చేర్పించాడు. అయిదో క్లాసుతో మానేసిన నా చదువు తిరిగి అలా ప్రారంభమైంది. తెలంగాణా ప్రాంతంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ఒక రావి చెట్టు కింద చెప్పులు కుట్టేవాడు మా నాన్న. క్లాసులో నేను తప్ప మా కులంవాళ్ళు మరెవరూ లేరు. ఒకమూల ఒంటరిగా కూచోబెట్టేవారు. భోజనం కూడా విడిగా పెట్టేవారు.

 

    మొట్టమొదటి రోజు అటెండెన్స్ పిలుస్తూ మా టీచరన్నమాటలు నా కింకా గుర్తున్నాయి. "ఏవిటే! నీ పేరు అచ్చమ్మా? కలెక్టరవుదామని వచ్చావా? ఖాళీగా కూచున్నా భోజనం పెడతారనొచ్చావా? అచ్చమ్మ, ఐ.ఏ.ఎస్. తోళ్ళ పరిశ్రమ శాఖాధికారిణి!" అని టీచరనేసరికి క్లాసంతా గొల్లుమంది. అప్పుడే అర్థమైంది నాకు- నాకున్న అనర్హత కులమే కాదు, నా పేరు కూడా అని!

 

    ఈలోగా గ్రాడ్యుయేట్ అయిన మా పెద్దన్నయ్యకి రిజర్వేషన్ కోటాలో మంచి ఉద్యోగం రావడంతో మమ్మల్నందర్నీ నిర్థాక్షిణ్యంగా వదిలేసి రెక్కలు సాచుకుని ఎగిరిపోయాడు. అప్పుడు నేను పదవతరగతి చదువుతున్నాను. నాన్నకి గుండెపోటు వచ్చి మంచం పట్టాడు. రెండో అన్నయ్య నాన్న ఖాళీ చేసిన చెట్టుకింద స్థానాన్ని భర్తీ చేశాడు. వాడికి మొదటినుంచీ చదువబ్బలేదు. నా చదువుకీ మొదటినుంచీ అభ్యంతరం చెప్పింది వాడే! అయితే అప్పటికే హాస్టల్లో నాకు భోజనంతో పాటు మరికొన్ని వసతులు ఉచితంగా లభిస్తుండటంతో వాడి అభ్యంతరాన్ని మానాన్న అంతగా పట్టించుకోలేదు. నా స్కాలర్ షిప్ అంతా ఇంటికి పంపించేసి, చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్తూ నేను చదువు కొనసాగించాను.

 

    మా కొచ్చిన గ్రాంట్ లో సగం డబ్బు వార్డెన్, పై అధికారులూ తినేసేవారు. దాంతో మా పరిస్థితి చాలా హీనంగా వుండేది. నేను ఇంటర్ మీడియట్ చదువుతుండగా అక్కయ్య పెళ్ళి జరిగింది. బావ కలెక్టరాఫీసులో ప్యూన్. పదివేలు కట్నం. పెద్దన్నయ్య చుట్టపు చూపుగా వచ్చి, దయాగుణంతో రెండు వేలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందువల్ల అక్కని ఒక ఇంటిదాన్ని చేయడం కోసం నాన్న తన ఇంటిని అమ్మేశాడు.

 

    ఇంటర్మీడియట్ పాసవగానే తిరిగి నా చదువు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి చిన్నన్నయ్య మరింత పట్టుదలగా నా చదువు ససేమిరా కొనసాగడానికి వీల్లేదని మంకుపట్టు పట్టాడు.

 

    "నేనేం నీ మీద ఆధారపడి చదువుకోవడం లేదే! ప్రభుత్వ సాయంతోనూ, నా కష్టంతోనూ చదువుకుంటున్నాను" అన్నాను.

 

    అమ్మ అన్నయ్య పక్షం వహించింది. "చదువుకుంటే పెళ్ళెవడు చేస్తాడే? అక్క పెళ్ళికి వున్న చిన్న నాకా అమ్మేశాం. ఇక నీ పెళ్ళికి మమ్మల్ని మేమమ్ముకోవాలి" అంది.

 

    "నేను పెళ్ళి చేసుకోను. చదువుకుని మిమ్మల్ని పోషిస్తాను" అన్నాను ఆవేశంగా.

 

    నాన్న కల్పించుకుని "చదువుకుని పోషిస్తావా? మీ అన్నయ్య ఏం పోషించాడే? అసలా ప్రభుత్వాన్నే వెళ్ళి అడగాలి. చిన్న పిల్లలకి ఉచితంగా చదువు చెప్పేముందు వాళ్ళకి రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందూ తల్లిదండ్రులని పోషిస్తామని హామీ తీసుకోమని ఆ ప్రభుత్వానికి చెప్పాలి. లేకపోతే మేమిలాగే వుండిపోతాం. మీరంతా పైపైకి వెళ్ళిపోతారు" అన్నాడు.

 

    "అలా వెళ్ళిపోయే దాన్నైతే ట్యూషన్లు చెప్తూ మీకు డబ్బెందుకు పంపిస్తాను?" అనడిగాను.

 

    "కూత నేర్చింది ఇల్లెక్కి కూసిందట! కాస్త చదువు నేర్చేసరికి మనల్నే ఎదిరిస్తోంది చూశావా?" అన్నాడన్నయ్య.

 

    "నేనేమీ ఎదిరించడం లేదు. వున్న విషయం చెప్పానంతే!"

 

    "ఒసేయ్! ఇక నువ్వేం చెప్పకర్లేదు. నువ్వు చదువు మానేసింట్లో వుండాలంతే!" అన్నాడు నాన్న. నాన్న కూడా అటే మాట్లాడేసరికి నాకేం చేయాలో తోచలేదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు చదువు మానేయాలని నిర్ణయానికి వచ్చాను.

 

    ఆ పరిస్థితిలో నాకు ధైర్యం చెప్పింది మా బావ. "చూడమ్మా! నేను నీ అంత చదువుకోలేదు. కానీ కలక్టరాఫీసులో నౌకరుగా చేస్తూ ఎంతోమంది చదువుకున్నవాళ్ళనీ, రాజకీయ నాయకుల్నీ, లుచ్చాల్నీ, లఫంగాల్నీ చూశాను. ప్రతివాడూ తన అవసరం కోసం పక్కవాడిని వాడుకునేవాడే! నువ్వింకాస్త చదువుకుంటే నీకు తగిన మొగుణ్ణి తేలేనని మీ చిన్నన్నయ్య భయం. చదువు పేరుతో నువ్వెవర్నో ప్రేమించి పెళ్ళి చేసుకుంటే కులపోళ్ళు వెలివేస్తారని మీ నాన్న భయం. చెప్పానుగా, ఎవరి భయాలు వాళ్ళవనీ! అయినా యిప్పుడు చదువు మానేసి ఏం చేస్తావ్? నీకు పెళ్ళి చేయడానికి వాళ్ళ చేతిలో పైసా లేదు" అన్నాడు. ఆ విధంగా జీవితం మొట్టమొదటి మలుపు తిరగడానికి మా బావ కారణమయ్యాడు.

 

    నా నిర్ణయాన్ని ఇంట్లో చెప్పగానే అక్కడ భూకంపం వచ్చినట్లైంది. అన్నయ్య నా జుట్టు పట్టుకుని వంగదీసి కొట్టాడు. అమ్మ కూడా అడ్డు చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ రాత్రే నేను కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాను.

 

    తిన్నగా మా పెద్దన్నయ్య దగ్గరకెళ్ళాను. నాకు చదువుకోవాలనుందనీ, తనని సహాయం చేయమనీ అడిగాను. నావైపు ఇబ్బందిగా చూశాడు. ఆ ఇబ్బంది కర్థం నాకు రెండు మూడు రోజుల్లోనే తెలిసింది. వర్ణాంతర వివాహం చేసుకున్న నా అన్నయ్య సభ్య సమాజంలో తన అసలు వర్ణం బయట పడకుండా వుండడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. మామగారి అండతో అగ్రవర్ణాల్లో చేరే ప్రయత్నంలో వున్నాడు. ఆ విషయం అర్థమవగానే అక్కణ్ణించి నేను బయటపడ్డాను. అన్నయ్య పెద్దగా అడ్డు చెప్పలేదు. తన గతానికి గుర్తుగా నేనక్కడ వుండడం వాళ్ళావిడకి కూడా ఇష్టంలేదు మరి!

 

    అక్కణ్ణించి నేను మా అక్కయ్య ఇంటికి వెళ్ళాను. అయితే అక్కడి పరిస్థితి నాకు చాలా చిత్రంగా తోచింది. అక్కయ్య స్వతహాగా అందగట్తే. ఆమె డ్రెస్సింగ్ టేబిల్ దగ్గర వున్న కాస్మటిక్స్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. బావ జీతంలో సగం వాటికే ఖర్చు పెడుతూ వుండి వుండవచ్చు బహుశా! కానీ అది నాకే మాత్రం సంబంధించిన విషయం కాదు కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

 

    "ఏదేనా చిన్న ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ గా డిగ్రీ పూర్తి చేద్దామనుకుంటున్నాను" అని నా మనస్సులోని నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పాను.

 

    "మా ఇంట్లోనే వుండి చదువుకో. నీ కొచ్చే జీతంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుండడం కష్టమవుతుంది" అన్నాడు బావ. ఆ మరుసటిరోజు నుంచీ కనబడిన ఉద్యోగానికల్లా అప్లై చేశాను. నా మొదటి ఇంటర్వ్యూని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు గమ్మత్తుగా సూట్ వేసుకుని మొహానికి నామం పెట్టుకున్నాడు. నా సర్టిఫికెట్లు పరిశీలిస్తూ "పర్సనల్ సెక్రటరీ అంటే నాతో పాటు ఊళ్ళు తిరగవలసి వుంటుంది. అభ్యంతరమేమీ వుండదుగా?" అనడిగాడు.

 

    ప్రపంచం అంతగా తెలీని నేను "అదేంటి సార్! అది ఉద్యోగధర్మం అయినప్పుడు అభ్యంతరమెందుకు?" అన్నాను.

 

    అతడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ "మీకు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకుండచ్చుగా!" అన్నాడు.

 

    ఆ విషయాన్ని ఆయనెందుకంతగా రెట్టిస్తున్నాడో తెలుసుకునేంత వయసు లేదు నాకు. "నేను మా అమ్మా, నాన్నలతో వుండటం లేదండీ! ప్రస్తుత మా బావగారింట్లో వుంటున్నాను. మావాళ్ళకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు".

 

    "వెరీగుడ్! నాక్కావలసింది సరిగ్గా నీలాంటి కాండిడేటే!" అంటూ ఆయన నవ్వి, అప్పుడే నా అప్లికేషన్ చూస్తూ "ఏమిటీ, నీ పేరు అచ్చమ్మా? చిత్రంగా వుందే. ఎవరు పెట్టారు ఈ పేరు?" అనడిగాడు.

 

    "మా నాన్నగారు".

 

    "ఆయనేం చేస్తుంటారు?"

 

    "ఇప్పుడేం చేయడం లేదండి! ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగా లేదు".

 

    "ఓహో! వాలంటరీ రిటైర్ అయ్యారా?"

 

    "ఆయన ఉద్యోగం చేయలేదు".

 

    "మరి".

 

    "చెప్పులు కుట్టేవారు".

 

    మేనేజింగ్ డైరెక్టర్ మొహంలో నవ్వు మాయమైంది. అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ "దళిత స్త్రీ వన్నమాట!" అన్నాడు.

 

    ఆ రోజు ఆయనన్న ఆ మాటని ఆ తర్వాత నా జీవితంలో విభిన్న రూపాల్లో, విభిన్న స్వరాల్లో, విభిన్న పరిస్థితుల్లో నేను చాలాసార్లు విన్నాను. పరిచయంకాగానే నా అందాన్ని గమనించిన సంభ్రమం, నా పేరు తెలియగానే ఆశ్చర్యంగా మారి, కులం తెలుసుకోగానే ఒక చిన్న చూపులోకి పరిణమించడం నాకు మొదట్లో వింతగా తోచేది. అయితే నేనెప్పుడూ అవమానంగా భావించలేదు. దేవుడిచ్చిన కులంగానీ, పెద్దలు పెట్టిన పేరు కానీ నేను అవమానం చెందవలసిన విషయాలుగా నేనెప్పుడూ భావించలేదు.

 

    ఆ తర్వాత నేనొక చిన్న కంపెనీలో రిసెప్షనిస్ట్ గా చేరాను. జీతమంతా అక్కయ్యకే ఇచ్చేసేదాన్ని. ఈవినింగ్ కాలేజీ. బికాంలో జాయినయ్యాను. మరో రెండు సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్ నవుతాననగా ఒకరోజు జరిగిందా సంఘటన.

 

    కాలేజీ పూర్తయ్యేసరికి సరిగా రాత్రి తొమ్మిదైంది. హోరున వర్షం కురుస్తోంది. ఇంటికెలా వెళ్ళాలని సందిగ్ధంలో పడ్డాను. రిక్షాలో వెళ్ళడానికి కూడా డబ్బుల్లేవు. ఇంట్లో అక్కా బావా లేరు. బావ కలెక్టరుగారితో కలసి క్యాంప్ కెళ్ళాడు. అందుకని అక్క అమ్మ వాళ్ళింటికి వెళ్తానని చెప్పింది. ఆ రాత్రి ఇంట్లో నేనొక్కదాన్నే వుండాలి.   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra